Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 49


    ప్రసూనకి వంట్లో ఏమీ బాగుండలేదనీ మంచంలోంచి లేవటం లేదనీ తెలుసు.
    అంచేత కంగారుగా "వెంకట్ నర్సింగ్ హోం ఎక్కడుందీ?" అంది.
    "సైదాబాద్ కాలనీలో ఉంది, రోడ్ నెం - 7 లో ఎవర్ని అడిగినా చెప్తారు."
    వెంటనే ఆటోలో బయలుదేరింది, ఆటో వాడితో "వెంకట్ నర్సింగ్ హోం" పేరు చెప్పగానే నాకు తెలుసు అన్నాడువాడు.
    నర్సింగ్ హోమ్ ముందుకు ఆటో రాగానే, డబ్బులిచ్చి నర్సింగ్ హోం లోపలికి వెళ్ళింది యశోద లోపలికి అడుగు పెట్టగానే, బయటి తలుపులు మూసుకున్నాయి ఉలిక్కి పడి వెనక్కి తిరిగింది.  
    తెలుగు సినిమా విలన్ లా నవ్వుతూ, కత్తి పట్టుకుని నిలబడ్డాడు వీరన్న.
    "ఇవాళ ఎలాగూ నిన్ను చంపుతాను, నిన్ను అనుభవించి మరీ చంపుతాను" అన్నాడు.
                                   * * *
    దేవిశంకర్ పరాభవాన్ని సహించి ఊరుకునే మనిషి కాదు. యశోద తన రహస్యాలన్నీ తెలుసుకుంది వివేక్ దూరంగా వెళ్ళిపోవటానికి కారణం యశోద ప్రసూన మంచమెక్కటానికి కారణం యశోద.  
    యశోద పీడ విరగడ చేసుకుంటే వివేక్ మొదట బాధపడినా, తర్వాత కోలుకుంటాడు హాయిగా మరో లక్షణమైన అమ్మాయిని పెళ్ళి చేసుకుని తమతోనే ఉంటాడు ప్రసూన కూడా బాగుపడుతుంది.     
    ప్రతీదానికీ పకడ్బందీగా పధకం తయారు చెయ్యటానికి అలవాటు పడ్డ దేవిశంకర్ ఈ పధకం కూడా జాగ్రత్తగానే తయారు చేశాడు సైదాబాద్ ప్రాంతంలో నగర శివార్లలో ఒక ఇల్లు ఖాళీ అయితే, తెలుసుకుని దానికి నర్సింగ్ హోం అని బోర్డ్ పెట్టించాడు.
    చాకచక్యంగా అక్కడికి యశోదని రప్పించాడు డబ్బుకోసం ఏం చేయటానికైనా సిద్ధపడే వీరన్నకి యశోదని ఖూనీ చేసేపని అప్పగించాడు.
                                                              * * *
    ముందుకు అడుగు వేయబోతున్న వీరన్న భుజంపైన చెయ్యి పడింది అది జానీ భుజం మీద చెయ్యి అలాగే అదిమి పెట్టి ముందుకు వంగి వీరన్న చేతిలోని కత్తిని లాక్కున్నాడు" చిరకాల దర్శనం" అన్నాడు చిరునవ్వుతో.
    తెల్లబోయి చూస్తున్నాడు వీరన్న....
    "నాకు నీ సంగతీ, నీ అయ్యగారి సంగతీ తెలుసురా ఎదవా! నేనూ నీలాగే దెబ్బతిని వదిలే రకం కాదు! నా దగ్గిరా ఉన్నారు నిన్ను మించిన మనుష్యులు! నీకు లేని తెలివి ఉన్న వాళ్ళు... నీ మీదా మీ అయ్యగారి మీదా, ఓ కన్నేసి ఉంచమన్నాను. మీ ఎత్తులన్నీ తెలుసుకుంటున్నాను నీకంటే ముందే ఇక్కడ చేరుకున్నాను."
    పాలిపోయింది వీరన్న మొహం, జానీ చేతిలోని కత్తివంక భయంగా చూస్తున్నాడు.
    "సునాయాసంగా ప్రాణాలు తీసే వారికి, తమ ప్రాణాలంటే ఎంత తీపో? నిన్నేం చెయ్యను పైగా డబ్బొచ్చే ఉపాయం ఒకటి చెప్తాను వివేక్ మూగవాడు కాడు... ఈ రహస్యం నీ గుప్పెట్లో పెట్టుకుని అతడిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించుకో! ఈ విషయానికి ఆధారాలు డాక్టర్ స్వామి దగ్గర ఉన్నాయి డాక్టర్ స్వామి పేరు చెప్పు చాలు నీకు అన్నీ తెలుసని వివేక్ నమ్ముతాడు నువ్వు అడిగిన డబ్బు ఇస్తాడు."    
    వీరన్న అనుమానంగా చూశాడు.
    "ఈ అమ్మాయిని నేను ప్రేమించాను కానీ, వివేక్ పెళ్ళి చేసుకున్నాడు అంచేత వివేక్ అంటే ఈర్ష్య నాకు అయినా ఇక్కడ నువ్వు చెయ్యగలిగినదేమీలేదు యశోదని నువ్వు చంపలేవు చంపనివ్వను రేప్ విషయం ఆలోచించనే అక్కరలేదు నీకు మిగిలిన ఛాన్స్ ఇదొక్కటే."
    వీరన్న తలుపులు తీసుకుని, బయటికి వెళ్ళిపోయాడు. ఆ సందు చివర వీరన్న మోటార్ సైకిల్ పార్క్ చేసి ఉంది.
    విభ్రాంతి లోంచి తేరుకున్న యశోద, "ఇదేమిటీ జానీ! వాడిని వివేక్ మీదకి ఎందుకు ఉసిగొల్పావు?" అంది.
    "వివేక్ కరాటే ఫైటర్! గుర్తుందా? నన్నే పడగొట్టాడు వీడు వివేక్ ని ఏమీ చెయ్యలేడు ఎవరి వేలితో వారి కన్నే పొడవ్డం నాకు సరదా తమాషా చూడు."  
    "ముందు ఇంటికి వెళ్దాం! వెంటనే వివేక్ దగ్గర వాలాలని ఉంది నాకు."
    "ఒక్క నిముషం"
    దేవిశంకర్ కి ఫోన్ చేశాడు జానీ అటు నుంచి దేవిశంకర్ గొంతు పలికింది "హలో" అని. మీ వీరన్న యశోదని హత్య చేయలేదు! నువ్వు మొగవాడివి కావు! ఈ రహస్యం అందరిలోనూ బయటపెట్టి, నిన్ను నవ్వులపాలు చేస్తాను..." అని వివేక్ ని బ్లాక్ మెయిల్ చేయటానికి వెళ్ళాడు."
    "ఏయ్! ఎవరు నువ్వు?"
    "అనవసరం మాటలతో టైం వేస్ట్ చేసుకోకు. వెంటనే వెళ్ళి నీ కొడుకును కాపాడుకో."    
    ఫోన్ పెట్టేశాడు జానీ.
    "ఇకరా! వెళ్దాం" అన్నాడు యశోదతో.
                                                            * * *
    దేవిశంకర్ జానీ ఫోన్ లో చెప్పిన మాటలు నమ్మాడు.
    ఒకటి:- యశోద హత్యప్రస్తావన ఉంది.
    రెండు:- ఎవరికీ తెలియని వివేక్ 'సైకలాజికల్ వీక్ నెస్' తెలుసుకున్నాడు.
    ప్రసూన అతడికి అన్ని విషయాలూ చెప్పింది అలాగైనా యశోద మీద పగ పోతుందేమోనని ఆశ పడింది దేవిశంకర్ లో పగ పెరిగింది తన రహస్యాలు ఆ నోటా! ఈ నోటా! ప్రచారమవుతున్నందుకు! ఫోన్ చేసినవాడు ఎవరైనా, అతడికి నిజాలు తెలుసు అందుకని వివేక్ ఇంటికి బయలుదేరాడు.    
                                     * * *
    వీరన్న దార్లో మరో కత్తి కొనుక్కుని మరీ వచ్చాడు, వివేక్ దగ్గరికి.
    "ఏమి వీరన్నా! ఇలా వచ్చావ్?" నవ్వుతూ అడిగాడు వివేక్ అతడికి వీరన్న మీద కోపం లేదు కేవలం వీరన్న పనిముట్టులాంటివాడు.   
    "నాకు అర్జెంట్ గా పది వేలయినా ఇయ్యండి.. లేకపోతే మీ రహస్యం బయట పెట్టేస్తాను."
    "నా రహస్యమా"
    "నాకంతా తెలుసు మీలో మొగతనం లేదు. పింకూ మీ కొడుకు కాదు. డాక్టర్ స్వామి నాకంతా చెప్పాడు."                        

 Previous Page Next Page