Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 48


    "పేరెంటేజ్ నిర్ధారణ చెయ్యటానికి"
    తెల్లబోయింది ప్రసూన "దానితో అవసరమేమొచ్చింది? వాడి ముఖంలో నేను అంత స్పష్టంగా కనిపిస్తుంటే నీకు సందేహమెలా కలిగింది"
    "వాడి ముఖంలో నువ్వు కనపడబట్టే, సందేహం కలిగింది పరీక్షకి తీసుకెళ్ళాను, లేకపోతే నిస్సందేహంగా కొడుకు కాదనుకునేవాడిని"        
    "నీ మాటలు నాకు అర్థంకావటం లేదు"
    "నీకు గుర్తుందా? అమ్మా! మన ఊళ్ళో నేను చాలా జబ్బు పడ్డాను... రకరకాలుగా పలవరించే వాడినట"
    భయంగా చూసింది ప్రసూన.
    "నీకది ఇంకా గుర్తుందా?."
    "ఇన్నాళ్ళూ గుర్తులేదు! లేదా లోలోపల అణిగి ఉంది. ఎందుకంటే, ఆ విషయాలు నేను మర్చిపోవాలనుకున్నాను నేను మరిచిపోయేలా మీరు ప్రయత్నించారు....."
    "ఇప్పుడా ప్రస్తావన దేనికీ?"
    "మనలో చాలామంది మానసిక వైకల్యానికి ఇలా బలవంతాన అణిచివేసిన అనుభవాలు ఆలోచనలే కారణం. అందులోనూ నాకెదురైన అనుభవం చాలా దారుణమైనది దానిని పైపైన మర్చిపోగలిగాను కానీ మనసు లోతులలో నాకు తెలీకుండా పచ్చిగా ఉంది బహుశాః దీని  కారణంగా, నేను సంసారం చెయ్యటానికి ప్రయత్నించినప్పుడల్లా నాకు నా మనసు ముందు నరకలోకపు దృశ్యాలు వచ్చి నేను పూర్తిగా ఆశక్తుణ్ణయ్యే వాడిని"   
    "అంటే ఇన్నాళ్ళూ నువ్వు....."
    "అవును! మేము నిజమైన అర్థంలో సంసారం చెయ్యలేదు సైక్రియాటిస్ట్ స్వామి సలహా మీద యశోద నాకు హాట్ డ్రింక్స్ అలవాటు చేసింది డాక్టరూ, యశోదా నా బలహీనతకి కారణం 'ట్రడిషనల్ అబ్సెషన్' అనుకున్నారు తాగటం వల్ల, మనసు ముందుకి ఏ దృశ్యాలూ వచ్చేవి కావు! అంచేత ఆ అలవాటుకు నేను బానిసనయిపోయాను."
    "ఇప్పుడీ సంగతులన్నీ ఎలా బయటికి వచ్చాయ్?"
    "నీ కోడలి ప్రయత్నం వల్ల! సైక్రియాటిస్ట్ తో నేను పది సెషన్స్ కూచున్నాను ఆయనకు సహజమైన చాకచక్యంతో నన్ను ప్రశ్నలు వేస్తూ నేను గతంలో నా బాల్యంలో జీవించే లాగ చేశారు."
    అంతా పూర్తయ్యాక, నాకు నా సైకలాజికల్ అబ్సెషన్ నుంచి రిలీఫ్ వచ్చిన తర్వాత డాక్టర్ ని అడిగాను" మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిశాయి?" అని... ఆయన జరిగింది చెప్పారు.   
    "జానీ గెస్ట్ హౌస్ కి వెళ్ళిందీ, వీరన్నతో మాట్లాడిందీ ఇందుకా?"    
    "అవును సైకాలజీ స్టూడెంట్ కదా తన ప్రయత్నం చేసింది నా అదృష్టం కొద్దీ ఫలించింది కానీ వీరన్న డబుల్ గేం ఆడటం వల్ల.... నాన్నగారికి, తన రహస్యాలన్నీ యశోదకి తెలిసిపోయాయని తెలీటం వల్ల... యశోద పైన పగబట్టారు..."  
    "పేరెంటేజ్ నిర్ణయం తేలిందా?"
    "ఆ! నేనే తండ్రినని నిర్ధారణగా చెప్పారు" కొంచెం సేపాగి తలదించుకుని అన్నాడు.
    "స్త్రీ సంతానవతి కావటానికి, సంపూర్ణమైన సంసార సౌఖ్యంతో నిమిత్తం లేదట. ఏ విధంగానైనా సరి అయిన సమయంలో పురుషుడి వీర్యం స్త్రీ అండాశయంలోకి చేరితే చాలట"
    "నా చేత తాగుడు మాన్పించటానికీ, నన్ను బెదిరించటానికీ, వారంరోజులు వరుసగా యశోద కూడా తాగింది వొంటి మీద ఇద్దరికీ తెలివిలేని దశలో ఏదో జరిగి ఉంటుంది."    
    యశోద పొంగిపోయింది.... తన కష్టాలు ఫలించాయి.... నవ్వుతూ అంది...." ఆ రోజు మీ అమ్మగారు సత్యన్నారాయణస్వామికి పూజ చెయ్యటంవల్లే నాకు గర్భం వచ్చింది అని అన్నాను గుర్తుందా? అది నిజం.. ఇదంతా మీ అమ్మగారి ఆశీర్వాదమే."
    "అమ్మా! ఇంక నేనూ, యశూ, పింకూ వేరే వెళ్ళిపోతాం! ఆశీర్వదించు" అన్నాడు వివేక్.   
    "వేరే వెళ్ళిపోతారా? దేనికీ?"
    "నాన్నగారి రహస్యాలు యశోదకి తెలిశాయి. యశోద మనింట్లోనే ఉంటే ఆయన భరించలేరు అది యశోదకి క్షేమం కాదు. వెళతాము! అప్పుడప్పుడొచ్చి నిన్ను చూస్తాము"
    యశోదతో కలిసి ప్రసూన పాదాలకు నమస్కారం చేశాడు వివేక్ ఆవిడ ఆశీర్వదించింది యశోద, వివేక్ లు పింకూతో గడప దాటగానే తెలివి తప్పిపడిపోయింది.  
                                                                 15
    వివేక్ పట్టుబట్టాడు మళ్ళీ తనకీ, యశోదకీ సాంప్రదాయసిద్ధంగా పెళ్ళి జరగాలని ఒకసారి విడాకులు తీసుకుంటే, భార్యాభర్తలు కానట్టే లెక్క!  
    కేవలం అవగాహన ఉంటే సరిపోదు లీగల్ హక్కులు కూడా ఉండాలి సంతానానికి ఇదిమరీ అవసరం.
    యశోదని పెళ్ళికూతుర్ని చెయ్యటం దగ్గరినుంచీ, అన్నీ ఆచారం ప్రకారం జరిగాయి... మొదటిసారి పెళ్ళి చేసుకున్నప్పుడు ఈ తతంగాలేవి జరగలేదు పెళ్ళికి ప్రసూన, దేవిశంకర్ కూడా వచ్చారు.
    పెళ్ళికి ప్రసూన మంచమెక్కేసింది... లేచి నాలుగడుగులు వెయ్యలేకపోతోంది... కొడుకు దూరం కావటంతో ఆమె మనసులో అణచి ఉంచిన క్షోభలన్నీ ఒక్కసారి ఆమెని కాటు వేసినట్లయింది.
    కొడుకు పెళ్ళి చూడాలనుకుంది ప్రసూన. ఆ స్థితిలో ఆమె కోరిక కాదనలేడు.. ఒంటరిగా పంపలేడు అంచేత తనూ వచ్చాడు దేవిశంకర్.   
    చాలా వేడుకగా జరిగింది పెళ్ళి స్నేహితులంతా "భార్యతో రెండో పెళ్ళి" అని వేళాకోళం చేశారు." రెండుసార్లూ ఒకే అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలా?" అని కొందరు ఆశ్చర్యం ప్రకటించారు.
    ఏమైనా పెళ్ళి చాలా వైభవంగా జరిగింది. పెళ్ళి ఫోటోలన్నింటిలోనూ పింకూ ఉన్నాడు.
    ఆ రాత్రి యశోదతో అన్నాడు వివేక్," ఇదే మనకి నిజమైన పెళ్ళి" అని ఆ మాటల్లో నిజం అనుభవంలో తెలుసుకుంది యశోద....
                                  * * *
    యశోద వివేక్ ల చిన్నసంసారం ప్రారంభమయింది ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు యశోద క్లినిక్ కి వెళ్తూ, పింకూని తల్లి దగ్గర వదిలి వెళ్తుంది వచ్చేటప్పుడు తీసుకొస్తుంది.  
    జానీ, పోలీస్ కస్టడీ నుండి బయట పడ్డాడు. ఎప్పుడైనా వచ్చి, పింకూతో ఆడుకుంటాడు.  
    ఆ రోజు యశోద క్లినిక్ లో ఉండగా ఫోన్ వచ్చింది "నేను వెంకట్ నర్సింగ్ హోం నుంచి నర్స్ ని మాట్లాడుతున్నాను మీ అత్తగారికి సీరియస్ గా ఉంది మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు వివేక్ గారికి ఫోన్ చేశాం! ఆయన వస్తానన్నారు మీరు కూడా వెంటనే బయలుదేరండి!"

 Previous Page Next Page