Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 47


    "యశోదా! నీ కొడుకుని నీకు దూరం చెయ్యాలని నా ఉద్దేశం కాదు! నీ భర్తను నీకు తిరిగి దగ్గర చేయాలని సంకల్పం. నువ్వు వెళ్ళినప్పట్నుండీ వివేక్ పింకూతోనే గడుపుతున్నాడు వాడు నీకోసం బెంగ పెట్టుకుని ఏడిస్తే వివేక్ ఫార్టీలకీ కూడా వెళ్లడం మానేసి పింకూతోనే గడిపాడు. ప్రస్తుతం మనని చుట్టుముట్టిన సమస్యలకి పరిష్కారం వీడే. నా మీద నమ్మకం ఉంచు, వీడికేలోటూ రానియ్యను. ప్రతీరోజూ తప్పకుండా సాయంత్రం మూడింటికి వాడిని నీ దగ్గరికి తీసుకొస్తాను నాలుగు వరకూ వాడూ నేనూ ఉంటాం ఇదివరకైనా నువ్వు క్లినిక్ కి వెళ్తే నా దగ్గరే ఉండే వాడుగా" అనునయంగా చెప్పింది ప్రసూన.
    "వివేక్ పింకూతోనే గడిపాడా? నిజంగా?" అడిగింది యశోద.
    "నేను అబద్ధం చెప్తానా?"
    "మరి మావగారు నామీద చాలా చెప్పి ఉండాలి. ఇప్పటికీ నన్ను కోడలిగా అంగీకరించగలరా?"
    "మొదట నీ మీద కోపం వచ్చింది. అసహ్యమూ కలిగింది కానీ నేను తెలివితక్కువ దానిని కాను అవసరమైనప్పుడు ఆలోచించగలను దుర్గయ్య ద్వారా జానీ వివరాలన్నీ తెలుసుకున్నాను నువ్వు ఒకసారి మాత్రమే జానీ గెస్ట్ హౌస్ కి వెళ్ళావనీ అప్పుడు కూడా వరండాలో వీరన్నతో మాట్లాడావనీ కూడా తెలుసుకున్నాను నువ్వు అక్కడికి వెళ్ళటానికి కారణం ఏదైనా కానీ జానీతో అక్రమ సంబంధం మాత్రం కాదని అర్థం చేసుకున్నాను."
    యశోద కళ్ళు మెరిశాయి. కొండంత రిలీఫ్ తో కనపడని దేవుడికి దండం పెట్టుకుంది పార్వతి.
    "తొందరగా వెళ్తానమ్మా. మీ మావయ్యగారికి తిక్క రేగుతుంది నేనుమాట నిలుపుకోకపోతే."
    "మావయ్యగారికి తెలుసా? మీరు ఇక్కడికి వచ్చినట్లు?"
    "ఆయనకి తెలియకుండా నేనేపనీ చెయ్యనని, నీకు తెలుసు కదా!"
    "ఏమి అనలేదా?"
    "చెప్పాను... పసివాడు తల్లికోసం బెంగటిల్లుతున్నాడు, ఇలా వదిలిస్తే ఎవరికీ దక్కకుండా పోవచ్చు! తల్లికి చూపించి మళ్ళీ తీసుకొస్తాను!" అని, మాట్లాడలేదు అంటే! అడ్డు చెప్పలేదన్నమాట ఆయనకి నా మీద ప్రేమ ఉంది... ప్రేమలో ఎన్నో రకాలు!" నవ్వింది, విషాదంగా......  
    సాయంత్రం మూడు గంటల కోసం ఎదురు చూడటమే, యశోద నిత్య కార్యక్రమమైపోయింది.
    ఉద్యోగం మానమని ఎవరెన్ని విధాలా చెప్పినా వినిపించుకోని వ్యక్తి తనంతట తను ఉద్యోగానికి రాజీనామా చేసింది ఉద్యోగంలో ఉంటే, సరిగ్గా మూడు గంటలకి రావటం కుదరకపోవచ్చని ఏ వస్తువు విలువైనా అది దూరమైనప్పుడు మరింత పెరుగుతుంది.   
    యశోద వెనుకటి మాతృత్వపు మమకారంలో ఈ ఉద్వేగం లేదు, ఈ తీవ్రత లేదు. ఇప్పుడు మరీ పింకూ తప్ప వేరే లోకం లేనట్లు అయిపోయింది.
    ఆ రోజు మూడయినా, ప్రసూన రాలేదు మూడు నుంచి మూడున్నర వరకూ అసహనం, ఆ తర్వాత ఆందోళనా ప్రారంభమయ్యాయి యశోదలో.
    నాలుగు వరకూ నిగ్రహించుకుంది ఆ తర్వాత తల్లితో చెప్పకుండా వచ్చేసింది ఆటోలో. దిగులుగా కూచుని ఉంది ప్రసూన, మతిపోయింది యశోదకి.
    "పింకూ ఏడీ? తీసుకురాలేదేం?" అడిగింది.
    "పింకూ.... పింకూ.... దుర్గయ్య వెళ్ళాడు, తీసుకొస్తాడు."
    "నిజం చెప్పండి... ఏదో జరిగింది... పింకూని దుర్గయ్యతో ఎందుకు పంపించారు?. ఎక్కడికి పంపించారూ?"
    "నేను పంపలేదు! పింకూని ఉయ్యాలలో పడుకోబెట్టి, దేవుడి ముందు కూచున్నాను. నిద్రపోతున్నాడని... నా పూజ పూర్తయి నేను బయటికి వచ్చేసరికి పింకూ ఉయ్యాలలో లేడు! కంగారు పడకు! బయటి వాళ్ళు వచ్చే అవకాశం లేదు ఇంట్లో వాళ్ళే ఎక్కడికో తీసికెళ్ళి ఉంటారు! వెతికిస్తున్నాను కొంచెం సేపట్లో ఎవరో ఒకరు తీసుకొస్తారు"  
    కళ్ళు పెద్దవి చేసి, చూసింది యశోద....
    "కొంపదీసి మావయ్యగారు వాడిని.....?"
    "ఛ! ఛ! అలాంటిది జరగదు..! వాడిని మీ మావయ్యగారు ఏమీ చెయ్యరు... చెయ్యలేరు"
    "మీకు తెలీదు..... మావయ్యగారు ఎంతకైనా...."
    "నాకు తెలుసు... ఆయన ఎంతకైనా తెగించగలరు ఎలాంటి ఘాతుకమైనా చేయగలరు కానీ వీడిని ఏమి చెయ్యరు."
    "ఏమిటంత విశ్వాసం మీకు?"
    "ఆ పసివాడిలో చాలా స్పష్టంగా నేను కనిపిస్తున్నాను కనుక!"
    నిర్ఘాంతపోయింది యశోద.
    "నన్ను నమ్ము... కొంచెం సేపు ఓపిక పట్టు"
    "అత్తగారూ! నాకు దేవుడిలో మీకున్నంత నమ్మకం లేదు! మీరు ప్రార్థించినంత భక్తితో నేను ప్రార్థించలేకపోవచ్చు పింకూ క్షేమంగా ఇంటికి రావాలని ప్రార్థించండి"
    "పెదవులతో నీతో మాట్లాడుతూ మనసులో నేను చేస్తున్న పని అదే. నా ప్రార్థన అలాగే ఉంటుంది."  
     మాట్లాడుతున్నా, నువ్వుతున్నా, తింటున్నా, ప్రసూనలో ఏదో డిటాచ్డ్ ధోరణి ఏనాడో కనిపెట్టింది యశోద దానికి కారణం ఇదా?
    "అత్తగారూ, పింకూ క్షేమంగా తిరిగి రాకపోతే, నేను మీ కళ్ల ముందే తిండీ, నీళ్ళూ మానేసి ప్రాయోపవేశం చేస్తాను వాడులేని జీవితం నాకు అక్కరలేదు వివేక్ తో మళ్ళీ కలిసే అవకాశం ఉందని మీరు ఆశ చూపించారు అందుకని వాడిని నేను మీ దగ్గర వదిలాను... లేకపోతే...."
    "ఏదీ ఆ మాటలు మళ్ళీ ఒక్కసారి అను"
    వివేక్ మాటలు అప్పుడే లోపలికి వచ్చాడు! వివేక్ చేతుల్లో ఉన్నాడు పింకూ తల్లిని చూడగానే ఎప్పటిలా మీదకి ఉరకలేదు.... వివేక్ చంకలోనే ఉన్నాడు యశోద చిన్నబుచ్చుకుంది.... సంతోషమూ కలిగింది, వివేక్ పింకూ మీద చూపిస్తున్న వాత్సల్యానికి.
    "రా" అంటూ చేతులు చాపింది యశోద. తండ్రి చేతుల్లోంచి తల్లి చేతుల్లోకి ఉరికాడు పింకూ.
    ఆనందభాష్పాలతో కళ్ళనిండుగా చూసుకుంది ప్రసూన ఆ ముగ్గురినీ.
    "పింకూని ఎక్కడికి తీసికెళ్ళావ్?" అడిగింది ప్రసూన, వివేక్ ని.
    "జెనిటిక్స్ ప్రొఫెసర్ దగ్గరికి"
    "అదెందుకు"              

 Previous Page Next Page