Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 46


    ఆ పశువుతో గెలవలేకపోతోంది తల్లి ఏడుపు చూసిపసివాడు కెవ్వుమన్నాడు హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యం చూడలేక రెండు చేతులతో ముఖం దాచుకుంది... వివేక్ లేచినవాడు కూచున్నాడు.   
    తండ్రి అదలింపుకు కాదు యశోద పిచ్చిదానిలా అరుస్తూ ఏడవటం చూసి అతడు భరించలేకపోతున్నాడు కానీ ఆ సమయంలో యశోదకి సహకరించదల్చుకోలేదు యశోద తనకు విడాకులిచ్చిందని దేవిశంకర్ చెప్పినప్పట్నుండీ అతడి మెదడు మొద్దుబారిపోయింది.
    తండ్రిలో వివేక్ కి ఏనాడూ నమ్మకం లేదు. అతడు ఏదో చేసి ఉంటాడనే అనుమానం ఉంది కానీ యశోద జానీ గెస్ట్ హౌస్ కి వెళ్ళింది, ఒకసారి కాదు రెండుసార్లు!    
    ఎందుకు వెళ్ళింది? ఏం జరుగుతోంది? ఏది ఏమైనా యశోద తనను శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతుందనుకోవటం అతడు సహించలేకపోతున్నాడు ఇంత జరిగాక, మనసు లోతులలోకి చూసుకుంటే ఇంకో చేదు నిజం తెలిసింది.
    ఒకవేళ నిజంగా యశోదకి జానీతో సంబంధం ఉన్నా, తను ఆమెని వదులుకోలేడు. యశోద శాశ్వతంగా తనను వదిలి వెళ్ళిపోతుందనుకుంటే, అంతా శూన్యమైపోయినట్లుగా ఉంది.
    ఎందుకు బతకాలో? బతికి పొందే సౌఖ్యమేమిటో అర్థం కానట్లు అయోమయంలో పడిపోయాడు. యశోద తనంతట తాను విడాకులు లిచ్చి వెళ్ళిపోవాలనుకుంటే, వివేక్ ఆమెని ఏ ప్రలోభంతో ఆపుజేయగలడు?  
    సమాధానం, పిచ్చిదానిలా ఏడుస్తూన్న యశోద ఏడుపులో దొరికింది.
    "పింకూ" పింకూ ఒక్కడే యశోదని పగ్గాలు వేసి ఈ ఇంటికి తీసుకురాగలడు ఈ బంధం తెంచెయ్యకూడదు అందుకే లేచినవాడు కూచున్నాడు.   
    దేవిశంకర్ చేతుల్లోంచి పింకూని లాక్కోలేకపోయింది యశోద వివేక్ దగ్గరికొచ్చి అతడి రెండు చేతులూ పట్టుకుంది. "వివేక్ పింకూని నాకిచ్చేయ్ వాడు నా బాబు నిన్నేమీ అడగను నువ్వు ఇంకోవందమంది ఆడవాళ్ళని పెళ్ళి చేసుకున్నా నీ జోలికి రాను నా కొడుకుని నాకిచ్చేయ్"
    యశోద ఈ ధోరణిలో మాట్లాడకపోయి ఉంటే, వివేక్ ఏం చేసేవాడో? నా పింకూని నాకిచ్చేస్తే మీ జోలికి రాను" అంటోంది, రాయిలా కూచున్నాడు కదలకుండా.
    "వివేక్! నీకిది న్యాయం కాదు నేను సహించను ఊరుకోను నా కొడుకుని నేను వదులుకోను కోర్టుకి వెళతాను. అన్నీ బయట పెడతాను పింకూని నాకు ఇప్పించు... ఇచ్చేయ్ వాడు నా కొడుకు!"  
    పిడికిళ్ళు బిగించి గుద్దటం మొదలు పెట్టింది.
    యశోద మాటలు పూర్తిగా అర్థమయింది వివేక్ వొక్కడికే. అతడి మనసు బండబారిపోయింది. భయమూ, కోపమూ, కసి... అన్నీ ఆక్రమించుకున్నాయి, అతడి మనసుని! యశోద పిడికిళ్ళు బిగించి దబదబాగుద్దుతుంటే చలనం లేనట్లు కూచున్నాడే గానీ, ఆ ఉద్రేకాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు.
    పసివాడు కెవ్వుమని గుక్కపట్టి ఏడుస్తున్నాడు.
    ప్రసూన వాడిని తన చేతుల్లోకి తీసుకుంది కొంత శాంతించాడు పింకూని ప్రసూన చేతుల్లోకి తీసుకోగానే "అత్తగారూ! నా బాబు!." అని అటు రాబోయింది యశోద.  
    దేవిశంకర్ బలవంతాన మత్తుమందు వాసన చూపించాడు. స్పృహ తప్పి యశోద పడిపోతున్నప్పుడు, వివేక్ చటుక్కున లేచి ఆమెని తన చేతులతో పట్టుకుని సోఫా మీద పడుకోబెట్టాడు అప్పుడు రాలి పడ్డాయి అతడి కళ్లలోంచి రెండు కన్నీటి బొట్లు.   
                                       14
    యశోద దిగులుతో మంచమెక్కింది పార్వతికీ, మూర్తికీ ఏమీ తోచటం లేదు. అంత జరిగినా వివేక్ సైకలాజికల్ వీక్ నెస్ తల్లిదండ్రులకు చెప్పలేదు యశోద.  
    అంచేత జానీ గెస్ట్ హౌస్ కి యశోద ఎందుకు వెళ్ళిందనేది వాళ్ళకీ అంతు పట్టడం లేదు అందరిలాగ జానీతో యశోదకి సంబంధం ఉందనే అనుమానం వాళ్లకు రాలేదు అలాంటిది ఉంటే యశోద మంచం పట్టేది కాదు దర్జాగా జానీతో ఉండేది.
    "పింకూ కస్టడీ కోసం కోర్టుకి వెళ్దాం" అన్నాడు మూర్తి. కానీ కోర్టుకి వెళ్తే దేవిశంకర్ ఎంత బురదనైనా పులమగలడు అప్పుడు వివేక్ ని బయటపెట్టవలసి వస్తుంది అందుకు ఒప్పుకోలేదు యశోద.
    ఎలా అయినా దేవిశంకర్ ని ఓడించాలి అంతే గానీ దెబ్బతిని ఉన్న వివేక్ మీద మరింత దెబ్బతీయకూడదు.   
    పార్వతి "కాఫీ తాగు!" అనగానే "పింకూ పాలు తాగాడో లేదో?" అని కాఫీ పక్కన పెట్టేస్తుంది.
    "వెఱ్రివెధవ వంట్లో బాగోకపోయినా సరే కబుర్లు చెప్తే నవ్వేస్తాడు" అంటుంది.
    "అత్తగారు వాడిని బాగా చూసుకుంటారు! నాకు బాగా తెలుసు! కానీ ఆవిడ ప్రేమలో వాడు నన్ను మరిచిపోతాడేమో? వాడు లేని జీవితం నాకెందుకు?" అని కుమిలిపోతుంది.
    పార్వతి తట్టుకొనలేకపోతోంది... "ఏమిటండీ ఇది? ఎంతగా చదువుకున్నా, ఎంత అందంగా ఉన్నా ఆదుకునే తల్లిదండ్రులున్నా ఆడదాని జీవితం ఇంతేనా?" అని మూర్తితో మొర పెట్టుకుంది.   
    రోజూలాగే "అమ్మా! పింకూ నన్ను మరిచిపోతాడేమో?" అంది మంచంలో పడుకుని.
    "మరిచిపోడు మరిచిపోతే సృష్టికి అర్థం లేదు" ప్రసూన మాటలకి గభాలున లేచి కూచుంది యశోద.
    ప్రసూన చేతుల్లో ఉన్న పింకూ యశోద చేతుల్లోకి ఉరికాడు తన చిట్టి చేతులతో యశోద ముఖమంతా తడిమి తడిమి బోసిగా నవ్వాడు యశోద కన్నీళ్ళు చేతివేళ్ళకి తగిలితే, ఆ వేళ్ళునోట్లో పెట్టుకోబోయాడు.   
    అలా పెట్టుకోకుండా చేతిని గట్టిగా పట్టుకుని నవ్వింది యశోద.
    ఆ నవ్వు చూశాక పార్వతికి ప్రాణం లేచి వచ్చినట్లయింది.
    "హమ్మయ్య! నాలుగు రోజుల తర్వాత ఇవాళ దాని ముఖం మీద నవ్వు చూశాను వదినగారూ మీరు నిజంగా దేవతలాంటి వారు దాని కొడుకుని దానికిచ్చేయండి."
    "తొందరపడకండి! అందరికీ ఏది మంచిదో అలా చేద్దాం యశోదా పింకూ నిన్ను మరిచిపోయాడనుకుంటున్నావా? పిచ్చి తల్లీ వాడిని కళ్లలో పెట్టుకుని నేను చూసుకుంటున్నాను పాలు, ఫారెక్స్, ఫ్రూట్ జ్యూస్ అన్నీ ఏ వేళలో అది వాడికి ఇస్తున్నాను ఇక బొమ్మలకి లోటేలేదు నేను అన్నిపనులూ మానుకునివాడితోనే ఉంటున్నాను అయినాసరే ఆడుతూ పాడుతూ అన్నివైపులా నీకోసం వెతుక్కుంటాడు నవ్వుతూ, నవ్వుతూ, నీకోసం బెంగపెట్టుకుని ఏడ్చేస్తాడు పాలు తాగుతూ తాగుతూ మధ్యలో ముఖం తిప్పుకుని చుట్టూ చూసుకుంటాడు ఇప్పుడు చూడు దొంగ వెధవ ఎలా నవ్వుతున్నాడో వాడికి నీ చేతుల్లో, నీ వళ్ళో కలిగే ఆనందం, స్వర్గ సౌఖ్యాలన్నీ దిగి వచ్చినా రాదు! ఇదే సృష్టి రహస్యం"   
    యశోద ముఖం వికసించింది పదే పదే కొడుకు చిన్నారి చేతులు ముద్దు పెట్టుకుంది.
    "నేనిక్కడ మరో అరగంట ఉంటాను అంతే వెళ్ళేటప్పుడు పింకూని తీసుకుపోతాను...." యశోద భయంగా చూసి, పసివాడిని గుండెకదుముకుంది.

 Previous Page Next Page