Previous Page Next Page 
భార్యతో రెండో పెళ్ళి పేజి 45


    "నా నుండి విడాకులు పొందటానికి, ఇన్ని పన్నాగాలూ పధకాలూ అవసరం లేదు వివేక్ ఒక్కమాట అంటే నేను ఏనాడో ఇచ్చేసేదాన్ని"  
    "ఓహ్ త్యాగశీల నాకు నీకూ త్యాగం అక్కరలేదు ఒక హక్కుగా, విడాకులు కావాలి నీ నీడ మావాడి మనసు మీద గానీ, మా ఇంటి మీద గానీ పడకుండా కావాలి" కసిగా అన్నాడు.
    యశోదకి ఎదుర్కోవాలని ఉంది... పోలీస్ కస్టడీలోకి తీసుకోమని సవాల్ చెయ్యాలని ఉంది అతిప్రయత్నం మీద నిగ్రహించుకుంది వివేక్ మనసు ఇప్పుడిప్పుడే స్థిమిత పడుతోంది ట్రీట్ మెంట్ ప్రారంభించానని చెప్పాడు స్వామి.   
    అతడి మనసు చెదరగొట్టడానికి ఇదికాదు సమయం వివేక్ తనని అర్థంచేసుకోగలిగితే ఇలాంటి కాగితాలు లక్ష కూడా అతడినీ, తననీ వేరు చెయ్యలేవు.   
    "ఇలా ఇవ్వండి కాగితాలు"
    తీసుకుని సంతకం చేసి ఇచ్చేసింది యశోద. దేవిశంకర్ కే ఆశ్చర్యం కలిగింది ఎవరెంత కాదన్నా యశోదకి ఆస్థి మీద మమకారం లేదని అతడు నమ్మలేడు.    
                                    * * *
    గెస్ట్ హౌస్ నుంచి నేరుగా తల్లి దగ్గరికి వచ్చింది యశోద, పసి పిల్లలా తల్లి వళ్ళోతల పెట్టుకుని పడుకుంది, తల్లడిల్లిపోయింది పార్వతి.
    మొండిగా పరిస్థితులతో పోట్లాడుతూంటే కానీ, డీలా పడిపోదు యశోద... ఏ మాత్రం భరించలేనిదేదో జరిగి ఉండాలి! ఏమి అడక్కుండా యశోద తల నిమురుతూ కూచుంది.... తల్లిచేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుంది యశోద.  
    "చాలా హాయిగా ఉంది అమ్మా" కళ్ళు తెరవకుండానే అంది యశోద.
    పార్వతి హడిలిపోయింది ఏం జరిగింది? ఏదో దారుణమైనదే జరిగే ఉండాలి.
    "అమ్మా! ఒకవేళ నేను నేనేదేమైనా ఇబ్బందుల్లో చిక్కుకుని నీ దగ్గర ఇలా పడుకోవాలని వస్తే నన్ను పొమ్మంటావా"
    "ఛ! అవేం మాటలే! ఎప్పటికీ నిన్ను నాగుండెల్లో దాచుకుంటాను ఎప్పటికీ నిన్ను పొమ్మనటమే! హమ్మో"
    "మరి, అప్పుడు మా అత్తగారు రాగానే నన్ను పంపేశావుగా"
    "అది నీ సంతోషం కోరి. నిజం చెప్పు అల్లుడికి దూరంగా, నువ్వు హాయిగా ఉండగలవా? ఉండగలవని, నువ్వు చెప్పినా నేను నమ్మను ఆ రోజుల్లో నీ ముఖం మీద చిరునవ్వు కనపడేదే కాదు! అలా నిన్ను చూడగలనా?"   
    "నాకూ అలా రావాలని ఉందమ్మా కానీ వొస్తే నువ్వేమీ అనకూడదు కొన్నాళ్ళు నాకు నీ అండ కావాలి నీ ప్రేమ కావాలి"   
    "పిచ్చి పిల్లా నీ మీద కాకపోతే, నా ప్రేమ ఇంకెవరి మీద? ఇప్పుడు నీవు తల్లివయ్యావు కదా నీకే తెలుస్తుంది"
    పార్వతి వొళ్ళోంచి లేచింది యశోద.
    "వెళ్ళి పింకూని తీసుకొస్తాను"
    "పింకూని తీసుకొస్తావా? అంటే....."
    "ప్రస్తుతం కొంత కాలం నీతో వుంటాను. తర్వాత ఏమవుతుందో నేను చెప్పలేను నాకు తెలీదు కానీ నిజంగా వివేక్ ని వదిలి నేను రావాలనుకోవటం లేదు. అంచేత నాకు నచ్చజెప్పటానికి కానీ నీతులు బోధించటానికి గానీ ప్రయత్నించకు! నువ్వలా చేస్తే నీ దగ్గరి నుంచి కూడా పారిపోతాను"  
    బిత్తరపోయింది యశోద.
                                                             * * *
    యశోద వచ్చేసరికి డైనింగ్ టేబిల్ ముందు కూచుని మాట్లాడుకుంటున్నారు, దేవిశంకర్, వివేక్, ప్రసూన విషాదంగా ఉన్న ప్రసూన ముఖమూ, అణుచుకుంటున్న వివేక్ ఉద్రేకమూ వాళ్ళు యశోద గురించే మాట్లాడుకుంటున్నారని చెపుతున్నాయి.  
    యశోదని చూడగానే చీడపురుగుని చూసినట్లు చీదరించుకుంటూ..." మళ్ళీ ఈ గడపలో ఎందుకు అడుగు పెట్టావ్" అన్నాడు దేవిశంకర్.
    ఇంత అవమానం భర్త ఎదురుగా జరుగుతుంది భర్త ఏమి అనటం లేదు కుతకుత ఉడుకుతుంది యశోద మనసు....
    ఆడజన్మ ఎత్తినంత మాత్రాన అన్ని అవమానాలూ, నోరు మూసుకుని భరించవలసిందేనా? ఇది కేవలం "విమన్ విచ్" సమస్య మాత్రమే అయితే యశోద ఇంకా తీవ్రంగా మాట్లాడేదే కానీ ఇక్కడ ఒక గాయపడ్డ మనసు చిక్కుకుని ఉంది ఆ మనసు తను ప్రేమించిన వివేక్ ది.
    "నీ వస్తువులన్నీ ఇవాళే మీ ఇంటికి పంపేస్తాను... వెళ్ళు" అన్నాడు మళ్ళీ "ఛీ! ఫో!" అన్న ధోరణిలో.
    "వస్తువుల కోసం నేను రాలేదు, అలాంటి వాటి గురించి నేను ఆలోచించను నేను పింకూని తీసుకెళ్ళడానికి వచ్చాను"
    "పింకూనా?" అప్రయత్నంగా అంది ప్రసూన.
    అప్పటికే ఆవిడ ముఖం పాలిపోయింది.
    "ఇప్పటికి మీకు అన్ని విషయాలూ తెలిసి ఉంటాయి నేను ఇక్కడ కుదరనప్పుడు పింకూని ఎలా వదలను? నన్ను క్షమించండత్తయ్యా" అని ప్రసూన ముఖం చూసి సానుభూతితో అంది.
    దేవిశంకర్ పులిలా లేచాడు మనిషి నెత్తురు రుచి చూసిన పులి కళ్లలాగే ఉన్నాయి, అతడి కళ్ళు.
    "బిడ్డని అక్కడ పెట్టు" అన్నాడు ఉరుముతున్నట్లు తెల్లబోయింది యశోద ఈ పరిణామం ఆమె ఊహించనిది.
    "నాకొడుకు మీరెవరు తీసుకువెళ్లొద్దనటానికి?"
    "వాడు మా వంశాంకురం! మా ఇంటిదీపం! నీ పాపిష్టి చేతులు వాడిమీద పడటానికి వీల్లేదు వొదులు"
    నిర్ఘాంతపోయింది యశోద... చటుక్కున పింకూని గుండె కదుముకుంది" జాగ్రత్త, పింకూ జోలికొస్తే ఊరుకోను"
    దేవిశంకర్ లోని తోడేలు పూర్తిగా బయటికి వచ్చింది "ఏమిటే అరుస్తున్నావ్! ఊరుకోవా? ఊరుకోక ఏం చేస్తావ్? పోయి నీ రంకు మొగుడితో చెప్పుకుంటావా" యశోద చేతుల్లోని పింకూని బలవంతంగా లాక్కున్నాడు, కెవ్వున కేక పెట్టింది యశోద.
    గబుక్కున లేచాడు వివేక్! "కూచో! ఈ రాక్షసి చేతికి మన బాబుని ఇస్తే, తనలాగే తయారు చేసి పెడుతుంది" అన్నాడు కరుగ్గా దేవిశంకర్.   
    యశోద ఏదీ గమనించటం లేదు.... దేనినీ లక్ష్యపెట్టడం లేదు "నా బాబు! నా పింకూ!" అని పిచ్చి దానిలా దేవిశంకర్ చేతిలో ఉన్న పింకూని లాక్కోవటానికి పెనుగులాడుతోంది.

 Previous Page Next Page