"మరిచిపోలేను! అప్పటి పరిస్థితులు వేరు. వివేక్ నీకంటే అందగాడు, మంచివాడు, డబ్బున్నవాడు అని అతడిని పెళ్ళి చేసుకుంది. కానీ సైకలాజికల్ రీజన్స్ వల్ల వివేక్ అసలు సంసారం చేయలేకపోయాడు. అంచేత నీ ఆఫర్ అందుకుంది పింకూ నీ కొడుకు" మతిపోయినట్లయింది జానీకి. వొళ్ళు తెలియని కోపం వచ్చింది అరుణ తల వెంట్రుకలు ఊడి వచ్చేలాగ జుట్టు పట్టుకుని అటూ ఇటూ ఊపుతూ "ఈ వెధవ కధలన్నీ ఎందుకు చెప్తున్నావ్ నువ్వు ఏం సాధిద్దామని?" అన్నాడు.
బాధ భరించలేక కెవ్వున అరిచింది అరుణ.
"చెప్పు?"
"ఒదులు చెప్తాను!!"
ఆఖరుసారి కోపంగా జుట్టు పట్టుకుని ఊపి దూరంగా విసిరేశాడు జానీ. దబ్బున నేల మీద పడింది.
అంతటితో ఊరుకోక మళ్ళీ కోపంతో మీదికి వస్తూ "చెప్పు! ఎందుకల్లుతున్నావ్ ఇలాంటి కధలు" అన్నాడు.
అరుణ ఏడుస్తూ చేతులు జోడించి "నన్ను కొట్టకు. నీతోడు నేను కధలల్లటం లేదు విన్నది చెప్తున్నాను" అంది.
"విన్నావా? ఏం విన్నావు? ఎక్కడ విన్నావూ?"
"నన్ను కాస్త ఊపిరి తీసుకోనియ్యి, చెప్తాను."
వరండాలో పేము సోఫాలో కూలబడిపోయాడు జానీ కోపమూ, చికాకూ అణుచుకోలేకపోతున్నాడు.
అరుణ బెడ్ రూంలోకి వెళ్ళి, ముఖం కడుక్కుని, పైపైన పౌడర్ అద్దుకుని వచ్చింది, జానీ పక్కన కూచుని తను విన్నదంతా వివరించింది.
"సారీ ఇవన్నీ విన్నాక, యశోదని నీ గెస్ట్ హౌస్ లో చూశాక పింకూ నీ కొడుకే ననుకున్నాను"
నిర్ఘాంతపోయాడు జానీ. ఇందుకా యశోద వీరన్నతో మాట్లాడతానన్నది ఇందుకా ఏదో దిగులు దాచుకున్న దానిలా కనిపిస్తోంది.
"ఇంతకూ 'పింకూ' తండ్రి ఎవరంటావు."
అడిగింది అరుణ.... అదే ప్రశ్న. జానీ మనసులో కూడా..... కొంపదీసి దేవిశంకర్ కసితో భగ్గుమంది జానీ మనసు.
* * *
యశోద పని చేసే క్లినిక్ కి వచ్చాడు వీరన్న.
అతడి ముఖం చూడగానే కలుగుతున్న జుగుప్సనీ, చికాకునీ అణుచుకుని "ఇక్కడికెందుకొచ్చావ్? నాతో మాట్లాడవలసిందేమైనా ఉంటే, ఇంట్లో మాట్లాడు" అంది కరుగ్గా.
మావగారికి వీరన్న భయపడతాడని ధైర్యం.
"ఒక విషయం అమ్మాయిగారూ. ఆ రోజు నేను అదే రత్తి గొడవ జరిగిన రోజు, ఇంకా కొన్ని వివరాలున్నాయి చెప్పవలసినయి."
ఈ మాటలు వినగానే యశోద ధోరణి మారిపోయింది.
"అయితే సరే జానీతో మాట్లాడి, అక్కడికి వొస్తాను నువ్వెళ్ళు"
"నేను రేపే మా ఊరు యెల్తున్నాను. ఇక్కడ పని అయిపోయింది అయినా జానీ బాబుగారు అక్కడుండక మరెక్కడుంటారమ్మా? మీరు రండి"
"అది కాదు"
ఆగిపోయింది.... "అమ్మాయిలెవరినీ పిలుచుకోవద్దని నేను చెప్తానులెండి. మీరు రండి"
"నువ్వెళ్ళు నేనొస్తాను"
వీరన్నని పంపేసింది, మనసు అటూ ఇటూ ఊగింది. జానీ ఇంటికి ఫోన్ చేసింది ఇంట్లో లేడని తెలిసింది బహుశా గెస్ట్ హౌస్ లోనే ఉండి ఉంటాడనుకుంది బయలుదేరింది వరండాలో కూచుని ఉన్నాడు వీరన్న గేటు దగ్గర క్షణ కాలం ఆగింది.
వీరన్న బెడ్ రూం వైపు తిరిగి "జానీ బాబూ! అమ్మాయిగారొచ్చారు" అని అరిచి చెప్పాడు.
అతడితో వరండాలోకి వచ్చింది. ఎప్పటిలాగే వరండాలో పేము సోఫాలో కూచుంది.
"జానీ బాబు లోపలికి రమ్మంటున్నారు" అన్నాడు బెడ్ రూంలోపలికి వెళ్ళి వచ్చిన వీరన్న.
అవసరం కొద్దీ వీరన్నతో మాట్లాడుతున్నా అతడిని ఏనాడూ నమ్మని యశోదలో అనుమానం పెరిగింది. కనుబొమ్మలు ముడిచి "జానీ ఒక్కనాటికీ అలా అనడు! నేను నమ్మను జానీ ఇలారా" అంది గట్టిగా. చేరవేసి ఉన్న బెడ్ రూం తలుపులు తెరుచుకున్నాయి బయటికి వచ్చింది జానీ కాదు దేవిశంకర్! అతడితో బాటు యస్. ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా వచ్చారు. బెదిరిపోయింది యశోద ఎప్పటి నుంచి మనసులోపల ఉన్న భయం నిజమవుతోంది.
"యశోదా! వ్యభిచార నేరం కింద నిన్ను అరెస్ట్ చెయ్యటానికి కావలసిన సాక్ష్యాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి నా దగ్గర అప్పుడు నువ్వెలాగూ వ్యభిచారిణివని రుజువు చేసి వివేక్ చేత నీకు విడాకు లిప్పించగలను. కానీ అంచేత అంతవరకూ రాకుండా నువ్వే ఈ కాగితాల మీద సంతకాలు పెట్టు" తను తీసుకొచ్చిన కాగితాలు అందించాడు దేవిశంకర్ లాయర్ సలహాతో అతి జాగ్రత్తగా వ్రాయించిన కాగితాలు అవి వాటి సారాంశం:
"నేను జానీని ప్రేమించాను అతడికీ నాకూ, చాలా రోజులుగా సంబంధం ఉంది. ఇప్పుడు ఆ సంబంధం తెంపుకోలేను వివేక్ తో సంసారం నాకిష్టం లేదు విడాకులు కోరుకుంటున్నాను వివేక్ స్థిర చరాస్థుల మీద నాకేవిధమయిన సంబంధం లేదు."
చివరి వాక్యం చదివి, అంతబాధలోనూ లోలోపల నవ్వుకుంది విడాకులు తీసుకోవటం? మానటమా? అనేది యశోదకి పెద్దసమస్య కాదు కానీ తెలుసుకోవాలనే కుతూహలంతో "నేను ఇక్కడికి వచ్చినమాట నిజమే కావచ్చు అంతమాత్రాన వ్యభిచారం నేరం కింద నన్ను ఎలా అరెస్ట్ చెయ్యగలరు"
అలాంటి పరిస్థితులలో సహితం కోడలు నిబ్బరాన్ని, ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు దేవిశంకర్ వెటకారంగా అన్నాడు "ఇంతకు ముందే నీ జానీని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు అతడి దగ్గరకు వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు ఆ అమ్మాయి జానీ తనని మభ్య పెట్టి మాయ మాటలు చెప్పి ఇక్కడికి రప్పించాడని రిపోర్ట్ ఇచ్చింది అలా జానీని పట్టుకున్నారు అలాంటివాడి దగ్గరికి అందులోనూ ఇంత చరిత్ర ఉన్న గెస్ట్ హౌస్ కినీ అంతట నీవు స్వయంగా వచ్చావు గనక......!"
"అర్థమయింది ఇదంతా ప్లాన్డ్ గా తయారు చేసిన పదకమన్నమాట"
గర్వంగా నవ్వాడు దేవిశంకర్, యశోద మనసు రగులుతోంది.