ఆమెకి ఒక్క ముక్క అర్థం కాలేదు.
ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న శక్తి నవ్వుతూ "ఊరకే నిలబడొచ్చుగా. ఏమంటున్నారు మీ అమ్మగారు అని అడిగి దొరికిపోయారు. అవంటున్నారన్న మాట మా అమ్మగారు" రిసీవర్ని ఆమె చేతుల్లోంచి తీసుకుంటూ అన్నాడు శక్తి.
"అవన్నీ తిట్లేనా?" తేరుకుంటూ అడిగింది మహిత.
"నిక్షేపంగా"
"అన్ని తిట్లా...?!"
"ఎన్ని కొన్నేగా...?! ఇంకా కొన్ని వేల రకాల తిట్లు తిట్టగలదు మా అమ్మ."
"మాట్లాడిచావ్..." అని ఫోన్ లో గట్టిగా వినపడేసరికి శక్తి ఉలిక్కిపడి...
"ఏం మాట్లాడను....? నే వచ్చేస్తాను" అన్నాడు శక్తి తిరిగి.
"మావయ్య ఇచ్చిన ఉద్యోగం చేయకుండా వస్తే... నువ్వొచ్చేసరికి నా శవం పాడె ఎక్కటానికి సిద్ధంగా వుంటుంది. నేనెంత పట్టుదల గలదాన్నో నీకు తెలుసు. కావాలంటే నువ్వు ఉద్యోగంలో చేరాక నేనొచ్చి మా అన్నయ్యతో మాట్లాడతాను. నువ్వు మటికి రేపే ఉద్యోగంలో చేరాలి. మావయ్య ఇచ్చిన ఉద్యోగంలో చేరకుండా అక్కడే ఖాళీగా ఉన్నా, వేరే ఉద్యోగంలో చేరినా వెంటనే నా చావు కబురు నీ కొస్తుంది. ఫోన్ పెట్టేయ్..." అని లక్ష్మీదేవి అరవగానే....
ఫోన్ కట్ అయిపోయింది.
"ఏవన్నారు మీ అమ్మగారు....? ఫోన్ పెట్టేసారనే ధైర్యంతో అడుగుతున్నాను" అంది మహిత గ్లిట్టరింగ్ ఐస్ తో.
వాళ్ళమ్మ ఏమన్నది చెప్పాడు శక్తి.
మహిత కళ్ళలో ఒక్కక్షణం మెరుపు మెరిసి మాయమైంది.
"మా కంపెనీలో... అది మా సెక్షన్ లో చేరబోతున్న సందర్భంలో మీకు మంచి పార్టీ ఇస్తాను. పదండి... వునూ... దూది దబ్బ సచ్చినోడా అంటే ఏంటి?" అమాయకంగా అడుగుతున్న మహితవేపు చూసి ఫక్కున నవ్వాడు శక్తి.
"తోలు మందమని అర్థం... మా అమ్మ సంస్కృతంలో కూడా తిట్టగలదు. అదలాంటి తిట్టే."
"నీ దెవసంకాల అంటే...?!"
"ఏమో నాకూ తెలీదు... బహుశా మా అమ్మకు కూడా తెలిసుండదు తిట్టు బావుందని తిట్టి ఉంటుంది" అన్నాడు ఫోన్ బిల్ పేచేసి.
ఫోన్ బూతులోంచి బయటికి వస్తూనే పడి పడి నవ్వింది మహిత. అలా చాలాసేపు ఆ తిట్లని తలుచుకొని నవ్వుతూనే ఉంది.
"నాకు మీ అమ్మగారిని చూడాలని ఉంది. భలే తమాషాగా ఉన్నారే మీ అమ్మగారు" ఇక నవ్వలేక పొట్టపట్టుకుంటూ.
"అప్పుడు ఆడతిట్లు కూడా తింటారు."
"అదేంటది... తిట్లలో కూడా ఆడతిట్లు... మగతిట్లు అని ఉంటాయా!?"
"ఆడా.... మగ తిట్లే కాదు... అటూ ఇటూ కాని తిట్లు కూడా ఉంటాయి."
"వ్వాట్....?!" అదిరిపోతూ అంది మహిత.
"అవును" అని ముందుకు సాగాడు శక్తి.
ఒకింతసేపటికి తేరుకున్న మహిత...
"అపాయింట్ మెంట్ ఆర్డరేది?" అని అడిగింది.
అప్పుడు గుర్తుకొచ్చి ఉలిక్కిపడ్డాడు శక్తి.
దాన్ని కోపంగా ఉండలా చుట్టి కేంటిన్ లోనే ఓ మూలకు విసిరేసాడు... అదే చెప్పాడు శక్తి తప్పు చేసినవాడిలా.
"వ్వాట్....?! వ్వాట్?!" అంటూనే నడకతో వేగం పెంచింది మహిత.
ఇద్దరూ కేంటిన్ కేసి పరుగులాంటి నడకతో బయలుదేరారు.
"ఆ ఆర్డర్ పోతే మీకా ఉద్యోగం కూడా రాదు. త్వరగా పదండి. దాన్ని మున్సిపాలిటీ చెత్త కుప్పలో వేసే లోపే పట్టుకోవాలి" అంది మహిత ఆయాసపడుతూ.
* * * *
"ఈ ఆఫీసులో ఏదెలాగున్నా, డస్ట్ బిన్నుల్ని మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంచుతారు కామోసు" క్యాంటిన్లో డస్ట్ బిన్ లన్నింటినీ ఓపిగ్గా వెతికి, అలసిపోయి నీర్సంగా, కుర్చీలో కూలబడుతూ అన్నాడు శక్తి.
"డస్ట్ బిన్నుల్లో చెత్తని, ఆఫీసు బయట పారేస్తార్ట... మీ అపాయింట్ మెంట్ ఆర్డర్... అక్కడే బిక్కు బిక్కుమంటూ... దిక్కులు చూస్తుంటుంది... వెళ్ళండి... వెళ్ళి వెతకండి" మహిత అంది తొందర చేస్తూ.
"అసలు... బెంగుళూరు రావడం... నా బుద్ధి తక్కువ..." విసుక్కుంటూ, క్యాంటిన్ లోంచి బయటకు నడిచాడు శక్తి.
అరగంట తర్వాత ఆపసోపాలు పడుతూ వచ్చాడు. అతని చేతిలో మాసిపోయిన ఎపాయింట్ మెంట్ ఆర్డర్.
"ఆఖరికి సాధించారు.... పట్టుదలంటే... అలా ఉండాలి..." చేతిలోంచి తీసుకొని చదివి, దాన్ని మళ్ళీ అతని చేతికందించింది.
"నేను ఆఫీసులో చేరినప్పుడు, నాకు కనీసం ఎపాయింట్ మెంట్ ఆర్డరు కూడా లేదు... నెల్రోజులు టెస్టింగ్ పిరియడ్ పేరిట... ఫ్రీ సర్వీస్ చేశాను" బయటికొస్తూ అంది మహిత.
మహితవేపు ఓరకంట చూసి....
"మీలాంటి వాళ్ళకి అలాంటివి తప్పదు."
ఆ మాటన్న శక్తివేపు ఆశ్చర్యంగా చూసింది మహిత.
"ఏం?!"
"నేను నిజాన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతాను. మీరేవనుకోకండి. నాకు ఛైర్మన్ స్వయాన మేనమామ- మీక్కాదు గనక... నన్ను క్లర్క్ గా ఎపాయింట్ మెంట్ చెయ్యటం వెనుక ఏ జనరల్ మేనేజర్ కుట్రో వుండుంటుంది ఐ నో దట్."
ఆటోని కేకేసింది మహిత లోలోనే నవ్వుకుంటూ.
"ఎక్కండి" అంది మహిత. ఒక్కక్షణం తటపటాయించి ఎక్కేసాడు శక్తి.
ఆటో బయలుదేరింది.
"ఇప్పుడు మా ఇంట్లో మీరు భోంచేసి మీ ఫ్రెండ్ రూం కెళతారు" చెప్పింది మహిత.