Previous Page Next Page 
వ్యూహం పేజి 46


    మాట్లాడలేదు శక్తి. మరో పావుగంట తర్వాత, ఆటో గమ్యస్థానం చేరింది. ఇద్దరూ దిగారు. ఆటో వెళ్ళిపోయింది.

 

    "మేడమీద నా నివాసం... రండి..." గేటుతీసి లోని కడుగుబెడుతూ అంది మహిత.

 

    తలుపు తీయగానే పెద్ద హాలు. ఆ తర్వాత బెడ్ రూమ్... ఆ పక్కన కిచెన్ హాలు అలంకరణ అందంగా వుంది.

 

    హాల్లో ఎదురుగా గోడకి కేబినేట్ సైజు ఫోటో ఒకటి కన్పించింది.

 

    "కూర్చోండి" అంటూ లోనికెళ్ళింది మహిత.

 

    టీపాయ్ మీద మేగజైన్స్ ని తిరగేస్తున్నాడు శక్తి. డ్రస్ ఛేంజ్ చేసుకోని వచ్చింది మహిత.

 

    "మహితగారూ... ఆ గోడమీదాయన ఎవరండీ... మీ డాడీయా" ఫోటోవేపు చూస్తూ అడిగాడు శక్తి.

 

    ఆ మాటలకు విరగబడి నవ్వింది. నవ్వలేక కళ్ళంట నీళ్ళొచ్చాయి.

 

    తెల్లబోయాడు శక్తి.

 

    "భలే జోకు వేసారండీ బాబూ... ఒకసారి ఫోటో దగ్గరికెళ్ళి చూస్తే ఆయనెవరో తెల్సేది కదా" మళ్ళీ నవ్వింది మహిత.

 

    లేచి, గోడదగ్గరకెళ్ళి ఫోటోని చూసి-

 

    "ఓబ్రాయ్... ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్... పేరు విన్నానుగానీ- ఫోటో చూడ్డం ఇదే మొదటిసారి. ఇళ్ళల్లో ఫామిలీ ఫోటోలు పెట్టుకుంటారు కదా... అందుకు అనుమానమొచ్చి అడిగాను అంతే... కూర్చుంటూ అన్నాడు శక్తి.

 

    "ఐ లైక్ హిమ్... పర్సనల్లీ..." చెప్పింది మహిత.

 

    "గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల ఫోటోలు పెట్టుకుంటారు... పాత కమ్యూనిస్టులైతే కమ్యూనిజంమ్మీద, మమకారం చావక లెనిన్, కారల్ మార్క్స్, స్టాలిన్ ఫోటోల్ని పెట్టుకోవటం చూసాను... కానీ ఇండస్ట్రియలిస్ట్ ల ఫోటోల్ని పెట్టుకోవటం... ఇట్స్ ఏ డేర్ థింగ్" అన్నాడు శక్తి.

 

    "ఎస్... ఇట్స్ ఏ రేర్ థింగ్... మనిషి సెల్ఫ్ సఫిషియంట్ గా ఎదగాలంటే, ఇండస్ట్రీల వేపు దృష్టి చాలా అవసరం... ఇండస్ట్రీయలిస్ట్ ల ఇన్ స్పిరేషన్ చాలా అవసరం. ఈ దేశంలో ప్రతి ఒక్క యువతి, యువకుడూ ఓబ్రాయ్, బిర్లా, టాటాల జీవిత చరిత్రల్ని చదవాలి... వాళ్ళ కృషి మనకు ఇన్ స్పిరేషన్ కావాలి" అంది ఎంతో ఉద్వేగంతో.

 

    "యూ ఆర్ కరెక్ట్ మహిత... బిర్లా, టాటాల లైఫ్ హిస్టరీల్ని- టెస్టు పుస్తకాల్లో పెట్టాలి... శాస్త్రీయ విజ్ఞానమంటే, థీరీకాదు... ప్రాక్టీకల్ గా ఎదిగిన వ్యక్తుల జీవిత చరిత్రలు, ఈనాటి తరానికి తెలియాల్సిన అవసరం వుంది" అన్నాడు శక్తి కూడా అంతే ఆవేశంగా.

 

    "బిర్లా, టాటాలే కాదు, ఓబ్రాయ్... కూడా చాలా గొప్ప వ్యక్తి. ఆయన గురించి కూడా మీరు తెలుసుకోండి" అని చెప్పి...

 

    "మనం మాటల్లో పడితే లేటయిపోతుంది... ఫిఫ్టీన్ మినిట్స్ లో వంట పూర్తి చేస్తాను... ఈలోపల న లైబ్రరీని చూస్తుండండి..." సోఫాకి వెనుక వున్న కర్టెన్ ను ప్రక్కకు తీసింది. అక్కడ నిలువెత్తు పుస్తకాల అరలో... అందంగా పేర్చబడ్డ రకరకాల పుస్తకాలు.

 

    "మీ అపాయింట్ మెంట్ ఆర్డర్ ఒకసారివ్వండి..." అంది మహిత.

 

    "ఎందుకు... స్టవ్వులో పడేస్తారా..." జోకేసి జేబులోంచి తీసిచ్చాడు శక్తి.

 

    దాన్ని అందుకొని లోనికెళ్ళింది మహిత.

 

    బుక్స్ రేక్ వేపు నడిచాడు శక్తి.

 

    స్టవ్వును వెలిగించింది మహిత. వంట కార్యక్రమాన్ని ప్రారంభించింది. పది నిమిషాల తర్వాత బయటికొచ్చి, ఐరన్ బాక్స్ ఆన్ చేసి నలిగిపోయిన ఎపాయింట్ మెంట్ ఆర్డర్ ని, చక్కగా ఇస్త్రీ చేసి, నీట్ గా ఒక కవర్లో పెట్టి, శక్తి చేతి కందించింది.

 

    "ఎపాయింట్ మెంట్ ఆర్డర్ కి షోకులు చేసినట్లున్నారే..." కవర్ని అటూ ఇటూ త్రిప్పి చూస్తూ అన్నాడు శక్తి.

 

    "మాసిపోయి, ముడుతలు పడిపోయిన ఎపాయింట్ మెంట్ ఆర్డర్ ని తీసికెళ్ళిస్తే- మీ బాస్ ఏవంటాడు... మీకు జాబు మీద శ్రద్ధ లేదనుకొంటాడు. అందుకని" డైనింగ్ టేబుల్ మీద కంచాలు సర్దుతూ చెప్పింది మహిత.

 

    "రండి... భోంచేద్దాం..." పిలిచింది మహిత.

 

    సింక్ లో చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నాడు శక్తి.

 

    "అర్జంట్ ప్రిపరేషన్స్... ఎలా వున్నాయో... ఏమో..." అంది మహిత.

 

    "ఆమ్లెట్ పప్పుచారు... మంచి కాంబినేషన్... మా అమ్మ... ఈ పప్పుచారుని అద్భుతంగా చేస్తుంది" అంటూ ఆమ్లెట్ తో అన్నాన్ని కలిపి, ముద్ద నోట్లో పెట్టుకుంటూనే వికారంగా మొహం పెట్టి మహిత వేపు చూసాడు.

 

    ఆమ్లెట్ కింద భాగంలో బాగా మాడిపోయింది.

 

    "ఏంటి... ఆమ్లెట్ బాగాలేదా..."

 

    "ఏంలేదు- బాగానేవుంది- కానీ ఉప్పు కూడా ఎక్కువైనట్లుంది" అన్నాడు శక్తి మొఖం ఆముదం తాగిన వాడిలా పెట్టి.

 

    "ఉప్పు కూడా అంటే?"

 

    "మాడువాసన..." మింగలేక, కక్కలేక అన్నాడు శక్తి.

 

    "మీతో మాట్లాడుతూ చేయడంవల్ల..." నసిగింది మహిత.

 

    "రోజూ మీరే స్వయంగా వంట చేసుకుంటారా..." అతి కష్టమ్మీద తింటూ అన్నాడు.

 

    "అవును ఏం...?"

 

    "ఏం... లేదు... ఏం లేదు..." అన్నాడు ఇబ్బందిగా మొఖం పెట్టి.

 

    పప్పుచారు కూడా దాని స్వరూపాన్ని పూర్తిగా కోల్పోయింది. మిగతా అన్నాన్ని మజ్జిగతో పూర్తి చేసేద్దామనుకున్నాడు.

 

    "మార్నింగ్... పాలు తోడుబెట్టడం మర్చిపోయాను... అందుకే పప్పుచారు ఎక్కువ చేసాను."

 

    "ఫర్వాలేదు... డోంట్ వర్రీ..."

 

    "పప్పుచారు మీకెలాగూ ఇష్టమే అన్నారుగదా..." అమాయకంగా అంది మహిత.

 

    "అవునవును..." అన్నాడు మొహమాటంగా.

 

    "తెలివైనవాళ్ళు వర్క్ ద్వారా పైకొస్తారు తప్ప వాళ్ళనీ, వీళ్ళనీ పట్టుకొని పైకిరారు. వచ్చినా అది తాత్కాలికమే."

 

    "అయితే నా ఐడియా తప్పా?"

 

    "తప్పా- తప్పున్నరా... మీ బాజ్ లో మీ సిన్సియారిటీ చూపించండి. కష్టపడండి. కంపెనీకి ఉపయోగపడండి... ఎప్పుడో ఒకప్పుడు మీ విషయం ఛైర్మన్ గారికి తెలీకపోదు. ఆయన మిమ్మల్ని గుర్తించకపోరు...

 

    "అది... ఈ... వి.వి.ఎన్....... ఎస్టేట్స్ లో కుదరదు" ఖరాఖండీగా అన్నాడు శక్తి.

 Previous Page Next Page