Previous Page Next Page 
వ్యూహం పేజి 44


    ఈమె కెందుకింత అభిమానం తనమీద? అదే అడగాలనుకున్నాడు. కాని గొంతుకేదో అడ్డుపడ్డట్లయింది.

 

    "నాలో ప్రతిభ ఉంది. దానికి అదృష్టం తోడవ్వలేకే చిన్న ఉద్యోగం వచ్చింది. ఏది అదృష్టం- ఎక్కడుంది?" అమాయకంగా అడుగుతున్న శక్తివేపు నవ్వుతూ చూసింది మహిత.

 

    "మీకభ్యంతరం లేకపోతే మీ అదృష్టాన్ని నేనౌతాను" అంది ఏదో ఆలోచిస్తూ- అనాలోచితంగా.

 

    శక్తి ఒక్కక్షణం ఉలిక్కిపడి ఆమె కళ్ళలోకి సూటిగా చూసాడు.

 

    తనన్నదేమిటో అప్పటికి అర్థం కాలేదు మహితకు, అర్థం కాగానే చటుక్కున తల దించుకుంది. తననోటి నుంచి ఆ హామీ ఎందుకొచ్చిందో తనకే అర్థంకాని స్థితిలో ఉండిపోయింది.

 

    అయినా ముందుగా తనే తేరుకుంది.

 

    "పోనీ ఓ పని చేయండి. మీ అమ్మగారికి ఒకసారి ఫోన్ చేసి చెప్పండి. ఆమె ఉద్యోగంలో చేరమంటే చేరండి. వద్దంటే మీ ఊరు వెళ్ళిపోదురుగాని... అయినా ఊరెళ్ళి ఏం చేస్తారు. ఇక్కడ మరోచోట మంచి జాబ్ ట్రై చేసుకోవచ్చు. ఇంతకీ మీరేం చదివారు. అడగడం మర్చాను" నాలిక్కరుచుకుంటూ అడిగింది.

 

    శక్తి వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.

 

    పైగా సిగ్గుపడ్డాడు కూడా! ఏమని చెబుతాడు? బోడి బి.కాం. కూడా తప్పాననా?

 

    తొలిసారిగా తన చదువుమీద తనకే సిగ్గనిపించింది శక్తికి.

 

    "మీరన్నది బాగానే వుంది. ఇక్కడుండి మరో జాబ్ మా మామ ఇచ్చిన దానికంటే మంచిది సంపాదించుకోవచ్చు. కాని..."

 

    "వూ... కానీ... ఏమిటభ్యంతరం?"

 

    "ఏం లేదు... తెచ్చుకున్న డబ్బయిపోయింది. మరి కొన్నాళ్ళుండి జాబ్ చూసుకోవాలంటే..." నసిగాడు శక్తి.

 

    మహిత చిన్నగా నవ్వింది.

 

    "మిమ్మల్ని... మీకు, మీరు కోరుకున్న జాబ్ వచ్చేవరకు నేను పోషిస్తాను. మీ కభ్యంతరం లేకపోతే" మహిత మాటలు పూర్తవుతూనే శక్తి ఆమెకేసి చురుగ్గా చూసాడు.

 

    "అపార్థం చేసుకోవద్దు మిత్రమా... మీ మామగారయినా ఎవరి సహాయం లేకుండానే ఇంత వారయ్యారా? పైగా మిమ్మల్ని ఊరకే పోషించను. మిమ్మల్ని మోడల్ గా వుపయోగించుకుంటాను గదా" శక్తి ఆత్మాభిమానాన్ని క్షణాల్లో అర్థం చేసుకున్న మహిత అలా అంది.

 

    ఆ పద్ధతి శక్తికి నచ్చింది.

 

    "మీరు రమ్మన్నారని తిరిగి ఈ కంపెనీకి వచ్చాను. లేదంటే గేట్ లోకి కూడా వచ్చేవాడ్ని కాదు. అలాగే చేద్దాం" అన్నాడు ఒకింత స్థిమితపడుతూ శక్తి.

 

    "అయితే పదండి. ముందు మీ అమ్మగారికి ఫోన్ చేసి వద్దాం" అంటూ లేచింది మహిత.

 

    మరికొద్ది నిమిషాలకు ఇద్దరూ ఓ ఎస్.టి/డి. బూత్ ముందు వున్నారు.

 

    "ఇంతకీ మీ టౌన్ కి ఎస్.టి.డి. వుందా?" అడిగింది మహిత.

 

    "ఉంది- కాని పి.పి. పిలవటానికి కనీసం పావుగంట పడుతుంది" అని శక్తి డయల్ చేసాడు.

 

    నెంబరు దొరకగానే వాళ్ళమ్మను ఫోన్ దగ్గరకు పిలిపించమని చెప్పి ఫోన్ పెట్టేసాడు.

 

    "మీ కుటుంబం గురించి చెప్పలేదే" అంది మహిత ఎదురుగా ఉన్న చిన్న హోటల్ లో ఇద్దరూ సెటిలయ్యాక.

 

    "మా అమ్మ, నాన్న, చెల్లెలు నేను అంతే. మా అమ్మ ఎలిమెంటరీ స్కూల్ టీచర్. మా నాన్న రిటైరై ఒక కొట్లో పని చేస్తున్నారు. చెల్లెలు చదువుకుంటోంది" అన్నాడు శక్తి ఎక్కడో ఆలోచిస్తూ.

 

    "ఆస్తి ఏమైనా ఉందా? ఇలా అడిగానని ఏమనుకోవద్దు. నాకూ ఏమీ లేదు. మీరేదయినా వ్యాపారం చేసుకొనేందుకు మీ ఇంటి నుంచి పెట్టుబడి లభిస్తుందేమోనని."

 

    మహిత తన మంచికోసమే అడుగుతున్నా, తనని నిలదీస్తున్నట్లుగా, న్యూనతా భావంతో కూరుకుపోతున్నాడు శక్తి.

 

    చదువు లేదు, ఆస్తి లేదు. పెద్ద సపోర్ట్ అవుతాడనుకున్న మేనమామ చిన్నచూపు చూసాడు. మరేం చూసుకొని నీకింత ధీమా, ధైర్యం, పొగరు అనడిగితే తను సమాధానం చెప్పగలడా? లేదు. అందుకే మవునంగా వుండిపోయాడు ఎటో చూస్తూ.  

 

    మహిత పరిస్థితిని అర్థం చేసుకుంది.

 

    పావుగంట వరకు తిరిగి ఇద్దరి మధ్య సంభాషణ నడవలేదు.

 

                                       *    *    *    *

 

    "హలో.... అమ్మా నేను... శక్తిని" శక్తి పెద్దగా అన్నాడు ఫోన్ లో.

 

    "బావున్నావా నాన్నా... మావయ్య ఉద్యోగం ఇచ్చాడా? జాబ్ లో చేరావా?" లక్ష్మీదేవి ఫోన్ కి అటువైపు నుంచి అడిగింది ఎంతో ఆతృతని కనబరుస్తూ.

 

    "ఇచ్చాడులే... ముష్టి జాబ్... అవునూ... ఇంతకీ వెంకటనారాయణ గారు నీకు నిజంగానే అన్నా... దూరపు బంధువా?" చిరాకును వ్యక్తం చేస్తూ అన్నాడు శక్తి.

 

    మహిత మౌనంగా శక్తి మాటలు వింటూ, అతడ్నే పరిశీలనగా చూస్తోంది.

 

    "అదేం అలా అడిగావు... పిచ్చ సచ్చినోడా... నీకన్నీ పిచ్చ అనుమానాలే."

 

    "అనుమానం కాకపోతే ఏమిటి? స్వంత మేనమామ తన మేనల్లుడికి... అదీ అల్లుడ్ని చేసుకోబోయే వ్యక్తికి ఎల్ డిసీ లాంటి పరమ ముష్టి ఉద్యోగం ఇస్తారా? అవునూ అసలింతకీ బేబీని నాకిచ్చి పెళ్ళి చేస్తాడా? ఏమో డౌటే... ఆయనిచ్చిన బోడి ఉద్యోగం నేను చేయను... నేను మనూరొచ్చేస్తున్నాను" ఒక నిర్ణయానికొచ్చిన వాడిలా అన్నాడు శక్తి.

 

    "తిక్కల సచ్చినోడా..." అంటూ ఫోన్ కి ఆవేపు నుంచి లక్ష్మీదేవి తిట్ల దండకం ప్రారంభించింది.

 

    సరిగ్గా అదే సమయానికి "ఏమంటున్నారు మీ అమ్మగారు..." అని అడిగింది మహిత.

 

    సమాధానం చెప్పకుండా ఫోన్ రిసీవర్ని మహితకు అందించాడు. మహిత రిసీవర్ని చెవికి ఆనించుకుంటూనే బిత్తరపోయింది.

 

    "పిచ్చ సచ్చినోడా... సన్నాసి సచ్చినోడా... అరవ సచ్చినోడా కష్టపడకుండానే లక్షాధికారివవుతావా ఆడంగి సచ్చినోడా... పొద్దుస్తమానం కలలు కనటమేరా రేలంగి సచ్చినోడా... నీ బోడి చదువుకి కలెక్టర్ ఉద్యోగం వస్తుందనుకున్నావా తిక్కిరి సచ్చినోడా. మావయ్య ఏమాలోచించకుండానే ఆ ఉద్యోగం ఇస్తాడా... నీ దెవసంకాల... ఊరికొచ్చావనుకో నీ కాళ్ళు ఇరగ్గొట్టి పొయ్యిలో పెడతాను. తింగరి సచ్చినోడా... బుద్ధిగా ఆ ఉద్యోగంలోనే చేరి కష్టపడి నీ తెలివితేటల్ని నిరూపించుకో... ఊరకే కాళ్ళార జాపుకుని కలలు కంటే బేబీనిచ్చి చేస్తాడా? కోట్ల ఆస్తికి వారసుడ్ని చేస్తాడా పిక్కరి సచ్చినోడా... ఇసుమంతయినా ఆత్మాభిమానం లేనోడివి పుట్టావేరా దూది దబ్బ సచ్చినోడా... ఏం మాట్లాడవేం..." అంటూ గుక్క తిప్పుకోకుండా తిట్టేసరికి మహితకి కళ్ళు బైర్లు కమ్మాయి.

 Previous Page Next Page