ఆజులు ద్రౌపదిని చూచినారు. ఆమె మీది మక్కువతో దనుస్సువద్దకు పోయినారు. కొందఱు ధనుస్సు పట్టలేకపోయినారు. కొందఱు వంచలేక పోయినారు. వారిని చూచి మరి కొందరు ప్రయత్నించలేదు. వృష్టి భోజులను, యాదవులను కృష్ణుడు వారించినాడు. శిశుపాల, జరాసంధ , శల్య, కర్ణులు ప్రయత్నించి విఫలులు అయినారు. అప్పుడు బ్రాహ్మణుల మధ్య నుండి అర్జునుడు లేచినాడు. అందుకు బ్రాహ్మణులు సంతోషించినారు. అర్జునుడు ధనువు వద్దకు వచ్చినాడు. గురువులకు నమస్కరించినాడు. ధనుస్సునకు ప్రదక్షిణము చేసినాడు. అవలీలగా ధనుస్సు అందుకున్నాడు. అయిదు బాణములు వేసినాడు. ఆకాశమందు గల మత్స్య యంత్రమును పడగొట్టినాడు. సభ సాంతము ఆశ్చర్యపొయినది. చిత్తరువువలె చూచినది.
మత్స యంత్రమును అనాయాసముగా కొట్టినాడు. వాడు నరుడు కాడు. ఇంద్రుడో, రుద్రుడో, సూర్యుడో, కుమారస్వామియో అయి ఉండవలెనని కీర్తించినారు. సభాస్థలమున కీర్తన ధ్వనులు మిక్కుటము అయినవి. దేవ వాద్యములు మ్రోగినవి. బ్రాహ్మణులు పై పంచెలు ఎగురవేసి, ఉత్సాహము ప్రకటించినారు. అర్జునుని మీద పూలవాన కురిసినది.
అది చూచినాడు. ధర్మరాజు, నకుల సహదేవులను వెంట పెట్టుకున్నాడు వెళ్ళిపొయినాడు.
ద్రౌపది పూలదండతో కదలి వచ్చినది. అర్జునుని చూచినది. సంతసించినది. అర్జునుని మెడలో పూలమాల వేసినది.
అది చూచి దుర్యోధనాదులు కోపగించినారు. ద్రుపదుడు తమను అవమానించినాడు అన్నారు. ద్రుపదుని వధించవలెనని దండెత్తినారు. భీముడు ఒక చెట్టు పెరికి నిలిచినాడు. అర్జునుడు బాణము ఎక్కు పెట్టినాడు. అర్జునునకు కర్ణునకు, భీమునకు శల్యునకు యుద్దము జరిగినది. అప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనాదులతో "ఈతడు బ్రాహ్మణుడు . మత్స్య యంత్రమును భేదించినాడు. ద్రౌపదిని సాధించినాడు. మీరు ఇతనితో యుద్దము చేయుట తగదు. ఏలనన ఇతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణునితో యుద్దము చేయుట తగదు. అంతేకాక ఇతనిని గెలుచుట ఇంద్రునకు సహితము సాధ్యము కాదు. కావున యుద్దము మానుడు. మరలిపోవుడు." అన్నాడు.
దుర్యోధనాదులు కృష్ణుని ఉపదేశము విన్నారు. రధములను మరలించినారు. వెళ్ళిపోయినారు. సభ సద్దుమణిగినది. భీమార్జునులు ద్రౌపదిని తీసుకున్నారు. బ్రాహ్మణులు వెంటరాగా నిజ నివాసమునకు వెళ్ళినారు. అప్పటికే ధర్మరాజు, నకుల సహదేవులు కూడ అక్కడికి చేరినారు. కుంతితో "అమ్మా! మేము బిక్షము తెచ్చినాము" అన్నారు. అందుకు కుంతియు "మీరు అయిదుగురు ఆ భిక్షను ఉపయోగించుడు" అన్నది. వారు నిత్యము తెచ్చు భిక్షవంటిదే అనుకున్నది. ఆమె వచ్చి చూచినది. ద్రౌపది కనిపించినది. కుంతి ఆమెను చూచి ఆశ్చర్యపడినది. ధర్మరాజుతో అన్నది :-
"నాయనా! ధర్మజా! నిత్యము తెచ్చు భిక్షవంటిదే అని నలుగురు ఉపయోగించుడు అన్నాను. కాని నేను చెప్పినది ధర్మ విరుద్దము. ఇంతవరకు నేను ఏమి చేసినను, ఏది చెప్పినను మీరు అది చేసినారు. ఇప్పుడు నేను చెప్పినది లోక విరుద్ద కార్యము. ఇప్పుడు చేయదగినది తెలియరాకున్నది" అని విచారమున మునిగినది.
ధర్మరాజు తల్లి విచారము చూచినాడు. ఆమె బాధ గ్రహించినాడు. "భీమార్జునులారా! మనము తల్లి మాట కాదనరాదు. ఆమె మనకు తల్లి, తండ్రి, దైవము. ఆమె చెప్పినట్లే చేతము. ద్రౌపది మన అయిదుగురికి భార్య అగును" అన్నాడు.
అప్పుడు బలరామకృష్ణులు అక్కడికి వచ్చినారు. పాండవులు కృష్ణ బలరాములకు మేనత్త కొడుకులు. అందువలన బలరామకృష్ణులు కుంతికి నమస్కరించినారు. పాండవుల కుశలము అడిగినారు. కృష్ణుడు "పాండవులారా! మాకు బావలారా! కౌరవులకు మేము ఇష్టులము కాము. అందువలన తేజో విశేషములను బట్టి మిమ్ము గుర్తించియు దూరమున ఉన్నాము. దుర్యోధనుడు దుష్టుడు. పాపాత్ముడు. అతడు మిమ్ములను లక్క ఇంటిలో కాపురము పెట్టించినారు. లక్క ఇంటిని కాల్చినాడు. మీరు వాని పన్నుగడ తెలుసుకున్నారు. తప్పుకున్నారు. ముందు మీకు మేలు కలుగనున్నది" అన్నాడు. బలరామకృష్ణులు వారితో కష్ట సుఖములు మాట్లాడినారు. వెళ్ళిపోయినారు.
పాండవులు ద్రౌపదిని తీసుకొని వెళ్ళినారు. అప్పుడు ద్రుపదునకు బ్రాహ్మణులను గురించి తెలుసుకోనవలెనని ఆతురత కలిగినది. పురోహితుని పాండవుల వద్దకు పంపినాడు. "కార్యము సాధించినాము. కులగోత్రములతో పని ఏమి?" అని పాండవులు పురోహితుని పంపించినారు. అంత ద్రుపదుడు ధృష్టద్యుమ్నుని పంపినాడు. అతడు నాలుగు జాతుల వారు ఎక్కదగు రధములు తీసుకున్నాడు. పాండవులు ఉండు చోటునకు వెళ్ళినాడు. వారిని ద్రుపదుడు ఆహ్వానించినాడని చెప్పినాడు. పాండవులు ఆహ్వానమును అంగీకరించినారు. బయలుదేరినారు. బయట వారికి నాలుగు జాతుల వారికి అనువగు రధములు కనిపించినవి. తమను చూచుకున్నారు. బ్రాహ్మణ వేషములలో ఉన్నారు. అయినను రాజులకు తగిన రత్నఖచిత రధమున ఎక్కినారు. రాజభవనమునకు చేరినారు. ద్రుపదుడు చూచినాడు. వారిని క్షత్రుయులుగా గుర్తుంచినాడు. సంబరపడినాడు. ఆహ్వానించినాడు. ఆదరించినాడు. ఆసనములు ఇచ్చినాడు. అన్నాడు:-
మీరు దేవతలో, గంధర్వులో, తెలియరాకున్నది. మీ వాస్తమగు కులగోత్రములు తెలిపిన పిమ్మట ద్రౌపదిని నిచ్చి పెండ్లి చేసెదను. అంతవరకు వివాహము చేయుటకు సమ్మతింపము.
అందుకు ధర్మరాజు "రాజా! మేము అయిడుగురము క్షత్రియులము. పాండురాజు కుమారులము. నేను పెద్దవాడను ధర్మరాజును. వీరు నలుగురు భీమార్జున నకుల సహదేవులు. ఈమె మాకు తల్లి కుంతి దేవి అన్నాడు.
అది విన్నాడు ద్రుపదుడు. నిస్చేష్టుడు అయినాడు. ఆనంద భాష్పములు జలజలరాల్చినాడు. లక్క ఇల్లు తగులబడుట అదిగా వృత్తాంతములను ఎరిగినాడు. వారికి ఇష్ట వస్తువులు ఇచ్చినాడు. రాజ భవనమున ఉంచినాడు.
అట్లు కొన్ని రోజులు గడిచినవి. ఒకనాడు ద్రుపదుడు కూతురు వివాహము సంగతి ప్రస్తావించినాడు. అర్జునునకు ఇచ్చి పెండ్లి చేయవలెను అన్నాడు.
"మహారాజా! మా తల్లి కుంతి. ఆమె మాట జవదాటము. ద్రౌపది మా అయిదుగురికి భార్య కావలెనని అన్నది. అట్లే కావలెను. ద్రౌపదిని మేము అయిడుగురము పెండ్లాడుదుము." అన్నాడు ధర్మరాజు.
ధర్మరాజు మాటలు విన్నాడు. ద్రుపదుడు ఆశ్చర్యపోయినాడు అన్నాడు:-
"ధర్మజా! లోకమందు ఒక పురుషునకు అనేక మంది భార్యలు ఉండుట కలదు. కాని ఒక స్త్రీకి అనేకమంది భర్తలు ఉండుట ఎరుగుము. అది ఏ యుగమందును, పురాణమందును లేదు. నీవు ధర్మజ్ఞుడవు. ధర్మపుత్రుడవు. నీ మాటలు ధర్మ విరుద్దములు కాకుండవచ్చును. అయినను కుంతియు, మీరు దృష్టద్యుమ్నుడు ఆలోచించుడు. రేపు నిర్ణయింతము" అన్నాడు ద్రుపదుడు. ఆరాత్రి అతనికి నిదురరాలేదు.