"అంగారపర్ణా!" హెచ్చులు పలుకుచున్నావు. శక్తీ హీనులు సంధ్య లందును, అర్ధరాత్రియందును సంచరించుటకు జంకుదురు. గంగానది నీది కాదు. జనులది. అందరిది. గంగ హిమవత్సర్వతమున పుట్టినది. భూలోకమున ప్రవహించుచున్నది. సముద్రమున కలియుచున్నది. అది శివుని జటాజూటమున పుట్టినది. ఆకాశమున ప్రవహించునపుడు మందాకినీ అనబడుచున్నది. మూడు లోకములను పరిశుద్దము చేయు గంగ నీ సొత్తు కాదు. ఇది అందరికి చెందునది. నీవు అడ్డు చెప్పరాదు. మేము ఇచట స్నానము చేతుము. అని ముందుకు సాగినాడు.
అంగారపర్ణుడు కోపించినాడు. అర్జునుని మీదికి బాణములు విడిచినాడు. అర్జునుడు కొరివితో బాణములను కొట్టివేసినాడు. ద్రోణుడు ప్రసాదించిన ఆగ్నేయాస్త్రము ప్రయోగించినాడు. అది అంగారపర్ణుని రధమును కాల్చినది. కూల్చినది. భయభ్రాంతుడయి అంగారపర్ణుడు నేలకూలినాడు. అర్జునుడు అంగారపర్ణుని జుట్టుపట్టి ఈడ్చుకొని వచ్చినాడు. ధర్మరాజు ముందు ఉంచినాడు. అంగారపర్ణుని భార్య కుంభీనస ఆమె ఉరికి వచ్చినది. తన భర్తను రక్షించమని వేడుకున్నది.
ధర్మరాజు అంగారపర్ణుని చూచినాడు. అతని దీనత్వము చూచినాడు. కుంబీనసను చూచినాడు. ఆమె దుఖమును చూచినాడు. "అర్జునా! యుద్దమున ఓడిన వానిని, హీనుని, శౌర్యము విడిచిన వానిని చంపరాదు. వీడు నీచేత ఆడినాడు. భయపడుచున్నాడు. విడిచి పెట్టుము" అన్నాడు.
"గంధర్వా! యితడు నా అన్న ధర్మరాజు. కురువంశ ప్రభువు. కృప గలవాడు. శరణాగత వత్సలుడు. నిన్ను విడువమని ఆజ్ఞాపించినాడు. విడిచినాను. భయము వీడుము" అన్నాడు అర్జునుడు. అంగారపర్ణుని విముక్తిని చేసినాడు.
అంగారపర్ణుడు భయము వీడిచినాడు. ధైర్యము తెచ్చుకున్నాడు. "అర్జునా! అర్జునా! నేను నీచేత ఓడినాను. కాబట్టి నా పేరు మార్చుకొందును. నేటి నుండి నేను చిత్రరధుడను. నీతో స్నేహము చేయదలచినాను. నావద్ద "చాక్షుహి" అను విద్య ఉన్నది. దానితో నీవు ఏకకాలమున మూడు లోకములు చూడగలవు. ఈ విద్య నీకు ఇత్తును. ఇది ఫలించుటకు అరుమాసములు వ్రత నియమములు కలిగి ఉండవలెను. అదికాక మీకు అయిదుగురికి నూరేసి గుఱ్ఱములు చొప్పున గాంధర్వ జాతి గుఱ్ఱములు ఇచ్చెదను. అందుకు బదులుగా నీవు నాకు ఆగ్నేయాస్త్రమును ఇవ్వవలెను."
అందుకు అర్జునుడు "ఎంత మిత్రులయినను వారి విద్య శుభధనములను తీసుకొనుటకు అంగీకరించను. నీవు అడిగినట్లు ఆగ్నేయాస్త్రము ఇచ్చెదను మాకు ఇవ్వదలచిన గుఱ్ఱములను మాకు ఇమ్ము. మాకు అవసరము కలిగినపుడు తీసుకొందుము. అంతవరకు నీవద్దనే ఉంచుము" అని చిత్రరధునకు ఆగ్నేయస్త్రము ఇచ్చినాడు. చిత్రరధుడు తీసుకున్నాడు. అర్జునునితో స్నేహము చేసినాడు.
అప్పుడు అర్జునుడు "మిత్రమా! నీవు మమ్ము నిర్జించినావు. అప్పుడు మేము పాండవులము అని నీకు తెలియదా? తెలిసియు నిర్జ ించినావా?" అని అడిగినాడు. అప్పుడు చిత్రరధుడు ఇట్లన్నాడు:-
"మిత్రమా ! మీ శౌర్య ప్రతాప కీర్తులను గురించి నారదాది మునిగణముల వలనను, దేవతల వలనను వినియున్నాను. అయినను నిర్జించినాను. అందుకు రెండు కారణములు ఉన్నవి.
1. స్త్రీలు దగ్గర ఉన్నపుడు మగవారు దురభిమానము కలిగి ఉందురు. మంచి చెడ్డలు తారతమ్యము గ్రహించలేరు. ఎదుటి వాని శక్తి ఎరుగరు. తామే గొప్పవారము అనుకొందురు. నావెంట నా భార్య ఉన్నది.
2. రాజులకు వారికి పురోహితుడు ఉండవలెను. అతడు వేదవేదాంగములు చదివి ఉండవలెను. జపహోమ యజ్ఞ విధులందు ప్రసిద్దుడు కావలెను. శాంతచిత్తుడు , సత్యవంతుడు కావలెను. ధర్మార్ధ కామ మోక్షములు పొందచేయుటకు సమర్దుడయి ఉండవలెను. అట్టి పురోహితులు గల రాజులు ప్రకాశవంతులగుదురు. మీకు పురోహితుడు లేడు. అందువలన నేను మిమ్ముల నిర్జించినాను. కాబట్టి మీరు మంచి పురోహితుని ఏర్పరచుకోనుట ఉత్తమము."
పాండవులు అది విన్నారు. ఆలోచించినారు. తమకు గాను పురోహితుని ఏర్పరచుకొనదలచినారు. అట్టివారిని సూచించవలసినదని చిత్రరధుని కోరినారు. చిత్రరధుడు ఆలోచించినాడు. ఉత్కచమను దివ్యక్షేత్రమున ఉన్న ధౌమ్యుడు ఉత్తముడు అని చెప్పినాడు. ధౌమ్యుని పురోహితునిగా చేసికొనమని చెప్పినాడు. పాండవుల అనుమతి పొందినాడు. భార్యా సహితుడయి వెళ్ళి పోయినాడు.
పాండవులు ఉత్కచమునకు వెళ్ళినారు. ధౌమ్యుని చూచినారు. అతడు శాంత చిత్తుడయి తపస్సు చేయుచున్నాడు. పాండవులు అతనిని పూజించినారు. తమకు పుతోహితునిగా ఉండవలసినదని ప్రార్ధించినారు. దౌమ్యుడు అంగీకరించినాడు. పాండవులు దౌమ్యుని పురోహితునిగా పొందినారు. సకల భూ రాజ్యము పొందినంత సంతోషించినారు. పురోహితుని దీవెనలు పొందినారు. తమ వృత్తాంతము తెలియపరచినారు. దౌమ్యుని అనుమతి పొందినారు. పాంచాలమునకు పయనము అయినారు. మార్గమధ్యమున వేదవ్యాసుడు దర్శనము ఇచ్చినాడు. రానున్న శుభములను, గురించి పాండవులకు చెప్పినాడు. వెళ్ళిపొయినాడు.
పాండవులు కుంతి సహితముగా పాంచాలము చేరినారు. కాంపిల్య నగరమున ప్రవేశించినారు. కుమ్మరి వాని ఇంట విడిసినారు. తమను ఇతరులు తెలుయకుండా బ్రాహ్మణవృత్తితో జీవించసాగినారు.
ద్రుపదుడు తన కూతురును అర్జునకు ఇవ్వదలచినాడు. చాల వేదికించినాడు. అర్జునుడు కనిపించలేదు. అప్పుడు వ్యయంవరం ఏర్పరచినాడు. స్వయంవరమునకు అనేక దేశముల రాజులు వచ్చినారు. వారు కవచములు ధరించినారు. చందనదులూ పూసుకున్నారు. కాశీ వస్త్రములు కట్టుకున్నారు.
స్వయంవర రంగస్థలము కాంపిల్యమునకు ఈశాన్యమున ఏర్పాటు చేయబడినది. అది చందనోదకములచే తడుపబడినది. ద్వార తోరణములు అలంకరించబడినవి. రంగ స్థలము చుట్టును అగడ్త ఏర్పరచినారు.
కాంపిల్యకు వచ్చిన రాజులు రంగ స్థలమునకు చేరినారు. ఉచితాసనములందు కూర్చున్నారు. పాండవులు వచ్చినారు. బ్రాహ్మణులతో కూర్చున్నారు.
ద్రౌపది సభామండపమునకు వచ్చినది. ఆమె తెల్లని రత్నభూషణములు ధరించినది. తెల్లని గంధము పులమినది. తెల్లని పుష్పమాలను చేత ధరించి ఉన్నది. ఆమె మన్మధుని పుష్ప బాణము వలె ఉన్నది.
అప్పుడు వాద్యములు మ్రోగినవి. వేద ఘోష వినిపించినది. రంగ స్థలము అలజడిగా ఉన్నది. ద్రుపదుని కుమారుడు దృష్టద్యుమ్నుడు లేచినాడు. ధ్వనులను వారించినాడు. రాజ సమూహమును చూచినాడు. అన్నాడు:-
"రాజన్యులారా! ఈమె నా సోదరి కృష్ణ, అయోనిజ. అగ్ని యందు అవతరించినది. ఇదిగో అగ్నిహోత్రమునకు సమీపమున మహా ధనుర్బాణములున్నవి. వాటిని అందుకొని బాణము సంధించి అయిదు బానములచేత మత్స్య యంత్రము భేదించవలెను. అట్లు భేదించిన వానిని ద్రౌపది వరించును."
స్వయం వరమునకు దుర్యోధన , దుశ్శాసనాది కౌరవులు వచ్చినారు. కర్ణుడు, అశ్వత్ధామ , సోమదత్త, భూరిశ్రవాది రాజులు వచ్చినారు. శల్య విరాట, జరాసంధ, శకునులు వచ్చినారు. అక్రూర , సాంబ, సాత్యకి, సంకర్షణ, ప్రద్యుమ్న, కృష్ణ, కృతవర్మ, అనిరుద్ధ యుయుధాన, బలరాములు మున్నగు యదు, వృష్టి, భోజ, అంధక వంశ శ్రేష్ఠులు వచ్చినారు. సుమిత్ర, సుకుమార, సుశర్మ, సుదక్షిణ, సుహేణ, సేనాబిందు, చంద్రసేన, సముద్రసేన, కాశీవర, చేకితాన, శిశుపాలం శ్రేణిమాత్, జనమేజయ, సైంధవ, సత్యవ్రత, చిత్రాంగద, శుభాంగద, భగదత్త, భాగీరధ, పౌండ్రక, వాసుదేవ, మత్స్యదేశ రాజులు వచ్చినారు.