తెల్లవారినది. వేద వ్యాసమహర్షి విచ్చేసినాడు. పాండవులు, కుంతీ, ద్రుపదుడు ధృష్టద్యుమ్నుడు వ్యాసదేవునికి పాదాభివందనము చేసినారు. పూజించినారు. ఆసనము చూపినారు. అందరు కూర్చున్నారు. అప్పుడు ద్రుపదుడు తన సంశయము వ్యక్తపరచినాడు. ఒక భార్య పలువురు భర్తలు లోక విరుద్దము అన్నాడు.
వేదవ్యాసుని ముందు ధర్మరాజు, ద్రుపదునితో అన్నాడు :-
"మహారాజా! హాస్యమందు గాని అబద్దమండయినను నాచిత్తము ధర్మము వీడదు. నేను చెప్పినది ధర్మమే అగును. అధర్మము కాదు. కావున నీ కుమార్తెను మా అయిదుగురికి ఇచ్చి వివాహము చేయుటకు సంకోచించవలదు. పూర్వము గౌతమ వంశమందలి జతిలుడు అనుమునికి ఒక కూతురు - ఆమెకు సప్తపురుషులు భర్తలు అయినారు. దాక్షాయిని అను ముని కన్యక పదిమంది ప్రచేతసులకు భార్య అయినది. అంతేకాక తల్లిని మించిన దైవము లేదు. మా తల్లి మాట ప్రకారము నడుచుకొనుట మా ధర్మము."
ద్రుపదుడు ధర్మరాజు మాటలు విన్నాడు. అతని ,మనసు శాంతించలేదు. "ధర్మజా! ధర్మసూక్ష్మము నిర్ణయించుట మనవల్ల కాదు. వేదవ్యాసుడు త్రిలోక పూజ్యుడు త్రికాలజ్ఞుడు . అతడు యోచించి ఎట్లు నిర్ణయించిన అట్లు చేతము" అన్నాడు.
అప్పుడు వేదవ్యాసుడు అన్నాడు :-
"మహారాజా! ధర్మరాజు ధర్మ స్వరూపుడు, ధర్మములు, ధర్మ సూక్ష్మములు, ధర్మ రహస్యములు చక్కగా తెలిసినవాడు. అతడు ఎన్నడును ధర్మ విరుద్దమగుమాట చెప్పడు. కుంతి దేవతా స్వరూపము గలది. ఆమె అసత్యమాడదు. వీరి అభిప్రాయమే దేవతల అభిప్రాయము అగును. కావున నిశ్చింతగా ద్రౌపదిని అయిదుగురు పాండవులకు ఇచ్చి పెండ్లి చేయుము. సంశయము వలదు. ఈ దినము శుభదినము, చంద్రుడు రోహిణియందు ఉన్నాడు. ఈరోజే వివాహము జరుపుము."
ద్రుపదుడు అంగీకరించినాడు. వివాహ ప్రయత్నములు జరిగినవి. రాజభవనము, రాజధాని శోభయమానముగా అలంకరించబడినవి. పెండ్లికి వచ్చిన వారితో ఇల్లు సందడిగా ఉన్నది. ఈశాన్యమున వివాహ మంటపము ఏర్పడినది. అది గోమేధిక, మరకత , మణిమాయమయి విరాజిల్లినది. మంటపమున విద్వాంసులున్నారు. పాండవ పురోహితుడు దౌమ్యుడు అసీనుడు అయినాడు. అలంకార భూషిత అయిన ద్రౌపది దేదీప్యమానముగా వచ్చి మంటపమున కూర్చున్నది. పెండ్లి అరుగుమీద పాండవులు ద్రౌపది పక్కన కూర్చున్నారు.
బ్రాహ్మణులు పుణ్యాహవాచనము చేసినారు.
వాద్యధ్వనులు, వేణువాదములు, వీణా ధ్వనులు మ్రోగినవి.
ధౌమ్యుడు ప్రజ్వరిలించుచున్న అగ్ని హోత్రమందు మంత్రా హుతులను హోమము చేసినాడు. ధర్మరాజునకు ద్రౌపది చేత పాణిగ్రహణము చేయించినాడు. తరువాత భీమార్జున నకుల సహదేవులకు వరుసగా పాణిగ్రహణము చేయించినాడు.
బ్రాహ్మణులు ఆశీర్వదించినారు.
వేదఘోష వినిపించినది.
మంగళవాయిద్యములు మ్రోగినవి.
దేవతలు పూలవాన కురిపించినారు.
ద్రౌపది అపూర్వ వివాహ ఉత్సవము ముగిసినది.
ఆలోచనామృతము
1. వేదవ్యాస మునీంద్రుడు మానవ ఇతిహాసమందు ఒక అపూర్వ ప్రయోగము చేసినాడు. అది మహాత్తమము. సాహసోపేతము అపూర్వము. అందుకు ఆ మహర్షికి పాదాభివందనము. అతనిని పొగడుటకు మాటలు చాలుట లేదు.
ఏకచక్రపురమున "భార్య" మాటలలో ఆనాటి స్త్రీల స్థితి వెల్లడి అయినది. భర్త లేని ఆడుదానిని లోకులు చులకనగా చూతురు. కావున చచ్చుటయే మేలు అనుదశలో ఉన్నారు స్త్రీలు. వ్యాసుడు స్త్రీల దశ చూచినాడు. అతని హృదయము ఏడ్చినది. మగవాడు పెక్కుమంది భార్యలను చేసుకోనవచ్చును. ఆడదానికి నిషేదమెందుకు? ఆడదానికి ఒకరిని మించిన భర్తలను చేయవలెననుకున్నాడు. సామాన్యులు చేసిన లోకము మెచ్చదు. మెచ్చినను అనుసరించరు. అందువలన అతడు పాండవులను ఎన్నుకున్నాడు. వారు లోక పూజ్యులు. అటు ద్రుపదుని ఎన్నుకున్నాడు. అతడు బలవంతుడు . మహారాజు.
ఈ ప్రయోగమునకు శాలిహోత్రుని ఆశ్రమముననే బీజావాపనము జరిగినట్లున్నది. హిడింబ పెండ్లి, బకాసురవధ, ద్రౌపది వివాహము కుంతి ద్వారా చేయించినాడు వేదవ్యాసుడు. కుంతి పాండవులకు తల్లి, పాండవులు తండ్రులను ఎరుగరు. తల్లి అనిన వారికి అపారమయిన భక్తీ, . అందువలన ఆమె ద్వారా కార్యములను సాధించినాడు. ద్రౌపది వివాహము దుష్కర కార్యము. లోకులు గతానుగతికులు. నలుగురు నడిచిన బాటనే నడుతురు. వారిని కొత్తబాటన నడుపుట మహత్కార్యము. అదియు పెండ్లిండ్ల విషయమున. అందుకు వ్యాసుడు ఎంత శ్రమించినాడో ఊహించవలసినదే.
పాండవులను ఏకచక్రపురము నుంచి కాంపిల్యమునకు పయనము చేయించినాడు వేదవ్యాసుడు. మార్గమధ్యమున దర్శనము ఇచ్చినాడు. ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతము చెప్పినాడు. ఆమెకు అయిదుగురు భర్తలని వివరించినాడు. అక్కడనే కుంతిని సిద్దపరచినాడు. కుంతికి భర్త ఒక్కడు. ముగ్గురి వలన సంతానము కలిగినది. మాద్రికి సంతానము కలిగించినవారి యుక్తముగా అయిదుగురు అయినారు. అట్లని ఆమెను ఒప్పించి ఉందును. అర్జునుడు ద్రౌపదిని గెలిచినాడు. ఆమెను అయిదుగురు పెండ్లాడుటకు తొలుత ధర్మరాజు కూడ అంగీకరించడు. కుంతి అతనిని ఒప్పించి ఉందును. అనంతరము ద్రుపదుడు అంగీకరించడు. అందుకు వేదవ్యాసుడు రావలసి వచ్చినది.
అంత ప్రయాసపడినాడు మహర్షి. ఒక మహాత్కార్యమును సాధించినాడు.
యయాతి నుండి పాండవుల వరకు జరిగిన వివాహములను పునశ్చరణ చేసికొన్న "పెండ్లి" నేటివరకు చేరుటకు ఎందరు మహామహులు తమ మేధలను వెలిగించినారో విదితము అగును.
మానవ ఇతిహాసము దుర్గమము - విచిత్రము!
2. నదులను వనములను స్వంతము చేసుకున్నవాడు అంగారపర్ణుడు. అతడు సమాజమునకు ప్రమాదకారి. నదులు కొండలు జనులవి అని నిరూపించినాడు అర్జునుడు. జనవాక్యమును గెలిపించినాడు. అతడు అంగారపర్ణుని చంపలేదు. అతని వాదమును ఓడించినాడు. మనిషిని చంపి ప్రయోజనము లేదు. మనిషి వాదమును ఓడించవలెనను నిత్య సత్యములను అర్జునుడు వెల్లడించినాడు.


