"ఈవెనింగ్ స్నాప్స్ తీస్తానన్నాను గదా. వస్తానని ప్రామిస్ చేసి మిస్సయిపోయారేంటి" అడిగింది మహిత.
"మర్చేపోయాను... సారీ..." చేతి వాచీ వేపు చూస్తూ అన్నాడు శక్తి.
అప్పుడు సరిగ్గా ఆరుగంటలయింది.
"ఇప్పుడు తీస్తారా?"
"ఆఫీసుకొస్తారా? మీరొస్తానంటే పదండి" అంది మహిత.
"పదండి వస్తాను." అంటూ లేచి నిలబడ్డాడు శక్తి.
మరో అరగంట తర్వాత, ఇద్దరూ ఆఫీసులో వున్నారు.
ఆఫీసంతా నిశ్శబ్దంగా వుంది.
"మిమ్మల్ని టీ కూడా తాక్కుండా చేసాను. ముందు కేంటిన్లో వేడి వేడి టీ తాగి వెళ్దాం." అంది మహిత.
ఇద్దరూ కేంటిన్ లోకెళ్ళి కూర్చున్నారు.
నెమ్మదిగా టీ తాగుతున్నారు.
"ఉదయం నుంచీ, మీరు అవుటాఫ్ మూడ్ లో ఉన్నారనుకొంటాను. కారణం తెలుసుకోవచ్చా."
ఆ మాట అంటున్న మహిత వేపు నిర్వికారంగా చూసాడు శక్తి.
తను మూడ్ లో వుంటే ఈవిడకేం, అవుటాఫ్ మూడ్ లో ఉంటే ఈవిడకేం? ఏదో ఆడపిల్ల అడిగింది కదాని, మోడలింగ్ కి వస్తే... సవాలక్ష ప్రశ్నలు.
"బాధను ఫ్రెండ్స్ తో పంచుకొంటే... సగం తగ్గుతుందట..." మళ్ళీ అంది.
"నేను, భయంకరమయిన బాధల్లో ఉన్నానని అనుకొంటున్నారా- నేనేం బాధల్లో లేను."
"మరి ఉదయం... నేను పిలుస్తుంటే, అలా వెళ్ళిపోయారేం..." మళ్ళీ అడిగింది మహిత.
"ఏం... వెళ్ళిపోగూడదా- ఎవరయినా పిలుస్తుంటే, వెళ్ళిపోవటం నా సరదా. అలా వెళ్ళిపోతుంటానంతే. అవునుగానీ... మహితగారూ- మీ మట్టుకు మీరు నన్ను పరిచయం చేసుకొన్నారు. ఎందుకు చేసుకున్నారు... రోడ్ మీద పోయే ప్రతివాడితో, మీరు పరిచయం చేసుకోరు గదా... ఛైర్మెన్ మేనల్లుడ్ని కాబట్టి పరిచయం చేసుకున్నారు. అందుకే నన్ను మోడల్ గా సెలెక్ట్ చేసారు. నెమ్మదిగా నాతో ఫ్రెండ్ షిప్ చేస్తున్నారు- అంతేనా."
శక్తి అలా మాట్లాడడంతో విస్తుపోయింది మహిత.
"అందుకే డిప్రెషన్ మూడ్ లో ఉన్నారని అన్నది..." అంది మహిత.
"నాకు డిప్రెషన్ మూడు ఎందుకొచ్చింది... మీ వల్లే... ఆ భగవాన్ గాడి వల్లే."
"నేనేం చేసాను." ఆశ్చర్యంగా అడిగింది మహిత.
"మా మావయ్య జీనియస్ కదా... నేనెవరితో మాట్లాడుతున్నానో తెలుసుకొని ఉంటాడు. నా స్టేటస్ ని మర్చిపోయి, ప్రవర్తిస్తున్నాననే ఆ దిక్కు మాలిన క్లర్క్ పోస్టులో పడేసాడు..." విసుక్కుంటూ అన్నాడు శక్తి.
"అదన్నమాట మీ డిప్రషన్ కి కారణం. అందుకేనా... అంత కోపంగా వెళ్ళిపోయారు. అయితే ఆ ఉద్యోగం చెయ్యరా..." అడిగింది.
"అది ఉద్యోగమా- నాలాంటి వాడికి అలాంటి ఉద్యోగమా ఇచ్చేది? అలాంటి ఉద్యోగాలు... నేను లక్షమందికిస్తాను... ఆయన ముఖంమీద అపాయింట్ మెంట్ ఆర్డర్ ని విసిరేద్డామని వెళ్ళాను- లేడాయన. అప్పుడే మా వూరెళ్ళి పోదామనుకొన్నాను. ఇవాళ ఎందుకాగానో తెల్సా? రేపుదయం, మీ ఛైర్మన్ గారిని కలిసి, ధర్మారావులాంటి, రామబ్రహ్మం లాంటి కాకారాయుళ్ళు తప్ప నీకు జీనియస్సులు అక్కర్లేదని, నేను తలచుకొంటే ఐదేళ్ళ టైమ్ లోనే, నువ్వు ఇన్నేళ్ళుగా సంపాదించింది సంపాదిస్తానని ఛాలెంజ్ చేసి, వెళ్ళిపోదామని ఆగాను" కోపంగా అన్నాడు శక్తి.
"మరి అంత శక్తి మీలో ఉంటే మీరెందుకు ఇక్కడకొచ్చారు? మీ స్వయం ప్రతిభతో ఎందుకు ఉద్యోగం సంపాదించలేక పోయారు. ఉద్యోగం కాకపోతే, ఏదో ఒక వ్యాపారం ఎందుకు ప్రారంభించలేక పోయారు..." అడుగుతున్న మహిత కళ్ళలోకి చూస్తూ వుండిపోయాడు శక్తి.
"చిన్న ఉద్యోగమైనా ఈ రోజుల్లో రావటం ఎంత కష్టమో తెలుసా మీకు? నా మాట విని ఆ జాబ్ లో చేరిపోండి" అంది మహిత అతని మీద అభిమానాన్ని కనబరుస్తూ.
"స్వంత చెల్లెలు కొడుకుని ఇంత అవమానిస్తాడా పెద్ద మనిషి" ఇంకా మండిపడుతున్నాడు శక్తి తిరిగి తనే అన్నాడు.
"ప్రేమాభిమానాలు, రక్తసంబంధం విలువ తెలీనివాళ్ళు అలాగే చేస్తారు."
"అనువుగాని చోట అణుకువగా ఉండి- అవకాశం వచ్చినప్పుడు ఎదిగిపోవాలి. ఏమో ఎవరి అదృష్టం ఎలా వుందో ఏం చెప్పగలం. మిమ్మల్ని మీరు దారిలో పెట్టుకుంటే మీ మేనమామకంటే మీరు గొప్ప వారైపోతారేమో" అనునయంగా అంది.
మహిత అలా అంటుంటే ఎందుకో శక్తికి వాళ్ళమ్మ గుర్తుకొచ్చింది. ఆ వెంటనే కళ్ళు తడిదేరాయి.
"అయినా లాభం లేదు. నే మా వూరెళ్ళిపోతాను" చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నట్లుగా అన్నాడు.
శక్తి మాటల్లో వాళ్ళ మేనమామ మీద ద్వేషం కనిపించలేదు. ఉక్రోషమే కనిపించింది.
అప్రయత్నంగా శక్తి చేతిమీద తన చేయివేసి నిమురుతూ "మన ఛైర్మన్ చాలా విచిత్రమైన వ్యక్తి. చేతిలో చిల్లిగవ్వ లేకుండా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక్క తరంలో కోట్లు సంపాదించారట.
తనలాగే ప్రతిమనిషి క్రింద నుంచి పైకి ఒక్కో మెట్టు తన స్వశక్తితో ఎక్కుతూ రావాలని అనుకుంటారు.
అందుకే చివరికి తన కూతుర్ని సైతం తన కంపెనీలో ఉద్యోగిని చేసారట...
అదే మీ బేబీ... ఆ బేబీ ఫలానా అని తెలిస్తే మన స్టాఫ్ తన కూతురికి అనవసరమైన గౌరవం, ప్రాముఖ్యత ఇచ్చి... తన కూతురు పని నేర్చుకోకుండా చేస్తారనే తన కూతురెవరయిందీ తెలీకుండా ఉద్యోగిని చేసారట. అలాగే మిమ్మల్ని అనుకోవచ్చుగా. నిజం మీలో ప్రతిభ ఉంటే... దానికి అదృష్టం కూడా తోడయితే మిమ్మల్ని ఎవరు ఆపగలరు?" సానునయంగా అంది మహిత.
ఆ మాటలు అంటున్న మహితవేపు విభ్రమంగా చూసాడు శక్తి.
తొలిసారి మహిత గురించి ఒకింత ఆలోచనకు కూడా గురయ్యాడు శక్తి.
"నిజంగానే మీకు బాధగానే వుంటుంది. స్వయంగా మేనమామ అలా చేయటం వలన ఏ పరిస్థితినయినా తనకు అనుకూలంగా మార్చుకోగలిగినవారే ఎదుగుతారు" తిరిగి అంది మహిత.