Previous Page Next Page 
మహాభారతము పేజి 42

 

     భీమ బకాసురులు ,మల్లయుద్ధమున పెనుగులాడినాడు. భీముడు బకాసురుని పడవేసినాడు. ఎడమ పాదమున రొమ్మును తొక్కి పట్టినాడు. బకాసురుడు భీముని పడగొట్టినాడు. భీమునిది వజ్రకాయము. బకాసురుని పోటు తాకలేదు. భీముడు లేచినాడు. కోపించినాడు. ఎడమ చేత బకాసురుని వీపు విరుగునట్లు పొడిచినాడు. అపోటునకు బకాసురుడు నవద్వారముల రక్తము కక్కి, నడుము విరిగి, పడి చచ్చినాడు.
    బకాసురుడు గావుకేక పెట్టి చచ్చినాడు. అది విని బకాసురుని బంధులందరు ఉరికి వచ్చినారు. వారిని చూచి భీముడు "రాక్షసులారా! బకాసురుడు నరులను తినుట వలన ఈగతి పట్టినది. ఇకమీదట రాక్షసులు నరులను తినుట మానవలెను. తినినచో బకాసురునవలె చత్తురు" అన్నాడు. రాక్షసులు భీముని చూచి భయపడినారు. భీముని మాటలకు సమ్మతించినారు. వెళ్ళినారు.
    భీముడు బకాసురుని కళేబరము ఏకచక్రపుర ద్వారము వద్ద పడవేసినాడు. అది చూచి జనులందరు సంతసించినారు. అది విన్నారు. కుంతి ధర్మరాజాదులు. భీముని మెచ్చినారు. ప్రజలు స్తుతించినారు.

                                                       ఆలోచనామృతము

1. వేదవ్యాసుడు మానవాళికి మరొక మహోపకారము చేసినాడు. భీమునితో బకాసురుని చంపించినాడు. అంతేకాదు రాక్షసులు నర భక్షకులు కాకుండునట్లు నియమము ఏర్పరచినాడు. హిడింబాసుర, బకాసుర వధల మధ్య మరిన్ని సంఘటనలు జరిగినవో మనకు తెలియదు. ఎంతటి ప్రయత్నమూ జరిగినదో తెలియదు. బకాసురవధకు శాలిహోత్రుని ఆశ్రమమందే పధకము సిద్దము అయినది. అందు గురించి వ్యాసుడు కుంతికి ఎరుక పరచినాడు. అక్కడ ఒక చెల్లిలిని సృష్టించి వధ చేయించినాడు. ఇక్కడ ఒక తల్లిని ఒప్పించి నరభక్షణ మాన్పించినాడు!
2. హస్తిన వీడిన పాండవులకు హస్తినలో విదురుడు, బయట వ్యాసుడు అండగా నిలిచినారు. మిగిలిన వారి పాండవ పక్షపాతము నామమాత్రము.
3. తొలుత అయిదుగురు భిక్షకు వెళ్ళినారు. భీమునిది భీమకాయము. అతని బలము దాచరానిది. ప్రజలు గుర్తింతురని చారుల వలని భయమున భీముడు ఇంటనే ఉన్నాడు. అవసరము వచ్చు వరకు బయట పడలేదు.
4. అగ్రహారమునకు రాజుల రక్షణ లేదు. గ్రామ రక్షణకు గ్రామస్థులే నియమములు ఏర్పరచుకున్నారు. అతి భయంకరమయిన ఆ నియమమును క్రమ శిక్షణతో అందరు పాటించినారు. ఇది సామాన్యము కాదు.
5. కుటుంబము సమాజమునకు మూలము. అందు ప్రేమాభిమానములు, ఆత్మీయతలు, అనుబంధములు వెల్లివిరియవలసి ఉన్నది, పరస్పర త్యాగమునకు సిద్దపడుట కుటుంబ నిర్మాణపు మూల సూత్రము. బ్రాహ్మణ కుటుంబమును ఆదర్శముగా చూపినాడు. ఒకరి కొఱకు మరొకరు ప్రాణములు అర్పించుటకు ముందుకు ఉరికినారు. అది ఆదర్శ కుటుంబము . ఈ కుటుంబము వారికీ పేర్లు పెట్టలేదు. యజమాని, భార్య, పుత్రిక, పుత్రుడు . అట్లనిన అందరు అట్టివారు కావలెనని వ్యాసమహర్షి సందేశము.
6. బ్రాహ్మణ గృహమున గంభీర సన్నివేశము ఏడ్పులు, పెడబోబ్బలు శోక తప్తమయిన వాతావరణము. బాలుడు కర్ర పట్టుకొని రాక్షసుని చంపుదునని ఉరుకుట సహజమే అయినను హాస్యము సృష్టించినది. అంత బరువు వాతావరణము తేలికపడినది. అప్పుడు కుంతిని, తదుపరి భీముని ప్రవేశపెట్టినాడు . ఇది రచనా చమత్కృతి.
7. భీముడు బకాసురుని పట్టిన పట్లకు నేటి కరాటే పట్లకు ఎంత వరకు పోలికలు ఉన్నవో అందుకు సంబంధించిన విశేషజ్ఞులు పరిశోధించవలసి ఉన్నది. మల్లయుద్దము మనకు ఒక శాస్త్రముగా అభివృద్ధి చెందినది.
    
                                                ద్రౌపది వివాహము

    పాండవులు ఏకచక్రపురమున కొంతకాలము గడపినారు. ఒకనాడు ద్రుపద రాజ్యము నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చినాడు. ద్రుపద రాజు తన కూతురునకు స్వయంవరము రచించినాడని చెప్పినాడు. కుంతి ఆ మాటలు విన్నది. "ఇక్కడ మనము ఎంతకాలము ఉన్నను కలుగు ప్రయోజనము లేదు. పాంచాల దేశములు సమృద్ధములు అని విన్నాను. అచటికే వెళ్ళుదుము" అన్నది. ధర్మరాజు అందుకు సమ్మతించినాడు. పాండవులు అనుసరించినారు.
    పాండవులు తాము ఉన్న గృహస్థుని వద్ద సెలవు తీసుకున్నారు. పాంచాలమునకు పయనము అయినారు. వారు అనేక సరస్సులను దాటినారు. నదులను దాటినారు. మహారణ్యములు దాటినారు. ఒకచోట వేదవ్యాసుడు దర్శనము ఇచ్చినాడు. పాండవులు వ్యాసునకు మ్రోక్కినారు. పూజించినారు. ఆసనము అర్పించినారు. వ్యాసుడు కూర్చున్నాడు. అన్నాడు.
    "పూర్వము ఒక ముని కన్యకకు భర్త లభించలేదు. ఆమె తపస్సు చేసినది. శివుడు ప్రత్యక్షము అయినాడు. వరము కోరుకొమ్మన్నాడు. అప్పుడు ఆముని కన్యక "భర్త కావలె, భర్త కావలె" అని అయిదు సార్లు అన్నది. అందుకు శివుడు "నీకు రాబోవు జన్మమున అయిదుగురు భర్తలు అగుదురు" అని వరము ఇచ్చినాడు. ఆమె ఇప్పుడు ద్రుపదుని కూతురుగా జన్మించినది. ద్రుపదుడు ఆమె స్వయంవరము చాటించినాడు. మీరు కాంపిల్య నగరమునకు వెళ్ళుడు" వ్యాసుడు అట్లు చెప్పినాడు. అంతర్దానుడు అయినాడు.
    పాండవులు వ్యాసుని మాట విన్నారు. తమకు మేలు కలుగనున్నది. అనుకున్నారు. పయనము సాగించినారు. ఒకనాటి రాత్రి వారు గంగను చేరినారు. అర్ధరాత్రి అయినది. గంగలో స్నానము చేయ దలచినారు. అర్జునుడు కొరివి తీసుకొని ముందు నడచినాడు. మిగిలినవారు అతనిని అనుసరించినారు. అంతకుముందే అంగారపర్ణుడు అను గంధర్వుడు భార్యా సహితముగా అక్కడికి వచ్చినాడు. అతడు పాండవుల అడుగుల చప్పుడు విన్నాడు. దూరము నుండియే హెచ్చరించినాడు. వింటినారి ధ్వని చేయించినాడు. అన్నాడు:-
    "ఎవరు వచ్చుచున్నారు? నిలువుడు. సాగకుడు. ఉభయ సంధ్యలు అర్ధరాత్రులు, సకల భూత యక్ష, రాక్షస, గంధర్వాదులవి. అర్ధరాత్రుల మనుజులు సంచరించుటకు భయపడుదురు. మీరెల ప్రమాదము కోరివచ్చుచున్నారు."
    "నేను అంగారపర్ణుడను. గంధర్వుడను. కుబేరుని మిత్రుడను. ఈ గంగ నాది. ఇక్కడి గంగకు "అంగారపర్ణ" అని పేరు. ఈ గంగ నాది. ఈ వనము నాది. ఇచటికి ఎవరు వచ్చినను నిగ్రహింతును."
    అర్జునుడు అది విన్నాడు. గర్జించినాడు . అన్నాడు:-

 Previous Page Next Page