మనసంతా చికాగ్గా వుంది.
జేబులో వున్న ఎపాయింట్ మెంట్ ఆర్డర్ ని మరోసారి చూసాడు కసిదీరా దాన్ని ఉండలా చుట్టి, కార్నర్ లో ఉన్న డస్ట్ బిన్ లోకి విసిరేసి లేచి నిలబడ్డాడు.
అదే సమయంలో-
మహిత, కేంటిన్ లోకి అడుగుపెట్టింది. పక్కన ఎవరో కొలీగ్ తో మాట్లాడుతున్న మహిత, దూరం నుంచే శక్తిని చూసి ఆశ్చర్యపోయింది.
రేగిపోయిన జుట్టు, చెమటలు పట్టిన శరీరమ్మీద అంటుకు పోయిన దుస్తులు- చూపుల్లో ఆగ్రహావేశాలు... ఆ వెనుక ఏదో తెలీని నిర్లిప్తత...
ఒక గంట క్రితం... తను చూసిన శక్తి వేరు- ప్రస్తుతం తను చూస్తున్న శక్తి వేరు- ఇంతలో ఏం జరిగింది... ఏం జరిగి వుంటుంది. ఒక పక్క ఆలోచిస్తూనే శక్తి దగ్గరకు పోబోయిన మహిత-
తన పక్కనుంచే, తనని చూడనట్టు వెళ్లిపోతున్న శక్తిని చూసి ఆశ్చర్యపోయింది.
"శక్తిగారు..." పిలిచింది.
పలకలేదు శక్తి.
విసురుగా కేంటిన్ మెట్లు దిగి, పెద్ద పెద్ద అడుగులతో, మెయిన్ గేటువైపు వెళ్ళిపోయాడు.
"ఎవరు మహీ... అతను... నీకు తెలుసా..." పక్కనున్న అమ్మాయి అడిగింది.
'చెప్పాను కదా.... మన టూత్ పేస్ట్ కు మోడల్ గా సెలక్ట్ చేసానని" చెప్పింది మహిత.
ఆలోచనలో పడింది మహిత.
భగవాన్ కి తెలుస్తుందేమో- ఆ ఆలోచన రావడంతోనే ఎకౌంట్స్ సెక్షన్ లోకి వెళ్ళి చూసింది.
భగవాన్ లేడు.
సెక్షన్ లోంచి బైటికొస్తున్నప్పుడు ఆదరా బాదరాగా లోనికొస్తూ కనిపించాడు భగవాన్.
"భగవాన్"
మహిత తననిలా పిలుస్తుందని, కలలో కూడా ఊహించలేదు భగవాన్.
"మేడమ్... నన్నేనా"
"మిమ్మల్నే... సడన్ గా, శక్తిగారు- కోపంగా వెళ్ళిపోయారు. ఎందుకెళ్ళి పోయారో తెల్సా."
అసలే విషయం తేలీని భగవాన్ కూడా ఆశ్చర్యపోయాడు.
"ఎందుకెళ్ళిపోయుంటాడు... సరదాగా వెళ్ళిపోయుంటాడు. మా వాడు మేన్ ఆఫ్ మూడ్స్ మేడమ్. వాళ్ళ మేనమామ అంటే... మన ఛైర్మెన్... మూడు నెలల తర్వాత ఎం.డీ. పోస్టు ఇస్తానన్నారట. ఇప్పుడే కావాలని తగవు పెట్టుకునుంటాడు."
అష్టవంకర్లు తిరిగిపోతూ అన్నాడు భగవాన్.
ఏదో అర్థమైనట్లయింది మహితకు.
మరేం అడగలేదు భగవాన్ ని.
"శక్తి ఎక్కడుంటున్నారు... మీ రూమ్ లోనే కదూ."
"అవును మేడమ్... నా రూమ్ లోనే- త్రీ బై ఫోర్ చామరాజ్ పేట్ మేడమ్."
"పోస్ట్ మేన్ లా అడ్రస్ చెప్పకండి. నేనడగలేదు కదా..." విసుక్కుని ముందుకెళ్ళి పోయింది మహిత.
మహితక్కూడా కోపం వస్తుందా? ఆశ్చర్యపడ్డాడు భగవాన్. చర, చరా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న మహితవైపు అదో రకంగా చూసి.
సెక్షన్ లో కెళ్ళిపోయాడు భగవాన్.
మళ్ళీ కేంటిన్లో కొచ్చింది మహిత.
అప్పటికే ఇద్దరు, ముగ్గురమ్మాయిలు, కేంటిన్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అందులో పర్సనల్ డిపార్ట్ మెంట్లో, టైపిస్ట్ గా పనిచేసే కమల కూడా వుంది.
"ఏయ్... కమల చిన్న మాట" మాట్లాడుతున్న కమల లేచి, మహిత దగ్గరకొచ్చింది.
"వాట్ మహిత."
"నాకో చిన్న ఇన్ ఫర్ మేషన్ కావాలి. నిన్నగానీ... ఇవాళ గానీ, మనాఫీసులో కొత్త... అపాయింట్ మెంట్స్ ఏవైనా జరిగాయా..." అడిగింది మహిత.
"అదేంటి నీకు తెలీదా... మీ మార్కెటింగ్ సెక్షన్ కి... కొత్తగా ఓ ట్రైనీ క్లర్క్ వచ్చాడుగా... రేపు జాయిన్ అవుతాడేమో... నిన్నరాత్రి ఛైర్మెన్ సిగ్నేచర్ చేసారు."
"ఆ కేండిడేట్ పేరు తెలుసా."
"పేరా... సరిగ్గా... జ్ఞాపకం లేదు మహితా"
"థాంక్యూ..." చెప్పేసి, కేంటిన్లోంచి, బయటికొచ్చేసి ఆలోచించుకుంటూ సెక్షన్ లో కెళ్ళింది మహిత.
* * * *
స్పీడ్ గా వెళ్ళిపోతున్న సిటీ బస్సులో...
అంతవరకూ మాట్లాడుకుంటూ కూర్చున్న మహిత, చటుక్కున లేచి "స్టాప్... స్టాప్... ప్లీజ్" అంటూ అరవడంతో, సడన్ బ్రేక్ వేసాడు డ్రైవర్.
"ఏమైందమ్మా..." కంగారుగా ముందుకొచ్చాడు కండక్టర్.
"ఇక్కడ దిగిపోతాను." జవాబు చెపుతూ, జనాన్ని తోసుకుంటూ బస్సులోంచి దిగింది మహిత.
"ఎవరికి బడితే వాళ్ళు... ఎక్కడబడితే అక్కడ, అరుచుకుంటూ, దిగిపోతుంటే, మరి నేనెందుకు... మరి నా చేతిలో విజిలెందుకు..." గొణుక్కున్నాడు కండక్టర్.
రోడ్డుమీద కొచ్చిన మహిత, అటూ ఇటూ చూసింది.
రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్న శక్తిని చూసి బస్సు దిగిపోయింది మహిత.
ఇంతట్లో ఎటెళ్ళిపోయాడతను...?
రోడ్డు గడబిడగా ఉంది. అటూ, ఇటూ చూసింది. శక్తి రోడ్డు కెడమ వేపునున్న ఇరానీ రెస్టారెంట్ లో కూర్చుంటుండగా తనకెదురుగా ఎవరో ఆడప్రాణి కదలాడడంతో తలెత్తి చూసాడు.
ఎదురుగా మహిత.
ఆమెకేసి షాక్ తిన్నాడు శక్తి... హే ఆడ భగవాన్ అనుకుంటూ నిట్టూర్చాడాపైన.
"మహితగారూ మీరు ఇక్కడ" ఆశ్చర్యపోయాడు శక్తి.