Previous Page Next Page 
వ్యూహం పేజి 41


    కేంటిన్లో, ఓ కార్నర్ కి వెళ్ళిపోయి...

 

    నెమ్మదిగా చింపాడు. ఎవరూ చూడకుండా కవరును, అందులోంచి తీసిన, ఉల్లిపొరలాంటి కాగితాన్ని ముద్దు పెట్టుకుని ఓపెన్ చేసాడు. చదివాడు ఆ ఎపాయింట్ మెంట్ ఆర్డర్. చదవగానే, కళ్ళు బైర్లు కమ్మాయి శక్తికి. మళ్ళీ చదివాడు అది.

 

    తనకిచ్చిందో, లేదోనని, మళ్ళీ తన పేరు చూసుకుని, మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు.

 

    ఒక్కసారి వెయ్యి అడుగుల నీళ్ళులేని బావిలో పడిపోయినట్టయింది.

 

    కళ్ళముందు వెల్తురంతా, అకస్మాత్తుగా మాయమైపోయి, కటిక చీకటి ఆవరించి నట్టయింది.

 

    ఇలా, ఇలా కలమీద, కల, కలమీద కల, పేర్చుకున్న కలలు ఇలా, ఇలా ఒక్కొక్కటీ దారాలు తెగిపోయిన రంగు రంగుల గాలిపటాల్లా గాలికి ఎగురుతున్నట్టుగా అయింది తన పరిస్థితి.

 

    అంతెత్తు ఆకాశంలో, అంతవరకూ ఉల్లాసంగా, నిండుగా ఎగిరిన బెలూన్ లో గాలి నెమ్మదిగా పోగా ఉత్తిత్తి కింద పడిపోయినట్లుగా అయింది.

 

    ఒక్కసారి కళ్ళలోంచి నీళ్ళొచ్చాయి. ఆ కన్నీటి చుక్కలు బుగ్గమీంచి జారి కంఠమ్మీంచి ప్రాకి షర్టు మడతల్లో ఇంకిపోతున్నాయి.

 

    ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి. మనసు నిండా దుఃఖం కమ్మేసింది. తననిక్కడకు పంపిన అమ్మకు బుద్ధి లేదు. అమ్మ మాట నమ్మి ఏదో ఊడబొడిచేస్తాడని వచ్చినందుకు మేనమామ తనకి బాగా బుద్ధి చెప్పాడు.

 

    ఎపాయింట్ మెంట్ ఆర్డర్ ని మళ్ళీ ఒకసారి చూసుకున్నాడు శక్తి. తెల్లటి కాగితంమ్మీద నల్లటి టైపు ఇంగ్లీషు అక్షరాలు... "YOU ARE APPOINTED AS TRAINEE ASSISTANT IN MARKETING SECTION... YOUR BASIC..." ఆ లెటర్ వైపు మరి చూడలేకపోయాడు. మేనమామ కంపెనీలో తమ ట్రైనీ అసిస్టెంటా... అంటే... సాధారణమైన గుమాస్తా పోస్టు... దీనికంటే, ఆ పల్లెటూర్లో సూర్యం దగ్గర గుమాస్తా ఉద్యోగమే నయం. దానికంత తతంగం ఉండదు... ఈ బోడి ముష్టి ఉద్యోగానికి టైపుడు లెటర్, డానికో కవరు... అదివ్వడానికో జనరల్ మేనేజర్... దీనికోసమేనా, అన్నిసార్లు తను, ఈ ఆఫీసు చుట్టూ తిరిగాడు.

 

    "ఛీ- ఛీ..."

 

    భగవాన్ గాడికి, మహితకు, తన మొహం ఎలా చూపిస్తాడు? ఊళ్ళో వాళ్ళకి ఏంట్రా నీ ఉద్యోగమంటే, ఏం చేస్తాడు?"

 

    ఉత్తి గుమాస్తా... ఇందులోనూ ట్రైయినీ గుమాస్తా అని చెప్తాడా! చెప్పగలడా! నెలకు పన్నెండు వందలు జీతం... బోడి పన్నెండు వందలు ఈ పన్నెండు వందలూ, ఒక్కరోజులో సంపాదిస్తాడు తను... పన్నెండు వందలేంటి ఖర్మ, అవసరమైతే- రోజుకి పన్నెండువేలు, లక్షలు సంపాదించే తెలివితేటలు తన దగ్గరున్నాయి.

 

    తన తల్లి మొహం కూడా చూడకుండా, స్వంత చెల్లి- కొడుకుని చూడకుండా...

 

    మేనమామ తనకి చేసిన ఉపకారం ఇదా?

 

    తన ఉద్యోగాన్ని చూసి బేబీ తననెలా ట్రీట్ చేస్తుంది?

 

    అసలు ఓ మనిషిగా గుర్తిస్తుందా?

 

    గుర్తింపు లేనిచోట ఉండడం అనవసరం...

 

    ఇన్నాళ్ళూ, గౌరవంగా చూసాడు తన మావని... ఇప్పుడసలు, తన మామమీద ఏ మాత్రం గౌరవం లేదు.

 

    ఎపాయింట్ మెంట్ ఆర్డర్ ని, ముఖంమీద పడేసి, వచ్చేస్తేసరి- జేబులోంచి కర్చీఫ్ తీసుకొని...

 

    కళ్ళూ, ముఖం తుడుచుకొని, లేచి నిలబడ్డాడు.

 

    గబగబా కేంటిన్ లో నుంచి బయటికొచ్చి, మెట్లెక్కాడు.

 

    లిఫ్టు విషయం మరిచేపోయాడు.

 

    ఛైర్మెన్ ఛాంబర్ కెళ్ళే, వరండాలో ఎవరూ లేకుండా ఖాళీగా వుంది. ఒక మూల పిట్టగోడమీద, ప్యూన్ ఠీవిగా కాలుమీద కాలు వేసుకుని కూర్చున్నాడు.

 

    విసురుగా వస్తున్న శక్తిని చూసాడు ప్యూన్.

 

    తను ఉద్యోగంలో చేరగానే, తీసెయ్యాలని నిర్ణయించుకున్న ప్యూనే వాడు. ఏమిటన్నట్లుగా చూసాడు వాడు.

 

    "వెంకటనారాయణ ఉన్నారా?" శక్తి నోటిలో నుంచి విసురుగా వచ్చింది మాట.

 

    "లేడు... వాడిప్పుడు బయటికెళ్ళాడు. వాడికి లాటరీల పిచ్చి- డైలీ లాటరీలు పెట్టినప్పటి నుంచీ... వాడు సరిగ్గా డ్యూటీకే రావడం లేదు. ఇంతకీ నువ్వాడికేమవుతావు?..."

 

    ఆ మాటకి కోపం తారాస్థాయి కొచ్చింది శక్తికి.

 

    "నేను... ఛైర్మెన్... వెంకటనారాయణ గురించి అడుగుతున్నాను."

 

    శక్తి నోట్లోంచి ఆ మాట రాగానే, గబుక్కున పిట్టగోడ దిగిపోయాడు వాడు షాకింగా.

 

    "ఛైర్మన్ని... వెంకటనారాయణ అని పిలుస్తున్నావ్... ఎవడు బాబూ నువ్వు" విసురుగా అన్నాడు వాడు.

 

    "ఒరేయ్... నిన్నూ- తన్నేస్తాను... ఛైర్మెన్ ఉన్నాడా లేడా" కోపంగా అన్నాడు శక్తి.

 

    మొన్న బుద్ధిగా కూర్చున్న కుర్రాడు, ఇయ్యేళ పెట్రేగిపోతున్నాడేటి? పొద్దున్నే... సుక్కేసుకొచ్చాడేటి... అదే అయ్యుంటుంది... కుర్రాళ్ళు ఇలాగే పాడైపోతున్నారు... పాపం... శక్తిమీద జాలేసింది ఆ ప్యూన్ కి. ఆ సమయంలో ఛైర్మెన్ వెంకటనారాయణ, తన ఛాంబర్లోనే వున్నారు. కాని అబద్ధం చెప్పేసాడు ప్యూన్.

 

    "ఈవేళ... ఛైర్మన్ గారు రారు... ఎక్కడికో మీటింగుకెళ్ళారు."

 

    "ఎక్కడ మీటింగ్?"

 

    "ఆ మీటింగ్ ల గురించి నాకేం తెలుస్తుంది బాబూ... రేపురా..." సాధ్యమైనంత నెమ్మదిగా చెప్పాడు వాడు భయపడిపోయి.

 

    ఆ మాటను నమ్మేసాడు శక్తి.

 

    గబుక్కున వెనక్కి తిరిగాడు.

 

    "కుర్రాడు... ఎలా వూగిపోతున్నాడో సూడు- మందు మహత్యం. అచ్చు మందేసినపుడు మనమెలా నడుస్తామో... అలాగే నడుస్తున్నాడీడు" కోపంగా నడుచుకుంటూ, ముందుకెళ్ళిపోతున్న శక్తివేపు చూసి, జాలిగా అనుకున్నాడు ప్యూన్.

 

    ఎంత వేగంగా మెట్లెక్కాడో, అంత వేగంగా మెట్లు దిగిపోయి కేంటిన్ లోకొచ్చి పడ్డాడు.

 

    భగవాన్ కోసం కొంతసేపు కేంటిన్ లో వెయిట్ చేసాడు. రాలేదు... విసుగొచ్చింది.

 Previous Page Next Page