మరునాటి నుంచీ రేడియోలజీ పోస్టింగ్. మొదట యీ పోస్టింగ్ గురించి నేను కొంచెం మనస్సులో విసుక్కున్న మాట నిజమే. ఎక్సరే ఫోటోలు....అవి చూడటం ! రోగాన్ని నిర్ణయించటం....ఏమి నేర్చుకుంటాం అనిపించింది. కాని లోతుకుపోయి తరచినకొద్దీ తెలుస్తుంది. ఒక్కొక్క సబ్జక్టూ ఎంతటి అఖాతమో, అందులో నేర్చుకోవల్సింది ఎంతో వుందో తెలిసి వస్తుంది. రేడియాలజీ చీఫ్ చాలా సరదాగా వుండేవారు. ఉదయం ఓ గంటసేపు ఆయన ఎక్సరే ఫోటోలు చూసి, వాటిమీద రిపోర్టు రాసే సమయంలో దగ్గర కూర్చో పెట్టుకుని ప్రతి ఎక్స్ రేనూ చూపించి, అందులో కనిపించే వివిధ విషయాలను గురించి విపులంగా చర్చించేవాడు. అలా రెండు మూడు రోజులు చెప్పిన తర్వాత మమ్మల్ని వాటి గురించి వివరించమనేవాడు. ఏమయినా తప్పులు చెప్తే సవరించేవాడు. నిజంగా ఎక్స్ రే ఎంత మహత్తరమైన సాధనం ! ప్రపంచంలో అది కనిపెట్టబడి వుండకపోతే, ఎన్ని సూక్ష్మరోగాలు డయాగ్నైజ్ చేయబడకుండా వుండిపోయి, విజ్ఞానం ఎంత వెనకబడి, మృదుల సంఖ్య ఎన్నిరెట్లు పెరిగిపోయి వుండేదో అనిపించింది.
ఎక్స్ రేలు అయిపోయాక స్క్రీనింగ్ వుండేది. మొదట ఊపిరితిత్తులనూ, లేక కడుపులోని వివిధ భాగాలను స్క్రీన్ యివతల నుండి చూడటం, తర్వాత బేరియమ్ మీల్ యిచ్చి, ఆ మందు నోటిలోంచి కడుపువరకూ ఎలా వెడుతుందో, సరిగ్గా వెళ్ళకపోతే అక్కడ వుండే లోపం ఏమిటో యివన్నీ డార్క్ రూమ్ లో వివరిస్తూ చేస్తూ వుండేవారు.
అలాగే ఎక్స్ రే గదిలో వివిధ కేసులకు సంబంధించిన యిన్వెస్టిగేషన్లు _ ఇంట్రావీనస్ పయలోగ్రఫీ, ఆర్డియోగ్రఫి జరుగుతూ వుండేవి.
ఇహ కేన్సర్ కు సంబంధించిన కేసులు చార్జు నిండా వుండేవి .ఎక్కువ భాగం కేన్సర్ ఆఫ్ సర్విక్స్ తో బాధపడే స్త్రీలు ,మొదట రెండుసార్లు రేడియంనింపిన సూదులు రబ్బరు వోవాయిడ్స్ లో పెట్టి అవి లోపల ఎక్కించటం, ఆ తర్వాత డిప్ ఎక్స్ రే థిరపీ.
కేన్సర్ ! ఎంత భయంకరమైన వ్యాధి ! శరీరంలోని ఏ అవయవాన్నైనా క్రూరంగా ఆక్రమిస్తుంది .అది ఎందుకు వస్తుందో, ఎలా పుడుతుందో తృప్తికరమైన సమాధానం ఎవ్వరూ యివ్వలేదు. సిగరెట్లు కాలిస్తే ఊపిరితిత్తుల్లో కేన్సర్ వస్తుందంటారు. సిగరెట్లు కాల్చనివారికీ, ఆడవారికి కూడా వుంది. రాపిడి వల్ల కడుపులో చిరకాలంగా వుండే కురుపు వల్లా కడుపులో కేన్సర్ వస్తుందిట. విరుద్ద ప్రక్రియలు అంటే వేడి వేడి కాఫీ త్రాగి, వెంటనే ఐస్ క్రీమ్ తినటం _ యిలాంటివి తరచు చేస్తే కేన్సర్ వస్తుందిట. నోటిలో చుట్ట _ నిప్పు మొన వెనక్కి తిప్పి కాల్చేవారికి, కేన్సర్ వస్తుందిట. అవివాహితగా వుండిపోయి, కన్యా జీవితం గడిపితే బ్రెస్ట్ కేన్సర్ _ వక్షస్థలంమీద కేన్సర్ వస్తుందిట. పెళ్ళిచేసుకుని పిల్లల్ని ఎక్కువగా కంటే యుటెరన్ _ గర్భసంచిలో కేన్సర్ వస్తుందిట .ఎక్కువగా మాట్లాడితే స్వరపేటికలో కేన్సర్ వస్తుందిట.
రేడియమ్ యివ్వనీ, డీప్ ఎక్స్ రే యివ్వనీ, ఆపరేషన్ చెయ్యనీ - కేన్సర్ అంటూ వచ్చాక జీవితం పరిసమాప్తికి వచ్చిందన్నమాటే. మహా జీవిస్తే అయిదారేళ్ళు.
కామేశ్వరిగారు హైదరాబాద్ లోనే ట్రీట్ మెంటు పొందుతూ, మధ్య మధ్య దగ్గర్లోనే వున్న స్వగ్రామానికి వెళ్ళి ఏకాంతం జీవితం గడుపుతూ, అవసరం వచ్చినప్పుడు బంధువుల బలవంతంమీద హైద్రాబాద్ వచ్చి ట్రీట్ మెంటు తీసుకుంటూ _ వేదాంత గ్రంథాలు చదువుతూ కాలం గడుపుతున్నారని తెలిసింది. ఆవిడ గురించి ఆవిడకు క్షుణ్ణంగా తెలుసు. ఆమెకు చావంటే భయంలేదు.
ఆమె జీవితాన్ని తలుచుకుంటే మనసు వేదనాభరితమైపోతుంది. ఓ నిట్టూర్పు విడుస్తాను.
రేడియోలజీలో పదిహేను రోజులు గడిచిపోయింది. ఒకనాడు పని చేస్తుంటే వళ్ళంతా నొప్పులుగా, జ్వరం వచ్చినట్లు అనిపించింది. అలాగే తోసేసుకుని తిరిగాను. మరునాడు జ్వర తీవ్రత మరీ ఎక్కువైపోయింది. కళ్ళు మండుతున్నాయి. నీరసంగా వుంది. రాజేశ్వరి నాతోపాటే రేడియోలజీలోనే పని చేస్తుంది. ఆమె నా పరిస్థితి చూసి అనుమానించి "అదోలా వున్నారేం డాక్టర్ !" అని చెయ్యి పట్టుకుని చూసి, "అయ్యయ్యో! జ్వరం మండిపోతోంది" అని సిస్టర్ని ధర్మామీటరు తెమ్మని జ్వరం చూసింది? "నూటమూడు ! మైగాడ్ !! ఇంత జ్వరంలో ఎలా పని చేస్తున్నారబ్బా. నేనైతే ఇంట్లో ముసుగుతన్ని పడుకుంటాను." అని, "ఇలా కూర్చుంటారేం యింకా ! పదండి. మెడికల్ ఓ.పి.కి వెడదాం" అన్నది బలవంతంచేస్తూ.
"వద్దండీ, అదే తగ్గుతుంది" అని వారించటానికి ప్రయత్నం చేశాను.
"అదేం లాభంలేదు, రాకపోతే వార్డుబాయ్ తో మోయించి తీసుకువెడతాను" అని పట్టుపట్టి నన్ను కదిలేటట్లు చేసి, ఓ.పి. వైపు దారితీయించి తనూ అనుసరించింది.
ఆవేళ ఓ.పి. చక్రపాణిగారిది. జనం క్యూలో క్రిక్కిరిసి నిల్చున్నారు. ప్రక్క నుంచి చోటు చేసుకుని లోపలకు వెళ్ళాం.
చక్రపాణిగారు నా వంక చూసి "కమిన్ డాక్టర్ ! ఏమిటి అలా వున్నారు ?" అని పరామర్శ చేశారు.
జ్వరం సంగతి చెప్పాను.
"అరెరె" అంటూ ,బల్లమీద పడుకోబెట్టి పూర్తిగా పరీక్షచేసి, "లంగ్స్ క్లియర్ గా వున్నాయి. మలేరియల్ టెంపరేచర్ లా కనబడదు. ఆల్ రైట్ ! హాస్పిటల్ లో ఎడ్మిట్ అవండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం" అన్నారు.
"ఎందుకు సార్ ! క్వార్టర్స్ లోనే వుంటాన్లెండి. పర్వాలేదు" అన్నాను, హాస్పిటల్ లో వుండటంపట్ల విముఖత చూపిస్తూ,
"మీ యిష్టం. అయితే యీ ప్రకారం చేయండి" అని ట్రీట్ మెంటు రాసియిచ్చి "రోజూ వచ్చి చూపించుకోండి. నేను వార్డులో వున్నా సందేహించవద్దు" అన్నారు.
సరే అని ఓ.పి. చీటి తీసుకుని, బయటకు వచ్చి లీవ్ లెటర్ రాసి చీఫ్ కిమ్మని రాజేశ్వరికి యిచ్చి ఆమెతో వెళ్తానని చెప్పి రూమ్ కి వచ్చాను. వెళ్ళేముందు "జాగ్రత్త డాక్టర్" అని హెచ్చరించి మరీ వెళ్ళింది ఆమె.
అయితే మరో మూడు రోజులు గడిచినా జ్వరం తగ్గలేదు, సరికదా రాను రాను తీవ్రం కాసాగింది. నా సెలవు రోజు రోజుకూ ఎక్కువై పోతోంది. హౌస్ సర్జన్ అయాక యింతవరకూ ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. ఇదే మొదటిసారి .ప్రాణం తెగకోసినట్లుగా అనిపిస్తోంది, ఒక్కొక్కరోజు గడుస్తూంటే. అయితే ప్రతి సర్జన్ కూ నెలరోజులవరకూ సెలవు వాడుకునే హక్కువున్నది. నెల అయాక ఒకరోజు ఎక్కువ సెలవు పెట్టినా మరో నెలవరకూ పని చెయ్యాలి. కాని నేను యింకా పని చేయవలసింది పదిహేను రోజులే. ఈ పదిహేను రోజులూ సెలవు పెట్టినా ఏ విధమైన యిబ్బందీ కలుగదు నాకు.
ఎంతకూ జ్వరం తగ్గకపోయేసరికి టైపాయిడ్ జ్వరంగా తేల్చి యిక హాస్పిటల్ లో చేరితేగాని వల్లకాదని పట్టుబట్టారు. ఇహ తప్పించు కోవటానికి వీల్లేకపోయింది.
స్టూడెంట్ సిక్ రూమ్ లో చేరాను.
నా వార్డు జీవితం ప్రారంభమయింది. నాకు తెలిసిన హౌస్ సర్జన్లు, సిస్టర్లు అంతా వచ్చి చూసి పరామర్శచేసి వెళ్తున్నారు. జగన్నాధం, ప్రభాకరం ,రాజేశ్వరి రోజుకు ఒకసారి వచ్చి చూస్తున్నారు. నళిని రోజూ ఏదో ఒక సమయంలో వచ్చి కాసేపు కూర్చుని వెడుతోంది. మృదుల ప్రతిరోజూ కొన్ని గంటలు నా దగ్గరే గడుపుతోంది.
పాలు, హార్లిక్స్, పండ్లూ, యితర టానిక్కులూ అన్నీ పట్టుకు వస్తుంది. వద్దంటే వినదు.
ఓ రోజు బోర్న్ విటా ప్లాస్క్ లో కలిపి తీసుకు వచ్చింది.
"ఊ ! ఈ క్లోరోమైసిటిన్ క్యాఫ్ స్యూల్ మ్రింగి ,బోర్న్ విటా త్రాగు" అంది కాప్ స్యూల్ అందిస్తూ.
"అబ్బ ! ఈ మాత్రలు మ్రింగలేక చచ్చిపోతున్నాను, మృదులా ! నన్ను బలవంతం చేయకు, నీకు పుణ్యముంటుంది" అన్నాను వేడుకుంటూ.
"ఉహు, అదేం కుదరదు. ఇతరులకు చెప్పినట్లు కాదు. ఇప్పుడు నువ్వు చెయ్యాల్సిన సమయం వచ్చింది."
"ఈ పాలూ, పళ్ళరసం నాకేం తృప్తినిస్తాయిగానీ, నా మనసులో నిజంగా ఏముందో చెబుతానుగానీ, నవ్వుతావా."
"చెప్పు."
"ఆవకాయా, సాంబారూ, మీ యింటిలో వేసినలాంటి మీగడ పెరుగూ వేసుకుని భోంచెయ్యాలని వుంది."
ఆమె చప్పున ముఖం ప్రక్కకి త్రిప్పుకుంది.
"ఎందుకలా ముఖం దాచుకుంటావు ? కోరరాని కోరిక కోరానా మృదులా !"
ఆమె నా వంక తిరిగి సజల నయనాలతో చూస్తూ "నీకు జ్వరం తగ్గనీ, అదెంత భాగ్యం" అంది డగ్గుత్తికతో.
తర్వాత నా జ్వరం తగ్గిపోయింది. వెంటనే కాదు. పదిరోజుల తర్వాత.
ఆ రోజు జూన్ ఒకటవతేదీ .ఇవాళ్టితో నా హౌస్ సర్జన్సీ పూర్తయిపోయింది. జ్వరం కూడా తగ్గిపోయింది. రేపు నన్ను డిశ్చార్జీ చేస్తారు.
రాత్రి ఏడుగంటలయింది. అంతవరకూ కూర్చుని అప్పుడే మృదుల వెళ్ళిపోయింది.
వార్డులో మొత్తం ఎనిమిది బెడ్లు వున్నాయి. అన్ని బెడ్లకి నేను ఒక్కడినే పేషెంటును, మిగతావన్నీ ఖాళీగా ఉన్నాయి.