డే డ్యూటీ సిస్టర్ తన ఆన్ డ్యూటీ పూర్తిచేసుకుని క్వార్టర్సుకి వెళ్ళే సన్నాహంలో వుంది. నైట్ సిస్టరువస్తే ఆమెకు ఛార్జి అప్పచెప్పి తను వెళ్ళిపోయింది. ఇవేళ ఫస్ట్ తారీఖు కాబట్టి ఈమె ఇవాళే క్రొత్తగా వచ్చింది.
నిజంగా యీ పన్నెండురోజులూ సిస్టర్స్ నాపట్ల చూపించిన వాత్సల్యానికి పులకించిపోయాను. ఎంతో ప్రేమగా ,దయగా, ఆదరాభిమానాలతో చూసుకున్నారు నన్ను. నీరసంగా లేవలేకపోతే లేచి కూర్చోబెట్టి స్వయంగా గ్లాసు నోటికందిచ్చి పాలు వగైరాలు త్రాగించారు. నా జుట్టుకు నూనె రాశారు. నా క్రాఫింగు దువ్వారు.
"హలో ! గుడ్ యీవెనింగ్ డాక్టర్!" పరిచితమైన ఈ కంఠం వినిపించి తలత్రిప్పిచూసి చకితుణ్నయిపోయాను. నళిని చిరునవ్వుతో నిలబడింది.
"ఏమిటి డ్యూటీ నీదా నళినీ !" అన్నాను.
నవ్వుతూ అవునన్నట్లు తల ఊపింది.
తర్వాత డే సిస్టర్ దగ్గరకు వెళ్ళి ఛార్జీ తీసుకుని, ఆమెను పంపించి వేసి నా దగ్గరకు వచ్చింది.
"చూశారా, ఎంత దైనికమో ! ఇవాళ నుంచీ నన్ను యిక్కడ నైట్ డ్యూటీలో వేశారు. మీరు రేపు డిశ్చార్జి అయి వెళ్ళిపోతున్నారు. ఈ ఒక్కరాత్రే మీకూ నాకూ మధ్య మిగిలివుంది చూడండి. మీకు పన్నెండురోజులు ఆలస్యంగా జ్వరం వచ్చినా బాగుండేది కదూ" అంది.
"నాకు రాత్రిళ్ళు నిద్ర వుండేదికాదు."
"ఏమమ్మా, అంత కాల్చుకు తింటాననుకున్నారా ? అలా ఎందుకనుకోవాలి ? హాయిగా జోకొట్టి నిద్రపుచ్చేదాన్నేమో."
"నీకు జోలపాటలు వచ్చునేమిటి ?"
"మరి రావేమిటి ?"
"అయితే యివాళ నిద్రపుచ్చుచూద్దాం, పాటపాడి."
"అమ్మా ! ఆశ. ఈ ఒక్కరాత్రి మాత్రం మీకు నిద్రపోవటానికి పెర్మిషన్ లేదు. సరిగ్గా మన యిద్దరి మధ్యా ఒక్కరోజే లభించటం మీరు చేసుకున్న పాపం."
"ఏమీకాదు. పుణ్యమంటాను."
"ఏమిటి కథ ? హఠాత్తుగా యింత ఔదార్యం చూపిస్తున్నారు ?"
"ఇందులో ఔదార్యమేముంది ? నీలాంటి మంచి స్నేహితురాలు దగ్గర కూర్చుని కబుర్లు చెబుతానంటే చేదా ఏమిటి ?"
"ఆహా ! ఇవన్నీ పైకబుర్లే. ఉట్టినే బులిపించటానికి."
అట్లా మొదలయింది మా సంభాషణ .రాత్రి పదింటిదాకా ఆమాటా యీ మాటా చెబుతూ, అటూ యిటూ తిరుగుతూ పని చూసుకుంటూ, తనని చూడటానికి వచ్చిన మిగతా సిస్టర్లతో మాట్లాడి పంపిస్తూ కాలం గడిపింది.
పది కూడా దాటింది. హాస్పిటల్ అంతా క్రమంగా నిశ్శబ్దం అలుముకున్నట్లయింది. రోజూ అయితే యీపాటికి ఏం చేసేవాడిని ? సిస్టర్ తనగదిలో పని చూసుకుంటూనో, కునికిపాట్లు పడుతూనో కూర్చుని వుండేది. నేను మైమరచి నిద్రిపోతూ ఉండేవాణ్ని.
కాని యివేళ ? నళినివచ్చి నా బెడ్ ప్రక్కకు కుర్చీ లాక్కుని కూర్చుంది. "మీ కింత జ్వరం వచ్చిందికదా! అమ్మగారికి ఉత్తరం రాశారా ?" అనడిగింది.
"లేదు."
"మొత్తానికి బలే మొండివారండీ. అందరికీ నచ్చనివి మీకు నచ్చుతాయి. ఎవరికి ఏది విషాదంగా ఉంటుందో అదే మీకు అనందం."
నవ్వి ఊరుకున్నాను.
"అంత అందంగా నవ్వుతారెందుకని ?" మళ్ళీ నవ్వాను.
"మీ సమ్మోహనాస్త్రాన్ని నాపై ప్రయోగించకండి. మీకే నష్టం."
ఆమె ముఖంవంక చూస్తూ పడుకున్నాను. ఆ క్షణంలో ఎందుకో నాకు జీవితం మధురాతి మధురంగానూ, చిత్రంగానూ తోచింది. ఒకానొక సమయంలో తాడిపర్తిలో మా పబ్లిక్ హెల్తు పోస్టింగ్ జరిగేటప్పుడు ఒక ప్రవేటు ప్రాక్టీషనర్ తో "నేనన్నీ చేయగలను. త్రాగుడు, జూదం వ్యభిచారం...." ప్రగల్భాలు పలికాను. ఈ క్షణంలో నాకంతటి శక్తి వుందనిపించింది.
"అలా చూస్తూ ఊరుకుంటున్నారేం ?"
"ఏమీలేదు."
"అవునుగాని మిమ్మల్నో విషయం అడగనా ?"
"అడగండి."
"రోజూ మిమ్మల్ని చూడ్డానికివచ్చి మీదగ్గర గంటలకొద్దీ కూర్చుని వెడుతూండే, మృదుల ! మీ యిద్దరిగురించీ రకరకాలుగా చెప్పుకుంటున్నారందరూ ? అందులో సత్యమేమయినా ఉందా ?"
"మన యిద్దరిగురించి కూడా యితరులు రకరకాలుగా అనుకుంటున్నారని ఒకసారి అన్నావు ఇందులో సత్యమేమయినా వుందా ?"
కొంచెం ఆగి ప్రక్కకు చూస్తూ మెల్లగా అన్నది, "నిజం చెప్పాలంటే లేకపోదు."
"అలానా ? ఏమిటది ?"
"చూడండీ ఎందుకీ దాగుడుమూతలు ? ఇన్నాళ్ళూనేననుభవించిన చిత్రహింసచాలు. ఇహనైనా కాస్త ప్రశాంతంగా వూపిరి తీసుకుని ఉన్న సంగతి చెప్పనివ్వండి. ఏ సత్యమూ లేకపోతేనే మీ చుట్టూ అలా పరిభ్రమించాననుకున్నారా ? ఏ సత్యమూ లేకపోతేనే నేను పనిచేస్తున్న వార్డుకి మిమ్మల్ని రప్పించుకునేదాన్ననుకున్నారా ? ఏ సత్యమూ లేకపోతేనే సెంట్రల్ స్టరిలైజేషన్ రూమ్ లో మిమ్మల్ని దాచేశాననుకున్నారా ? ఇదంతా కేవలం ఆకతాయితనమనుకున్నారా ?"
ఏమీ జవాబియ్యలేకపోయాను. తెలిసినసంగతే తెలిసేటట్లు చెబుతూంటే చిత్రంగా ఉంటుంది.
నావంక పూర్తిగా తిరిగి, నా కళ్ళలోకి చూసి చెప్పసాగింది. "సరిగ్గా ఏడాది కితం, రేపటికైతే తేదీకూడా సరిపోతుంది. తడబడుతూన్న అడుగులతో మీరు ఫిమేల్ ఓ.పి. కి వచ్చారు. నేను చిరునవ్వుతో మిమ్మల్ని ఆహ్వానించాను గుర్తువుందా ?"
తల ఆడించాను, "గుర్తులేకేం ?" అన్నట్లు.
"మీ అమాయకత్వమో, మీ చిరునవ్వో, మీలో మరి ఏదో నన్నాకర్షించింది. మీతో ఎక్కువసేపు మాట్లాడాలనిపించేది. మీకు బహుమతులివ్వాలనిపించేది. తర్వాత ఒక హార్టు పేషెంటును ఎగ్జామిన్ చూస్తూండగా'మీ భుజాలదాకా వచ్చాను' అని నేనంటే 'నా ప్రక్కన నిలబడే అర్హతే మీకు లేదు' అన్నారు. ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదుగానీ ఆ మాటే నాలో పౌరుషాన్ని రేకెత్తించింది. మీకు అంత అహంభావమా అని పట్టరాని ఆగ్రహం వచ్చింది. నా అర్హతని నిరూపించుకోవాలని పట్టుదల వచ్చింది. ఆ పట్టుదలే నన్ను మీకింకా చేరువగా తీసుకువచ్చింది.
పాదరసం దీపకాంతిలో ఆమె మనసులోని ఆవేశం ముఖంలో ప్రతిఫలించి, కొత్తదీప్తులతో ప్రకాశించినట్లయింది.
"ఇదంతా చెబుతే మీరు వెర్రి అంటారు. ఎవరి వెర్రి వారికానందం. నా వెర్రి నా కానందమే కాదు, ఓ తపస్సుకూడా. వరమివ్వలేని ఓ రాతిదేముడికోసం తపస్సు" అని ఓ క్షణమాగి "ఇలాంటి సంఘటనేదో మన యిద్దరి మధ్యా జరిగి అపూర్వ సన్నివేశ మొకటి సృష్టించబడుతుందని ఒక ఆశ మిణుకు మంటూ వుండేది. ఆ ఆశే యిప్పుడు మహా సత్యమై కూర్చుంది."
ఆమె హఠాత్తుగా ఉన్మాదం ఆవహించినట్లు కుర్చీలోంచి నా మంచం మీదకు వచ్చి నా ప్రక్కన కూర్చుంది. తన చేతితో నా చెంపమీద రాసింది, "డాక్టర్ !" అని పిలుస్తూ.
భయంతో ఒక్కసారి నా శరీరం వణికిపోయింది. ఆమె అంత సాహసం చేస్తుందని ఊహించనైనా ఊహించలేదు. బెదురుతూన్న కళ్ళతో నలువైపులా చూశాను. ఎవరూ కనిపించలేదు. కిటికీలోంచి బయట చీకటి కనిపిస్తోంది.
"లే నళినీ ! నీకేమైనా పిచ్చిపట్టిందా ?" అన్నాను మృదువుగా మందలిస్తూ.
ఆమె నా మందలింపు లక్ష్యం చేయకుండా నా మీదకు వొంగి రెండు చేతులూ నా ముఖం మీద వుంచి మెత్తగా రాస్తోంది. "గడ్డం పెరిగితే మీరెలా వున్నారో తెలుసా ?" నవ్వింది.
"నళిని ! ప్లీజ్ ! లేచి కుర్చీలో కూర్చో. ఎవరన్నా చూస్తే ఏం జరుగుతుందో తెలుసా !"
"ఏమయినా జరగనీ ! మీ కెలాగూ హౌస్ సర్జన్సీ అయిపోయింది. నా గురించి దిగులు పడకండి. నేను దేన్నీ లెక్కచెయ్యను."
"అంత లెక్క చెయ్యని దానివి ఆనాడు మేట్రన్ వస్తుందని గదిలో ఎందుకు దాచేశావు ?"
"అప్పుడు పొరపాటు చేశాను. ఆ పొరపాటు నిప్పుడు సరిదిద్దుకుంటున్నాను."