Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 40


    నువ్వు వృద్ధికి  రావాలని  కాంక్ష  తప్ప అన్యం  నా మనసులో లేదు. నువ్వు బుద్ధిమంతుడివి .విద్యతో  నీ మనస్సు యింకా  వికసించి  వుంటుంది. నువ్వు ఎంతో  నిశితంగా  ఆలోచిస్తేగాని, ఈ నిశ్చయానికి  వచ్చి  వుంటావని నేననుకోను. నీ భవిష్యత్తుని  గురించి  నీ కంటే  నా కెక్కువ  తెలుస్తుందా ? నిన్ను విడిచి  వుండాలన్న బాధకన్న  నువ్వు పైకివచ్చి  పెద్దవాడివి  కావాలన్న  కాంక్షే  నాకు ఎక్కువ. వెళ్ళిరా బాబూ! నువ్వు ఎక్కడకు  పోదలుచుకుంటే  అక్కడికి  పోయిరా. నీ కెంత  శక్తివుంటే  అంత చదువు. ఆ  శక్తిని  ఆపకు, మమకారాలేవీ  దాన్ని నాశనం  చేయకుండా  చూసే పూచీ నాది. కాని ఒక్కకోరిక. ఎక్కడకు  వెళ్ళినా, ఏమి చేసినా, నేను కనులు మూసే లోపల మాత్రం  తిరిగిరా....

                                                                                                  __మీ అమ్మ...."

    అని వుంటుందందులో.

    మృదుల చదివింది. ఏం జరిగిందో   తెలియదు. ఉన్నట్లుండి  ఆనకట్టను  చేదించుకుని  నదీ ప్రవాహం పెల్లుబికినట్లు  వెక్కి వెక్కి  ఏడవసాగింది.

    నా కడుపులో  ఏదో  గిరగిరా  తిరిగినట్లయింది. ఎనలేని  ఆప్యాయత లోపల నుండి  పెల్లుబుకుకుని  వచ్చి ఆమెను  సముదాయించటానికి  భుజంమీద చేయి  వేయబోయి, మళ్ళీ  ఆగిపోయాను. ఏడుస్తోంది  మృదుల. దిక్కుతోచని  ముగ్ధబాలిక, చిటారుకొమ్మన  కూర్చున్న  జతలేని  వంటరి  బంగారు పిట్ట....రకరకాలుగా  గోచరించింది.

    "మృదులా ! ఏమిటిది  చంటిపిల్లలా ! నువ్వో  డాక్టరువు. ఈ విషయం  గుర్తుంచుకో."

    చాలా సేపటికి  ఆమె ఏడుపు  మాని  పమిటచెంగుతో  కళ్ళు తుడుచుకుని  అర్ద్రస్వరంతో  అంది: "మధూ!
నువ్వు ఒకందుకు  అదృష్టవంతుడివోయి. అటువంటి  మహనీయురాలైన  మాతృమూర్తి లభించినందుకు."

    నా శరీరం  పులకించింది. నా నేత్రాలు  చెమర్చాయి.

    మృదుల  కుదురుగా  కూర్చుని, మామూలుగా  వుండటానికి  ప్రయత్నిస్తూ  అంది: "ఇంతకీ  ఏ దేశం  వెడుతున్నావు ?"    

        "యు.కె. అక్కడ  లివర్ పూల్ లో  ఒక  చిన్న  హాస్పిటల్ కు మెడికల్ ఆఫీసర్ గా ఉద్యోగం  వచ్చింది. అక్కడనే  మూడేళ్ళు  వుండి  చదువుకుంటూ  వీలైతే  కోర్సులో  ప్రవేశించిగాని, లేకపోతే  ఉద్యోగం కంటిన్యూ  చేస్తూనే  కెనడాకు వెళ్ళి ఎఫ్.ఆర్.సి.ఎస్. ఎపియర్  అవుదామని  వుంది"

    ఒక నిముషం  ఊరుకుని  మెల్లగా  అంది మృదుల. "అవునుగాని, ఒక సందేహం" అంది.

    చెప్పమన్నట్లు  చూశాను.

    "నువ్వు చదవాలనుకుంటే  అన్యదేశాలకు  పోవాలా ? మన దేశంలో  ఎన్ని పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు  లేవు! ఫస్ట్ క్లాస్ స్టూడెంటువి. స్కాలర్ షిప్ రావటం కూడా  ఏమంత కష్టం  కాదు."

    "నీ వన్నడి  నిజమే" అన్నాను  అంగీకరిస్తూ. "కానీ నేనో  ఉన్మాదిని. నా తృష్ణకు  అంతులేదు. ఎక్కడెక్కడికో  పోవాలని, ఏవేవో ఘనకార్యాలు చేయాలని  ఉర్రూత లూగిపోతున్నాను. విశ్వజనీనత్వంకోసం  నా మనసు  తహతహలాడుతోంది. ఒక చోట కూర్చుంటే  నాకు ఊపిరాడడం లేదు. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను. తిరగాలి, పిచ్చిగా తిరగాలి, వెర్రిగా  చదవాలి, విపరీతమైన అనుభవాన్ని  సంపాదించాలి, మెడిసిన్ లో. అది యింత  పురోగమిస్తున్నా  ఇప్పటికీ  అంతు కాదుగదా ,మొదలు కూడా  తెలియని  సమస్యలు  లక్షోపలక్షలున్నాయి. వాటిలో  కొన్నిటినైనా  నేను తెలుసుకోగలిగి, పరిష్కారించగలగాలి. రీసెర్చి ! ఈ మంట  నా మనస్సు ఉడుకులెత్తిపోతోంది. దహించుకు  పోతున్నాను, నన్నర్ధం చేసుకో  మృదులా ?"
   
    నా కళ్ళలోకి  చూసి  మృదుల  నవ్వింది. "అర్ధం చేసుకున్నాను....ఇంకా ఏమీ మిగలనంతగా  అర్ధం  చేసుకున్నాను. నీ ప్రయాణ మెప్పుడు ?" అనడిగింది.

    "జూన్ ఒకటితో  నా హౌస్ సర్జన్సీ  అయిపోతుంది  పాస్ పోర్ట్. వగైరాలు అన్నీ  చూసుకుని  నేను బయల్దేరేసరికి  మరో  నెల పడుతుంది ?"

    రెండు క్షణాలు యిద్దరం మౌనంగా  కూర్చున్నాం. మృదుల నావైపు  చూస్తోంది.

    నేను ప్రక్కకి  చూస్తున్నాను.

    "ఈ పూట మా యింటిలో  భోజనంచేసి  వెడుదువుగాని" అంటూ ఆమె అనురాగపూరిత స్వరం వినిపించింది.

    ఆమె వంక  తిరిగి  "అలాగే" అన్నాను.

    మరో గంట  పోయాక  ఆ మేడమీద  డైనింగ్  హాల్లో  డైనింగ్ టేబిల్ ముందు కూర్చుని  భోజనం  చేస్తున్నాను. ఆమె దగ్గర  వుండి, ఏమి కావాలో  ఆదరంగా  కనుక్కుని  స్వయంగా  వడ్డిస్తోంది.

    "వంట చేసింది  నేను కాదు. అందులో  ఓ.న. మాలు   కూడా  నాకు తెలియవు .వడ్డన కూడా చేతకాదు. ఏమీ అనుకోకేం" అంది.

    "ఇంత చక్కగా  వడ్డిస్తూ, నేను బ్రహ్మరాక్షసుడిలా  తింటానని నిరూపిస్తూ, ఏమీ రాదని అంటావేం ! వంటలో ఏముంది ? వడ్డించే చేతిలో వుంది" అన్నాను.

    "ఎంత సున్నితంగా  మాట్లాడుతున్నావు ? అంతా  నాయందు సానుభూతి చూపించడం  కోసమేనా ?" అని ఆమె  గొంతు  వినిపించీ  వినిపించనట్లు  వినిపించింది. నా ముఖం  వంక  ఓ సారి  క్రీగంట  చూసి, అన్నం తీసుకురావటానికి  లోపలకు  వెళ్ళింది, మృదుల.

    ఆమె తిరిగి వచ్చి  పళ్ళెం నుండి  అన్నం  వడ్డిస్తూంటే  కంగారుగా "చాలు చాలు. మజ్జిగలోకి  యింత అన్నమా ! బాప్ రే" అని వారించబోయాను.

    "మజ్జిగకాదు. సరిద్దిద్దుకో. పెరుగు .మీగడ పెరుగు   మేము శ్రీమంతులం కదూ ! అన్నీ అలాంటివే  తింటాం" అని అన్నమంతా  గుమ్మరించి, చెప్పింది తీసుకురావటానికి  మళ్ళీ  లోపలకు  వెళ్ళింది.

    ఆమె తిరిగి  వచ్చి  వెండిగిన్నెలోని  పెరుగంతా  నా కంచంలోకి వడ్డించాక  కలుపుకొని తింటూ, "నిజమే, ఇంత  మంచి అన్నం, ఇంత మంచి పెరుగూ  జీవితంలో  ఎప్పుడూ  తినలేదు" అన్నాను, ఆమె చెప్పిందానికి  అంగీకరిస్తూ.

    ఆమె చప్పున  ముఖం  ప్రక్కకి  తిప్పుకుంది. నేను తెల్లబోయి  "ఎందుకలా  ముఖం  దాచుకుంటావు ? నా వంక చూడు" అన్నాను.

    ఆమె తప్పనిసరిగా  నా వైపు  తిరిగింది, ఆమె కన్నులలో  తిరిగి నీళ్ళు తిరుగుతూ  వుండటం  చూసి నిశ్చేష్టుడినైపోయాను.

    "మీ నాన్నగారు  కనిపించరేం ? యింట్లో  లేరా ?" అనడిగాను, మాట మార్చాలని.

    "లేరు ,క్లబ్బుకు వెళ్ళారు. రోజూ  పది గంటలదాకా  పేకాడి రెండు మూడొందలదాకా  పోగొట్టుకుంటేనేగాని  యింటి ముఖం  చూడరు." అని జవాబు  చెప్పింది, మృదుల.

    నా భోజనం  అయిపోయింది. వాష్ బేసిన్ దగ్గర  చెయ్యి కడుక్కుని మృదుల అందిచ్చిన  నేప్ కిన్ తో  చేతులు  తుడుచుకుని  యివతలకు  వస్తూంటే తులశమ్మగారు ఎదురుగా  వచ్చారు.

    "మధుకి  యింగ్లాండులో  ఉద్యోగం  వచ్చిందమ్మా ! ఒకటి రెండు నెలల్లో  బయల్దేరుతున్నాడు" అంది మృదుల.

    "అలాగా ! సంతోషం నాయనా ! కష్టపడి  వృద్ధిలోకి  వచ్చావు. మా మృదులను  ఈ ఊరు దాటి ఎక్కడకూ  పోనివ్వరు వారు. విడిచి వుండలేరట. అది ఏం చేసినా  యీ ఊళ్ళోనే  చెయ్యాలి" అంది ఆవిడ.

    "ఉద్యోగమూ, ప్రాక్టీసూ  సరే, రేపు  అత్తారింటికి  పోయినప్పుడైనా  మీ అమ్మాయిని  విడిచిపెట్టరా ?" అన్నాను.

    "ఉహు. ఆ అత్తారిల్లు  యిక్కడే  సృష్టిస్తారు  ఆయన. అనువైన పరిస్థితి వచ్చిననాడే  మృదులకు  పెళ్ళి జరుగుతుంది. అయినా  ఆయన కిది ఏమంత కష్టమైన  పని కాదు" అంది.

    ఆ మాటలో  అతిశయోక్తి  లేదు. రంగారావు  తలుచుకుంటే  నేను కష్టపడి సాధించిన ఉద్యోగాలలాంటివిగాని, పోస్ట్ గ్రాడ్యుయేటు  కోర్సుగాని  ఏ దేశంలోనైనా  సరే  అవలీలగా  సాధించి  ఎంత ఖర్చు పెట్టి  అయినా చెప్పించగలడు. కాని ఆయన ఆ పని చేయడు. మృదులను  ఎక్కడకూ  పంపించడు. ఆ విషయం  నాకు బాగా తెలుసు.

    "ఇహ వస్తానండీ !" అని  ఆమె దగ్గర  సెలవు  తీసుకొని  మృదులతో  క్రిందికి దిగి వచ్చాను. పోర్టికోలో   ముందు స్తంభానికి  కట్టేసివున్న  ఆల్సేషియన్  డాగ్  నా వంక  ఒకసారి  చూసి మళ్ళీ  మృదులవైపు దృష్టి మరల్చి  ఆమెవైపు రావటానికి  గొలుసును  లాక్కుంటోంది. "జెమినీ ! అని  ఆమె దాని  దగ్గరగా వెళ్ళి  ప్రేమగా  వీపు నిమిరి ,నాతో  బయటకు వచ్చింది.

    ఇద్దరం  గేటు దగ్గరకు వచ్చాం. గేటు దాటాను. ఆమె యినుప కమ్మీలను  ఆనుకుని నిలబడింది.

    మసక వెలుగులో  ఆమె కన్నులు, వాటిలోని  తడి ఆర్ద్రంతో  మెరుస్తున్నాయి.

    ఈమె  యిదివరలో  నేనెరిగిన  చిలిపి  మృదుల కాదు. చీటికి మాటికి కోపగించుకునే  పసిపిల్ల మనస్తత్వంగల మృదుల కాదు. ఈ మృదుల  గంభీర సుందరి.

    "సెలవు" అన్నాను.

    "యిచ్చాను" అంది మృదుల.

    అక్కణ్నుంచి  కదిలాను. అడుగులు  ముందుకు  వేసిన కొద్దీ  ఆమెకు దూరమైపోతున్నాను. సందు మలుపు  వచ్చింది. నేను తల వెనక్కి  త్రిప్పి చూడలేదు. మలుపు  తిరిగి  ముందుకు సాగిపోయాను.


                                    *    *    *

 Previous Page Next Page