"ప్రపంచంలోని అన్ని మతాల్లోకి హిందూమతం పరమ విశిష్టమైనది. ఎందుకో చెప్పగలరా?" అని వున్నట్లుండి అడిగాడు మిత్ర.
ఆ ప్రశ్న ఆయనెందుకు వేశాడో అర్థంకాక శృతి ఆశ్చర్యపోతే- బిల్హరి కలవరపడ్డాడు.
"ఈ ప్రశ్న ఎందుకు వేశానో తెలుసా? ది గ్రేట్ విశ్వాత్మకున్న ఆధ్యాత్మిక అవగాహన దేశంలోనే బహు అరుదుగా వుంటుంది.
విశ్వాత్మే తిరిగి నీ రూపంలో జన్మించినట్లయితే, ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వుండలేరని నా అభిప్రాయం. కావాలంటే కొద్ది నిమిషాలు టైం ఇస్తాను. ఎందుకో తెలుసా? ఫాస్ట్ లైఫ్ రిగ్రేషన్స్ రికలెక్ట్ చేసుకోవడానికి" అని మిత్ర బిల్హరి కళ్ళల్లోకి హిప్నటైజ్ చేస్తున్నవాడిలా చూడసాగాడు.
క్షణాలు, నిమిషాలు కరిగిపోతున్నాయి. శృతి బిల్హరి ఏం చెప్తాడోనని ఆసక్తిగా చూస్తోంది.
మరికొద్ది క్షణాలకే బిల్హరి ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది.
మిత్ర లేచి ఇరవై అడుగులు నడిచి, కిటికీ దగ్గరికి చేరుకొని ఆకాశంలోకి చూస్తూ తన చిన్ననాటి జ్ఞాపకాల్నీ, ఆ జ్ఞాపకాల్లో ముద్రించుకు పోయిన విశ్వాత్మ భౌతికాకృతిని మననం చేసుకోసాగాడు.
బిల్హరి మిత్ర ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాడు.
శృతి తన కుర్చీలోంచి నెమ్మదిగా లేచి కిటికి దగ్గరున్న మిత్రను చేరుకుంది.
చిన్నగా మిత్రకు మాత్రమే వినిపించేలా అడిగింది. "మీ ప్రశ్నకి బిల్హరి సమాధానం చెప్పగలరని మీరు భావిస్తున్నారా? నాకు మాత్రం ఆ నమ్మకం కలగడం లేదు. నేను విశ్వాత్మని చూడకపోయినా, ఆ అదృష్టం నాకు లేకపోయినా కేవలం వీడియో క్యాసెట్స్, ఆడియో కేసెట్స్ ద్వారా ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ఇతనిలో చూడలేకపోతున్నాను.
భౌతికంగా ఆజానుభావుడైన విశ్వాత్మ ఇతనిలో నాకెక్కడా కనిపించడం లేదు. మంచునీటిమీద పడిన వెన్నెలకాంతిలా మెరిసే విశ్వాత్మ ముఖమెక్కడ, దైన్యాన్ని కనబరుస్తున్న అతని ముఖమెక్కడ?
అరుదుగా కనిపించే విశ్వాత్మకున్న పెద్ద పెద్ద కళ్ళు ఇతనికి లేవు. ఆలోచనల్లో నిగూఢత్వాన్ని ప్రదర్శించే విశ్వాత్మ ఒత్తయిన కనుబొమలు ఇతనికి లేవు. మగతనానికి ప్రతీకగా కనిపించే వెడల్పాటి పెదాలుగానీ, మేఘగర్జనలాంటి గంభీరమైన కంఠంగానీ ఇతనికి లేవు. నా అంచనా ప్రకారం ఇతనెంత మాత్రం విశ్వాత్మ కానేకాడు" అంది శృతి స్థిరంగా.
ఆమెలోని పరిశీలనాశక్తిని అభినందిస్తున్నట్లుగా చూశాడు మిత్ర ఆమెవైపు.
ఆయన చూపులోని భావాన్ని శృతి అర్థం చేసుకొని ఒక్కక్షణం కళ్ళు వాల్చింది.
"బిల్హరి మీ ప్రశ్నకు సమాధానం చెప్పినా, చెప్పకపోయినా నాకు మాత్రం మీ ప్రశ్నకు సమాధానం మీ వద్దనుంచే తెలుసుకోవాలని వుంది. మీరేమీ అనుకోకపోతే..." అంది శృతి మెల్లగా.
కళ్లతోటే నవ్వాడు మిత్ర.
"హిందూమతం ఎవరో ఒక గొప్ప వ్యవస్థాపకుడు ఏర్పరచింది కాదు. వ్యక్తి ప్రమేయంలేని వైదిక గ్రంథాల ద్వారా ఆవిర్భవించిందే హిందూ మతం కనుకే హిందూమతం అన్ని కాలాల, అన్ని దేశాల ప్రవక్తల్ని పూజ్యభావంతో కలుపుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.
హిందూమత పవిత్ర వేదగ్రంథాలు, మానవుడు చేసే ప్రతి పనికీ దైవనియమంతో, సామరస్యం కలిగించే ప్రయత్నంలో భక్తితత్పరతనే కాకుండా ముఖ్యమైన సాంఘికాచారాల్ని అన్నింటినీ క్రమబద్ధం చేస్తాయి. న్యాయబద్ధమైన నియమానికి లేదా స్వాభావిక రుజువర్తనకు కట్టుబడి వుండమంటుంది హిందూమతం.
ఏ సమయంలోనైనా మనిషి వుండే పరిస్థితుల్లో అతనికి సహజమైన కర్తవ్యం ఒకటుంటుంది, మానవుడు పతనం నుంచి, బాధ నుంచి తనను తాను కాపాడుకోవడానికి తోడ్పడే స్వాభావిక నియమ సముదాయమని పవిత్ర హిందూమత గ్రంథాలు నిర్వహించాయి" మిత్ర చెప్పడం ఆపి శృతి కేసి చూశాడు.
శృతి ఆశ్చర్యపోతూ ఆయనకేసే అబ్బురంగా చూస్తూ వుండిపోయింది.
"విశ్వాత్మ ఒక అసాధారణమైన వ్యక్తి. ఒక కంటితో ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, మరో కంటితో సైన్సే అన్నిటికంటే గొప్పదని భావిస్తున్న నేటి ప్రపంచాన్ని వీక్షించేవారు. ఈ భగవంతుడు సృష్టిలో ఇప్పటివరకు కనుగొన్న పరిజ్ఞానం కానీ, సైన్స్ కానీ అతి సూక్ష్మమైనదని వారి అభిప్రాయం.
ఎ రేర్ క్రియేచర్ ఆన్ దిస్ ఎర్త్- ఎందుకోగానీ ఆయన్ని నాకు తిరిగి చూడాలనిపిస్తోంది. ఆయనింకా జన్మించారో లేదో తెలియదు. జన్మించి వుంటే ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో జన్మించారో?
మన కళ్ళెదుటకు ఆయన ఎప్పుడు రానున్నారో? విశ్వాత్మ పునర్జన్మ గురించి లక్షలు ఖర్చుపెట్టి ప్రపంచవ్యాప్తంగా మనమిస్తున్న ప్రచారం ఆయన దృష్టి కెళ్ళిందో లేదో?" నిట్టూరుస్తూ అన్నాడు మిత్ర.
"మీరు మరోలా భావించకపోతే- విశ్వాత్మ ఆకాంక్షలో స్వార్థం వుందేమోనని నాకనిపిస్తోంది" అంది శృతి కొంచెం జంకుగానే.
ఆమెకేసి చివుక్కున తల తిప్పి చూశాడు మిత్ర.
ఆయన చూపుల్లో వున్న చురుకును అర్థం చేసుకున్న శృతి కంగారుపడి వెంటనే సర్దుకుంది.
"నీ ఆలోచన నాకర్థంకానిదేం కాదు. ఆ తరహా ఆలోచన విశ్వాత్మ ఆకాంక్ష తెలిసిన ఎవర్లోనైనా కలగవచ్చు. తను సంపాదించుకున్న ఆస్తిని కేవలం అనుభవించడానికే పునర్జన్మ కావాలని విశ్వాత్మ కోరుకొని వుంటాడని చాలామంది అభిప్రాయం.
అది చాలా తప్పు. ఎందుకు పునర్జన్మ ఎత్తాలని కోరుకున్నాడో, కోరుకొని వుంటాడో అతి కొద్దిమందికి మాత్రమే తెలుసునని నా అభిప్రాయం. అదేమిటన్నది త్వరలో నీకే తెలుస్తుంది" అని తిరిగి ఆలోచనలోకి జారుకున్నాడు మిత్ర.
శృతి ఆయనకేసి దీర్ఘంగా చూస్తుండిపోయింది.
కొద్దిక్షణాలకి తేరుకున్న మిత్ర తిరిగి తన కుర్చీ వద్దకు చేరుకున్నాడు.
"ఇచ్చిన సమయం సరిపోలేదా మిస్టర్ బిల్హరీ?" గంభీరంగా ప్రశ్నించాడు డైరెక్టర్ మిత్ర.
బిల్హరి తన కళ్ళద్వారానే తన నిస్సహాయతను వెలిబుచ్చాడు. అది గమనించిన మిత్ర బిల్హరికేసి అసహనంగా చూశాడు.
"మిస్టర్ బిల్హరీ! మీరిక వెళ్ళొచ్చు" అన్నాడు క్లుప్తంగా.
లేచి షేక్ హేండిచ్చి నీరసంగా బైటికొచ్చాడు బిల్హరి.