అయోమయంగా చూస్తూ వుండిపోయింది కామిని.
"అతడు మరణించిన రోజే నేను జన్మించాను" తనలో తాను అనుకుంటున్నట్లు అన్నాడు ఫణి.
ఆమెకు అయోమయంగా వుంది. బహుశా దేశంలో ఎవరూ చేయని సాహసం 3,170 కోట్ల 60 లక్షల రూపాయల కోసం ఫణివర్మ చేయబోతున్నాడన్న ఆలోచనే ఆమెను భయభ్రాంతురాల్ని చేసింది.
"ఎవరు మరణించిన రోజు?" అతని మాటలకు అడ్డుపడుతూ అడిగింది కామిని.
"వి....శ్వా....త్మ" అన్నాడతను సాలోచనగా.
"నీకిదంతా ఎలా తెలుసు? ఎవరు చెప్పారు?" ఆమె గొంతులో ఆతృత ధ్వనించింది.
"ఎవరికేమిటి.... ఈ ప్రపంచానికంతా తెలుసు. విశ్వాత్మ గురించి, అతను రాసిన విల్లు గురించి ఈరోజు ఉదయం పత్రికల్లో చూశాను.
విశ్వాత్మ ఫౌండేషన్ వాళ్ళ ప్రకటన. వాళ్ళ ఫౌండేషన్ కి డిటెక్టివ్ గా అన్వేషి అనే యువకుడిని అపాయింట్ చేసుకున్నట్లు ప్రకటించారు కూడా. అప్పుడొచ్చింది నాకీ ఆలోచన" అని త్రిబుల్ ఫైవ్ సిగరెట్ ని రూమ్ కార్నర్ వైపు విసిరాడు.
ఫణివర్మ మాటల్లోని ఉత్సాహాన్ని బట్టి అతని వ్యూహంపట్ల పట్టుదలని గమనించింది.
"దానితోపాటు ప్రస్తుతం విశ్వాత్మ ఆస్థికి సంబంధించిన వివరాలను కూడా ప్రకటించారు. వాటి విలువ ఎంతో తెలుసా? 3.170 కోట్ల 60 లక్షలు" ఉద్వేగంగా అన్నాడు ఫణివర్మ ముందుకు జరుగుతూ.
అతని మనసులో వున్న పథకం ఏమిటి? అతని ఆస్థిని అతనెలా చేజిక్కించుకోబోతున్నాడు? కేవలం క్రిమినల్ ఏటిట్యూడ్ తో, గూండాల గందరగోళంతో సాధించడానికి వీలులేని పటిష్టమయిన రక్షణలో వుంది విశ్వాత్మ ఫౌండేషన్.
ఏమాత్రం స్కూప్ జరగబోతోందని తెలిసినా, పిట్టల్ని కాల్చినట్లు కాల్చిపారేస్తారు నిర్దాక్షిణ్యంగా. ఏదిఏమయినా ఫణిదాస్ ని ఎలా లొంగ దీసుకోవాలో కామినికి బాగా తెలుసు. అందుకే సోఫాలోంచి లేచి, లోనరూంలో కెళ్ళి చీరలోంచి నైటీలోకి మారి బయటికొచ్చి, రెండు గ్లాసుల్లో డ్రింకును పోసి అతనికో గ్లాసు అందించి తనో గ్లాసు తీసుకొంది.
ఆమె భుజాల చుట్టూ చేతులు బిగించి పక్కకి తిప్పుకుంటున్న అతని ప్రయత్నాన్ని మందలిస్తున్నట్లుగా నటించి "నీ ప్లాన్ ఏమిటో చెప్పవా నాకు" అందామె గోము గోముగా.
"విశ్వాత్మ ఫౌండేషన్ కు నా బర్త్ డే డేటుతోపాటు అప్లయ్ చేశాను" అన్నాడతను గుసగుసగా.
"అయినంత మాత్రాన నిన్ను విశ్వాత్మగా నమ్ముతారా? విశ్వాత్మ చనిపోయాక సరీగ్గా ఇన్నిరోజులకే, ఇన్ని నెలలకే, ఇన్ని సంవత్సరాలకే తిరిగి జన్మిస్తారనే రూలేమైనా వుందా? తిరిగి జన్మించిన అయనకి మీ వయస్సే వుంటుందనే బలమయిన వాదనేమన్నా వుందా? జన్మకూ... జన్మకూ మధ్య ఫలానా వ్యవధి వుండాలన్న నిబంధన ఏదీ లేదు కదా?" అని అతన్ని డిస్టర్బ్ చేస్తూ అడిగింది కామిని.
ఆమెలోని వివేకానికి ఆశ్చర్యపోతూ-
"శభాష్ కామిని... నీ వివేచన అభిలషణీయమయినదే- కాదనను. ఏదయినా ఆయా వ్యక్తుల కర్మానుసారంగా జరుగుతుందని తెలుసు నాకు. అయినా ప్రయత్నించడంలో తప్పులేదుగా? నేనేం చేసినా అది నువ్వూ అనుభవిస్తావ్ కదా?" అన్నాడు అతను.
కామిని కల్లోల మేఘంలా కవ్వింపుగా నవ్వింది. ఆమె నవ్వులోని తృప్తిని గమనించి తను కరెక్టుగా అంచనా వేశాననుకున్నాడు ఫణివర్మ. వేడివేడిగా తగులుతున్న శ్వాస ఆవిర్లు, అతని పెదాలతోపాటు శరీరమంతా పోరాడుతున్న వేళ్ళ కొసలు కామినిని వివశురాల్ని చేశాయి.
ఒక పక్క స్వర్గసౌఖ్యాన్ని అనుభవిస్తూనే మరొక పక్క విశ్వాత్మకు చెందిన కోట్లాది ఆస్థి గురించి ఆలోచిస్తోంది కామిని- అలాగే ఫణివర్మ కూడా.
* * * *
బిల్హరి. పేరులాగే మనిషి కూడా విచిత్రంగా వుంటాడు. పాతికేళ్ళ వయస్సున్న బిల్హరి ముప్ఫై ఏళ్ళ మనిషిలా బలంగా వుంటాడు.
దేశంలోని చాలామందిలాగే బిల్హరి కూడా విశ్వాత్మ ఫౌండేషన్ కు అప్లయ్ చేశాడు. అ అప్లికేషన్ ను చూసిన మిత్ర తన అనుమతి తెలపడంతో ఆ సాయంత్రం బిల్హరి రాక ఆఫీసులో కలకలం రేపింది.
అక్కడున్న భద్రతా ఏర్పాట్లను నిశితంగా గమనించిన కొద్దిక్షణాల వరకు బిల్హరి వెన్నులో చలో పుట్టినట్టయింది. కర్చీఫ్ తో చెమట తుడుచుకొని ముందుకు నడిచాడు.
శృతి క్యాబిన్ లోకి చూసి- "మే ఐ కమిన్ మేడమ్" అంటుండగానే-
"వెల్ కమ్ మిస్టర్ బిల్హరి" అని ఆహ్వానించింది శృతి అతనికేసి పరిశీలనగా చూస్తూ-
ఆమెకు ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడతను. కొందరు వ్యక్తులు లోపల బెరుకుగా వుంటూ, బైటకు హుందాగా నటిస్తుంటారు. స్వభావ సిద్ధంగా హుందాగా వుండేవాళ్ళు అరుదుగా వుంటారు.
బిల్హరి మొదటి కోవకు చెందినవాడు. తననో పెద్ద బిజినెస్ మాగ్నెట్ లా, చాలా డిగ్నిఫైడ్ గా అవతలి వ్యక్తులు భ్రమించేలా అనుక్షణం జీవిస్తుంటాడు.
తనో పెద్ద ఎగుమతి, దిగుమతి వ్యాపారవేత్తనని, విదేశాల్లో కూడా కంపెనీలు నిర్వహిస్తున్న పారిశ్రామికవేత్తననీ, పరిచయం చేసుకున్న బిల్హరిని అద్భుతాన్ని చూస్తున్నట్లు, గౌరవంగా రిసీవ్ చేసుకుందామె. ఆమె బిల్హరిని చూసిన మరుక్షణం నుంచి అతనిలో విశ్వాత్మ పోలికల కోసం వెతుకుతోంది.
పదినిముషాలు గడిచాక డైరెక్టర్ మిత్ర వచ్చి తన సీటులో కూర్చున్నాడు.
అతి కష్టం మీద టెన్షన్, ఫీలింగ్స్ బయటపడకుండా జాగ్రత్తపడ్డాడు బిల్హరి.
మిత్ర కూడా వస్తూనే పునర్జన్మ నెత్తిన వ్యక్తిని తానేనంటూ, అప్లయ్ చేసివచ్చిన బిల్హరిలో విశ్వాత్మ పోలికల కోసం, మేనరిజమ్స్ కోసం స్కాన్ చేసినట్లు ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాడు.
దాదాపు రెండు గంటలు బిల్హరి వ్యక్తిగత జీవితంపట్ల అతని వ్యాపారాల వివరాలు, అందుకు సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్లు, చివరలో విశ్వాత్మ జీవితానికి సంబంధించిన విశేషాల గురించి శృతి, మిత్రలు శల్యపరీక్ష చేసినట్లు రకరకాల ప్రశ్నలు వేశారు.
బిల్హరి ఎక్కడా తడబాటుపడకుండా చాలా ప్రశాంతంగా సమాధానాలన్నీ ఇచ్చాడు.
కానీ మిత్రకు అతని మాటల్లోని కొన్ని సందర్భాలు అసంతృప్తిగా అనిపించాయి.