Previous Page Next Page 
అహో! విక్రమార్క పేజి 42


    అతడు వెళ్ళిపోగానే మిత్ర అసహనంగా "ఇతని బ్యాక్ గ్రౌండ్ గురించి పూర్తిగా డిటెయిల్స్ సేకరించండి. యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్" అని ఆదేశించి వెళ్ళిపోయాడు మిత్ర.

 

    బిల్హరిని ఇంటర్వ్యూ చేసే సమయంలో అన్వేషి ఎందుకు రాలేదు అనే ప్రశ్న శృతి మెదడులో మెరిసింది. దాంతో ఆలోచనలో పడింది శృతి.

 

    అ విషయంలో డైరెక్టర్ మిత్ర కూడా అసహనంగా వున్నాడు. అందుకే వెంటనే అన్వేషి క్యాబిన్ కు డయల్ చేసింది శృతి.

 

                               *    *    *    *

 

    ఆ సమయంలో ఆమెకు రెండ్రోజుల క్రితం జూబ్లిహిల్స్ కొండల్లో జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. స్పృహ తప్పిన అన్వేషిని నర్సింగ్ హోమ్ కి తీసుకుపోవడం, అక్కడ డాక్టర్లు అతన్ని టెస్ట్ చేసి లోబీపి వుందా అని అడగడం...

 

    దానికి అన్వేషి ఆశ్చర్యపడడం మరింత ఆశ్చర్యంగా వుంది శృతికి.

 

    ఒళ్ళు తిరగడం, స్పృహ తప్పడం నాకిదే మొదటిసారి. ఏడాదికి రెండుసార్లు నేను తప్పకుండా బాడీ చెకప్ చేయించుకుంటాను. ఆ రిపోర్ట్స్ లో ఎప్పుడూ లోబీపీ ప్రసక్తి లేదని అన్వేషి చెప్పిన మాటకు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. బాడీ స్కానింగ్ చేశారు ఎందుకయినా మంచిదని.

 

    లోబీపీకి సంబంధించిన లోపాలేవీ అతని శరీరంలో కనిపించక పోవడంతో ఆ కేసుని స్పెషలిస్టులకు రిజర్వ్ చేశారు ఫీజీషియన్స్.

 

    ఫోన్ లో శృతి గొంతు వినగానే "హాయ్ శృతి!" అంటూ విష్ చేసాడు అన్వేషి.

 

    ఫోన్ చేసింది తానేనని ఎలా ఊహించాడబ్బా అన్నట్లు ఆశ్చర్యపోయిందామె.

 

    "షాక్ తిన్నారా?" అన్నాడతను రెట్టిస్తూ.

 

    "నేనే విశ్వాత్మనంటూ రుజువు చేసుకొనేందుకు వచ్చిన బిల్హరి అనే వ్యక్తిని మేం ఇంటర్వ్యూ చేసేప్పుడు- అతన్ని పరిశీలించేందుకు ఎందుకు రాలేదు?" అంది చిరుకోపంగా.

 

    "అదా సంగతి... మీరెలా చేస్తారో చూద్దామని. ఫర్వాలేదు- బాగానే మానేజ్ చేసారు" అన్నాడు.

 

    "అంతా చూసినట్లుగా చెప్తున్నారే?"

 

    "చూడాలా.... వూహించి తెలుసుకోవచ్చుగదా?"

 

    "ఏంటి... దివ్యదృష్టితోనా?" వ్యంగ్యంగా అందామె.

 

    "కాదు- ఎలక్ట్రానిక్ దృష్టితో" ఆటపట్టిస్తున్నట్లు అన్నాడు అన్వేషి.

 

    "ప్లీజ్! విసిగించకుండా అసలు సంగతి చెప్పండి" అసహనంగా అందామె.

 

    "సీక్రెట్ గా మీ క్యాబిన్ లో వీడియో కెమేరా సెట్ చేసాను" రహస్యం చెపుతున్నట్టుగా చెప్పాడతను.

 

    నిర్ఘాంతపోయింది శృతి.

 

    "మీరిలాంటి పనులు కూడా చేస్తారన్నమాట" అతని ముందు జాగ్రత్త చర్యకు అచ్చెరువొందుతూ అంది శృతి.

 

    "మరి నా డ్యూటీ అదేగదా? నా జాగ్రత్తలో నేనుండకపోతే ఎలా? ప్రధానమంత్రుల్ని, గవర్నర్స్ ని, ముఖ్యమంత్రుల్నే నమ్మలేని రోజులొచ్చేశాయి. కలియుగం అంతం కాబోయే సమయం ఆసన్నమయిందేమో ననిపిస్తోంది. మనదేశ రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారుల లంచగొండితనం చూస్తుంటే వీరభోగవసంతరాయలు జన్మించే కాలం సమీపించబోతోంది" అన్నాడు అన్వేషి నవ్వుతూ.

 

    "గొప్ప ఘనకార్యం చేశారుగానీ, బైదిబై బిల్హరి గురించి డీటైల్స్ సేకరించమణి మిత్రగారు ఆదేశించారు" చెప్పిందామె.

 

    "అదీ... ఇంతకుముందే తెలుసు. దానితోపాటు మరో విషయం కూడా తెలుసుకున్నాను."

 

    "ఏమిటీ?"

 

    "శృతి అనే అమ్మాయికి నేను రాకపోవడంతో కోపంగా వుందని" కొంటెగా అన్నాడతను.

 

    "అఫీషియల్ ఫోన్స్ లో, నాన్ అఫీషియల్ మేటర్స్ మాట్లాడడం నేరం" అంటూ గబుక్కున ఫోన్ పెట్టేసింది శృతి లోలోనే నవ్వుకుంటూ.

 

    విశ్వాత్మ ఫౌండేషన్లో ఫోన్లమీద నిఘా వుంటుందనే విషయం శృతికి బాగా తెలుసు.

 

    ఆ విషయం అన్వేషికింకా తెలీదు.

 

    శృతి ఫోన్ పెట్టేశాక కాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడతను.

 

    ఇరవై నిముషాలు గడిచాయి.

 

    మళ్ళీ శృతికి ఫోన్ చేశాడు.

 

    "హలో!" శ్రావ్యంగా శృతి కంఠం వినిపించింది ఫోన్ కి ఆవైపు నుంచి.

 

    "ఈరోజు ఈవెనింగ్ మీరు ఫ్రీ అనుకొంటాను" అన్నాడు అన్వేషి కొద్దిక్షణాలు తటపటాయించాక.

 

    "లేదు... నాకు పర్సనల్ పనుంది" చెప్పిందామె.

 

    "ఇది నూటికి తొంభై తొమ్మిదిన్నర శాతం అమ్మాయిలు చెప్పే అతి మామూలు సమాధానం. నిజమైన కారణం వుంటే చెప్పకూడదూ" ఆమెను ఉడికిస్తున్నట్లుగా అన్నాడు అన్వేషి.

 

    "కారణం కూడా మీరే చెప్పండి" అంది నవ్వుతూ.

 

    "అలాకాదు. నేనో నాలుగు కారణాలు చెప్తాను. మీకిష్టమైన్ కారణాలు చెప్పండి" అడిగాడు.

 

    "కానివ్వండి" అందామె.

 

    "ఓ.కె. నెంబర్ వన్ అమ్మమ్మతో గుడికెళ్ళాలి. నెంబర్ టూ బ్యూటీపార్లర్ కు వెళ్ళాలి. నెంబర్ త్రీ ఫ్రెండ్స్ తో షాపింగ్ కి వెళ్ళాలి. నెంబర్ ఫోర్...." అంటూ ఆగాడు.

 

    "ఊఁ!" చెప్పండి.

 

    "ఇప్పుడు కాదులెండి, తర్వాత చెప్తాను"

 

    "చెప్పండి మహాశయా!"

 

    "అదే అద్దంతో దోస్తీ బ్రహ్మ సృష్టిలో ముందు అద్దం, తర్వాత ఆడపిల్ల పుట్టిందట. అంచేత..." అంటూ నవ్వేడు అన్వేషి.

 

    "డిటెక్టివ్ గారికి చాలా విషయాలు తెలుసే కానీ ఇవేవీ కాదు" అంది శృతి.

 

    "అయితే థాంక్స్. ఈ సాయంత్రమే వస్తున్నారన్న మాట" అన్నాడు ఉత్సాహంగా.

 

    "లేదు... లేదు....మీ ప్రశ్నల్లో మరొకటి చేరిస్తే నేను సెలెక్ట్ చేసేదాన్ని"

 

    "ఏమిటది?"

 

    "సాయంత్రం నేను నా బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళుతున్నాను" అన్నదామె.

 

    "మళ్ళీ థాంక్స్! అయితే ఆరుగంటలకు నేను రెడీగా వుండాలన్న మాట" అన్నాడు అన్వేషి హస్కీగా.

 Previous Page Next Page