"ఇవాళ... ఓకే... ఇవాళ... నేను ఖాళీ... ఎక్కడా పనిలేదు-"
"మీ మేనమామగారింటికి వెళతారేమో..."
"మీకు తెలుసో, తెలీదో, ఎంత గొప్ప బంధువులైనా, వాళ్ళింటికి ఎక్కువసార్లు వెళ్ళకూడదు... చులకనైపోతాం... రేపొస్తావా... అనడిగాడు మా మావ... రానని చెప్పేసాను... అదే భగవాన్ లాంటివాడ్ని అడిగేరనుకోండి... పెట్టే, బేడా సర్దుకుని వెళ్ళిపోతాడు. అవునంటారా- కాదంటారా- జీవితంలో ప్రిన్సిపల్స్ ఉండాలండి... ప్రిన్సిపల్స్ ఉంటేనే మనుషులు... రుషులు అవుతారు... ఏవంటారు?"
"ప్రస్తుతం మరి పెట్టే, బేడా ఎక్కడున్నాయో..." బిత్తరపోతూ అడిగింది మహిత.
సమాధానం ఇవ్వలేదు శక్తి.
"మీరేమీ అనుకోనంటే ఒక మాట... గాలిలో కట్టే మేలిసౌధం కన్నా గుంజ పాతి కట్టే గుడిసె మేలని పెద్దలంటారు మీకు తెలుసా" అంది మహిత.
"నాకు తెలీదు. తెలుసుకుంటాను" అన్నాడు శక్తి సీరియస్ గా.
మహిత నిట్టూర్చింది. మనిషికి అవసర మనుకున్నప్పుడే కష్టపడతాడు. కష్టపడ్డప్పుడే ఎదుగుతాడని చెప్పాలనిపించింది. ఎందుకో అంత చనువు తీసుకోలేక పోయింది.
"మీకు తెలుసా... వసుదేవుడు లాంటి వాడు.... గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. అలాగ... మన భగవాన్ గాడి రూమ్ లో పెట్టాను... ఎందుకంటారా..." ఏదో చెప్పబోయాడు శక్తి.
"నాకు తెలుసులెండి... సెక్షన్ కెళ్ళాలి... టైమవుతోంది..." వెళ్ళిపోయింది మహిత నవ్వుకుంటూ.
కేంటిన్లో, ఒక్కడూ మిగిలిపోయాడు శక్తి.
ధర్మారావు దగ్గరకెళితే... ఏవంటాడు?
అసలు ధర్మారావు ఎవడు మధ్యన?
ఇవాళ, తాడో పేడో తేలిపోవాలి...
మేనమావ, వెంకటనారాయణ దగ్గరికి, తనే నేరుగా వెళ్ళిపోతే... ఏవంటాడు?
కొట్టేసి చంపెయ్యడు గదా!
రోజులు గడుస్తున్న కొలదీ, భగవాన్, మహితల ప్రశ్న లెక్కువయి పోతాయి.
తను అబద్ధాల మీద, అబద్ధాలు ఆడాల్సి వచ్చింది. అసలు మేనమావను డైరెక్టుగా కలిస్తే, అన్ని విషయాలు బయటపడతాయి... మధ్యలో అసలు...
ధర్మారావుని కూడా కలవడం అనవసరం... ఒక నిశ్చయానికొచ్చి లేచి నిలబడ్డాడు శక్తి.
కేంటిన్లోంచి బయటపడ్డాడు.
మెయిన్ హాల్లోకి నడిచాడు.
నడుస్తుండగా మహిత వచ్చింది శక్తి దగ్గరకు.
"మీ బేబీని నేను కనిపెట్టి చెబుతాను... నేనేదడిగితే అది ఇస్తారా?"
"ఇస్తాను" అన్నాడు శక్తి హుషారుగా.
"మిమ్మల్ని పట్టించుకోని ఆ బేబీ అంటే మీకెందుకండి ఇంట్రస్ట్" అడిగింది మహిత.
"The rich deserved their riches but the poor did not deserve their poverty.... అందుకన్న మాట... అర్థమైందా?" అని వేగంగా వెళ్ళిపోయాడు శక్తి.
అది వింటూనే దిగ్ర్భాంతికి లోనయింది మహిత.
తను పొరపాటున శక్తిని తక్కువ అంచనా వేసింది. ఇతడేం తెలివి తక్కువవాడు కాదు. కావాలని నటిస్తున్నాడంతే... కాకపోతే కలల మనిషి... ఆ కలల్ని పోగొడితే? అయినా తనకెందుకు...? పరి పరి విధాల శక్తి అన్న కొటేషన్ గురించే ఆలోచిస్తూ వెళ్ళిపోయింది మహిత.
నెమ్మదిగా మెట్లెక్కుతున్న శక్తి ఏదో పిలుపు విని తల వెనక్కి తిప్పి చూసాడు.
ధర్మారావు.
"నిన్నేనయ్యా... బాబూ..."
ధర్మారావు అలా పలకరిస్తాడని, ఊహించనే వూహించలేదు శక్తి.
"ఎవరో అనుకొని... నన్ను పిల్చారేమో సర్... మీరు.... నేను..." కంగారుగా అన్నాడు శక్తి.
"నా కళ్ళకి చత్త్వారం ఇంకా రాలేదయ్యా... పద... పద... నక్కతోక తోక్కావ్..." నవ్వుతూ, భుజమ్మీద చెయ్యివేసి నడుస్తూ అన్నాడు ధర్మారావు.
ధర్మారావు నవ్వాడంటే, భుజమ్మీద చెయ్యి వేసేడంటే, మేనమావ దగ్గర్నించి, ఎపాయింట్ మెంట్ ఆర్డర్ వచ్చుంటుందా... లేకపోతే- మేనమావ తీసుకున్న నిర్ణయం ఏదైనా తెలుసుంటుందా?
సెక్షన్ ముందు కెళ్ళగానే ధర్మారావు, శక్తి భుజమ్మీద నుంచి చేతిని తీసేసాడు.
వెళ్ళి సీట్లో కూర్చున్నాడు.
ఆయన వెనకే వెళ్ళి, ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు శక్తి.
"చూడబ్బాయి... నిన్న, నువ్వెళ్ళిపోయిన ఓ గంట కనుకుంటాను- ఛైర్మెన్ గారి దగ్గర్నుంచి, నీ అపాయింట్ మెంట్ ఆర్డర్ వచ్చిందయ్యా- నువ్వెక్కడయినా, కనిపిస్తావేమోనని చూసాను- పోనీలే- ఈరోజు గురువారం- మంచిరోజు-" అన్నాడు సొరుగులోంచి ఏదో తీస్తూ.
ధర్మారావు పర్మిషనిస్తే, ఆయన ముందున్న టేబిలెక్కి గెంతాలని వుంది శక్తికి.
మేనమామని తను తప్పుగా అర్థం చేసుకున్నాడు.
బిజీగా వుండడం వల్ల లేటయింది అంతే-
మేనమావ తనకి, ఎలాంటి పోస్టు ఇచ్చుంటాడు- ఎపాయింట్ మెంట్ ఆర్డరున్న కవర్ ని అనందంగా అందుకుని, అక్కడ్నించి లేచొచ్చేస్తాడు శక్తి.
ఇంతకీ శక్తి ఛైర్మెన్ కి నిజంగానే మేనల్లుడా? ధర్మారావుకి పెద్ద ధర్మ సందేహం- అయితే ఆ పోస్ట్ ఎందుకిస్తాడు? ఛైర్మెన్ కి ఒక చెల్లెలున్నట్లు ఎవరో చెప్పగా విన్నాడు. ఆమె కొడుకేనా శక్తి-? కన్నకూతుర్ని ఎం.డి. చేయకుండా ఏదో పోస్ట్ లో పెట్టేసాడు. అలాంటి ఛైర్మెన్ ని తక్కువ అంచనా వేయకూడదు. ఏదో మతలబు ఉండే ఉంటుంది.
చెంగు, చెంగున వచ్చి కేంటిన్ లో పడ్డాడు శక్తి.
భగవాన్ కోసం, అటూ, ఇటూ చూసాడు. ఎక్కడా కనబడలేదు. "ఈ ఇడియట్... అవసరమైనప్పుడు కనబడడు" విసుక్కుని, ముచ్చటైన తెల్లటి కవరుని, ఆ కవరుమీద టైపు చేసి ఉన్న తన పేరుని మురిపెంగా చూసుకున్నాడు.