Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 39


    ఆ గదిలో  స్విచ్  ఎక్కడవుందో  నాకు తెలుసు. గోడమీద  తడిమి  స్విచ్ ఆన్ చేశాను. వెలుగు!

    "ఎవరూ ?" అని ఉలికిపాటుతో  ఆమె కనులు తెరిచి  చూసింది.

    చిరునవ్వు  నవ్వుతూ  నిలబడ్డాను.

    "నువ్వేనా ? నిజంగా  నువ్వేనా ? చెప్పు. ఊ, చెప్పూ. నువ్వేనా ? అన్న భావం, ఆశ్చర్యం ఆమె ముఖంలో  కనిపిస్తున్నాయి, రంగులు మారాయి.

    అట్లాగే  చూస్తోంది  ఆమె  నావంక  దృష్టినిల్పి. ఎంత  ఉద్వేగం, ఉద్రేకం, ఉద్విగ్నత దాచుకుంటుందో  అనిపించింది.

    "నేను వచ్చాను" అన్నాను.

    "రా మధూ!" అంది, ఎంతో  ఆదరంగా ! ఎంతో నిగ్రహంతో అన్నట్లు  నిండైన  ఆదరం.

    నేను వెళ్ళి  ఆమె కెదురుగావున్న  సోఫాలో  కూర్చున్నాను.

    అది మృదుల  గది. అత్యంత  అధునాతనంగా  అలంకరించబడింది నేలమీద ఖరీదైన తివాచీ, రేడియోగ్రాం, బుల్లి టేప్ రికార్డర్, ముచ్చటైన సోఫా సెట్టు, విశాలమైన  కిటికీలు, ముట్టుకుంటే  మాసిపోయేటట్లు  వున్న తెల్లటి పరుపుతో పందిరిమంచం, దానిచుట్టూ దోమతెర, అవసరమైతే  లాగేసుకునేందుకు  పందిరిమంచం  ప్రక్కన  నీలిరంగు కర్టెన్....

    "చీకటిలో  కూర్చుని  ఏం చేస్తున్నావు మృదులా ?"

    "వేదాంత ధోరణిలో  ఆలోచిస్తున్నాను."

    "చీకటిలో  వేదాంతం వస్తుందా ?"

    "వేదాంత భ్రమ  వస్తుంది పోనీ, మనుషులు  వ్యక్తిత్వం  పెరుగుతుంది. మొదట భయంపుట్టి, ఆ భయంలోంచి  అనంతమైన  ధైర్యం  ఆవిర్భవిస్తుంది మొదట  ఏడుపువచ్చి, ఆ ఏడుపులోంచి  శతకోటి  ఆనందాలు వెలుగుపువ్వుల్లా  వ్యాపిస్తాయి."

    నేనామెవైపు  వింతగా  చూశాను. మృదుల  ఆ విధంగా  మాట్లాడటం  ఎన్నడూ  ఎరుగను.

    ఆమె నావైపు  చూసి  నవ్వింది. "పిచ్చిదాన్ననుకుంటున్నావు  కదూ! పిచ్చిదాన్ని  కాదు పిచ్చిపిల్లను."

    "అయితే  యివేళ నుంచి  నిన్ను  'పిచ్చిపిల్లా' అని పిలుస్తాను."

    "ఇంకెన్నాళ్ళు  పిలుస్తావు ? అయిపోవచ్చిందిగా"

    "ఏమిటి  అయిపోవచ్చింది ?"

    "అదే" అని  ఒకక్షణం  మెదలకుండా   ఊరుకుని  "నువ్వు  నన్ను  పిలిచేకాలం. మన హౌస్ సర్జన్సీ  అయిపోవస్తుందిగా" అంది.

    కొంచెంసేపు  ఆమె ముఖంలోకి  చూస్తూ  ఊరుకుని  "మృదులా ! తర్వాత  ఏం చేస్తావు నువ్వు ? అని ప్రశ్నించాను.

    ఆమె నావంక  వాడిగా  చూసింది  భావాల వలయాలు  జారిపడ్డాయి ఆ చూపులనుంచి. "ఆ తర్వాతతో  ఏమీ  సంబంధంలేనట్లు  మాట్లాడుతున్నావే  నువ్వయ్యా మహా  పురుషుడివి. రాగద్వేషాలకు  అతీతుడివి. ఈ కాల్పనిక  జగత్తులో నీలాంటివాడిలో  పరిచయం  కావటం  నా అదృష్టం. ఏం చేస్తానని  అడిగావు కదూ ! ఏమీ చెయ్యను. సరదాకోసం  యీ చదువు చదివాననుకుంటాను. నా సొంత  ప్రపంచాన్ని  నేను నిర్మించుకుంటాను" అంది.

    కొంచెం  ఆగి "మరి నీవేమి చేస్తావు?" అనడిగింది.

    జవాబు చెప్పటానికి  తటపటాయిస్తున్నాను.

    "జవాబు  నేను చెపుతున్నాను  విను. పై  చదువుకు వెడతావు. ఆజన్మాంత బ్రహ్మచారిగా వుండి  ప్రజాసేవ చేస్తూ  బాహుళ్యానికి  నీ జీవితాన్ని  ఖర్చు పెడుతూ  వుంటావు."

    నవ్వి ఊరుకున్నాను.

    "అదిగో  ఆ నవ్వే, ఆ మందహాసమే  నిన్నీ  అర్ధంకాని  మహా సమస్యగా  చేసి మమ్మల్ని  గంద్రగోళ పరుస్తోంది. మా గుండెల్ని  కోస్తుంది."

    నేను తిరిగి ఏమీ అనకముందే  "చూడూ !" అంటూ  సోఫాలోంచి  లేచి, మెరుపులా  నా ప్రక్కకు  వచ్చి  కూర్చుంది. దగ్గరగా, నన్ను  తాకుతూ  కూర్చుంది.

    "హటాత్తుగా  దీపం  వెలిగి, కళ్ళు  చెదిరినట్లయి  ఎదురుగా  నువ్వు కనిపించగానే  ఏమని అడగాలనిపించిందో  తెలుసా ? నువ్వు వచ్చావని  వెలుగు వచ్చిందా ? లేక వెలుగుతో  నువ్వు ప్రకాశించావా?' అని. అడిగితే ఏం సమాధానం  చెప్పేవాడివి ?"

    "నేను వెలుగునుకాను. వొట్టి చీకటిని!" అని సమాధానం  చెప్పేవాణ్ని.

    "అవును, నువ్వు  చీకటివే" అంది మృదుల. "ఆ చీకటి  గర్భాన్ని  నిర్ధాక్షిణ్యంగా  కోసి, లోపల  చూస్తే  రేడియమ్ ని మించిన  కాంతి"

    నవ్వేశాను.

    "అదిగో ఆ నవ్వే" అంది మృదుల  తిరిగి. "ఎందుకు బాబూ! నవ్వుతావు ! ఓ డాక్టర్ మహాశయా ! సూర్యకాంతికి  తళతళలాడే  నీటి బిందువులో  ఎంత  స్వచ్చత  వుందో ,నీ మనోహరమైన  చిరునవ్వులో  అంతటి స్వచ్చతా, ఆకర్షణా వున్నాయి. చూడూ ! ఎందుకు వచ్చావో, నీకేం బుద్ధి పుట్టిందో, ఏ దేముడు నిన్నిక్కడికి  పంపాడో  యివాళ యీ స్నేహితురాలిపై  దయతలచి, వరమిచ్చిన దేవుడిలా, జాలితలచిన  చక్రవర్తిలా యిక్కడకు  దయచేశావు. మా గృహం పావనం  చేశావు. నా జన్మ పునీతమైనట్టే  భావిస్తున్నాను. ఈ శుభసమయంలో  ఒక ప్రశ్న  అడగాలని  కుతూహలం. ఏం ? అడిగేదీ ?"

    "అడుగు"

    "మృదుల తన చేతితో  నా క్రాఫింగు  సవరించి, జుట్టును  అటూ యిటూ, ముఖం మీదకు  పడవేసి  "ఏం అడిగేదీ?" అని నవ్వింది.

    ఆ సమయంలో  ఆమె నాకెంత  దగ్గరగా  వుంది! తన సర్వస్వాన్నీ  దోసిట పట్టి, ఆ దోసిలిలో  హారతి వుంచి, నా కళ్ళచుట్టు త్రిప్పినట్లయింది.

    ఎక్కడినుంచో  మృదు సుగంధం  వీస్తున్నట్లయింది.

    ఆమె చేతిని  మెల్లిగా  విడదీసి "మరీ చిలిపిగా, చిన్నపిల్లలా  ప్రవర్తించకు ! అడుగు. ఏమడుగుతావో" అన్నాను.

    "ఎప్పుడూ నీ చదువు, వంటరితనం, రోగులు, జబ్బులు_యిదే  నీ జీవితం. ఇదే నీ జీవిత పరమావధి. ఇదే నీకు  శాశ్వతానందం. ఈ దశలో  నిన్నెవరైనా  ఓ సుందరి, అమాయకురాలైన ఆడపిల్ల సంపన్నురాలైన ఓ అభమూ శుభమూ  తెలియని  సుకుమారి 'ఓయి జడుడా! కొంచెం నీలోని బండరాయిని బ్రద్దలుకొట్టి  ఆలోచించు. వెన్నెలనీ, పరిమళాన్నీ  కూడా  నీ హృదయంలో  నింపుకో. నీకోసం  యిన్నాళ్ళు  వెయ్యికళ్ళతో  వేచివున్నాను. నిగ్రహంతో, సహనంతో  సర్వం  నీకు ధారపోయటానికి  సిద్ధంగా  వున్న రాకుమారిని. నన్ను....నన్ను.... నన్ను....పరిగ్రహించవా' అని అడిగితే  ఏమంటావు ?"

    రుద్దకంఠంతో, వణుకుతూన్న  గొంతుకతో  అని, అర్ద్రనయనాలతో  నావంక  తిలకిస్తూ, ఆవేశాన్నణుచుకుంటూన్నట్లు  కనిపించింది  మృదుల.

    నేను గుండెను  రాయిచేసుకున్నాను .మృదుల  కళ్ళతో నా కళ్ళు కలిశాయి. "ఓ రాకుమారీ! నీ ప్రేమకు, నీ అనురాగానికి, నీ దయకు కృతజ్ఞుణ్ని. కాని నేను అధముణ్ణి. నీకు సమ ఉజ్జీని కాదు. ఏడంతస్తులమేడ మీద  సుకుమారంగా  విహరించే బంగారు పిచ్చిపిల్లవు  నీవు. కటిక  నేలలో, కష్టంగా, దుమ్ములో  శ్రమపడే  శ్రామికుణ్ణి  నేను. ఇంత  కరుణ  నీకు తగదు. ఆ కరుణ  కిరణాలు  నా మీద  ప్రసరింపబడే  యోగ్యత  అర్హత  నాకు లేవు అంటాను."

    మృదుల  నాకు మరింత  దగ్గరగా  జరిగింది. "అవన్నీ  నా కిష్టమే నోయ్! ఓ ప్రబుద్దుడా ! నిరంతరం  శ్రామికుడా ! అవన్నీ  తెలిసే  నేను నా సర్వస్వం  నీ కప్పగించడానికి  సిద్ధపడింది. అని ఆమె అంటే ?"

    "అందుకు  కూడా  అవాంతరం  వుంది  రాకుమారీ!" అని ఆ నిర్భాగ్యుడు వినమ్రవదనుడై  విజ్ఞాపక  చేసుకుంటాడు."

    "ఏమిటా విజ్ఞాపన. చెప్పండి. చెప్పు మహారాజా' అంటుంది...."

    "నేను ఉద్యోగిగా  నియమించబడి, ముందు  ముందు  పై చదువులు చదవాలన్న  అభిలాషతో  విదేశాలకు  పోతున్నాను. సర్వం  సిద్ధమైపోయింది. అన్ని సన్నాహాలూ  పూర్తయిపోయాయి. విమానంలో  కాలు పెట్టటానికి  యింకా  కొద్ది రోజులే  వ్యవధి  అని ఆ.....!"

    మృదుల హఠాత్తుగా  నాకు దూరంగా  జరిగి  ఎర్రబడ్డ  ముఖంతో  నా వంక చూసింది, కళ్ళలో రక్తిమ. పెదవులు వొణుకుతున్నాయి.         

    "నువ్వు....నువ్వు నిజంగానే  విదేశాలకు  వెళుతున్నావా మధూ! నువ్వు చెప్పేది నిజమేనా ?"

    "అవును. అందులో  ప్రతి అక్షరమూ  నిజమే మృదులా !"

    "ఎప్పుడు చేశావు  యీ ప్రయత్నమంతా? సరదాకి  అంటున్నావనుకున్నాగాని  యింత తీవ్రంగా ,సీరియస్ గా ఆలోచిస్తావనుకోలేదు. అనుకోక పోవడంలో  నా స్వార్ధంకూడా  వుందేమో! ఆ విషయం  గురించి  నేనాలోచిస్తే  నిజం తెలుస్తుందని, భయపడి  ఎప్పటి కప్పుడా  యోచనను  మనసులో  నుంచి దూరంగా  బయటకు నెట్టివేస్తూ  వచ్చానేమో !"

    "ఈ విషయం  గురించి  నేను సమయం  వచ్చినప్పుడల్లా  సూచిస్తూనే  వున్నాను మృదులా! ఇహ ప్రయత్నమంటావా ? హౌస్ సర్జన్ గా అడుగుపెట్టిన  మరుక్షణం  నుంచి  అదే ధ్యాస  నాకు. ఎన్నో ఉత్తరాలు, ఎందరెందరికో  రాశాను. నేననుకున్నది  సాధించగలిగాను."

    "ఒక్కగా నొక్క  బిడ్డవు  మీ అమ్మకు నీవు." అంది మృదుల నా వంక తీక్షణంగా  చూస్తూ. "ఒక్క బిడ్డవు. చిన్నతనంలోనే  తండ్రిని కోల్పోయిన  నీకు  ఆస్తంతా  అమ్మి  అష్టకష్టాలు  పడి  చదువు చెప్పించింది. అటువంటి కన్నతల్లిని  ఈనాడు  రెక్క  లొచ్చాయిగదా  అని ఆమె కర్మకు  ఆమెను  విడిచిపెట్టి  నువ్వెక్కడికో  ఎగిరిపోదామని  చూస్తున్నావా ? నీకు హృదయం  వుందా ?"

    ఈ నింద  కూడా భరించి  జేబులోంచి  ఒక ఉత్తరం  తీసి ఆమెకిచ్చాను.
   
    "బాబూ !

 Previous Page Next Page