ఆ కారుని చూడగానే టీపాయ్ మీదున్న రిమోట్ కంట్రోలర్ ని తీసి బటన్ ప్రెస్ చేశాడు.
గేటు నెమ్మదిగా తెరుచుకోవడం, నల్లటికారు లోపలికి రాగానే గేటు మూసుకోవడం ఆటోమేటిగ్గా జరిగిపోయింది.
కారులోని వ్యక్తిని చూడగానే "కమాన్ కామినీ డాళింగ్..." అని ఉత్సాహంగా పిలిచాడు.
కొద్దిక్షణాల క్రితం వరకూ అసహనంగా వున్న అతనిలో ఆకస్మికంగా ఉత్సాహం ప్రవేశించింది.
"హల్లో ఫణీ.... డాళింగ్.... సారీ యార్... ఎంగేజ్ మెంట్స్ అన్నీ తెముల్చుకొని వచ్చేసరికి ఈ టైమయింది" అంటూ అతని మీసాల్ని పట్టుకుని లాగి, గ్లాసునందుకొని డ్రింకును గడగడా తాగేసి "హమ్మయ్య- అయామ్ టైర్డ్" అని అంది.
ఫణివర్మ ఎరుపెక్కిన నిషాకళ్ళతో, ఎగిసిపడుతున్న ఆమె గుండె పొంగుల వైపు చూస్తున్నాడు.
"కమాన్ డార్లింగ్... లోపలికి పోదాం పద. బోరుకోట్టి చచ్చిపోతున్నా. మరి నేనింక ఆగలేదు..." అంటూ లేచి నిలబడ్డాడు ఫణివర్మ.
"నేనివాళ నువ్వాగలేనంత అందంగా వున్నానా" ఒళ్ళు విరుచుకుంటూ అంది కామిని కవ్విస్తున్నట్లుగా.
"నువ్వెప్పుడూ నేను ఆగలేనంత అందంగానే వుంటావు... కమాన్..." అంటూ ఆమె భుజంమ్మీద చెయ్యి వేశాడతను.
"అబ్బా! ఏమిటా తొందర డియర్, కాస్త నన్ను వూపిరి తీసుకోనీ" కసిగా నవ్వింది కామిని.
"లోనికి రమ్మంటున్నది... ఆనందపు అంచులు చూడటానికి కాదు డార్లింగ్... టుడే.... మేజ్.... మోస్ట్ ఇంపార్టెంట్ డే ఫర్ మీ- అందుకే..."
"ఏమిటో... నాకు తెలీని అంత ఇంపార్టెంట్ డే?"
"చెప్తా రా..." అంటూ లోనికి నడిచాడు ఫణివర్మ- మత్తుగా నవ్వుతూ, వయ్యారంగా ముందుకు నడిచింది కామిని.
"మనిద్దరికీ పరిచయమై ఇవాల్టికి సంవత్సరమైంది. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఫణిదాస్ గురించి నీకు తెలియదు" అన్నాడతను.
"ఫణిదాస్... అతనెవరూ?" అడిగింది కామిని.
చెబుతానన్నట్లుగా తలూపి సిగరెట్ యాష్ ట్రేలో పడేసి "నేనే ఫణిదాస్" ని అన్నాడు చాలా క్యాజువల్ గా.
అతడివైపు అర్థంకానట్లు చూసింది కామిని.
సంవత్సరం క్రితం ఓ కంపెనీ నుండి సెక్రటరీగా వచ్చిన తనకు మూడురెట్లు ఎక్కువ జీతం ఆఫర్ చేసి, తన సెక్రటరీగా నియమించుకున్న ఫణివర్మ, ఇప్పుడు ఎ రాపిడ్ గ్రోత్ ఇండస్ట్రియలిస్ట్!
తను ఫణిదాస్ నని అంటున్నాడేమిటా అని ఆశ్చర్యపోయింది ఆమె.
"వింటావా నా స్టోరీ. పదేళ్ళ క్రితం నేనొక ట్రేడ్ మిల్ లో గుమాస్తాగా చేరాను. నాలాగే జీవితం ప్రారంభించినవాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది వుండొచ్చు. కానీ చాలామంది మాత్రం అక్కడితో ఆగిపోయి వుంటారని నా నమ్మకం.
ఎందుకంటే, నేను ఎదిగి, ఈ స్థాయికొచ్చిన విషయం నాకు బాగా తెల్సు కాబట్టి. ఆ స్థాయికి రావటానికి నేను పడిన కష్టాలు, నేను వేసిన ఎత్తుగడలు వారు వేసి వుండకపోవచ్చు.
చిన్నతనం నుంచి పేదరికంలో మగ్గిన నేను, రెండుపూటలా కడుపు నింపే గుమాస్తా ఉద్యోగంతో తృప్తిపడలేదు. కాలంతోపాటు వేగంగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో దానికోసం కృషి చేశాను. నన్ను నమ్మిన వాళ్లను మోసగించాను.
కానీ నేను నమ్మినవాడు మోసగిస్తే నిర్దాక్షిణ్యంగా నలిపేశాను.
లక్కీగా నాకొక స్టాక్ బ్రోకర్ తో పరిచయం ఏర్పడింది. అదే ఈనాటి నా స్థానానికి ఆరంభపు మెట్టు. మేమిద్దరం కలిసి ఓ నాలుగు నాసిరకం కంపెనీ షేర్లను గుప్పెట్లో పెట్టుకొని క్రమక్రమంగా వాటి ధరలను పెంచుతూ వచ్చాం.
పత్రికల్లో చూసి, స్పెక్యులేషన్ చేసి, గుడ్డిగా కొనేసే జనం మేమిద్దరం పన్నిన వలలో చాలా తేలిగ్గా చిక్కారు. రెండేళ్ళు తిరక్కుండానే లక్షలకు లక్షలు కళ్ళ చూశాం.
నాకన్నా డబ్బూ, తెలివి ఎక్కువగా పెట్టుబడి పెట్టిన ఆ స్టాక్ బ్రోకర్ తో ఎంతకాలం వున్నా చిన్న వాటా తప్ప వొరిగేదేమీ లేదని గ్రహించాను.
అతనికి వ్యాపారదృష్టి తప్ప క్రిమినల్ మైండ్ లేకపోవడంతో అతని అడ్డు తొలగించుకోవడం నాకు పెద్దగా శ్రమ అనిపించలేదు.
ఆరోజుతో ఆ స్టాక్ బ్రోకర్ తోపాటు ఫణిదాస్ కూడా చనిపోయాడు. ఇప్పుడు నేను టాప్ లిస్ట్ పారిశ్రామిక వేత్తల్లో ఒకడిని. ఫణివర్మను" అంటూ గర్వంగా నవ్వాడతను.
బయటి ప్రపంచానికి రాజఠీవితో కనిపిస్తూ తనతో రహస్య ప్రణయం సాగించే ఫణివర్మ చీకటి జీవితం గురించి తెలిసేసరికి... కామినీకి మతిపోయింది. స్కాచ్ సిప్ చేసి, రింగులు రింగులుగా సిగరెట్ పొగ వదులుతున్న అతనివైపు భ్రాంతిగా చూస్తూండిపోయిందామె.
కొద్దిక్షణాలు నిశ్శబ్దంగా గడిచాక- "మరి ఈ రోజు విశేషమేమిటో చెప్పలేదుగా?" అంది కామిని కుతూహలంగా.
"చెప్తాను... ఓ విచిత్రమైన వీలునామా రాసి, ఈ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచి, మరణించిన వ్యక్తి గురించి నువ్వు విన్నావనుకొంటాను" ఆమెకు ఎదురుగా కూర్చుంటూ అడిగాడతను.
కాసేపు ఆలోచించిందామె. ఆ తరువాత సడెన్ గా అందామె. "ఎస్! నువ్వే ఎప్పుడో చెప్పినట్లు గుర్తు. గుర్తొచ్చింది.... విశ్వాత్మ... ది గ్రేట్ ప్రాక్టికల్ జోకర్" అంటూ గలగలా నవ్వింది కామిని.
"ఎస్.... కానిమీ... ఎస్ యూ ఆర్ సెంట్ పర్సెంట్ కరెక్ట్.... అయామ్ ఏ పూర్... అండ్ గ్రేట్ ప్రాక్టికల్ జోకర్" అన్నాడతను పెద్దగా నవ్వుతూ.
టక్కున నవ్వాపేసింది కామిని- ఆశ్చర్యంతో.
"ఎగ్జాట్లీ- ఆ విశ్వాత్మను నేనే" అన్నాడు ఫణివర్మ చాలా ప్రశాంతంగా, ధీమాగా.
కొద్ది క్షణాలు ఆమెకేం అర్థంకాలేదు.
అది నిజమా? ఎత్తుగడా? ఆమె అలా అతనికేసే చూస్తూ దిమ్మెరపోయింది.
"వాడ్డూయూ మీన్ ఫణీ...నీకసలు మతిపోలేదు కదా?" ఊహ కందని విషయం విన్నట్లు దాదాపు అరిచినంత పనిచేసింది కామిని.
"ఇటీజ్ ట్రూ కామినీ. నేనే ఆ విశ్వాత్మను. ఎందుకంటే... నా వ్యూహం సరిగ్గా అమలు జరిగితే నేను మూడో జన్మ ఎత్తుతాను కాబట్టి" మరింత తీక్షణంగా, సాలోచనగా అన్నాడు ఫణివర్మ.