Previous Page Next Page 
వ్యూహం పేజి 39


    "అంటే- ఇందాక నేను సెక్యూరిటీ దగ్గర వున్నప్పుడే ఆ కారులోంచి ఓ అమ్మాయి దిగి, లోనికెళ్ళడం, మీరు బాడితోపాటు ఐస్ అప్పగించేసి చూడ్డం- మైమరచిపోవడం చూసాన్లెండి" వంపంటి వెనుక నవ్వును దాచుకుంటూ అంది మహిత.

 

    "చూసారా... చూసేసారా... అంటే... ఆ అమ్మాయివేపు నేను అసలు చూడలేదండీ... కారు కలర్ వేపే చూసానండీ... నిజం... ఛైర్మెన్ మా మావా వెంకట నారాయణ మీదొట్టు" కంగారు కంగారుగా అనేసాడు శక్తి.

 

    "ఇంతోటి దానికి ఆయన మీద ఒట్టెందుకులెండి. పెద్దాయన... అవును గానీ... నిన్న రాత్రి మీరుగానీ స్వప్నా థియేటర్ కు వచ్చారా" ముందుకు నడుస్తూ అడిగింది మహిత.

 

    అమ్మ మహితా- నిన్న సిన్మా హాల్లో నన్ను చూసేసేవన్న మాట. ఇప్పుడెలా...

 

    "మీరనవసరంగా మాట మార్చేస్తున్నారు. జీనియస్ పీపుల్ ఒక ప్రశ్న వేస్తారు. ఒకే జవాబు అడుగుతారు... మీరేంటి ఒకేసారి... ఫోరో, ఫైవో క్వశ్చన్ లు అడుగుతారు? నాకు కలర్స్ ఇష్టమా లేదా అనడిగారు మీరు. అవునా? నాకు కలర్స్ ఇష్టం. ఎందుకిష్టమో తెల్సా? నాకు సంజయ్ గాంధి ఇష్టం కాబట్టి."

 

    ఇద్దరూ కేంటిన్లోకి అడుగుపెట్టారు.

 

    "ఆయనెందుకు మధ్యన" శక్తి విషయం అంతుపట్టడం లేదు మహితకు.

 

    "మీరు మాజా తాగుతారు గదా... నే తెస్తాను. మీరు కూర్చోండి" మరో ప్రశ్న.

 

    మహిత అడక్కుండా గబగబా ముందుకెళ్ళిపోయాడు శక్తి.

 

    రెండు మాజా తెచ్చి ముందు పెట్టాడు.

 

    "నిన్న యూనిటీలో సర్కిల్ లో..."

 

    "ముందు మాజా తాగండి. కూల్ గా లేకపోతే  తాగలేం" తొందర పెట్టేసాడు శక్తి.

 

    కూల్ డ్రింక్ తాగేసి...

 

    "నిన్న స్వప్నా థియేటర్ కు వచ్చారా మీరు..." అడిగింది మళ్ళీ.

 

    "స్వప్నా థియేటర్ కా? ఎవర్ని చూసి ఎవరనుకున్నారో ఏమో? మనిషిని పోలిన మనుషులు, ప్రతి ఒక్కడికీ ఏడుగురుంటారట. ఎక్కడో చదివాను. నన్ను వదిలేయండి..." ఇబ్బందిగా ముఖంపెట్టి అన్నాడు శక్తి.

 

    "మర్చిపోయాను. ఛైర్మెన్ గారింటి కెళతానన్నారు గదా... ఏమయింది మీ ఎపాయింట్ మెంట్?"

 

    "అవుతుంది. రెండు మూడు రోజుల్లో అవుతుంది" గంభీరంగా ముఖంపెట్టి అన్నాడు శక్తి.

 

    "మీ బేబీగారితో మాట్లాడారా?"

 

    ఆ ప్రశ్నకు విసుక్కున్నాడు. భగవాన్... నన్నీ ఆడ భగవాన్ బారి నుంచి రక్షించు బాబోయ్... అని మనసా, వాచా, కర్మణా దేవుడ్ని ప్రార్థించి-

 

    "అది ఊటికెళ్ళింది..." ఫాన్ వేపు చూస్తూ జవాబు చెప్పేసాడు శక్తి.

 

    "అది... అదా... అదంటే?"

 

    "అదంటే... అదే... మా బేబీ"

 

    "ఆడపిల్లను అదీ ఇదీ అని ఎవరూ అనరు. అసలలా అనొచ్చా" అంది.

 

    "నేనంటాను. మా మేనమామ కూతుర్ని నేను అదంటాను... ఇదంటాను. నేనలా పిలవడమే దానికిష్టం. నిన్న అది ఇంట్లో లేదు- ఊటికెళ్ళిందట. దాని ఫోటో కూడా ఇంట్లో కనబడలేదు. ఏవండీ మహితగారూ! మా బేబీ ఈ ఆఫీసులో ఎక్కడుందో మీరు నాకు కొంచెం కనుక్కొని చెప్పాలండీ! అలా మీరు చెప్పిన పక్షంలో నా ఆస్థిలో మీకు టెన్ పర్సెంట్, అంటే పదిశాతం ఇచ్చేస్తాను."

 

    అలా అంటున్న శక్తి ముఖంలోకి చూసింది మహిత విస్మయంగా.

 

    "మీ ఆస్థి వివరాలు నాకెప్పుడూ మీరు చెప్పలేదు-"

 

    "చెప్పలేదా? చెపుతాను వినండి. వి.వి.ఎన్. ఎస్టేట్స్... అంటే ఈ ఎస్టేట్స్ ఎవరిదనుకున్నారు నాదే... మా మావా, మా అమ్మతో ఎప్పుడో చెప్పాడు. పెద్దయ్యాక బేబీని నాకిచ్చి చేస్తానని, ఆస్తంతా రాసిచ్చేస్తానని."

 

    ఆ మాటకు పెద్దగా నవ్వింది మహిత.

 

    "ఏవలా నవ్వుతున్నారు?" అడిగాడు కోపంగా శక్తి.

 

    "ఆస్థి ఇంకా మీ చేతిలో రాలేదు... అప్పుడే వాగ్ధానాలు మొదలెట్టేసారని..."

 

    "మీ టెన్ పర్సెంట్ మీ క్కావాలంటే నాకా హెల్ప్ చేయండి. అదీ కాకుండా, ఈ ఆఫీసులోకి రాగానే, మీతో పరిచయం అయ్యింది కాబట్టి, మీరు మంచి లేడిలా కనిపిస్తున్నారు కాబట్టి... మీ సెక్షన్ కి మిమ్మల్ని హెడ్ ని చేస్తాను. భగవాన్ గాడితో కూడా అదే చెప్పాను... వాడు కూడా మంచివాడే. కానీ వాడిక్కూడా మీలాగే తలతిక్క ప్రశ్నలు... నేను జవాబు చెప్పడానికి ఇబ్బంది పడే ప్రశ్నలు వెయ్యడం సరదా. ఆ సరదా తగ్గించుకుంటే మీకు నేను హెల్ప్ చెయ్యడం ఖాయం" ఆ మాటలంటున్న శక్తివేపు అలా తల మోచేతి మీద పెట్టుకుని చూస్తూ ఉండిపోయింది మహిత.

 

    "మీరు మాంచమ్మాయిలా కనిపిస్తున్నారు కాబట్టి, మీతో మాట్లాడుతున్నాను నేను. అసలు మావూళ్ళో అడగండి మీరు. ఏ అమ్మాయితోనైనా అస్సలు ఎప్పుడయినా మాట్లాడేనేమోనని- అంత స్ట్రిక్టు. నాకు అడపా దడపా హెల్ప్ చేసారనుకోండి మీకే మంచిది. ఒక్క మూణ్ణెళ్ళు ఆగండి- అప్పుడు- అప్పుడు మీరే నా చుట్టూ తిరుగుతారు తెలుసా?" ఆగి పక్కనున్న గ్లాసుడు మంచినీళ్ళు తాగాడు.

 

    మూణ్ణెళ్ళ తరువాతేమవుతుంది?"

 

    "నేను ఎం.డీ. నవుతాను. నిన్నరాత్రి మీ ఛైర్మెన్- అంటే మా మేనమామ స్వయంగా చెప్పాడు- ఇప్పుడున్న ఓల్డ్ ఎండీ.ని ఇంటికి పంపేసి-"

 

    దూరంగా ఇంకేదో వైట్ కలర్ మారుతీ కారు ఆగడం, అందులోంచి ఇంకో అమ్మాయి దిగి, లోనికెళ్ళటాన్ని గుడ్లప్పగించి చూస్తూ అన్నాడు శక్తి.

 

    "ఇప్పుడున్న ఎం.డీ. ఓల్డ్ ఎండీనా? అంటే ఏజ్ డ్ ఎం.డి.- అనా మీ ఉద్దేశ్యం-"

 

    "అవును... మా వెంకటనారాయణ మావే చెప్పాడు."

 

    "ఇప్పుడున్నాయన వయసు- ముప్పై అయిదేళ్ళుంటాయి- కుర్రాడు- నాకు తెలుసు."

 

    "మీకు తెలుసా-" అటూ, ఇటూ చూసి-

 

    "మహితగారూ... మీకు ప్రతి విషయం విడమర్చి చెప్పాలి- ఓల్డ్ అంటే... ఏజ్ లోనా... ఏజ్ లో కాదండీ బాబూ... ఆలోచనల్లో... ఆలోచనల్లో.. ముసలితనం ఉండకూడదు... కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు."

 

    "ఇవాళ... మన ఫోటోల ప్రోగ్రాం పెట్టుకుందామా-" లేస్తూ అడిగింది మహిత.

 Previous Page Next Page