Previous Page Next Page 
ముగ్ధ పేజి 40

   

   "విశాలాక్షిగారు రాలేదు. విశాలాక్షిగారు అనుకొని ఇందాక మీరు నన్నే గసురుకున్నారు" చెప్పింది సురభి.
    
    "సారీ... సురభి... నా మూడ్స్ తెలీవు. ఈ గది నా మెదడు లాంటిది.
    
    ఏ చిన్న శబ్దాన్ని గాని, ఈ గది, నా మెదడూ రెండూ భరించలేవు. అయినా ఏదో అలజడి కారణం లేని అలజడి. అస్ఫష్టపు అలజడి ఈ అలజడికి కారణం ఏమైవుంటుందో నువ్వయినా చెప్పు సురభి నాకు ఏకాంతం కుదరడంలేదు సురభీ."
    
    అంత పెద్ద సైంటిస్ట్, చిన్న పిల్లాడిలా అన్నాడు.
    
    "మీ అలజడికి నేనెలా కారణం చెప్పగలను సర్."
    
    "చాలామంది ఆరోగ్యంగా బయటకు కన్పించినా, వాళ్ళలో ఎక్కువ మంది వ్యాధిగ్రస్తులు, ఆ వ్యాధిగ్రస్తుల్ని డాక్టర్లు మాత్రమే గుర్తించగలరు. అలాగే నువ్వు."
    
    శ్రీధర్ కి తనమీద నమ్మకం కలిగినందుకు చాలా ఆనందించింది సురభి.
    
    "గ్రిగేరియన్ నెస్, ఇండివిడ్యువేషన్-ఈ రెంటిమధ్య మీరు కొట్టుమిట్టాడు తున్నారేమోనని నా అనుమానం సర్... యోమై కరెక్ట్."
    
    "కావచ్చేమో కానీ ఎలా."
    
    "చిన్నప్పటినుంచీ ఏకాంతాన్ని కోరుకునే తరహా మీది అవునా జనసమూహానికి మీ అంతరంగానికీ మధ్య ఎప్పుడూ అంతులేని ఏకాంతం. అవునా, ఏకాంతంలోంచి ఏకాంతం పుట్టినట్టుగా, మీ ఏకాంతంలోంచి పుట్టింది మీ పరిశోధన దానికి అడ్డంకుగా మీ కుటుంబ పరిస్థితులు వున్నాయని మానసికంగా మీరు దృఢమైన అభిప్రాయానికి రావడంవల్లే, ఆ అలజడి అని నేననుకుంటున్నాను సర్."
    
    "వండ్రఫుల్ సురభీ." చిన్న పిల్లాడులా చప్పట్లుకొట్టి, "ఫ్రాయిడ్ లా ఎంత చక్కగా ఎనలైజ్ చేసావు పిల్లా" అన్నాడు హుషారుగా ఆ ఒక్క తృటికాలంలో మెరిసిన ఆ హుషారు జీవితంలో ఎప్పుడూ, శారీరకంగా, మానసికంగా అనుభవించలేదు శ్రీధర్. ఆ విషయం అయన మనసుకు బాగా తెలుసు.
    
    "పిల్లా అన్నందుకు కోపం వచ్చిందా..." మళ్ళీ అన్నాడు శ్రీధర్.
    
    "యూ ఆర్ ఏ నొస్టోరియన్ సర్ మీకు నేనేం చెప్పగలను" నవ్వుతూ జవ్వాబిచ్చింది సురభి.
    
    "నొస్టోరియన్ నిజమే కానీ నా అనుభవం, నా పరిశోధన, నా మానసిక సంఘర్షణకు గురై పేలవం అయిపోతాయని, నేను పిచ్చివాడినై పోతానేమోనని భయంగా వుంది సురభీ."
    
    ఏదో అలికిడి అయితే చప్పున తలతిప్పి చూసింది సురభి.
    
    బాయ్ నిలబడి వున్నాడు.
    
    "వెళ్తున్నాను సర్." చెప్పాడు వినయంగా.
    
    "వాచ్ మెన్ వచ్చాడా" అడిగాడు శ్రీధర్.
    
    "వాచ్ మెన్ వచ్చాడు సర్ తేజా సార్ వెళ్ళిపోయారు సర్."
    
    తేజ శ్రీధర్ అసిస్టెంటు.
    
    "అయితే, వెళ్ళిపో."
    
    ఆ మాట అనగానే బోయ వెళ్లిపోయాడు.
    
    "న్యూనతా భావంతో అలా కుంగిపోవడమే, ఓడిపోవడం మీరు అనుకున్నది సాధిస్తారు ఇంతకీ మీ పరిశోధన దేని గురించి సర్?"
    
    శ్రీధర్ ని తన ప్రయోగానికి అనుకూలంగా మలచుకోవాలంటే, ముందు ఆయన చేస్తున్న ప్రయోగపు పూర్తి వివరాలు తెలియాలి.
    
    "మెడికల్ రేడియేషన్."
    
    ఆ పదమే కొత్తగా వుంది సురభికి.
    
    "అంటే."
    
    "నా అసిస్టెంట్ తేజకు, నాకూ తప్ప ఇంతవరకూ నేనేం చేస్తున్నానో, ఏమిటో ఎవరికీ తెలీదు. ఎందుకంటే, రహస్యంగా వుంచదలచుకున్నాను కాబట్టి."
    
    రోజురోజుకీ ప్రపంచంలో ఎన్నో జబ్బులు ఎక్కువైపోతున్నాయి.
    
    కొత్తకొత్త జబ్బులు పుడుతున్న కొలదీ, కొత్త కొత్త మందులు పుడుతున్నాయి. మందుల్లేని జబ్బులు కూడా వున్నాయి. మామూలు అనారోగ్యం దగ్గర్నించి, పెద్ద జబ్బులవరకూ ఇవ్వాళ డాక్టర్లు పేషెంట్లకు ఎక్స్ -రే మొట్టమొదట తీయిస్తున్నారు. ఎక్స్ రే తీసుకుంటే, శరీరంలోని వ్యాధిని గుర్తించవచ్చని, వెంటనే దానిని నివారించ వచ్చని డాక్టర్లు అభిప్రాయ పడుతున్నారు. అది తప్పు మాటిమాటికి జబ్బుని గుర్తించడానికి ఒక మనిషికి ఎక్స్-రే తీయడంవల్ల, అవసరం వున్నా, లేకపోయినా మనిషికి ఎక్స్-రే తీయడంవల్ల కొత్త జబ్బులొస్తున్నాయని ఎందరికి తెలుసు? ఇవాళ కేన్సర్ తదితరమైన భయంకర వ్యాధులు రావడానికి కారణం 'ఎక్స్-రే'."
    
    ఆశ్చర్యంగా వింటోంది సురభి.
    
    "ఓ అణురియాక్టర్ నుంచి ప్రమాదవశాత్తూ రేడియేషన్ బయటకు వెలువడితే ఏమవుతుందో మనకు తెలుసు. ఒక మోతాదుకు మించి రేడియేషన్ సోకితే దాని స్థాయినిబట్టి, ఆ మనిషి అనతికాలంలోనే మరణించడానికి ఆస్కారం వుంది. రక్తంలోని తెల్లకణాల సంఖ్య శరవేగంతో పడిపోయి, దారుణ శారీరక బాధలు అనుభవించొచ్చు. లుకేమియా, ధైరాయిడ్, కాన్సర్ వంటి భయంకర వ్యాధులు సోకవచ్చు. ఆ వ్యక్తికి పుట్టబోయే పిల్లలుకూడా వారసత్వంగా రేడియేషన్ కి (ఎక్స్ రే తీసే సమయంలో వెలువడే విద్యుత్ కాంతి) గురై వికలాంగులుగా, ఆకారం లేకుండా పుట్టడానికి అవకాశం వుంది. ఇంతటి ప్రమాదాన్ని సృష్టించగల రేడియేషన్ ను విడుదలచేసే అణు రియాక్టర్లు ఎక్కడో కాదు. మన చుట్టూ, మన వూరిలోనే వున్నాయని, మనకి తెలియకుండానే ఆ రేడియేషన్ ప్రభావానికి లోనవుతున్నామని తెలిస్తే ఒళ్ళు జలదరించకుండా వుంటుందా?
    
    ఇవి మామూలు అణురియాక్టర్లు కాకపోయినా, అణురియాక్టర్ల అంతటి ప్రమాదాన్ని సృష్టిస్తాయి. ఈ అపర అణురియాక్టర్లు ఏమిటో తెల్సా....రేడియాలజీ సెంటర్లు.
    
    కాగా డాక్టర్లు ఎక్స్ రే తీయించమనగానే, చాలామంది ఎక్స్ రే తీసుకుంటారు. ఈ ఎక్స్ రే వల్ల రేడియేషన్ సోకి ప్రతి సంవత్సరం ఎంతోమంది చస్తున్నారు. ప్రతి లక్షా అరవైవేల కేన్సర్ కేసుల్లో, దాదాపు వంద నుంచి రెండువందల ఇరవైవరకూ అనవసరమైన ఎక్స్ రేల వల్ల వస్తున్నాయని నా వాదన ఎక్స్-రేల్ని ఎక్కువగా తీసుకున్న పేషెంట్లలో వివిధ రకాల చర్మవాద్యులు, బుద్దిమాంద్యం వస్తాయి.
    
    ఈ విషయంలో నేను రాయల్ కాలేజి ఆఫ్ రేడియోజిస్టులకు ఒక పేపర్ సబ్ మిట్ చేసాను నా ఒపీనియన్ వాళ్ళు ఒప్పుకున్నాకే, నా పరిశోధనకు, స్కాలర్షిప్, గ్రాంట్ చేశారు.
    
    ఇందులో ఇంకొ విచిత్రం డాక్టర్లుకూడా నమ్మలేని విషయం ఏమిటో తెలుసా వ్యాదుల్ని కనుక్కోడానికి ఉపయోగించే ఎక్స్ రే వల్ల వ్యాధులు రావడం ఏమిటని, ఎంతోమంది డాక్టర్లు, సెమినార్లలో నాతో వాదించారు?
    
    నేను బతికుండగానే అతి ప్రమాదకారి అయిన ఈ ఎక్స్ రే ను మనిషి జీవితంలోంచి తొలగిస్తానని ఆనాడే నేను శపధం చేసాను. నా పరిశోధనలో నేను ఇప్పటివరకూ ఇరవై అయిదు శాతమే కృతకృత్యున్నయ్యాను. ఇక ఏం జరుగుతుందో చూద్దాం." చెప్పడం ఆపాడు శ్రీధర్.

 Previous Page Next Page