Previous Page Next Page 
ముగ్ధ పేజి 39

  

    అంతవరకూ ఆఫీసురూంలో తన పనిచేసుకుంటున్నట్టుగా నటించిన వార్డెన్ అరవింద్, నీలిమల సంభాషణంతా విన్న వెంటనే రిసీవర్ని చేతిలోకి తీసుకుని ఓ నెంబర్ కి డయల్ చేసింది.
    
    "రామ్ హియర్."
    
    "నేనే ఆంటీని."
    
    "వాట్ ఆంటీ ఏవైనా కొత్త న్యూస్ తెల్సిందా" ఆసక్తిగా అడిగాడు రామ్.
    
    "ఇప్పుడే హైదరాబాద్ నుండి అరవింద్ ఫోన్ చేసాడు. బహుశా ఈ నెల పదహారుకి నీలిమ హైదరాబాద్ వెళ్ళొచ్చు అదీ న్యూస్."
    
    "ఓ.కే. ఆంటీ థాంక్యూ ఫర్ యువర్ కొపరేషన్ ఎప్పుడే కొత్త న్యూస్ వచ్చినా ఫోన్ చేయండి ఆంటీ. మర్చిపోరు కదూ."
    
    "అలాగేలే డిటెక్టివ్ పని చెయ్యడం నాక్కూడా సరదాగా వుంది. ఉంటాను." ఫోన్ పెట్టేసింది వార్డెన్.
    
    రామ్ రిపోర్టర్, పర్నేష్ ఫ్రెండ్ నలుగుర్లో ఒకరయిన నీలిమ డిటైల్స్ కోసం నియమించబడిన వ్యక్తి తనకు రిలేషన్ అయిన వార్డెన్ ద్వారా ముగ్ధ, నీలిమ విషయాల్ని ఎప్పటికప్పుడు తెల్సుకోడానికి ఆ ఏర్పాటు చేసాడు రామ్.
    
                                      *    *    *    *    *
    
    లేబరేటర్ లోకి అడుగుపెట్టింది సురభి.
    
    "ఎవరు కావాలన్నట్టుగా చూసాడు" బోయ్.
    
    "శ్రీధర్ గారెక్కడున్నారు" అడిగింది సురభి.
    
    "పర్సనల్ రూమ్ లో వున్నారు. ఈ సమయంలో ఆయన్నెవరాయినా డిస్ట్రబ్ చేస్తే, నానా ధ్వంసం చేస్తారమ్మా రేపుదయం ఎనిమిది, తొమ్మిది గంటలమధ్య రండి. అది అయన కాఫీ టైమ్ మీరు మాట్లాడొచ్చు" చెప్పాడు బోయ్.
    
    "నేనాయన స్టూడెంట్ ని ఏ టైములోనయినా తన దగ్గరకు రమ్మన్నారాయన" చెప్పింది సురభి.
    
    అప్పుడు రాత్రి 7 గంటలైంది.
    
    "మీ ఇష్టం" ఎగాదిగా చూస్తూ అన్నాడతను. అతనికో నలభై ఏళ్ళుంటాయి.
    
    పదేళ్ళ నుంచి అతను శ్రీధర్ దగ్గరే పని చేస్తున్నాడు.
    
    చిన్న చిన్న క్యూబిక్స్ గా నిర్మించిన గ్లాస్ రూమ్స్ ని దాటుకుంటూ ముందుకు నడిచింది.
    
    "ప్రపంచంలో అతి విలువైనది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోంచే ఎన్నో కొత్త, అద్భుత విషయాలు పుడతాయి. అందువల్ల ఆ నిశ్శబ్దాన్ని గౌరవించండి." అని అర్ధం వచ్చే ఇంగ్లీషు సూక్తి రాసుంది.
    
    ఆ పక్కన పర్సనల్ రూం అని రాసుంది.
    
    ఒక్కక్షణం తటపటాయించి, తలుపుమీద చెయ్యేసి ముందుకు తోసింది. లోన విశాలమైన గది. పుస్తకాలు, ఫైల్స్ చిందర వందరగా ఉన్నాయి. ఆ గదిలో, ఓ మూల చిన్న రైటింగ్ టేబుల్ ఆ టేబుల్ మీద టేబిల్ లైట్. ఆ లైటుకాంతిలో ఏదో ఫైలు రిఫర్ చేస్తూ శ్రీధర్ తలొంచుకుని దీక్షగా చదువుకుంటున్న శ్రీధర్ ప్రపంచపు ఉనికిని మరిచిపోయినట్లున్నాడు.
    
    మాట్లాడకుండా వెళ్ళి, అతని కెదురుగా వున్న కుర్చీలో కూర్చుంది సురభి.
    
    పావుగంట గడిచింది.
    
    అరగంట గడిచింది.
    
    మధ్య మధ్యలో ప్రక్కన చిన్న నోట్ బుక్ లో నోట్స్ రాసుకుంటున్నాడు.
    
    నలభయ్ ఐదు నిమిషాల తర్వాత తలెత్తి చూసాడు.
    
    టేబుల్ లైటు కాంతిలో అస్పష్టంగా ఒక ఆకారం మాత్రం ఆయనకు కన్పించింది.
    
    "చూడు విశాలాక్షీ నీకు ఖాళీ ఉన్నప్పుడల్లా కూరగాయల మార్కెట్ కు వెళ్ళినట్టు లేబరేటరీకి రావద్దని చెప్పానా, లేదా? ప్లీజ్! లీవ్ మీ ఎలోన్ ప్లీజ్ అండర్ స్టాండ్ మీ ప్లీజ్" తలొంచుకుని అనేసి తన పనిలో పడిపోయాడు శ్రీధర్.
    
    సురభి పెదవులమీద ఓ నవ్వొచ్చింది ఆయన దీక్షను అర్ధం చేసుకుంది.
    
    నెమ్మదిగా లేచి, బయటికొచ్చేద్దామనుకున్నా, అందుకామె మనస్సు ఒప్పుకోలేదు.
        
    తనను గుర్తించేవరకూ అక్కడే కూర్చోవాలని నిర్ణయించుకుంది.
    
    "ఆల్ ఇండియా రేడియో" అన్న పుస్తకం కనబడితే, ఆసక్తిగా చదవడం మొదలుపెట్టింది.
    
    మనదేశంలో రేడియో, అదే ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు ప్రారంభమైందో తెల్సా దాదాపు అరవై రెండేళ్ళ క్రితం ఆల్ ఇండియా బ్రాడ్ కాస్టులు 1927 జూలై 23న ఒక ప్రైవేటు సంస్థగా ప్రారంభమయ్యాయి. ది ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ అనే ఓ కంపెనీ బొంబాయిలో 1.5 కిలోవాట్ల మీడియం వేవ్ ట్రాన్స్ మీటర్ ను మొట్టమొదటిసారిగా నిర్మించారు. ఒక నెల తర్వాత ఆగస్టు 26న ఇటువంటిదే మరో ట్రాన్స్ మీటర్ కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఈ రెండు ట్రాన్స్ మీటర్లూ 50 కిలో మీటర్ల వైశాల్యంవరకు ప్రసారం చేసేవి.
    
    బ్రాడ్ కాస్టింగ్ ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చెంది 1936లో ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైంది. దేశం అంతా కొత్త పరిణామాలతో బ్రాడ్ కాస్టింగ్ సర్వీసు ప్రారంభమయింది. ముఖ్యంగా ఉష్ణమండలంలో వున్నా విశాలమైన భారత దేశంలో బ్రాడ్ కాస్టింగ్ సౌకర్యం కలిగించడానికి నాలుగు షార్టువేవ్ ప్రాంతీయ కేంద్రాలు 750 కిలోమీటర్ల ప్రసార సామర్ధ్యంతో ఢిల్లీ, బొంబాయి, మద్రాసు, కలకత్తాల్లో 1937-38లో స్థాపించారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు సౌత్ ఈస్ట్ ఏషియా, వెస్ట్ ఏజియా, దక్షిణాఫ్రికాలకు ఎక్స్ టర్నల్ సర్వీసులకు ఢిల్లీని ప్రధాన కేంద్రంగా ఎన్నుకున్నారు.
    
    1947లో భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియో అత్యద్భుతంగా విస్తరించుకుపోయింది. మూడు వివిధ భారత వ్యాపార కేంద్రాలు, రెండు రిలే కేంద్రాలతో ఇప్పుడు మొత్తం 96 రేడియో కేంద్రాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం మనదేశంలో 83 శాతం వైశాల్యంలో విస్తరించుకున్న 95 శాతం ప్రజలకు రేడియో ప్రసారాలు అందుతున్నాయి. దేశంలో ఆయా భాషల్లో వివిధ కేంద్రాలచే ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింపబడు తున్నాయి.
    
    ఆల్ ఇండియా రేడియో మొత్తం బ్రాడ్ కాస్టుల్లో 38 శాతం సంగీతానికి చెందిన కార్యక్రమాలు వీటిలో శాస్త్రీయ, లలిత, భక్తి సంగీతం, జానపద సంగీతం, సినిమా పాటలు మరియు పాశ్చాత్య శాస్త్రీయ, లలిత సంగీత పాటల కార్యక్రమాలుంటాయి. మొత్తం సంగీత కార్యక్రమాల్లో 12 శాతం జానపద గీతాలుంటాయి. ముఖ్యంగా త్యాగరాజు, తాన్ సేన్ సంగీత ఉత్సవాలను ఆల్ ఇండియా వారు నేషనల్ మరియు జోనల్ హుక్ అప్ లలో సంగ్రహంగా ప్రసారం చేస్తారు. ఎయిర్ లో ఎక్కువగా గ్రామఫోన్ రికార్డుల ద్వారా, క్యాసెట్ల ద్వారా దేశ సంగీత సంపదను భద్రపరచి ఉంచారు.
        
    డబ్బాలా మన కళ్ళెదుట కల్పించే రేడియో, ప్రోగ్రాముల వెనుక ఇంత కథ వుందన్న మాట. మనసులో అనుకుంది సురభి.
    
    "నువ్వా ఎంతసేపైందీ వచ్చి" గబుక్కున విన్పించిన ఆ మాటలకు తలెత్తి శ్రీధర్ వైపు చూసి నవ్వింది.
    
    "ఇప్పుడే..."

 Previous Page Next Page