Previous Page Next Page 
ముగ్ధ పేజి 41

 

      ఆ సబ్జక్టే తెలీదు సురభికి అందుకే మరేం మాట్లాడలేకపోయింది. మనిషికి, ఇక మీదట కొత్త జబ్బులు రాకుండా, అందుకు కారణమైనదాన్ని, అందరూ విశ్వసిస్తున్న దానిని, తోసివెయ్యడానికి పూనుకోవడం ఎంత సాహసం.
    
    దానికెంత ఆత్మ విశ్వాసం కావాలి?
    
    "మీ పరిశోధనను విశ్వసించే పరిస్థితి వస్తుందంటారా."
    
    "నా పరిశోధనల్ని... విశ్వసించాల్సింది స్టెతస్కోపుల్ని మూర్చపుబిళ్ళల్లా వేసుకు తిరిగే ఈ డాక్టర్లుకాదు రోగులు! వాళ్ళను నమ్మించడానికే నా ప్రయత్నం ఇవాళ వైద్యం వ్యాపారమైపోయింది. వైద్యుడు వ్యాపారవేత్త అయిపోయాడు. బిజినెస్ పీపుల్ కి లాభాలే కావాలి. అలాగే తయారయ్యారు డాక్టర్లు అందుకే ప్రజలకే నా సిద్దాంతాన్ని విన్పిస్తాను" చాలా ఆవేశంగా చెప్పాడు శ్రీధర్.
    
    "ఫస్ట్రేషన్ ఓటమికన్నా భయంకరమైనది. దయచేసి మీరు దాని జోలికి వెళ్ళొద్దు."
    
    "గత ఎనిమిది నెలలుగా నా పరిశోధన ఎక్కడి గొంగళి అక్కడి లాగే వుంది. అదే నా బాధ సురభీ ఎందుకు ముందుకు కదలడంలేదు?" చేతులు వెనక్కి పెట్టుకుని, కుర్చీకి చేరబడిపోయాడు శ్రీధర్.
    
    "హాస్టల్ లోంచి బయటికొచ్చేస్తున్నాను. పూలబావి వీధిలో ఓ ఇల్లు దొరికింది. రెండు గదుల ఇల్లు బాగుంది" చెప్పింది సురభి సడెన్ గా కావాలనే టాపిక్ మార్చింది.
        
    "ఎప్పుడు దిగుతున్నావ్?"
    
    "రేపు!"
    
    "మరి నన్నెందుకు పిలవలేదు?"
    
    "మనకోసం తీసుకున్నదే కదా! అది చెప్పడానికే వచ్చాను"
    
    ఆనందంతో శ్రీధర్ ముఖం వికసించింది.
    
    "రేపుదయం ఫోన్ చేస్తాను. బస్టాండ్ దగ్గర కలుసుకుందాం. అక్కడ నుంచి మనింటికెళధాం" శ్రీధర్ నుంచి జవాబు లేదు ఆలోచిస్తున్నాడు.
    
    "వస్తాను" కుర్చీలోంచి లేచింది.
    
    అప్పటికే రాత్రి తొమ్మిది గంటలయింది.
    
    "కాసేపుండు సురభి. నువ్వుంటే నాకెందుకో మనశ్శాంతిగా వుంది" జాలిగా అన్నాడు శ్రీధర్.
    
    ఈయన అసలు అంతర్మధనం ఏమిటో?
    
    "ఇవాళ ఒక్కరోజే...వార్డెన్ కస్టడీలో వుండేది. రేపట్నించి మీ దగ్గరే ఎంత సేపు వుండమన్నా మీరు వెళ్ళిపోయే మన్నంతవరకూ."
    
    "నేను వెళ్ళిపోమంటానా?"
    
    బయట గేటువరకూ ఇద్దరూ నడుచుకుని వచ్చారు. రోడ్డంతా చీకటిగా వుంది.
        
    "చీకట్లో ఎలా వెళతావ్?"
    
    "అలవాటేకదా! ఫర్వాలేదులెండి" తలనిండా కొంగు కప్పుకుని రోడ్డుమీద కొచ్చింది.
    
    సురభి రోడ్డు చివర మలుపు తిరుగుతున్నప్పుడు, ఆమె పక్కనుంచే రిక్షా వెళ్ళిపోయింది. ఆ రిక్షా లేబరేటరీ దగ్గర ఆగింది.
    
    శ్రీధర్ లోనకెళ్ళి తన సీట్లో కూర్చున్నాడు.
    
    అతనికెందుకొ ఆకలి వెయ్యడంలేదు. ఇంటికెళ్ళాలనిలేదు.
    
    సురభి తన జీవితంలోకి ప్రవేశించిందా? ప్రవేశిస్తోందా?
    
    ఈ విషయం విశాలాక్షికి తెలిస్తే...
    
    ఏదో పుస్తకం తీసుకోడానికి పక్కకు తిరిగి, తలుపు చప్పుడైతే చూశాడు. రిక్షాలోంచి దిగి లోనికొచ్చింది విశాలాక్షి.
    
    "ఇంకా...మీ పరిశోధనలు పూర్తవలేదా?" చుట్టూ అనుమానంగా చూస్తూ అరిచినట్టుగా అడిగింది.
    
    "మీరు ఇంటికొచ్చి మూడురోజులయింది. తెలుసా మీకా విషయం?"
    
    "మూడురోజులయిందా?" మరిచేపోయాడు తను.
    
    "పోనీ మీ గొడవలో  మీరున్నారు. కనీసం ఫోన్ చేయొచ్చుకదా?"
    
    ఏ ప్రశ్నకూ శ్రీధర్ దగ్గర జవాబులేదు.
    
    తన సీతాకోక చిలుక జీవితం చటుక్కున గొంగళిపురుగులా మారిపోయినట్టనిపించింది శ్రీధర్ కి.
    
    "ఇంటికి రండి వెళ్దాం" ఆ మాటతో కుర్చీలోంచి లేచాడు శ్రీధర్ లైట్లన్నీ ఆర్పేసి, లేబరేటరీకి తాళం వేసేసి, నైట్ వాచ్ మెన్ కి కీస్ ఇచ్చేసి భార్య వెనక రోడ్డుమీదకొచ్చాడు.
    
    ఇద్దరూ ఇంటివేపు నడుస్తున్నారు.
    
                                                           *    *    *    *    *
    
    పావుగంట తర్వాత ఇల్లు దగ్గర పడడంతో గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది విశాలాక్షి.
    
    టేబిల్ మీద భోజనం రెడీగా వుంది. భార్య తిందో, లేదో అడగలేదు.
    
    ఏదో రెండు మెతుకులు కతికి, బెడ్ రూంలోకి వెళ్ళిపోయాడు.
    
    బెడ్ మీద పడుకుని బెడ్ లైట్ ఆర్పేసాడు. ఆలోచిస్తున్నాడు. ఆలోచనల నిండా సురభి.
    
    సురభి గురించి ఆలోచించడం ఆనందంగా వుంది.
    
    అదే సమయంలో-
    
    విశాలాక్షి చేతులు అతని ఛాతీమీద పడ్డాయి. భర్తను కౌగలించుకోడానికి ప్రయత్నం చేసింది.
    
    ఆ చేతుల్ని పక్కకు తప్పించేసాడు శ్రీధర్.
    
    విశాలాక్షికి కోపం వచ్చింది. వస్తుందని తెలుసు శ్రీధర్ కి.
    
    అయిదు నిమిషాల తర్వాత విశాలాక్షి లేచింది-
    
    కనబడిన వస్తువులన్నిటినీ చిందర వందరగా విసిరేస్తోంది ఏడుస్తోంది.
    
    జడలోని పూలను విసిరేసింది. జుత్తు పీక్కుంది జాకెట్టు చింపేసుకుంది, చీర విప్పేసి విసిరేసింది.
    
    గత కొన్ని నెలలుగా అలవాటైన తతంగమే అది.
    
    అందుకే శ్రీధర్ లో ఏ విధమైన చలనంలేదు.
    
    అనేకసార్లు-
    
    తను ప్రేమగా, అభిమానంగా భార్యమీద చెయ్యి వేసినప్పుడు విసిరికొట్టలేదూ? బతిమాలితే విన్పించుకోకుండా దూరంగా జరిగిపోలేదూ?
    
    భర్తగా శ్రీధర్ అహం దెబ్బతిన్న క్షణమది.
    
    ఆలుమగల్లో అహం తలెత్తనే గూడదు. తలెత్తాక చాలా కాపురాలు రాత్రుళ్ళు ఇలాగే ఉంటాయి.
    
    లేబరేటరీనుంచి బయటకొచ్చిన సురభిని పోస్టల్ వరకూ వెంబడించాడు ఆనంద్.
    
                                       *    *    *    *    *
    
    హోటల్ భీమాస్ డీలక్స్ సెల్లార్ రెస్టారెంట్లో...
    
    పర్నేష్, శివాజీ, రామ్, ఆనంద్ కూర్చున్నారు.
    
    "అలక, ఆ జయాధ్యక్ష వెనుక రేపు బొంబాయి వెళ్తోంది." చెప్పాడు శివాజీ.
    
    "నీలిమ, రెండు మూడు రోజుల్లో అరవింద దగ్గరకు హైద్రాబాద్ వెళుతుంది." చెప్పాడు పర్నేష్.

    "సైంటిస్ట్ శ్రీధర్, సురభి రేపట్నించి కల్సి వుండాలని నిర్ణయించుకున్నారు." చెప్పాడు ఆనంద్.

 Previous Page Next Page