Previous Page Next Page 
హౌస్ సర్జన్ పేజి 38


    "అలా కాదు. నేనలా  మిమ్మల్ని  గదిలో  ఎందుకు బంధించానో చెబుతాను వినండి. మనమిద్దరం  మాట్లాడుకుంటూంటే  రెండుమూడుసార్లు  చూసిందిట. ఒకసారి  క్వార్టర్స్ లో అందరి  ఎదుటా  అతిహీనంగా  మాట్లాడింది. మళ్ళీ  మనమిద్దరం  వంటరిగా  వుండటం  చూస్తే  ఏం ప్రమాదం ముంచుకొస్తుందో  అని భయపడ్డాను."

    నిజంగా ఆమె ముఖంలో  అంతటి  భయమూ  కనిపించింది. లోలోపల ఏ మూలో  ఆమె పట్ల జాలీ, ఆప్యాయతా ఆవిర్భవించాయి. "అంత భయపడేదానివి  యిలా  ప్రమాదాలు కొని తెచ్చుకోవట మెందుకు ?" అన్నాను.

    ఆమె  ముఖంలో  భీతిపోయి, గంభీరంగా  మారిపోయింది. "దానికి సమాధానం మీరు ఊహించలేరు .మీకు అర్ధమయేటట్లుగా  చెప్పటం  నాకు కూడా  చేతకాదు. ఒక్కటి మాత్రం  అనగలను. 'సిగ్గులేక' ఏం ? తెలిసిందా!" అంది.

    తల తిరిగినట్లయింది. ఆ రాత్రి  ఆమె దగ్గర నుండి  బరువైన హృదయంతో  తిరిగి వచ్చాను.

    ప్రభాకరం  గదిలో లేడు. ఉదయం ఆరుగంటలకే  లేచి  ఎక్కడికో  వెళ్ళిపోయాడు. అలా చేయడం  అతని  కలవాటే. కాని రాత్రి  తొమ్మిది గంటలోపు  సాధారణంగా  వచ్చేస్తాడు.

    ఆరోజు, పదకొండు దాటుతున్నా  యింకా  రాలేదు. అప్పటివరకూ  ఆలోచిస్తూ  అస్తిమితంగా  ప్రక్కమీద అటూ యిటూ  దొర్లుతూన్న  నేను  తలుపు  గడియవేసి  యిహ  పడుకున్నాను.

    ఎంతసేపు  గడిచిందో   తెలియదు. బహుశా  ఒంటిగంట  దాటి  ఉంటుంది తలుపు తడుతూన్న  చెప్పుడైతే 
s
మెలుకువ వచ్చింది.

    లేచి, తలుపు  తెరిచేసరికి  ఎదురుగా  ప్రభాకరం  వున్నాడు. ముఖమంతా  పీక్కుపోయి, అలిసిపోయినట్లు  నీరసంగా  వున్నాడు. లోపలకు  వచ్చి  కూజాలో  మంచినీళ్ళు  గాజుగ్లాసుతో  వొంపుకుని  త్రాగి, బట్టలైనా  మార్చుకోకుండా  మంచంమీదకు  వచ్చి  కూర్చున్నాడు.

    "అలా  వున్నావేం ?" అని  అడిగాను.

    తల ఎత్తి  నావంక  జీవం లేనట్లు  చూశాడు. "చాలా ప్రమాదం జరిగిపోయింది మధూ ?" అన్నాడు.

    ఒక గదిలో  చాలాకాలంగా  ఉంటున్నా, ఒకరంటే  ఒకరికి  గౌరవాభిమానాలున్నా  స్వవిషయాలు  ఎప్పుడూ  ముచ్చటించుకోము. అలాంటిది, ఆరోజతను  లోపల  యిముడ్చుకోలేక బయటకు వెళ్ళగక్కేశాడు.

    సునంద అనే సిస్టర్ కు యీ రోజు  ఆఫ్ ట. అతనూ, ఆమె ముందుగా  ఏర్పాటు చేసుకున్న  ప్రకారం  ఆరుగంటలకే  బస్ స్టాండ్ కు వెళ్ళిపోయి, బస్సెక్కి  యిక్కడికి  యిరవైమైళ్ళు  దూరంలో వున్న  నందిగిరి అనే ఊరికి  వెళ్ళి అక్కడ  టి.బి. తీసుకున్నారు. ఇలా  చేయటం  వారికి కొత్తకాదు. ఈ విధంగా  చాలాసార్లు  జరిగిందట.

    మధ్యాహ్నం  అక్కడే  భోంచేశారు. తర్వాత  ఉన్నట్లుండి  సునంద "అయ్యయ్యో ! నా నెక్లస్ కనబడటం లేదు" అందిట.

    "నెక్లెసేమిటి ?" అన్నాడుట  ప్రభాకరం.

    "నా రూమ్ మేట్  సావిత్రిది పట్టుకొచ్చాను, స్నానం చేసినప్పుడు  బాత్ రూమ్ లో  తీసి  వొంకెన  తగిలించాను. అప్పుడు  గుర్తురాలేదు. ఇప్పుడు చూస్తే లేదు" అని వాపోయింది.   

    ప్రభాకరం  కూడా బాత్ రూమంతా  వెదికాడట. నెక్లెస్  కనిపించలేదుట. చివరికి  కోపంవచ్చి  "అసలు యింకోరి  నెక్లెస్  ఎందుకు తీసుకువచ్చావు, బుద్ధిలేకుండా" అని కసురుకున్నాడుట.

    "బుద్ధిగడ్డితిని  తీసుకొచ్చాను. ఇప్పుడీ  సంగతి  తెలిసిందంటే  సావిత్రి   నా ప్రాణం  తీసేస్తుంది. ఆరువందల రూపాయల  వస్తువు. మా ఆస్తంతా  అమ్మినా  అంతరాయ ఇప్పుడు నేనేంచెయ్యను ? నేనింక  అక్కడికిరాను. ఉరేసుకుని  చచ్చిపోతాను" అంటూ  సునంద  ఏడుపు మొదలుపెట్టిందిట.

    ప్రభాకరానికి  కూడా మతిపోయినంత  పనయి, టి.బి. అంతా పిచ్చిగా  వెదికి, చివరకు  తాపీగా ఆలోచించగా వాచ్ మేన్  ఆ తర్వాత బాడ్ రూమ్ లోకి నీళ్ళు పెట్టడానికి  వెళ్ళి తచ్చాడినట్లు  గుర్తువచ్చిందిట. వెంటనే వాచ్ మేన్ ను  పిలిచాడు. నిలదీసి  అడిగాడు. 'నాకేం తెలీదు మొర్రో అని అతను లబోదిబోమన్నాడుట  ఎంత  అడిగినా, బెదిరించినా  అదే సమాధానం యిచ్చాడుట. ఇహ ప్రభాకరం  ప్రాణం  విసిగి గత్యంతరం లేక పోలీసు రిపోర్టు యిచ్చాడు.

    పోలీసులు  వచ్చారు. అ"అసలు మీరిద్దరూ ఎవరు ?" అని ఖచ్చితంగా  ప్రశ్నించాడట సబ్ యిన్ స్పెక్టరు.

    ప్రభాకరం  గుటకలుమ్రింగి, బుకాయించటానికి  ప్రయత్నించి కూడా శక్తిచాలక  "నేను డాక్టర్ని. ఈమె మా హాస్పిటల్ లో నర్సు" అని నిజం చెప్పివేశాడుట.

    దాంతో  సబ్ యిన్ స్పెక్టరు  అసలు విషయం  వదిలివేసి  ప్రభాకరాన్ని  పట్టుకున్నాడుట. "చదువుకున్నవారు, మీరే  యిలాంటి పనులు చేస్తే ఎలా ? డాక్టర్లు  యీ విధంగావుంటే  ఆసుపత్రులు  ఎలా బాగుపడతాయి ? మీరు చేసిన నేరానికి  యిప్పుడు  మీ యిద్దర్నీ  ఎందుకు అరెస్టు చేయకూడదు ?" ఇలా  మొదలు పెట్టాడుట.

    ప్రభాకరం రెండు చెంపలూ  వేసుకుని "బాబూ ! ఏదో వెధవ పని చేసాం, అయిందేదో  అయిపోయింది. నామీద దయ వుంచి  మా సమస్య పరిష్కారం  చేయండి .లేకపోతే  మేమిక్కడి నుంచి  కదిలే  మార్గంలేదు" అని గోల పెట్టాడుట.

    ఇన్ స్పెక్టర్  అతనిమీద జాలితలచి  వాచ్ మేన్ ని పిలిపించి  సామదాన దండోపాయాలన్నీ  ఉపయోగించి  అడిగాడుట. అతని  యిల్లు  సోదా చేశాడుట. అయినా  ప్రయోజనం  కనిపించలేదు.

    అంతా మహాగోలగా  తయారయింది.

    వాచ్ మెన్ ని  జయిల్లో  పెడతామని  బెదిరించారుట. అతని  పెళ్ళాం వచ్చి  శోకాలుతీస్తూ  బ్రతిమిలాడింది. ఏడుపులు....గందరగోళం చివరకు  'పదేళ్ళనుంచీ  నేను  దాచుకున్న డబ్బు  అయిదొందలయింది. అది తీసుకుని  వొదిలెయ్యమ"ని  వాచ్ మెన్ ఘోషపెట్టాడుట. ప్రభాకరం  అంగీకరించాడు. అయిదువందలూ చేతిలో  వేసుకుని  పోలీసుల్ని  బ్రతిమాలి  కేసు  కొట్టే యించి, బయటపడేసరికే  తలప్రాణం తోకకు  వచ్చిందిట.

    ఇదంతా అయేసరికి  రాత్రి  పదకొండు  అయింది. అప్పడిహ  ఊరు చేరటానికి  బస్సులులేవు. రోడ్డు మీదకు వచ్చి   అక్కడ  అరగంట  పడిగాపులు  కాశాక  యిటువైపువచ్చే  లారీ  నొకదాన్ని  ఆపుచేసి, లారీ డ్రైవర్ని బ్రతిమలాడుకుని, అతని  చేతిలో  రెండు రూపాయలు  పెట్టి లారీ ఎక్కి ఎలాగో  యిక్కడికి చేరుకున్నారుట.

    ఆమెను నర్సెస్  క్వార్టర్స్ లోకి  పంపించటానికి  తిరిగి భగీరథ ప్రయత్నమయిందిట. వాచ్ మేన్ ని మంచిచేసుకుని, వాడికి  కాస్త  మేత పడేసి, ఆమెను గోడమీద నుంచి  దాటించి యిలా  వచ్చాడుట.

    అంతా  చెప్పి  చివరకు  ప్రభాకరం  "డబ్బిచ్చి  సునందను  పంపేశాను గాని, ట్రావెలర్స్  బంగళా   వాచ్ మేన్ విషయంలో  కఠినంగా ప్రవర్తించానేమోనని  అనుమానం నన్ను  వేధిస్తున్నది. గత  పది నెలలుగా  ఎన్నోసార్లు  అతన్నీ, ఆ బంగళానూ  నా సౌఖ్యం  కోసం  ఉపయోగించుకున్నాను. ఎంతో అణకువగా, విశ్వాసంగా వుండేవాడు. నెక్లెస్ పోయిన మాట నిజమే. ఎందుకంటే ఉదయం  ఆమె మెళ్ళో  నేను కూడా  చూశాను. వాచ్ మెన్ తియ్యకపోతే, అంత డబ్బు  చేతుల్లో  ఎందుకు  పోస్తాడన్నది ఒక సమస్య. ఒక వేళ నిజంగా  తీయకుండావుంటే  ఉత్త పుణ్యానికి  అతని దగ్గర డబ్బు  గుంజినట్లు  అయిందేనన్న  బాధ  నన్ను  వేపుకుతింటున్నది మధూ ! వెధవ పన్లూ, వెధవ సమస్యలూ" అని గొణుక్కుని  మంచంమీద  వాలి  పడుతున్నాడు.

    అతన్ని  చూస్తే  జాలివేసింది. ఆ రాత్రి  రెండుమూడుసార్లు  మెలకువ వచ్చినప్పుడు  అతను  నిద్ర పట్టక  అటూ యిటూ  పొర్లుతూ  ఉండటం  చూశాను.

    మరునాడు  పనిచేశాక  క్యాజుయాలిటీ  పోస్టింగు అయిపోయింది.

                                                                   *    *    *

    ఆల్సేషియన్  డాగ్  గొలుసును  ఊదలాక్కోవటానికి  ప్రయత్నిస్తూ  భౌ భౌ మని అరుస్తూ, నా మీద  దూకటానికి  ఉరకలు వేస్తోంది.

    నా అడుగులకు   ఫుల్ స్టాప్ పడింది. 

    విశాలమైన  గేటు, అది దాటివెడితే  అటూ యిటూ  అందమైన  తోట, మధ్య చక్కని దారి. పోర్టికోముందు నిలబడిపోయాను.

    సవ్వడి విని  కాబోలు  లోపల నుండి  తులశమ్మగారు  యివతలకు వచ్చి నన్ను చూసి  "నువ్వా నాయనా ! కులాసాగా వున్నావా ?" అని చిరునవ్వు ముఖంతో  పలకరించింది.

    "బాగానే వున్నానండీ."

    "ఎప్పుడొచ్చావు ! ఈ మధ్య  రావటం  మానేశావు !.... మృదుల పైన వుంది, వెళ్ళు బాబూ !" అన్నది.

    ఆల్సేషియన్  డాగ్  యింటివారికి  కావలసిన  వ్యక్తే  అని గ్రహించినట్లు  మొరగటం  ఆపి నేలమీద ముడుచుకుని  పడుకుంది.

    లోపలకు వెళ్ళి  మెట్లెక్కసాగాను....క్యాజుయాలిటీ  అయిపోయి  నెల రోజులయింది. ఇవ్వాళ్టితో స్క్రీన్  పోస్టింగ్  ఆఖరు. రకరకాల చర్మ వ్యాధులూ, వాటిని డయాగ్నైజ్  చేయటం, చికిత్సా  విధానమూ  తెలుసుకున్నాను.

    మామూలు స్కేబిన్, టీనియా, ఇంపటైగో  వ్యాధుల  దగ్గర్నుంచీ  మొండివ్యాధులైన  ఎగ్జిమా, పెంఫగస్, సోరియాసిస్, లైకన్ ప్లేసస్ మొదలైన  అనేక చర్మవ్యాధుల గురించి  తెలుసుకున్నాను.

    "నీకేం ? చాలా సుఖమైన  పోస్టింగు, ఎమర్జన్సీలుండవు. ఆడుతూ పాడుతూ  చేసుకోవచ్చు" అన్నారు కొందరు.

    కాని నా జాతకమేమిటో  యీ పోస్టింగ్ లో కూడా  ఎమర్జన్సీలు తగిలాయి నాలుగయిదు  పెంఫగస్ కేసులు  వచ్చాయి  అవి చాలా సీరియస్ కేసులు. రక్తం  ఎక్కించాల్సి  వచ్చింది  అలాగే  గ్సీరోడెర్మా  పిగ్మింటోసా  అని ఒక కేసు  సాధారణంగా  జీవించరు. యీ  వ్యాధి  వచ్చినవారు  ఒక పదేళ్ళ  పిల్లవాణ్ని  పొట్టన  పెట్టుకుంది.

    మృదుల  గది  గుమ్మంవరకు  వచ్చేసరికి  లోపల  చీకటిగా  ఉండటం కనిపించింది. దాదాపు  సాయంత్రం ఏడవుతోందప్పుడు. వేసవికాలం కావటంవల్ల  ఆలస్యంగా చీకటి  పడుతోంది.

    లోపలకు  అడుగు పెట్టాడు. మృదుల సోఫాలో  కూర్చుని  ఉన్నట్లు  కనబడింది. చీకటిలో వంటరిగా  కూర్చుని  ఏం చేస్తోంది ? బహుశా కళ్ళు  మూసుకుని  ఉందేమో; ఓ వ్యక్తి  లోపలకు  ప్రవేశించటం  చూసినట్లులేదు.

 Previous Page Next Page