Previous Page Next Page 
వ్యూహం పేజి 38


    "డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చున్నామా... అవీ, ఇవీ మాట్లాడుతున్న టైమ్ లో... సడన్ గా చెయ్యి కడిగేసుకుని వెళ్ళిపోయాడు...." నాకేం అర్థం కాలేదు.

 

    "గుడ్ నైట్... మైడియర్ బాయ్...." అని చెప్పేసాడు.

 

    అంతవరకూ నేను గమనించలేదు. స్ట్రిక్ట్ డిసిప్లిన్ గదా... తొమ్మిదయ్యే సరికి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోతాడు కదా... వెళ్ళిపోయాడు. కనీసం పూర్తిగా భోజనం కూడా చెయ్యలేదు.

 

    హుషారుగా చెప్పేసాడు శక్తి. చెప్పేసి, భగవాన్ మొహంలోకి చూసాడు.

 

    "మిగతా రాత్రంతా... మరి మీ బేబీగారితో కబుర్లే కబుర్లన్న మాట..." ఆ ప్రశ్నను విననట్లు నటించాడు శక్తి.

 

    వదల్లేదు భగవాన్ మళ్ళీ అడిగాడు.

 

    "చెప్పకూడదా... సార్... కాన్ఫిడెన్షియలా సార్..."

 

    చటుక్కున శక్తి బ్రెయిన్ లోకి మెరుపులాంటి ఆలోచనొచ్చింది. "కాన్ఫిడెన్షియలా పాడా... ఎవరో ఫ్రెండ్స్ తో ఊటీ వెళ్ళిందట... ఇంకో నెలరోజులకి గానీ రాదట..."

 

    చెప్పేసాను కదా... ఇంకేం అడుగుతావురా బచ్చా భగవాన్... అన్నట్టుగ భగవాన్ మొఖంలోకి చూసాడు శక్తి.

 

    "చలికాలంలో ఊటీ ఏంటి సార్...."

 

    ఆ ప్రశ్నకు చిర్రెత్తుకొచ్చింది శక్తికి.

 

    "అంతే... మా బేబీకి చలికాలంలో ఊటీకి, కాశ్మీర్ కి వెళ్ళటం సరదా అట. మనమేం చేస్తాం- వింటర్ లోనే మా బేబీ ఐస్ క్రీములు తింటుందట. బ్రేక్ ఫాస్ట్ లో జ్యూస్ లు తాగుతుందట..."

 

    "అరిస్ట్రోక్రాట్ ఫామిలీల్లో అంతేలెండి- మరి మీ పోస్టు విషయం."

 

    "అదా... ఇంకా డిసైడ్ కాలేదయ్యా... ఇప్పుడున్న ఎం.డి.ని తీసేయడానికి కొంత టైమ్ కావాల్ట. రెండు మూడు నెలల తర్వాత నుంచి పోష్టిస్తాను... ఈ లోపల... ఏదో పోస్టులో వేస్తానన్నాడు మా మామ."


    
    "మామూలు పోస్టులో మీరేం చేస్తారు సర్.... ప్రెస్టేజ్ క్వశ్చన్- మూణ్ణెల్లపాటు జాలీగా తిరగండి సార్. ఒకేసారి ఎం.డి.గా అయితేనే నాలాంటి వాడికి హేపీ సార్..."

 

    నీ బోడి హేపీ కోసం మూణ్ణెళ్ళు నన్ను అడుక్కోమంటావ్రా- బచ్చా భగవాన్ అని మనసులో తిట్టుకుని-

 

    "అదికాదు భగవాన్ ఎం.డి. పోస్టుకోసం, త్రీ మంత్స్ ఆగమన్నాడు కానీ మా మావ సూపర్నెంటు పోస్టు కోసం కాదు కదా.... నువ్వేం కంగారు పడక ఇవాళో, రేపో, సూటబుల్ సూపర్నెంటూ పోస్టులో పడేస్తాడులే"

 

    "కాఫీ తాగుతారా, టీ తాగుతారా" సడన్ గా టాపిక్ ని మార్చేసి అడిగాడు భగవాన్.

 

    ఆ రకంగా భగవాన్ గాడి నస తప్పినందుకు ఆనందించి, నెమ్మదిగా తయారై...

 

    తెచ్చుకున్న డ్రెస్ లో ఓ మంచి డ్రెస్ సెలక్ట్ చేసి, వేసుకుని ఈల వేసుకుంటూ బైటకొచ్చాడు శక్తి. భగవాన్ కాఫీ తెచ్చేలోపు.

 

    అప్పుడు సరిగ్గా సమయం తొమ్మిదన్నరైంది.

 

    దార్లో హోటల్లో టిఫిన్ కానిచ్చేసి, ఠంచన్ గా ఆఫీసు గేటు దగ్గర పదిగంటలకల్లా వాలాడు శక్తి.

 

    ముందు ధర్మారావును కలవాలా?

 

    మహితను కలవాలా?

 

    ఠంచన్ గా, పదిగంటలకల్లా వెళితే, ధర్మారావు పిచ్చికుక్కలా కరిచెయ్యడా?

 

    అంచేత మహితను కలవడం మంచిది.

 

    మహిత నిన్న సినిమా హాల్లో తనను చూసుంటే? చూసి ఉండకపోవచ్చు- అడిగినప్పుడు కదా.

 

    ఠీవిగా నడుచుకుంటూ, కేంటిన్ వేపెళ్ళి, చుట్టూ చూసాడు. కేంటిన్ సిబ్బంది తప్ప ఎవ్వరూ కనిపించలేదు. కాసేపు అక్కడే అటూ ఇటూ తిరిగి-

 

    ధర్మారావు దగ్గరకే వెళదామని బయటికొస్తున్న శక్తి.

 

    ఎదురుగా, లాన్ పక్కన ఆగిన మారుతీకారువేపు, అ కారులోంచి అప్పుడే సంగీతా బిజ్ లానీలా దిగిన అందంవేపు, కళ్ళార్పకుండా చూశాడు. ఆ అమ్మాయి, హుందాగా కారులోంచి దిగి, అంతే హుందాగా ఠీవిగా వయ్యారంగా లిఫ్ట్ వేపు వెళ్ళిపోయింది.

 

    కాసేపయ్యాక లిఫ్ట్ ఎక్కి వెళ్ళిపోయింది.

 

    శక్తికి చటుక్కున బేబీ జ్ఞాపకానికొచ్చింది. కొంపదీసి, మేనమామ కూతురు బేబీ కాదు కదా-

 

    ఆ పక్కన, పార్కు చేసి ఉన్న, ఎర్రగులాబీ లాంటి మారుతీ కారువేపు చూసాడు. బేబీయే అయ్యింటుంది.

 

    లేకపోతే అ గ్రేస్ రాదు. క్లియోపాట్రా సినిమాలో ఎలిజబెత్ టేలర్ లాంటి గ్రేస్ ఉందా నిజంగా- లేదు. తనే అనుకుంటున్నాడు. గ్రేస్ ఉంది మహితలోనే. కొంపదీసి తను మహితను ప్రేమిస్తున్నాడా? అలా విదిలించి ఆ అమ్మాయిని మరోసారి జ్ఞాపకం చేసుకోడానికి ప్రయత్నించాడు శక్తి.

 

    నో డౌట్... మేనమామ కూతురే అయ్యుంటుంది అందుకే స్టాఫ్ ఎవరూ రాకుండా వచ్చింది... తనకి దొరికిపోయింది.

 

    ఆలోచిస్తున్న శక్తి దగ్గరకు మహిత వచ్చి పలకరించడం "ఏవండోయ్-" అని అరవడం విన్పించుకోలేదు. ఆఖరికి చేత్తో తడితేగానీ ఇహలోకంలోకి రాలేదు శక్తి.

 

    ఎదురుగా మహిత.

 

    "మహితగారూ! మరో చిన్న హెల్ప్ చెయ్యాలి. మీకయితే అది చాలా చిన్నది. ఆ మారుతీకారు ఎవరిదో నాకు చెప్పాలి" ఎదురుగా ఉన్న మారుతీ కారును చూపిస్తూ అన్నాడు శక్తి.

 

    "అలాంటి మారుతీ కార్లు చాలామందికి ఉన్నాయిక్కడ. ఎవరిదో నాకేం తెలుస్తుంది?" వెంటనే జవాబిచ్చింది మహిత.

 

    "అన్ని మారుతీకార్ల గురించి నాకెందుకండీ? ఆ ఎర్ర గులాబీ కారు- ధగధగా మెరిసిపోతోంది చూసారా- ఆ కారు"

 

    "అసలు పనేంటో చెప్పండి. ఆ తర్వాత కారెవరిదో చెపుతాను" మడత పేచీ పెట్టింది మహిత.

 

    "పనంటే... పని కాదండీ- అ కారుని చూడగానే ఆ కారు నాకు నచ్చిందన్న మాట. మారుతీ షోరూమ్ లో ఆ కలర్ కారు లేదు- అందుకని నోటికొచ్చిందేదో చెప్పాడు శక్తి.

 

    "జనరల్ గా మీకు కలర్స్ అంటే ఇష్టమా?" నవ్వుతూ అడిగింది మహిత.

 

    "వాట్ డూ యు మీన్" ఒకింత కోపం వచ్చింది శక్తికి.

 Previous Page Next Page