"రేపు మధ్యాహ్నం రెండుగంటలకిక్కడ కొచ్చేయండి. ఇక్కడ నుంచి ఇలాగే ఎయిర్ పోర్టుకి వెళ్ళిపోదాం. అలాగేనా"
తలూపుతూ టాక్సీఎక్కింది అలక.
"సీయూ."
"గుడ్ నైట్"
తాక్సీలోని అలక మనసు అర్దరాత్రివేళ కనిపించే తిరుపతి కొండ మీద విద్యుద్దీపాల బారులా వెయ్యి ఓల్టుల్తో వెలుగుతోంది.
జయాధ్యక్ష, అలక రెస్టారెంట్ లోకి డిన్నర్ కి వెళ్ళినంతసేపు బయట వెయిట్ చేసి బయటికొచ్చాక వాళ్ళతోపాటు బయట కొచ్చాడు శివాజీ.
అలక టాక్సీవెనుక అతని హీరోహోండా కూడా వెళుతోంది. అలకను ఇమ్త్య్దగ్గర డ్రాప్ చేసిన ఆ టాక్సీ వెనక్కి తిరిగింది. అక్కడ అవరకు వచ్చిన శివాజీ ఆ ఇంటిని గుర్తుపెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాడు జర్నలిస్ట్ పర్నేష్ ఫ్రెండ్.
* * * * *
"నీలిమా హైద్రాబాద్ నుంచి నీకు ఫోన్." వార్డెన్ కేకేసి చెప్పడంతో ఆఫీసురూంకి పక్కరూంలోనే ఉంటున్న నీలిమ చదువుతున్న పుస్తకం పక్కనపడేసి పరుగెత్తుకెళ్ళింది.
"హలో ఎవరో చెప్పుకోండి చూద్దాం" అవతలినుంచి గొంతు స్పష్టంగా విన్పిస్తోంది.
"హౌ ఆర్యూ అరవింద్"
"పోల్చారు నా హరపున న అమిత్రుల తరపునా ముందుగా అభినందనలు అందుకోండి."
"నేనేం చేసానని"
"సారీ త్యాగం చేసి నన్ను రక్షించారు కదా అందుకని"
నవ్వింది నీలిమ.
"డిన్నర్ అయిపోయిందా."
"జస్ట్ ఇప్పుడే"
"ఏం చేస్తున్నారు."
"వరల్డు ఫేమస్ గ్లామరస్ వుమెన్ బుక్ చదువుతున్నాను"
"ఆ బుక్కే చదవాలా? గ్లామరస్ వుమెన్ గురించి తెల్సుకోడానికి."
"మరి"
"మీరూ గ్లామరస్ వుమనేకదా" పొగిడాడు అరవింద్.
"మీకు జోకులుకూడా వచ్చన్నమాట"
"మిస్ నీలిమా ఇప్పుడు టైమెంతయింది" అడిగాడు అరవింద్.
"పావుతక్కువ తొమ్మిది" గోడగడియారం చూస్తూ చెప్పింది నీలిమ.
"ఈ పావుతక్కువ తొమ్మిది సాక్షిగా ఇప్పుడు నేనోవిషయం చెప్పనా. మరేం అనుకోరుకదూ ఈ విషయం మొట్టమొదటి తిరుమల కొండమీద చెప్దామనుకున్నాను. రెండోసారి శ్రీకాళహస్తిలో చెప్దామనుకున్నాను కానీ..."
"చెప్పండి సందేహం ఎందుకు?"
"నేను ఎక్కువ నిజాలే మాట్లాడతాను. అందుచేత ఇప్పుడుకూడా నేను కొన్ని నిజాలు మాట్లాడుదామనుకుంటున్నాను." సీరియస్ గా విన్పించింది అరవింద్ గొంతు.
"చెప్పండి."
"మీలా స్లిమ్ గా చక్కగా ఉండేవాళ్ళంటే నాకిష్టం"
"ఇదేనా మీరుచేప్పే నిజం" నవ్వుతూ అడిగింది నీలిమ.
"ఇంకా చాలా వున్నాయండోయ్ ఫోన్ పెట్టేయకండి రెండోది మీ నవ్వు బాగుంటుందండి"
"ఇంకా."
"ఆ రోజు నేను బ్లయిండ్ మాన్ గా నటించినప్పుడు నాచేతిని పట్టుకున్నారు చూశారూ మీచేతి మెత్తదనం ఎంతబావుందో తెల్సా ఐలైక్ ఇట్."
ఆ మాటకు సిగ్గుపడింది నీలిమ.
"మీ చీరను నేను కట్టుకున్నప్పుడు నాకేమనిపించిందో తెల్సా."
అరవింద్ ఏం చెప్తాడోనని భయమేసింది నీలిమకు.
గబుక్కున ఫోన్ పెట్టేసింది.
మళ్ళీ ఫోన్ మోగడంతో రిసీవరు పట్టుకుంది.
"ఏం ఫోన్ పెట్టేశారు కోపం వచ్చిందా" అరవింద్ అడిగాడు.
"ఫోన్లో ఏమిటి మీ మాటలు అక్కడ మీపక్కన ఎవరూ లేరా. ఎవరైనా వింటే నవ్వుతారు. పిచ్చిపట్టిందేమో అనుకుంటారు జాగ్రత్త" పంటిచాటున నవ్వును నొక్కిపెట్టుకుంటూ అంది నీలిమ.
"ఎవ్వరూ వినరులెండి. నచ్చిన అమ్మాయితో మాట్లాడడం తప్పా చెప్పండి."
"తప్పుకాదు గానీ అందరూ పడుకుంటున్న టైమ్ ఇది మీ మాటలు అన్ని గదుల్లోకి స్పష్టంగా విన్పిస్తున్నాయి" నీలిమ అటూ ఇటూ చూస్తూ అంది.
"ఎవ్వరూ వినకుండా మనమే మాట్లాడుకోవాలంటే ఏంచెయ్యాలో తెల్సా. కొంచెం మీ బుర్రకు పదునుపెట్టి చెప్పండి" అడిగాడు అరవింద్.
"పజిల్స్ కూడానా? నాకు తెలీదు బాబూ."
"మనిద్దరం ఒక్కచోటే వుండాలి తెల్సిందా అందుచేత మీరు హైద్రాబాద్ వచ్చేయండి" ఫోన్లో అతడి గొంతు ఎంతో మృదువుగా వుంది.
"అవును యాజిటేషన్ ఏమైంది?" అడిగింది నీలిమ.
"ఉదయం లేచిం దగ్గర్నుంచి సాయంత్రం వరకూ యాజిటేషన్ అంటే ఎక్కడచేస్తాం చెప్పండి మనిషన్నాక దానిక్కూడా విశ్రాంతి నివ్వాలికదా దానిక్కూడా ఇంకొక మనసుని తోడు ఇస్తేనే కదా దాని కబుర్లు అది చెప్పుకుంటుంది."
"మనస్సుక్కూడా ప్రాణం వుందని కొత్తసిద్దాంతానని ప్రతిపాదిస్తున్నట్టున్నారే?"
"లేదు పాత సిద్దాంతమే కానీ మిస్ నీలిమ నాకో నిజం మీరు చెప్పాలి నేను చెప్పిన నిజాలు నిజాలేనా."
దానికి జవాబివ్వలేకపోయింది నీలిమ.
"మీ దగ్గర్నుంచి ఆ జవాబుని నేనెలా రాబట్టాలో నాకు తెలుసు గానీ, ముందుగా నేను చెప్పే విషయం ఒకటి వినండి. రాష్ట్రంలోని విద్యార్ధులమీద పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ పదహారోతేదీన మేం ఊరేగింపు తీస్తున్నాం. ఆ టైమ్ కి మీరక్కడుంటే బాగుంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవర్నయినా తీసుకొచ్చినా బాగుంటుంది."
"పదహారునా?"
"పెళ్ళికొచ్చినట్టు పదహారునొస్తారా మీరు పదిహేనో తేదీకల్లా రండి. వచ్చేముందు టెలిగ్రామ్ ఇవ్వండి. వస్తారా హేండిస్తారా."
"హేండివ్వడం నాకెప్పుడూ అలవాటు లేదు."
"మరి ఏమివ్వడం..." నవ్వుతూ అడిగాడు అరవింద్.
ఆ ప్రశ్నవెనక గూడారధానికి నవ్వింది నీలిమ.
"ఉంటాను గుడ్ నైట్" ఫోన్ పెట్టేశాడు అరవింద్.
రూమ్ లోకొచ్చి బెడ్ మీద పడుకుని అరవింద్ గురించి ఆలోచిస్తోంది నీలిమ.