ఎక్కేసాడు శక్తి.
అది నేరుగా వెళ్ళి కె.ఎస్.ఆర్.టి.సి. స్టేషన్ దగ్గర ఆగింది.
"ఇది చామరాజ్ పేట్ వెళ్ళదా..." కండక్టర్ దగ్గరకెళ్ళి కోపంగా అడిగాడు.
"నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పావా..."
ఆ ప్రశ్నకి జవాబు లేదు శక్తి దగ్గర. అడక్కుండా టిక్కెట్ తీసుకోవడం తనదే తప్పు.
"చామరాజ్ పేట్ వెళ్ళాలంటే... ఏం చేయాలి సార్..." నెమ్మదిగా అడిగాడు.
"ఆటో ఎక్కండి." ఉచిత సలహా ఇచ్చాడు ఆ కండక్టర్. బాగానే ఉండి ఐడియా.
గబగబా ఆటోవైపు నడిచాడు శక్తి.
"చామరాజ్ పేట్ వస్తావా?" అడిగాడు శక్తి.
"బేడా..." ఆటోడ్రైవర్ ఎక్కమన్నాడేమో అనుకుని, ఎక్కి కూర్చున్నాడు శక్తి. ఎంతసేపయినా, కదలకపోతే, ఆటోడ్రైవర్ వేపు అనుమానంగా చూసాడు.
ఆటో డ్రైవర్ సీట్లోనే గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు మందు మత్తులో. విసుక్కుని దిగిపోయి....
చేతికున్న పాత వాచీవేపు చూసాడు. పదిగంటలు దాటింది.
రైల్వేస్టేషన్ లోకి నెమ్మదిగా అడుగుపెట్టాడు మరేం తోచక.
ఈ రాత్రి స్టేషన్ లో ఉండిపోయి, రేపు ఉదయాన్నే భగవాన్ రూమ్ కి వెళ్తే, సమస్యలన్నీ పరిష్కారమై పోతాయి గదా... స్టేషన్లో ఎక్కడుంటాడు తను.
వెయిటింగ్ రూమ్ లో కాలక్షేపం చేసెయ్యాలి తప్పదు.
రైల్వే కేంటిన్ లో, రెండు బజ్జీలు తినేసి, నీళ్ళు తాగేసి, రెండ్రూపాయలిచ్చి టిక్కెట్ తీసుకొని...
వెయిటింగ్ రూమ్ లోకి నడిచాడు.
ఒక పక్క చలి... ఒక పక్క ఆలోచనలు.
ఈ బెంగుళూరులో తన జీవితం ఇలాగే రోజు ఇలాగే అబద్దాలతో, నాటకాలతోనే గడుస్తుందా?
తనకి సుఖవంతమైన జీవితం రాదా?
ఎందుకు రాదు... వస్తుంది.
ఒక పన్నెండు నెలల తర్వాత... తన పొజిషన్ చూడు బాసూ, కారులోనో, మారుతి కారులోనో తను తిరగడూ?
ఎ.సీ.రూముల్లో ఉండడూ.
ఉంటాడు. చచ్చినట్టు ఉంటాడు.
తన చేతిలో జెర్రిపోతంతటి గీతలున్నాయట. ఉత్తిగానే అందరికీ గీతలుండవు.
తాటాకీ, బిర్లాకీ, తనకీ అలాంటి, ఒకే రకమయిన గీతలున్నాయట. గీతలు అంత పొడవుగా, జెర్రిపోతుల్లా ఉంటే, తనెందుకి వేళ, రైల్వేస్టేషన్లో గడపాల్సి వచ్చింది?
పిచ్చికన్నా, గీత ఒక్కటే కాదురా ఉండాల్సింది రాత కూడా బాగుండాలి. లలాట లిఖితం అంటారే... అదన్న మాట.
సిసలైన సక్సెస్ ని కోరుకుంటున్న వాడెవడు, గీతల్ని, రాతల్ని లక్ష్యపెట్టడు.
గీతలు, రాతలు, మనిషిని భ్రమల్లోనే ఉంచుతాయి. భ్రమల్లోనే ముంచుతాయి.
జపాన్ లోని ప్రసిద్ధ పారిశ్రామికవేత్త, ప్రపంచ ప్రఖ్యాత సోనీ కంపెనీ అధినేత అకియో మొరిట, గీతల్ని రాతల్ని నమ్మే విజయం సాధించాడా? తనకెంత ప్రాపర్టీ ఉందో తనకే తెలియని పరిస్థితి ఉంటుందని ఆయనెప్పుడయినా అనుకున్నాడా?
బ్రిటన్ కు చెందిన సర్ జాన్ హార్వే, ఇటలీకి చెందిన అగ్నిల్లి, అమెరికాకు చెందిన రాబర్ట్ అండర్ సన్, మనదేశానికి చెందిన ఉక్కు మనిషి రస్సీ మోడి.
వీళ్ళందరూ విఠలాచార్య సినిమాలోలా... గబుక్కున బిజినెస్ మాగ్నట్ లు అయిపోయారా- వీళ్ళూ స్టేషన్ లో పడుకుని ఉంటారు. సిటీ బస్సుల్లో తిరిగే ఉంటారు. కార్లను చూసి కలలుకనే ఉంటారు. మేడల్ని చూసి, థ్రిల్లయి పోయే వుంటారు.
మనిషెప్పుడూ ఒంటరి అంకె కాదు.
ఒంటరిని అనుకున్న ప్రతివాడూ సున్నాలా మిగిలిపోయాడు, మిగిలిపోతాడు.
తన దుఃఖం, తన బాధ, తన అశాంతి, తన ఆవేదన... ఇవ్వేమి- ఇవ్వేమి సక్సెస్ కు అడ్డురావు. ఆటంకంగా నిలవవు.
ఆలోచనలు ముసురికొనగా, కునుకుపాట్లు పడుతున్నాడు శక్తి.
ప్లాట్ ఫారాల మీద ఆగి వెళ్ళిపోతున్న రైళ్ళు- ప్రయాణీకుల సందడి... ప్లాట్ ఫారానికి.
ఒక పక్క వెలుతురు, రెండో పక్క చీకటి జీవితంలా-
* * * *
"ఏంది బాసూ... ఇంత పొద్దున్నే వచ్చేసారు" ముసుగు తీయగానే మెట్లదగ్గర కనబడిన శక్తిని పలకరించాడు భగవాన్.
"మీరు డైరెక్ట్ గా మీ మామయ్యగారితో కార్లో, ఆఫీసుకే వస్తారనుకున్నాను..." గబుక్కున లేచిపోయి, అప్పటికే సగం విరిగిపోయిన కుర్చీని సర్ది- "ముందు కూర్చోండి సర్" అన్నాడు భగవాన్.
"ఆఫీసు బట్టలిక్కడే ఉండిపోయాయి. అందుకే వచ్చేసాను" నవ్వు మొఖం పెట్టాడు శక్తి.
"చెప్పండి సార్... ఏం మాట్లాడారు ఛైర్మెన్ గారు. మీ బేబీగారు కలిసారా... మొత్తం చెప్పేయండి సర్... రాత్రి నాకంటికి- అస్సలు నిద్రలేదు సార్... డ్రీమ్స్ డ్రీమ్స్- మీరు... ఎం.డి. అయిపోయినట్టు... మారుతీ థౌజండ్ లో అఫీసు కొచ్చినట్టు...."
భగవాన్ తో ఏం చెప్పాలో అర్థః కాలేదు శక్తికి.
ఫాంటులోంచి, లుంగీలోకి మారాడు శక్తి.
ఎప్పుడో చిన్నప్పుడు చూసాడు కదా... మా మేనమామ వెంటనే పోల్చుకోలేక అనబోయి, నిన్న ఛైర్మన్ని కలిసానన్న అబద్ధం భగవాన్ గాడితో చెప్పానన్న విషయం గుర్తుకొచ్చి-
"ఎవరో.... మేనల్లుడి వరస వాడు వచ్చాడని ఉపేక్షించాట్ట... అసలు విషయం చెప్పేసరికి... ఎంత మర్యాదిచ్చాడనుకున్నావ్"
"మీ ఎం.డి. పోస్ట్ ఏమైంది సార్..." మళ్ళీ అడిగాడు భగవాన్.
ఓరి... నీ ఎం.డి. పోస్టు పాసుగాలా... ఆ క్వశ్చన్ తప్ప, నీ మెదడ్లో మరే అక్షరాలు లేవురా... బచ్చా భగవాన్... మనసులో కసితీరా తిట్టుకుని...