Previous Page Next Page 
ముగ్ధ పేజి 37

   

   అందరూ అందుకు అంగీకరించారు.
    
    లేచి సత్రంవేపు నడుస్తున్న ముగ్ధ, రాజేంద్రప్రసాద్ పక్కనుంచే ఆ నలుగురు వాళ్ళను దాటి, ముందుకొచ్చి పార్క్ చేసిన వాహనాలెక్కారు.
    
                                         *    *    *    *    *
    
    తిరుపతి సిటీలోని అదొక త్రీస్టార్ హోటల్ రూంనెంబర్ 205లో జయాధ్యక్ష కూర్చున్నాడు.
    
    అలక ఉండగానే పోలీసులు తనని అరెస్టుచేయడం గురించి అతను ఆలోచిస్తున్నాడు. పక్కనున్న మిత్రుడు బెయిల్ ఇవ్వబట్టి సరిపోయింది లేకపోతే....
    
    తనమీద కంప్లయింటు ఎవరిచ్చుంటారు? ప్లేబోయ్ మనస్తత్వం గల జయాధ్యక్ష ఎందర్నని జ్ఞాపకం వుంచుకుంటాడు.
    
    మర్నాడు ఉదయాన్నే వెళ్లి, తనేదో కధచెప్పబట్టి సరిపోయింది లేకపోతే అందమయిన అలక, మొదటిచూపులోనే ఇష్టపడిన అలక, యూనివర్శిటీ ప్రెష్ అమ్మాయి అలక తన చేతులలోంచి జారుకునేది.
    
    పోలీసులింకా తనమీద నిఘా వేసేవుంటారా? ఇప్పుడెలా? సాధ్యమైనంత త్వరలో సిటీనుండి వెళ్ళిపోవాలి.
    
    అలకతోపాటు వెళ్ళిపోతే అదృష్టవంతుడు తను ఇంతకూ అలక తన దగ్గరకు వస్తుందా? ఆలోచిస్తూ గదిలో పచార్లు చేస్తున్నాడు జయాధ్యక్ష.
    
    అదే సమయంలో కాలింగ్ బెల్ మోగడంతో ఉలిక్కిపడ్డాడు. ఎవరయి ఉంటారు?
    
    ఒక్క క్షణం తటపటాయించాడు. నెమ్మదిగా డోర్ తెరిచాడు.
    
    ఎదురుగా అలక.
    
    గుండెల్నిండా వూపిరి పీల్చుకున్నాడు. అంతవరకూ అతనిలో వున్న భావాలను కప్పి పుచ్చుకుంటూ, చక్కని చిరునవ్వు ముఖమ్మీదకు తెచ్చుకున్నాడు.
    
    "రండి! రాత్రంతా నాకు నిద్రలేదు తెల్సా?" అన్నాడు.
    
    "ఏం?" లోనికొస్తూ అంది అలక.
    
    "మీ అందం నన్ను నిద్రపోనిస్తేనా?" ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు జయాధ్యక్ష.
    
    ఏ అమ్మాయినయినా పొగడాలనుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ పొగడాలి. ఆ పొగడ్తకు ఆనందించే అమ్మాయి తల కిందకు దించుకుంటుంది. అంటే ఆ పురుషుడ్ని ఆ అమ్మాయి ఇష్టపడుతున్నట్టు లెక్క.
    
    "కాజేటీ కొచ్చాను. మీరు లేరు. వాచ్ మెన్ ని అడిగితే చెప్పాడు."
    
    కుర్చీలో కూర్చుంటూ అంది అలక.
    
    "కొండమీద కొచ్చాను. దైవ దర్శనం బదులు దేవీ దర్శనం అయింది కదా! దేవిగార్నే కొండమీదకు రప్పిద్దామని దిగిపోయాను" నవ్వుతూ అన్నాడు జయాధ్యక్ష.
    
    "జోవియల్ గా మాట్లాడ్డంలో మీరు ఎక్స్ పర్ట్ లా వున్నారే."
    
    "మాట్లాడ్డంలోనేకాదు. అన్నింట్లోనూ ఎక్స్ పర్ట్ నే నేను" డబుల్ కాట్ బెడ్ పక్కనున్న మినీ ఫ్రిజ్ ని ఓపెన్ చేసి, అందులోంచి రెండు వైన్ బాటిల్స్ ని తీసి టీపాయ్ మీద పెడుతూ అన్నాడు జయాధ్యక్ష.
    
    రెండు గ్లాసుల్ని తెచ్చి, ఆ గ్లాసుల్లో వైన్ పోసాడు.
    
    "ప్లీజ్ హావిట్!" అంటూ తనొక గ్లాసు తీసుకున్నాడు.
    
    "నాకలవాటులేదు మీరు తీసుకోండి."
    
    "వైనంటే గ్రేప్ జ్యూసే ఆల్కహాల్ కాదు" తను సిప్ చేస్తూ అన్నాడు జయాధ్యక్ష.
    
    "అయినా నేను తీసుకొను సరదాగా మాట్లాడు వింటాను" అంటూ బుద్దిమంతురాలిలా కుడిచేతిని బుగ్గమీద ఆనించుకుని కూర్చుంది అలక.
    
    "మీలాంటి అందగత్తెలు బొంబాయిలాంటి సిటీలో వుండాలి. ఇక్కడ కాదు అక్కడ కొచ్చిన క్షణంనుంచీ మీ అదృష్టంమారిపోతుంది. నాకా విషయం తెల్సు. బ్యూటీ, గ్లామర్, ఫ్యాషన్స్ మనీ, లక్జరీ లైఫ్! మీకు టీ.వీ. ఇంటరెస్టా? సినిమా ఇంటరెస్టా? మోడలింగ్ ఇంటరెస్టా చెప్పండి" ఏదయితే అది ఆ మధ్య ఏదో ఫంక్షన్ లో కలిసాం రేఖ, నేనూ."
    
    "ఏ రేఖ?" ఎక్సయిటింగ్ గా అడిగింది అలక.
    
    సెన్షేషనల్ ఏక్ట్రస్ రేఖ తెలీదా? ఆ రేఖే! మా అతరం అయిపోయింది. కొత్తతరం రావాల్సిన అవసరం వుంది. సంగీతా బ్రిజ్ లానీ, ఏక్తా, ముక్త, కరిష్మా, దివ్య ఇలాంటి వాళ్ళొస్తున్నా, టైం బీయింగ్ స్టార్స్ తప్ప ఏక్టర్స్ కారు. మంచివాళ్ళు ఎవరయినా వుంటే చెప్పండి. ప్రొడ్యూసర్స్ కి నేనే రికమెండ్ చేస్తానంది. మీరు గనక బొంబాయివస్తే ఇదొక చాలా మంచి అవకాశం రేఖకి ఇంట్రడ్యూస్ చేస్తాను."
    
    జయాధ్యక్ష చెప్పిన మాటల్ని నమ్మలేకపోయింది అలక.
    
    "అమితాబ్ ని చూసారా మీరెప్పుడయినా?"
    
    "అమితాబా! రోజూ మేం ఇండియా గేట్ దగ్గర జాగింగ్ టైంలో కలుసుకుంటాం. హాయ్ ఈజ్ నైస్ జంటిల్ మెన్ మీరొస్తారు కదా ఒక్క అమితాబ్ ఏంటి? మిధున్, అనిల్, శ్రీదేవి, రిషికపూర్, దేవానంద్, రాఖీ, ఎంతోమంది సీనియర్స్ తెల్సు" రెండో పెగ్గు గ్లాసులో పోసుకుంటూ అన్నాడు జయాధ్యక్ష.
    
    అలక కళ్ళముందు ఒక రంగుల ప్రపంచం సాక్ష్యాత్కరిస్తోంది బొంబాయి వీధుల్లో హాయిగా, హుషారుగా షికారు పోతున్నట్టుగా అనిపిస్తోంది ఆ అమ్మాయికి.
    
    అర్జంటుగా బొంబాయి వెళ్ళిపోవాలనుంది అలకకు.
    
    "రేపు ఫ్లైట్ లో బొంబాయి వెళ్తున్నాను వస్తారా?" డ్రింక్ ఫినిష్ చేస్తూ అడిగాడు జయాధ్యక్ష.
    
    మౌనంగా తలూపింది అలక.
    
    ఆ తర్వాత తనతోపాటు హోటల్ రెస్టారెంట్ కి తీసికెళ్ళాడు అలాకాని. డిన్నర్ అక్కడే పూర్తి చేసేసింది.

    రెస్టారెంట్ నుంచి తిరిగొస్తున్నప్పుడు...
    
    "మీరు నమ్మండి, నమ్మకపొండి. మీకో అద్భుతమైన ఫ్యూచర్ వుంది. ఆ విషయం నాకు తెలుసు. మీ కెరియర్ వేరు. మీ ఎట్రాక్షన్ వేరు. మీరు బొంబాయి వచ్చాక చాలామంది మగవాళ్ళు మీకు పరిచయం అవుతారు. స్నేహాలు పెరుగుతాయి. ఆ స్నేహాల మధ్య నన్ను మరిచిపోరుకదూ?" కళ్ళెత్తి జయాధ్యక్ష కళ్ళవేపు చూసింది.
    
    "ఎంత మంచివాడీయన" అనుకుంది మనసులో.
    
    "ఛీ...ఛీ...మిమ్మల్ని మరచిపోవడమా! మీ తర్వాతే అందరూనూ" అంది.
    
    "నా చేతిలో చెయ్యేసి చెప్పండి" జయాధ్యక్ష తన చేతిని ముందుకు చాపాడు.
    
    ఒక్క క్షణం తటపటాయించింది అలక.
    
    అతని చేతిలో చెయ్యేసింది. జీవితంలో మొట్టమొదటిసారి ఒక పరాయి మగవాడిచేతిని స్పర్శించడం. ఆ స్పర్శ కొత్తగావుంది. ఆ మెత్తదనం వింతగా వుంది. ఆ మెత్తధనాన్నే మనసారా కోరుకుంటున్న ఆమె వయసు కుషన్ బెడ్ లా వూగుతోంది.

    ఆ కుడిచేతిని పట్టుకుని పైకెత్తి రెండు పెదవుల్తో ముద్దుపెట్టుకుని "ఐ లవ్ యూ అలకా" అన్నాడు జయాధ్యక్ష.
    
    "ఐటూ ఐటూ ఐటూ ఐటూ ఐటూ ఐటూ..." మూలిగింది అలక మనసు.

 Previous Page Next Page