Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 37
తేరు తిరిగి వచ్చుచుండగా దారినడుమ నొకసన్యాసి రాజకుమారున కెదురయ్యెను. గౌతముఁడాతనిని సూతునకుఁ జూపించి "చెన్నా! యీతఁ డెవఁ?"డని ప్రశ్నించెను సారథి "ఈయన సర్వసంగ పరిత్యాగి యగు యోగి. సంసారమును బరిత్యజించి సన్యాసియైనాడు. ఇంద్రియములను జయించి నాఁడు. ఈయన కెట్టి బంధములు లేవు" అని పలికెను. రాజనందనుఁడు పరివ్రాజకునివంక తదేకదృష్టితోఁ జూచి తలపంకించెను.
రథము రాజమందిరము చేరినది శుద్ధోదనుఁడు "కుమారా! నగరమున నేమేమి వింతలు చూచి వచ్చితివి?" అని గౌతమునడిగెను. "చూడవలసిన వన్నియు జూచియేవచ్చితి"నని తనయుఁడు తండ్రికి సమాధానమిచ్చెను. రాకుమారుని వాడిన వదనమండలమును, బాష్పపూరముతో నిండిన నేత్ర ద్వయమును, మహారాజు మానసమున కనుమానము గలిగించెను.
రాజనందనున కారాత్రి నిద్రపట్టలేదు. కన్ను మూసినదే తడవుగాఁ గలపై గలలు వచ్చుచుండెను. వీథుల యందు గాంచిన విషాద దృశ్యములే క్షణక్షణము గానుపించుచుండెను. "ఈ లోకమును శోకవిముక్తము చేయుటకు మార్గమెయ్యది? హింసాజర్జరిత మగు నీ విశాల సృష్టికి వముక్తి యెక్కడ? నేనేమి చేయవలెను? రాజునై రాజభోగముల ననుభవించుచు రత్న సింహాసనములపై గూర్చుండి కులుకుటయేనా నా కర్తవ్యము? ద్వేష రోష భూయిష్ఠ మయిన యీ మానవ సమాజమును పరస్పర ప్రేమతో బరిపూరితమును జేయకున్న నా జన్మమునకు సార్థకత యెక్కడిది?" ఈ విధముగా తర్క వితర్కములతో గౌతముని చిత్తము సంక్షుభిత మయ్యెను. క్షీరసాగరమున మథనముద్భూతమైనది. అమృతమే జనించునో హాలాహలమే పుట్టునో!
4
గౌతముఁడు తల్పమునుండిలేచెను. కన్నులు నులుముకొని నలుదెసల బరికించి మఱల బ్రక్కపైఁ బరుండెను. అతనికి గొలఁదిగా గునుకు పట్టినది. ఆ కలత నిద్దురలో నెవ్వరో దివ్యమూర్తి యతని నిట్లు ప్రబోధించెను. "రాజ కుమారా! ఎంతకాలమీ నిద్ర? యీ సంపదలు శాశ్వతములు కావు. విలాసములు విద్యుచ్చంచలములు. ఈ బంధములనుండి బైటపడుము. హింసానలదందహ్య మానమగు నీలోకమును నీ కారుణ్య సుధాధారలతో నభిషేకింపుము మానవహృదయ ద్వారములను ననురాగ తోరణములతో నలంకరింపుము. ప్రేమమూర్తిని బ్రతిష్ఠింపుము. లెమ్ము! మేలుకొనుము. ఇది నీ కర్తవ్యము. నిర్వర్తింపుము".
గౌతముఁడులికిపడి లేచెను ఆయన కా చంద్రశాల చెరసాలవలె గాన్పించెను. ఆ క్రీడాగృహము కారా గృహమువలె దోచెఁను. తక్షణమే యాతఁ డారాజ మందిరమును విడచి యరణ్యములకేగ దృఢనిశ్చయుఁడయ్యెను. ఎదురుగా సతీశిరోమణియైన యశోధరాదేవి మైమరచి నిదురించుచుండెను. అమాయకుఁడైన పసిబిడ్డ రాహులుఁడు తల్లి హృదయములోఁదల దూర్చుకొని శయనించియుండెను. ఆ యర్ధరాత్రమున శాశ్వతముగ సంసారమును ద్యజించి యరణ్యముల కేగసంకల్పించిన యా రాజనందనుఁడు కరుణామయ నయనములతో నొక్కమాటు తన యర్ధాంగివైపుఁ జూచెను. మధురమోహనమైన తన దేవి ముఖమును, నమాయకమైన యనుంగుబిడ్డ రాహులుని ముద్దుల మూతినిఁ గనుంగొని గౌతముఁడొకింత వ్యాకుల హృదయుండయ్యెను. ఒక్కమాటు తన చిన్నబిడ్డ చిగురుచేతులను ముద్దాడదలంచెను. కాని తల్లినిఁ గౌఁగలించుకొని యున్న తనయుని చేయి దీసినచో యశోధర మేల్కొని తన ప్రయాణమున కాటంకము కలిగించు నన్నసంశయముతో నందులకు సాహసింప లేకపోయెను. జీవితసర్వస్వముగాఁ దన్ను నమ్ముకొనియున్న తన యర్ధాంగలక్ష్మితన వియోగమునకై యెంత విలపించునో యని పెక్కు విధములఁ దలపోసెను. ఎట్టకేలకు హృదయమును గట్టిచేసికొని గౌతముఁడానిశీధమున రాజ్యశ్రీని, శ్రీమతిని, చిరంజీవిని విడిచిలోకము నుద్ధరించు నుద్దేశముతో నడవులకుఁ బయనమయ్యెను. గౌతముని కాళ్లు గడపలు దాటుటకుఁదడబడినవి. మెట్టు మెట్టునకు వెనుదిరిగి చూచుచు వియోగ భారముచేఁ గొట్టుకొనుచున్న గుండె నదిమిపట్టుకొని రాజనందనుఁడు రాజసౌధము నవరోహించెను.
మెల్ల మెల్లగా నశ్వశాలలోని కరిగి నిద్రించుచున్న చెన్నుని మేలుకొల్పెను. చెన్నుఁ డులికిపడి లేచి కట్టెదుట గౌతముం గనుంగొని యాశ్చర్యముతో నేదియో పలుకఁబోయెను. రాజనందనుఁడతనిని వారించి గుఱ్ఱమును గొని తెమ్మనెను; ఆ అర్ధరాత్రమున యువరాజునకు హయముతో నవసర మేలవచ్చెనో చెన్నున కర్థము కాలేదు. ఐనను రాజనందనున కెదురాడఁ జాలక చెన్నుఁడు గౌతమునకు మిక్కిలి ప్రియమైన కంటక మను నశ్వమును సంసిద్ధపరచెను. గౌతముఁడా హయము నధిరోహించి చెన్నునితోఁ గూడి కోటదాటి యరణ్యమార్గమును బట్టెను.
ఆ కటిక చీకటిలో గౌతముఁడు చాల దూరము పోయెను. ఒక్కచో నిల్చి హయము నవరోహించి తనకుఁ బ్రాణప్రదమైన యాతురంగమును బుజ్జగించి చెన్నున కప్పగించి యిట్లు పలికెను. "మిత్రుడా! నాకును మన శాక్యరాజ్యమునకును నేఁటితో సబంధము తెగిపోయినది. లోకము మేలుకొఱకుఁ బ్రపంచకళ్యాణము కొఱకు నేను సర్వమును బరిత్యజించి సన్యాసి నగుచున్నాను. నా తండ్రికి నాకడసారి నమస్కృతుల నందింపుము. నన్నతి కారుణ్యమునఁ బెంచి పెద్దజేసిన ప్రేమంపుఁదల్లి ప్రజావతి గౌతమికి నా యభివాదముల నర్పింపుము. నా జీవితేశ్వరి యగు యశోధరను ధైర్యముగ నుండు మనుము. చిన్న బిడ్డయగు రాహులునకు నా ముద్దులను దెలుపుము. నీవు చిన్నప్పటినుండియు నన్ను కడుంగడు భక్తిమై సేవింపుచుంటివి. నీ సేవకు నేనెంతయు కృతజ్ఞుఁడను; కన్నుల నీరు పెట్టకుము. కంటకముతో నింటికి జనుము".
గౌతముని వాక్యము లాలించినంతనే చెన్నునకు దుఃఖమాగలేదు. ఆతఁడు బాలునివలె వెక్కి వెక్కి యేడ్చెను. పరిపరి విధముల రాకుమారుని బ్రతిమాలెను. కాని తుదకుఁజేయునది లేక రాకుమారుని నాజ్ఞ శిరసావహించి యాతని పాదములకు నమస్కరించి హస్తములు ముద్దుగొని కంటకాశ్వముతో కపిలవస్తు పురమునకు మరలిపోయెను.
తెల్లవారిన వెంటనే కన్నులు తెఱచిచూచి ప్రక్కమీఁద బ్రాణనాథునిఁగానక యశోధర కలవరమునంది మహారాజున కావార్త యెఱింగించెను. శుద్ధోదనభూపాలుఁడును గౌతముఁడెచ్చటికిఁ బోయినదియు నూహింపఁజాలక చింతాక్రాంతుఁడై పరిపరి విధముల నాలోచించుచు నింతలోఁ గన్నుల నీరుగార్చుచు వచ్చు కంటకాశ్వము వెంట ఖిన్నవదనుఁడై యరుగుదెంచుచున్న చెన్నునిఁ గని సందేహందోళిత హృదయుఁడై సమీపించి సమాచార మంతయుఁ దేటతెల్లముగ దెలిసికొని గౌతముని సాహసకృత్యమునకు నెంతయు విలపించెను.
Previous Page
Next Page