Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 38


    కుసుమ కోమల హృదయయగు యశోధర మనోనాథుని మహాప్రస్థానవార్త యాలించినంతనే నేల వ్రాలి, కొంతవడికిఁ దెలిసి "హా నాథా! హాజీవితసహచరా! అయ్యో! ప్రభూ! నన్నిచట నొంటిగ డించి యరణ్యముల కేగితివా! నేనెట్లీ దుఃఖమును భరింతును? ఎట్లు జీవింతును? పోవునప్పుడొక మాట యైనఁ జెప్పిపోఁ దగదా? చెప్పిన పోనీయక యడ్డగింతునని సందేహించితివా? హృదయేశ్వరా! నన్నీ విధముగఁ బరిత్యజించి పోవుటకు నీకుఁ బాదము లెట్లాడెను? హృదయ మెట్లంగీకరించెను? నీవు నా మనోనాథుఁడవని తలంచితినే గాని జగన్నాథుఁడవుగాఁబోవుచున్నావని యెఱుంగనైతి"నని పెక్కు చందముల విలపింపసాగెను. రాజకుమారుఁడిట్లు సంసారమును ద్యజించి యరణ్యముల కేగెనని వినుటతోడనే కపిలవస్తు నగరమందలి యాబాలగోపాలము జనుల హాహాకారములు సలుపసాగిరి.


                                                5


    ఇఁక నా యరణ్యమున గౌతముఁడు కొంతదూరము నడచిపోయి "అనోమా" నదీతీరమునకుఁ జేరెను. అమూల్యము లగు దన యాభరణములను వస్త్రములను మార్గమధ్యమున నెదురైన బీదల కిచ్చి వారి జీర్ణ వస్త్రములను దాను ధరించెను. శిరోజములను ఛేదించి వైచుకొనెను. భిక్షాటనమున జీవితము గడుపుచు మునివృత్తి నవలంబించెను. సత్యాన్వేషణ తత్పరుఁడై పెక్కుమంది పండితులతో శాస్త్రార్థము సలిపెను. సన్యాసుల యొద్ద శుశ్రూష గావించెను. సమస్త సంప్రదాయములను, ధర్మముల మర్మములను గ్రహించెను. కాని వీనివలన గౌతమునకు సత్యమైన మార్గము గోచరింపలేదు; వాంఛితార్థము సిద్ధింపలేదు.
    గౌతముఁడట్లు నత్యాన్వేషణ తత్పరుఁడై తిరుగుచు మగధ రాజధానియగు రాజగృహ సమీపమునందున్న రత్నగిరి యను పర్వతమును జేరెను. ఒక దినముఁ గొందఱు గొల్లలు మేకల మందలను దోలుకొని యాపర్వతము ప్రక్కగా నరుగుచుండిరి. పాప మొక మేకపిల్ల కాలిలో ముల్లు గ్రుచ్చు కొనుటచేఁ దల్లితో సమానముగాఁ బరువెత్తజాలక మంద వెనుక మెల్ల మెల్లగాఁ గుంటుకొనుచుఁ బోవుచుండెను. కరుణామూర్తి యగు గౌతముఁడు కొండపై నుండి యీదృశ్యమును దిలకించి వడివడి పర్వతమును దిగివచ్చి యామేకపిల్లను గనికరముతో నెత్తుకొని మందవెనుకఁ జనుచుండెను; గొల్లలిది యంతయును వింతగాఁ జూచుచుండిరి. గౌతముఁడు వారితోఁ జనుచు "మీరీ మేకలమంద నెచ్చటకు దోలుకొని పోవుచున్నా?"రని యడిగెను. గొల్లలు గౌతమునితో "స్వామీ! మా దొరయగు బింబిసారుఁడు రాజగృహ నగరమున యజ్ఞ మొకటి చేయుచున్నాఁడు. ఆ యాగమునందు బలియిచ్చుటకై యీ మేకలను గొని పోవుచున్నా" మని చెప్పిరి.
    ఈ విధముగ మేకలమంద వెనువెంట గౌతముఁడు బింబిసారుని యజ్ఞశాలలోఁ బ్రవేశించెను. మసిపాతయందుఁ గట్టబడిన మాణిక్యమువలె మలిన వస్త్రములలో సైతము దివ్యతేజో విశేషముతో విరాజిల్లుచున్న యా విచిత్ర సన్యాసింగాంచి రాజగృహమందలి ప్రజలు పలు తెఱంగుల భావింపసాగిరి. ఆతనిం గనుంగొని యజ్ఞశాలలో బలియాగమునందు దీక్షితుఁడై యున్న బింబిసార మహారాజు విస్మయాక్రాంత చిత్తుఁడైయట్లె చూచు చుండెను. ఇంతలో యాజకులు బలులు సిద్ధము గావించిరి. మేకల కంఠముల నఱకుటకై కత్తులను బై కెత్తిరి. గౌతముఁడు హస్తమును బైకెత్తి "అయ్యా! హింస సలుపకుఁడు. నోరులేని జీవములను ప్రాణము దీసి పాపము నేల మూటకట్టుకొనెదరు. ఆగుఁడాగుఁ"డని కేక వైచెను. వారందఱు నాశ్చర్య చకితులై యతనివైపు దృష్టి సారించిరి. వెంటనే గౌతముఁడు బలిపీఠమును జేరి యొక్కింతయు సంకోచము లేక మేకల మెడలకు గట్టియున్న త్రాళ్ళ నూడదీసెను. తరువాత నాతఁడు రాజునాజ్ఞ గైకొని హింస పాపకారణమనియు, నహింసయే ధర్మములం దెల్ల యుత్తమోత్తమమగు ధర్మమనియు, దన మధుర వాక్సుధాధారలు గురియించుచు వారల యెదుట నుపన్యసించెను. ఆ మహాత్ముని మహోపన్యాసము విని యాజకులందరు తలలు వంచుకొనిరి. తమ ఖడ్గములను నొరలయం దుంచుకొనిరి. బింబిసారుఁడు గౌతమునకు సాష్టాంగ ప్రణామము నాచరించి తన తప్పిదమును క్షమింప బ్రార్థించెను. అది మొదలు "అహింసయే పరమ ధర్మము. జీవహింస నెవ్వరును జేయరా" దని తన రాజ్యమందంతట నారాజు చాటింపఁ బంపెను. యజ్ఞములందు జంతువధ చేయరాదని కఠినముగ శాసించెను.
    ఆ వచ్చిన బాలయోగి తన ప్రియమిత్రుఁడగు శుద్ధోదనుని నందనుఁడు గౌతముఁడని తెలిసిన వెంటనే బింబిసారుఁడు మిక్కిలి చింతించి తన మగధసామ్రాజ్యము నంతయు నాతనికి సమర్పించెద ననియు, మునివృత్తి మానుమనియు, పెక్కు తెఱంగుల వేడుకొనెను. కాని గౌతముఁడందులకు సమ్మతింపక తన యుద్దేశము నారాజున కెఱింగించి యచట నుండి మఱల నరణ్యముల మార్గము బట్టిపోయెను.
    తుట్టతుదకాతఁడు గయకు సమీపమునందున్న మహారణ్యమునఁ బ్రవేశించెను. అచ్చోటనైదుగురు తాపసులు నిరాహారులై ఘోరమగు తపమ్ము గావించుచుండుట గాంచి తానును వారి మార్గముననే యవలంబించి యత్యంత నిష్ఠాగరిష్ఠుఁడై క్రమక్రమముగ నాహారమును విసర్జించి యారుసంవత్సరములు దారుణమగు తపమాచరించెను. ఆ యైదుగురు తాపసులును గౌతమునిఁ దమ గురువుగ స్వీకరించిరి. క్రమముగా గౌతముని సుందర శరీరము కృశించిపోయెను. నరముల శక్తి సన్నగిల్లెను. రక్తమాంసము లెండిపోయెను. చిట్ట చివరకు గౌతముఁడు దనంతఁ దాను నిలుచుండుటకు సైతము రవంతయు నోపిక లేనివాఁడయ్యెను. దీర్ఘోపవాసములచే నాతఁడొకనాటి మధ్యాహ్నమున మండుటెండలో సొమ్మసిల్లి పడిపోయెను. అప్పుడు సుజాత యను నొక కాపువెలఁది యా శాక్యమునింగాంచి వనదేవత యని తలంచి శీతలోపచార ములచే సేదదీర్చి భక్తితోఁ బాయసమును సమర్పించి ప్రాణములు నిలిపెను. అది మొదలు గౌతముఁడు తన మార్గమును మరల్చుకొని మరల నాహారమును స్వీకరించెను. కాపువెలఁదియన్నమును దిని తమ గురువు భ్రష్టుఁడై పోయినాఁడని శిష్యులైదుగురు గౌతముని విడచిపోయిరి.
    ప్రతి దినము సుజాత సమర్పించు నాహారము నందు కొనుచు గౌతముఁడు తిరిగి సత్యమార్గాన్వేషణకై సంకల్పించెను. ఒకనాఁడొక యశ్వత్థవృక్షముక్రింద నాసీనుఁడై ధ్యానమునందుండ గౌతముని మనోనేత్రమున కేదియో సత్యజ్యోతి గోచరించెను. జ్ఞానదీపము వెలిఁగెను. ధర్మసూక్ష్మ మవగతమయ్యెను. గౌతముఁడు బుద్ధుఁడయ్యెను. ఆయన బోధమునకుఁ గారణమగు నా వృక్షము బోధివృక్షమున నొప్పెను.


                                6


    తరువాత గౌతముఁడు దాను దెలిసికొనిన ధర్మము లెవరికి బోధింపదగు ననియు, నిందలి యథార్థమును నెఱుంగ గల యెవరి కుండుననియు యోచించెను మొదట తన్ను గురువుగా స్వీకరించి, పిదప, వదలిపోయిన శిష్యులైదుగురు కాశీపట్టణమునకు సమీపమున "మృగదావ"మునఁ దపమొనర్చు చున్నారని విని వారల నెట్లేని స్వీయమార్గమునకుఁ ద్రిప్ప దలచిఁ బుద్ధుఁడావనమునకుఁ బోయెను.

 Previous Page Next Page