Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 36


    చిన్నతనము నుండియు సిద్ధార్థుని స్వభావము శుద్ధోదన భూపాలు నంతరంగమున కనుమానము గలిగించుచుండెను. జ్యోతి శ్శాస్త్రవేత్తలు వచించినట్లు తన నందనుఁడు సన్యాసి యగు నేమోయను సందేహ మా రాజ సంక్రందనుని డెందమును డిందు పఱచుచుండెను. భోగ విముఖమును రాజ వైభవ పరాజ్ముఖము నగు రాజకుమారుని మానసమును మరల్చుటకై మహారాజెన్నియో భంగులఁ బ్రయత్నము సలిపెను.
    హృద్యము లగు నుద్యానవనముల నేర్పాటుచేసి యందు సుందరము లగు మందిరములను నిర్మించెను. మహోన్నతములగు మణిమయ ప్రాసాదములను గట్టించెను. హృదయజ్ఞులును, కార్య చతురులను, సమయా సమయ విదులునగు దాస దాసీ జనమ్ముల వేనకువేలు నియమించెను. మతిమంతులగు మంత్రులచే బోధింపఁజేసెను. స్నేహ భాజనులగు మిత్రులచేఁ జెప్పించి చూచెను. కాని రాజనందనుని స్వాంతము రవ్వంతయు మార్పు నందలేదు. విలాస సౌధములును, వినోద మందిరములును, విహార మంటపములును, శరచ్చంద్రచంద్రికాధౌతములగు చంద్రశాలలును, రూపరేఖా విలాస సముపేతులగు నంగనామణుల యాటపాటలును మన గౌతముని చేతమునకు బ్రీతి దాయకములు గాకపోయెను.
    రాజకుమారుని విరక్తి నానాటికి నధికమగుట గాంచి శుద్ధోదన భూపాలుడిఁక నాలసించిన లాభము లేదని మంత్రులను బిలిపించి గౌతమునకు యౌవరాజ్య పట్టాభిషేకము సేయ నాలోచించెను. కాని గౌతముఁ డందుల కియ్యకొనలేదు. కుమారుని యభిప్రాయమునకు నప్పుడమిఱేఁడు కడుంగడు నొచ్చుకొని తన యనంతరము శాక్య రాజ్య సింహాసనము నదిష్ఠించి ప్రజలఁ బాలించవలసిన గౌతముఁ డిట్లు రాజ్య కాంక్షాపరాఙ్ముఖుఁ డగుటకు శోకించి, పెండ్లి చేసినంగాని పిచ్చి కుదరదని పుత్రునకు వివాహము గావింపఁ గృత నిశ్చయుఁడయ్యెను.


                                3


    శుద్ధోదన మహీనాథుఁడు మంత్రులతో నాలోచించి తన రాజ్యము నందున్న రమణీయ రూప రేఖా విలాసవతులగు రాజ పుత్రికల నందఱ రావించి వారలయందు గౌతమున కిష్టమగు కన్నియ నాతనికిచ్చి పరిణయము సేయ నిశ్చయించెను. మహారాజు నాజ్ఞానుసారముగా నాకన్నియలందఱు రాజధానియగు కపిలవస్తు నగరమున కరుదెంచిరి.
    నాఁడు శాక్యుల పండుగ రోజు. సర్వాలంకార సముపేతముగ సభా మంటపము మధ్య స్వర్ణ సింహాసనముపై రాజకుమారుఁడాసీనుఁడై యుండెను. వాని కెదురుగ బంగారు పళ్లెరములనిండ రత్నాభరణములు, ముత్యాల హారములు, పగడాల దండలు, చీనిచీనాంబరములు నమర్చఁబడియుండెను. ఒక్కొక్క రాకుమారి వచ్చి గౌతముని ముందు నిలిచి యాతఁడొసఁగు బహుమానముల సవినయముగ నందుకొని నమస్కరించి చనుచుండెను. ఈ విధముగ రాజ పుత్రికలందఱు బహుమతులందుకొనుచుండిరేగాని వారి యందెవరును రాకుమారు నాకర్షింపఁగలిగిన వారు లేకపోయిరి.
    ఇంతలో సమస్త శుభ లక్షణ సమన్వితయు, లలిత లావణ్యవతియు నగు యశోధర యను రాజపుత్రిక రూపొందిన ప్రేమ సుధవలె వినయ వినమిత గాత్రయైవచ్చి యువరాజు ముందు నిలచెను. స్వర్గమునుండి దిగివచ్చిన సౌందర్య దేవతవలెనున్న యాలలనాలలామకు కానుకల నొసంగుటకై గౌతముఁడు పళ్లెమూలా వంకఁజూచెను. కాని వస్త్రాభరణములన్నియు అయిపోయెను. వెంటనే యారాజ నందనుఁడు తన కంఠమునందలి పచ్చలపతకమును దీసియా లావణ్యవాతికి బహూకరించెను. ఆ సమయమున వారివురును పరస్పరావ లోకనములఁ బరస్పరము బద్ధానురాగులైరి.
    అన్ని విధముల తన తనయునకుఁ దగిన యంగనామణి యశోధరయే యని శుద్ధోదనుఁడు సంతసించెను. యశోధరా గౌతముల వివాహము మహా వైభవముగా జరిగినది. ఆ రాజన్య చంద్రుఁడు తన ముద్దుల కుమారుని, ముద్దుల కోడలినిఁగాంచి మిక్కిలి యానందము నంది వారికై రోహిణీ నదీతీరమున మూడు మహోన్నత సౌధములను నిర్మించెను. అందు నానంద సముద్రమున నోలలాడుచున్న నూతన దంపతులం గనుంగొని మహారాజు స్వాంతము కొంత శాంతి వహించెను. ఇట్లు కొలఁది కాలము గడచినది. ఆ యువ దంపతులకు రాహులుడను నొక చక్కని కుమారుఁడుదయించెను.
    ఒక దినము రాజనందనుఁడగు గౌతముఁడు జనకుని యనుజ్ఞ గైకొని నగర సందర్శన కౌతూహలముతో బయలుదేరెను. సారథియగు చెన్నుఁడు రథ్యముల నడుపుచుండ రాజనందనుఁడు రథముపై గూర్చుండి వీథులందలి వింతలు విశేషములు వీక్షించుచుండెను. అమూల్య వస్త్రాభరణములతోఁ దళతళ లాడుచు సౌధోపరిభాగముల విహరించు ధనికులను గాంచెను; జీర్ణవస్త్రములతో శిథిలాంగములతో నాకట మలమలమాడుచున్న నిరుపేదల నిరీక్షించెను; ఆ కాశముల నంటు భర్మహర్మ్యముల నాలోకించెను; పడిపోవుచున్న పూరిపాకలను పరికించె.
    క్రమ క్రమముగా రథము రాజవీథులను గడిచిపోవు చుండెను. ఇంతలో మూఁడు కాళ్ళ ముదుసలి యొకఁడు ముడుతలు వడిన యొడలితో గడగడ వడకుచు వంగిన నడుము నీడ్చుకొనుచు నెదురు వచ్చెను, రాజకుమారుఁడు సారథినిఁజూచి "చెన్నా! ఈ వికార స్వరూపమేమి?" అని యడిగెను. చెన్నుఁడు "రాజకుమారా! వీఁడొక వృద్ధుఁడు. వయో భారముచే వీని నడుము వంగిపోయినది. వార్థక్యముచే వీని యొడలు ముడుతలు పడినది. కొంత కాలమునకు మనము సైతమిట్లే యగుదు" మని యనెను. రాజనందనుఁ డా మాటలు విని విస్మయమందెను. అరదము మఱి కొంచెము ముందుకు సాగినది. ఆ సమయమున దుర్గంధ దూషిత సర్వాంగుడగు నొక రోగి గౌతమ కుమారుని కన్నులఁబడెను. గౌతముఁ డాతనిం గాంచి "సారథీ! వీడెవఁడు? వీని మేనంతము నీగలతో నిండియున్నదేమి? కాయమునిండ గాయములేమి?" యని చెన్నుని బ్రశ్నించెను. చెన్నుఁడునవ్వుచు "నరేంద్రనందనా! వీఁడొక వ్యాధిగ్రస్తుడగు మనుష్యుఁడు. వీని శరీరమంతయుఁ గుష్ఠురోగముచే నిట్లు చెడిపోయినది. పూర్వ మొకప్పుడు మనవలె వీఁడును మంచి దేహము కలవాఁడే" యని వాక్రుచ్చెను. రాజనందనుఁడు వేడి నిట్టూర్పు బుచ్చెను.
    స్యందనము ముందునకు సాగిపోయినది. నలుగురు మునుష్యులొక శవమును మోసికొని వచ్చుచుండిరి. ఆ విచిత్ర దృశ్యమును గాంచినంతనే రాచపట్టి "అదియేమి చెన్నా! వీరీమనుష్యు నిట్లు మంచముపై బంధించి మోసికొని పోవుచున్నా రెక్కడికి? వీఁడట్లే కదలక మెదలక పడియున్నాడేమి యద్భుతము? వీని వెనువెంట నీ యువతీమణులందఱు క్రొమ్ముడులువీడ గుండెలు బాదుకొనుచు గోలపెట్టి యేడ్చుచున్నారేమి?" అని యడిగెను. సూతుడు శుద్ధోదన పుత్రుని యమాయత్వమునకు వింతపడి "యువరాజా! ఇది యొకశవము; ప్రాణముపోగా మిగిలిన శరీరమిది. ఇక నిది యెప్పటికిని కదలదు మెదలదు. కొంతకాలమునకు మనమందరము నిట్లేయగుదు"మని పలికెను. శాక్యనంద నుఁడా వాక్యములకు వెఱగుపడి చేతులతో ముఖము కప్పుకొని "యీ దుఃఖమయ ప్రపంచము నేనికఁ జూడజాలను. రథము రాజమందిరమునకు మరలింపు" మని సారథితో బలికెను.

 Previous Page Next Page