Previous Page Next Page 
వ్యూహం పేజి 36


    అలా ఆలోచించడం నచ్చింది శక్తికి.

 

    ఇందులో భాగమేనేమో మహిత తనతో మాట్లాడ్డం. ఇందులో భాగమేనేమో. ఆ ధర్మారావుగాడు అలా చీదరించుకున్నట్టుగా మాట్లాడ్డం.

 

    మహిత బాగానే ఉంటుంది కదూ-

 

    ఆ వెంటనే-

 

    మేనమామ కూతురు జ్ఞాపకాన్ని కొచ్చింది.

 

    పడితే మేనమామ కూతుర్నే పట్టాలి. అంతే తప్ప... ఇలాంటి వాళ్ళనా... రేపు తను ఉద్యోగంలో కెళ్ళాక ఇలాంటివాళ్ళు వందలమంది తన చుట్టూ తిరగరూ.

 

    కానీ-

 

    మహితలో ఏదో ఆకర్షణ వుంది. ఏదో గ్రేస్ వుంది.

 

    మహితలోనే కాదు, ప్రతి అమ్మాయిలోనూ ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ లేకపోతే, అమ్మాయే కాదు. కాని మహితలో గ్రేస్ వుంది. అది మిగతావారిలో లేదు.

 

    ఒరే ఫూల్! ఎట్రాక్షన్ కు లొంగిపోకురోయ్. నీ లక్ష్యం- మేనమామ ఆస్తి. నీ టార్గెట్- మేనమామ కూతురు.

 

    నువ్వు, ఇవాలిటి గురించి ఆలోచించకు... రేపటి గురించి ఆలోచించు.

 

    రేపు-

 

    నీ స్వప్నం నువ్వు నిజం చేసుకునే రోజు-

 

    "రేపు..."

 

    అతని అంతరాత్మ ఎలుగెత్తి అరిచింది. హెచ్చరించింది. దాంతో మహిత తాలూకూ ఆలోచనల్ని తరిమేసాడు.

 

    అటో ఇటో రేపు తేలిపోతుంది కదా. చూద్దాం. కంగారెందుకు- టీ తాగి బిల్లిచ్చి బయటికొచ్చాడు శక్తి.

 

    ఇప్పుడేం చేయాలి?

 

    సాయంత్రం మేనమామ రమ్మన్నాడని చెప్పి ఇరుక్కున్నాడు. అనవసరంగా హోటల్ రూమ్ ఖాళీ చేసేసాడు తను.

 

    ఎక్కడో నాలుగు మెతుకులు కతికి, ఆ హోటల్ కెళితే అయిడియా బేషుగ్గా నచ్చింది శక్తికి.

 

    జేబులో చెయ్యిపెట్టి చూసుకున్నాడు.

 

    ఇరవయ్ రూపాయల నోటు కనిపించింది. మిగతా డబ్బులన్నీ భగవాన్ రూమ్ లో సూట్ కేస్ లో వున్నాయి.

 

    ఇప్పుడెలా?

 

    ఈ రాత్రి ఏం చేయాలి? ఎక్కడుండాలి?

 

    ఓ అరగంటసేపు కబ్బన్ పార్క్ ప్రాంతంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ మనుషుల్ని, షాపుల్ని, కార్లనీ, కరెన్సీ కాగితాల విసుర్లనీ చూస్తూ గడిపేసాక...

 

    అయిడియా వచ్చింది శక్తికి.

 

    మళ్ళీ ఫస్టుషోకి సినిమాకెళిపోతే...?

 

    వండ్రఫుల్ అయిడియా... సినిమా విడిచి పెట్టగానే, నేరుగా బస్సెక్కి, భగవాన్ గాడి దగ్గరికెళతాను. మేనమామని కల్సి, మాట్లాడి వచ్చేసానని చెప్పేస్తాను. పిచ్చి భగవాన్ ఆ మాటల్ని, చచ్చినట్లు నమ్మేస్తాడు.

 

    వెంటనే...

 

    థియేటర్ లోకి అడుగుపెట్టాడు. టిక్కెట్టు తీసుకొని, లోనికి అడుగుపెట్టాడు.

 

    సీట్లో కూర్చున్నాక తెలిసింది... సినిమా పేరు కూడా చూడకుండా లోనికొచ్చాడని- హిందీ సినిమా.

 

    ఏం అర్థం కాలేదు. ఎవడు, ఎవడికి, బాబో, మావో, ఎవరు హీరోయో, ఎవరు విలనో, ఏమిటో ఏం అర్థం కాలేదు. భగవాన్ గాడికి ఇంగ్లీషు సినిమా, తనకి హిందీ సినిమా ఒక్కటే... నవ్వొచ్చింది. గంట గడిచింది.

 

    సినిమా ఏం నచ్చలేదు శక్తికి.

 

    ఇంట్రవెల్లో వెళ్ళిపోదామనుకున్నాడు. ఎప్పుడు లైట్లు వెలుగుతాయా అని ఎదురు చూస్తున్నాడు.

 

    ఇరవై నిమిషాల తర్వాత లైట్లు వెలగడం, శక్తి లేచి నిలబడి చుట్టూ చూసి, బయటికి రాబోయి.

 

    డంగని కంగు తినేసాడు.

 

    తన సీటుకి, రెండు సీట్ల వెనకాల ఎవరో ఒక పెద్దావిడతో కబుర్లు చెప్తూ మహిత.

 

    శక్తిని చూడగానే మహిత కూడా ఆశ్చర్యపోయి, పలకరించడానికి, లేచి ముందుకు రాబోతున్న పరిస్థితిలో...

 

    గబగబా, త్వరత్వరగా బయటికొచ్చేసాడు శక్తి.

 

    థియేటర్లోని మహితకు ఏమీ అర్థం కాలేదు. శక్తి అయితే, తనని విష్ చేయకుండా వెళ్తాడా?

 

    శక్తి కాడేమో....

 

    బయటికొచ్చి, పరుగులాంటి నడకతో దారిలో వస్తున్న సిటీ బస్సెక్కేసాడు శక్తి.

 

    అప్పటికిగానీ, మనసు కుదుటపడలేదు.

 

    తను అనవసరంగా సినిమా కెళ్ళాడు... కోరి కోరి పులినోట్లో తల దూర్చడమంటే. ఇదేనేమో... రేపు మహిత.

 

    మేనమామ ఇంటికి వెళ్ళకుండా, సినిమా కెందుకెళ్ళేరని అడిగితే ఇంతకీ... తను తనేనని మహిత గుర్తుపట్టే ఉంటుందా... ఎందుకు గుర్తుపట్టదు.

 

    ఇలాంటి వాటిలో ఆ పిల్ల జీనియస్.

 

    "టిక్కెట్ సాబ్" కండక్టర్ పలకరింపుతో ఆలోచనల్ని కట్ చేసాడు.

 

    "ఎక్కడికెళుతుంది" అడిగాడు శక్తి.

 

    "మీరెక్కడికెళ్ళాలీ."

 

    "చామరాజ్ పేట..."

 

    "ఇది అటు వెళ్ళదు... మాగాడి వెళుతుంది" సీరియస్ గా చెప్పాడు కండక్టర్.

 

    "మాగాడి నుంచి చామరాజ్ పేట్ నడిచి వెళ్ళొచ్చా?"

 

    "వెళ్ళొచ్చు... కానీ... ఓ వారం రోజులు పడుతుంది. చేరేసరికి, చూడు బాబూ సిటీకి కొత్తా."

 

    అవునన్నట్టు తలూపాడు శక్తి.

 

    వెంటనే బస్సాపాడు కండక్టర్.

 

    "మూడో నెంబర్ బస్సెక్కండి."

 

    మంచివాడులా వున్నాడు పాపం. ఓ అరమైలు నడిచాడు శక్తి. ఎక్కడా బస్టాపు కనిపించలేదు.

 

    అ తర్వాత ఓ బస్సు కనబడితే అడగడానికి ఎవరూ కనిపించకపోతే...

 Previous Page Next Page