రాజేంద్ర ఒక్కొక్కమాట వెనకున్న పరిస్థితిని అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది ముగ్ధ.
"మీ లోపాల్ని మీరు సవరించుకోడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా?"
సూటిగా అడిగిన ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు రాజేంద్ర.
"లోపం తెలిసి సవరించుకోలేక పోవడం, కనీసం సవరించుకోడానికి ప్రయత్నించక పోవడమే అపజయానికి నిదర్శనం చెయ్యాల్సిన పనిని పైపై అనుకోవడం వేరు లోన అనుకోవడం వేరు మీరు ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిగా ఉండాలని స్థిరంగా అనుకున్నప్పుడు ఆ ముద్ర మనస్సులో స్థిరంగా పడుతుంది. ఆ స్థిరంగా పడిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోదు. మిమ్మల్ని జీవితాంతం విజయంవేపు నడిపిస్తుంది. అవ్వొచ్చులే కావొచ్చులే అని ఉత్తుత్తినే అనుకోవడంవల్ల మీరేమీ కాలేరు. అందువల్ల ముందు మీరు ఏంచెయ్యాలనుకుంటున్నారో స్థిరంగా చిత్తశుద్దితో అనుకోండి.
"అనుకున్నాక" ఆసక్తిగా అడిగాడు రాజేంద్ర.
"ఎలాంటి అపజయాలైనా ఎదుర్కోడానికి సిద్దంగా ఉన్నాను" అని అనుకోండి.
"అనుకున్నాక..."
"సాధారణంగా మనిషిని కొన్ని భయాలు నిత్యం పీడిస్తుంటాయి. అవ్వేమిటంటే పేదరికం, విమర్శ, అనారోగ్యం, ప్రేమలో పరాజయం, వృద్దాప్యం, చావు.
తను పేదవాడు కాబట్టి తనేమీ చెయ్యలేడని కొంతమంది అనుకుంటారు. తనని అందరూ విమర్శిస్తున్నారు కాబట్టి తఃనేమీ చేయలేడని మరి కొందరు అనుకుంటారు. తనని నిత్యం అనారోగ్యం పీడిస్తోంది కాబట్టి తనేమీ చేయలేడని మరికొందరానుకుంటారు. ప్రేమలో ఓటమి, వృద్దాప్యం చావు... ఇవ్వేమీ నిజమైన కారణాలు కావు ఇవ్వన్నీ కల్పించుకున్న కారణాలు.
ప్రపంచంలో ఎంతోమంది అంగవికలలు ఎన్నెన్నో అద్భుతాలు సాధిస్తున్నారు. అలాంటప్పుడు అన్నీ వుండి మీరు మానసిక అంగవికలత్వం పొందడం అన్యాయమని మీకెప్పుడూ అన్పించలేదా..."
"నిజమే" ఒప్పుకున్నాడు రాజేంద్ర ప్రసాద్.
రాజేంద్ర ప్రసాద్ నెమ్మదిగా తనవేపు తిరుగుతుండటం, చాలా ఆనందంగా వుంది ముగ్ధకు అతన్ని ఇంకా పూర్తిగా ఇన్ స్పైర్ చేయాలి, నిర్ణయించుకుంది ముగ్ధ.
బ్రిటన్ టీ.వీ. డైరెక్టర్ రొన్నీ అనే వ్యక్తి గురించి విన్నారా మీరు? అతను తన తల్లి గర్భంలోంచి చేతులులేకుండా పుట్టాడు. చేతులు లేని రొన్నీ బాల్యంలో ఎన్నో అవహేళనలకు గురయ్యాడు. తన అంగ వికలత్వాన్ని నిత్యం వెక్కిరించే ఈ ప్రపంచానికి తనేమిటో, తన శక్తేమిటో చూపించాలనుకున్నాడు. స్కూల్లో టీచర్, బుద్దిమంతులయిన అబ్బాయిలందరూ చేతులు ముడుచుకుని కూర్చోవాలని హెచ్చరించినపుడు, రొన్నీ ఏం చేసాడో తెల్సా కాళ్ళు పైకెత్తి ముడుచుకున్నాడు. అప్పుడే రొన్నీ లోని వ్యక్తిత్వం టీచర్లు గుర్తించారు. ఆనాటినుంచీ రొన్నీ జీవిత సంగ్రామం ప్రారంభమయింది.
చేతులు లేకపోతేనేం? రొన్నీ మనసులో ఎన్నో ఆలోచనలున్నాయి. వాటిని నెరవేర్చుకోగలనన్న అపారమైన ఆత్మవిశ్వాసం ఉంది. అప్పుడతను ఏం చేస్తాడో తెల్సా? పాదాల్నే చేతులుగా చేసుకున్నాడు. చదువులోనూ, ఆటల్లోను, ఈతల్లోనూ అన్నింట్లోనూ తనే 'ఫస్ట్' వచ్చాడు. చేతులు లేనంత మాత్రాన నేను చేతగాని వాడ్ని మాత్రంకాదు అటుంటాడు రొన్నీ.
నన్నెపుడూ ఇన్ స్పైర్ చేసే వ్యక్తి రొన్నీ, ఇదెందుకు చెప్పానంటే అంగవికలత్వం కన్నా ప్రమాదమయింది మానసిక అంగవికలత్వం...
"మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే సమయం వచ్చింది. ఈ సమయాన్ని వృధా చేసుకోకండి."
చెప్పడం ఆపి అతని కళ్ళల్లోకి చూసింది ముగ్ధ.
"ఇన్నేళ్ళ నా జీవితంలో మీలా నన్ను ఇన్ స్పైర్ చేసిన వ్యక్తి ఎవరూ లేరండి. మిమ్మల్ని చూస్తుంటే, మీ మాటలు వింటుంటే, కొండను పిండి చేయగలనన్న నమ్మకం కలుగుతోంది నాకు... దయచేసి, నా వెనక మీరుంటారా..." చాలా వినయంగా అడిగాడు రాజేంద్ర ప్రసాద్.
ఆ మాటకోసమే చూస్తోంది ముగ్ధ. తన ఛాలెంజ్ కు తను చేరువగా వచ్చేసినట్టు అనిపించింది.
ఆ అమ్మాయి మనసు ఆనందంతో నిండిపోయింది.
"మీ వెనక కాదు. అవసరమైతే మీ రూంలోనే వుంటాన్నేను. ఈ దేశం గొప్పగా పొగిడే ఒక బిజినెస్ మాగ్నట్ మీలో ఉన్నాడు."
"బాగానే వుంది ఏ బిజినెస్ చేయాలన్నా....కనీసం పెట్టుబడి వుండాలి కదా!.... అదెలా."
"పెట్టుబడి నేనిస్తాను. బిజినెస్ చేస్తారా" సీరియస్ గా అడుగుతున్న ముగ్ధవేపు, స్థిరంగా చూసాడు రాజేంద్ర.
"చేస్తాను" నమ్మకంగా చెప్పాడు.
మరేం మాట్లాడలేదు ముగ్ధ తన మెడలోవున్న ఒంటిపేట బంగారు గొలుసుతీసి అతనిచేతిలో పెట్టింది.
"ఇదే పెట్టుబడి దీని ఖరీదెంతో తెల్సా.... మూడువేల రూపాయలు. మళ్ళీ మనం వారం తర్వాత ఇక్కడే కలుద్దాం. ఈ మూడువేల పెట్టుబడితో మీరు ఆరువేల రూపాయలు సంపాదించాలి. ఏం చేస్తారో నాకనవసరం" ఆ మాటలు అంటున్న ముగ్ధవేపు విచిత్రంగా, ఆశ్చర్యంగా, సంభ్రమంగా చూశాడు రాజేంద్రప్రసాద్.
తన అభివృద్దిని నిత్యం కోరే తన తల్లి గుర్తుకొచ్చింది రాజేంద్రకు.
ముగ్ధలో తల్లి కన్పించింది.
అతనికళ్ళలో తడి ఆ తడిని గమనించింది ముగ్ధ.
* * * * *
ఆ నీలగిరి తోటలోకి వచ్చిన దగ్గర్నించి ముగ్ధ, రాజేంద్రప్రసాద్ లను గమనిస్తూ వారికి దూరంగా పిట్టగోడమీద ఓ నలుగురు కుర్రాళ్ళు వాళ్ళనే అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నారు.
అందులో ఒకడు రిపోర్టర్ పర్నేష్ మిగతా ముగ్గురూ అతని ఫ్రెండ్స్.
"చూసారా ఇప్పుడైనా నమ్మకం కలిగిందా నేను సీరియలైజ్ చేస్తున్న ఈ న్యూస్ హిట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ అవుతుందన్న నమ్మకం నాకుంది. అందుకే మీ కోపరేషన్ అడుగుతున్నాను. ఎందుకంటే ఎక్కడెక్కడో వుండే నలుగుర్ని నేను కవర్ చెయ్యడం అసాధ్యం. అందుకే మీకయ్యే ఖర్చంతా నేనే భరిస్తాను. ఒప్పుకుంటారా" ముగ్గురివేపు చూస్తూ అడిగాడు పర్నేష్.
"భలే ఇంటరెస్టింగ్ గా వుందిరా. మిగతా ముగ్గురూ ఎక్కడెక్కడున్నారు" అడిగాడు ఆనంద్.
"ఎక్కడున్నారో చెపుతాను. తీసికెళతానుగానీ ముందు నేను చెప్పేది వినండి. నలుగురూ నలుగురమ్మాయిల్నీ ఇవ్వాళా నుంచి అబ్జర్వ్ చెయ్యాలి. ఇందులో అవుటాఫ్ స్టేషన్ వెళ్ళే అమ్మాయిల్ని నేనూ, శివాజీ ఫాలో అవుతాం. ఇక్కడవుండే ముగ్దని, సురభిని ఆనంద్, రామ్ ఫాలో అవుతారు. ఓ.కే." చెప్పాడు పర్నేష్.