హమ్మ! భగవాన్! ఏ క్షణంలో, సాయంత్రం మేనమామ ఇంటికి, వెళ్ళాలని తను అబద్దమాడేడో... అప్పట్నించి, వీడు తనని రాకాసిబల్లిలా అంటుకుపోయి, అదే వల్లి వేస్తున్నాడు...
ఏం చేయాలి?
మహిత ఉన్నప్పుడు అదే పాట... లేనప్పుడు అదే పాట... వీడిబారి నుంచి తనను తాను రక్షించుకోవడం ఎలా?
"సాయంత్రం వెళ్ళరా?" మళ్ళీ అడిగాడు భగవాన్.
ఆ మాటకి పిచ్చికోపం వచ్చింది శక్తికి. షర్టూ, ఫాంటూ విప్పేసి భగవాన్ గాడిని, తన్నెయ్యాలన్నంత కోపం వచ్చింది.
"వెళ్ళనా... ఎందుకు వెళ్ళను... వెళతాను..." అసహనంగా అన్నాడు.
"ఈ గొడవలో పడి, అసలు విషయం మర్చేపోయాను బాస్... మధ్యాహ్నం... పర్మిషన్... దొరికేసింది... హోటల్ కెళ్ళి, భోంచేసి, ఏదైనా మంచి, ఇంగ్లీషు సినిమాకి చెక్కేద్దాం పదండి... మరోక్షణం ఇక్కడుండకూడదు..." కేంటిన్లోంచి శక్తి చెయ్యి పట్టుకుని బయటికి లాక్కొచ్చాడు భగవాన్. చెయ్యి పట్టుకుని లాన్లో నడిపిస్తున్న భగవాన్ వేపు కోపంగా చూసి, చెయ్యి లాక్కొని...
"అప్పుడప్పుడు... నీకు మంచీ, మర్యాదా తెలీదయ్యా... అని మర్చిపోతుంటావ్" విసుక్కున్నాడు శక్తి.
వెంటనే అర్థమైపోయింది భగవాన్ కి.
"కాబోయే ఎం.డి. గారి చేతులు పట్టుకుని నడవడంలో ఎంత మజా వుంటుందో కదు... సర్... వెధవలు... వీళ్ళంతా... వెర్రి వెంగళప్పల్లా చూస్తున్నారు చూడండి సర్. నాకెంత థ్రిల్ గా వుందో" పొగిడేసాడు భగవాన్.
ఆ మాటతో కాసేపు మేనేజింగ్ డైరెక్టర్ లా నడవడం మొదలెట్టాడు శక్తి.
మెయిన్ గేటువరకూ, అలాగే నడిచాడు. ఆ తర్వాత మామూలు శక్తి అయిపోయాడు.
భోంచేసాక మహాత్మాగాంధీ రోడ్ కి వెళ్ళి బస్సెక్కారు ఇద్దరూ.
* * * *
థియేటర్ లోంచి, బయటికొచ్చి పక్కనే ఉన్న ఇరానీ రెస్టారెంట్ లోకి దూరారు శక్తి, భగవాన్.
"దో ఛాయ్... లావ్ భాయ్" అరిచాడు భగవాన్.
అప్పుడు సాయంత్రం ఐదు దాటింది.
"నువ్వు... సదాశివ నగర్ వెళ్ళాలి కదా..." అని అడిగాడు భగవాన్.
చాచి కొట్టేద్దామనుకున్నాడు. అంత పిచ్చికోపం వచ్చింది శక్తికి.
"అవును... వెళ్ళాలి"
"సిటీ బస్సులోనే వెళతావు కదూ"
"అవును"
"అదిగో అక్కడే సిటీ బస్సులాగుతాయి. అక్కడాగిన ఏ బస్ ఎక్కినా చాలు. సదాశివనగర్ తీసికెళతాయి. మళ్ళీ మనం రేపుదయమేనా కలవడం..."
ఆ మాటకి ఆముదం తాగినవాడిలా మొహం పెట్టాడు శక్తి.
"రేపుదయం మీరు ఛైర్మెన్ గారి కారులోనో, బేబీగారి కారులోనో వస్తారనుకుంటాను..."
జవాబు చెప్పలేదు శక్తి.
అదంతా అబద్ధమని చెప్పేద్దామనిపించింది శక్తికి. చెప్పేస్తే తను లోకువయిపోడు. రేపు మహిత తనని పలకరించక పోవచ్చు.
పట్నంలో ఏంటో అనుకున్నాడు తను.
నటిస్తూ బతకడమంటే ఇదన్నమాట. ఇవాళ నుంచి, ఇక్కడ నుంచి తను నటిస్తూ బతకడంలోకి అడుగుపెడుతున్నాడన్న మాట.
అంతవరకూ బేలగా ఉన్నవాడు తను ఛైర్మెన్ మేనల్లుడన్న విషయాన్ని తనకు తాను ఇంజెక్ట్ చేసుకుని స్టిఫ్ గా అయిపోయాడు.
* * * *
మహా ప్రపంచంలోని ఒక జంక్షన్ లో మొట్టమొదటిసారి నిల్చున్న శక్తికి జీవితంలోని ప్రారంభం ఎంత అయోమయంగా వుంటుందో, స్పష్టంగా అర్థమైంది. ఎవరు కలగన్నది వారికి అందుబాటులోకి రాదేమో... ఎవరు సాధించుకున్నదే వారికి వాస్తవంలో దక్కుతుందేమో... కలల్లోంచి క్రమంగా వాస్తవంలోకి రావటం మొదలయింది శక్తిలో.
ఖర్చులేని కలల్ని నమ్ముకోవటం కంటే కష్టపడి ఆ కలల్ని నిజం చేసుకొనేందుకు ప్రయత్నించటమే మంచిదేమో.
మళ్ళీ ఇరానీ రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు.
మేనమామ అనే వెంకట నారాయణ తనను వెంటనే ఎందుకు, రిసీవ్ చేసుకోలేదు?
నిజంగా మేనమామేనా? డూప్లికేటా? తనని నందిగామ నుంచి తగిలేద్దామని అమ్మ అలా చేసిందా?
తగిలేస్తే ఈ పేరే ఎలా తెలిసి ఉంటుంది.
పేపర్ చూస్తే తెలీదా? లేదు... లేదు.. అలా అయితే లెటరెలా ఇస్తుంది. ఇచ్చినప్పుడు తెలీకుండా ఎందుకు పంపుద్ది? అమ్మ... బేబీ అని మేనకోడలు పేరు కూడా చెప్పింది. అది పేరు కాదేమో... ముద్దు పేరేమో...
ఏది ఏమయినా అమ్మ చెప్పింది అబద్ధం కాదు, వంద శాతం నిజం... అమ్మ అబద్ధాలు చెప్పదు. ప్రాణం మీద కొచ్చినా సరే.... మరి వెంకట నారాయణ తనకెందుకు అపాయింట్ మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు?
నిజంగా బిజీయా? బిజినెస్ మాగ్నెట్ బిజీగా ఉండడా?
మేనల్లుడ్ని పలకరించలేనంత బిజీయా? ఒకసారి పిల్చి మాట్లాడేసి, ఒక మంచి ఉద్యోగం పడేస్తే అయిపోయేది కదా!
పిల్లికి చెలగాటం- ఎలక్కి ప్రాణ సంకటం అంటే ఇదేనేమో. అంత దూరం నుంచి, ఆ టౌన్ నుంచి మేనల్లుడనే వాడు ఒకడొచ్చాడు. వాడు ఈ మహా పట్నంలో ఎలాంటి బాధలు పడుతున్నాడో ఏంటో అని ఒక్కసారి ఆలోచించకుండా ఆ మేనమామ మహానుభావుడు...
డబ్బు!
డబ్బు... ఎప్పుడూ డబ్బు సంపాదించే గొడవేనా?
డబ్బుంటే ఎవరూ గుర్తుకు రారు కాబోలు-
లేకపోతే-
మేనమామ తనని టెస్ట్ చేస్తున్నాడా? అమ్మ చెప్పింది మేనమామ చాలా జీనియసని.
తన వెనుక గూఢచారుల్ని పెట్టి తను ఎలాంటివాడో తెలుసుకొని ఆ తర్వాత ఉద్యోగం ఇస్తాడేమో?