ఈ సంచలనానికి కారణమైన నలుగురు అమ్మాయిలు-
ముగ్ధ, అలక, సురభి, నీలిమ.
ముందుగా అనుకున్నట్టుగా ఆరోజు ఉదయం తిరుపతి బస్టాండ్ లో విడిపోయారు.
వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు?
* * * * *
ముగ్ధ!
ధర్మసత్రంలోని ఆ గదిలోకి అకస్మాత్తుగా ప్రవేశించేసరికి రాజేంద్ర ప్రసాద్ ఆమెనుచూసి కంగారుపడ్డాడు.
గదిలో ఓ మూల వాళ్ళమ్మగారు పడుకున్నారు.
"చాపతప్ప కుర్చీల్లేవండి" మురికిపట్టిన గోడలవేపు చూస్తూ అన్నాడు రాజేంద్ర.
"పర్వాలేదు" అంటూ ముగ్ధ గదిలో గోడకుచేరబడి కూర్చుంటూ అంది.
ఒకవ్యక్తిని మనవేపు తిప్పుకోవాలంటే ముందు అతను బతుకుతున్న బతుకులోకి, అదెలాంటి బతుకయినా అందులోకి చొచ్చుకుపోవాలి. అప్పుడే అవతలివ్యక్తికి మనమీద నమ్మకం ఏర్పడడానికి దారి ఏర్పడుతుంది. అందుకే రాజేంద్ర అభిమానంగా చూశాడు ముగ్ధవేపు.
"చెప్పండి ఏం నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుమీద ఈ చిల్లర బిజినెస్సే చేద్దామనుకుంటున్నారా, ఇంకొంత మెరుగయిన బతుకు కోరుకుంటున్నారా."
వెంటనే ముగ్ధ అలా అడిగేసరికి ఏమనలేకపోయాడు రాజేంద్ర.
రాత్రంతా అతను ఆ విషయమై ఆలోచించాదు. కానీ దారీతెన్నూ ఏందొరకలేదు.
వాళ్ళమ్మగారు లేచి కాఫీచేసి ఇచ్చారు.
"ఎక్కువసేపు ఆలోచించేవాడు ఏ పని చెయ్యడానికి పనికిరాడని ఓ చైనా సూక్తి. దేనికయినా తెగింపు అవసరం" కాఫీ తాగుతూ అంది ముగ్ధ.
"మీకేవండి తెగింపవసరం తెగింపవసరం అని చెప్పేసి వెళ్ళిపోతారు. వున్నపని మానేసి కొత్తదేదీ దొరక్క అల్లాడిపోవాలి నేను. గాల్లో దీపంలా కూర్చున్నాన్నేను. నాకేంచెయ్యాలో, ఎలా చెయ్యాలో తోచడంలేదు."
"మీకేం అభ్యంతరం లేకపోతే మనం బైటికెళ్దామా" కాఫీ గ్లాసు పక్కన పెడుతూ అంది ముగ్ధ.
"ప్రైవేటు క్లాసు బయట తీసుకుంటారా"
"మీరు జోకులుకూడా వేస్తారే" అంది ముగ్ధ నవ్వుతూ.
బయటికెళుతున్న వాళ్ళిద్దరివేపూ రాజేంద్రప్రసాద్ వాళ్ళమ్మగారు ఆపేక్షగా చూసారు.
ఇద్దరూకల్సి వెనుక వేపునున్న నీలగిరి చెట్ల తోటలోకి నడిచారు.
"మీకుతెలుసా నీలగిరి చెట్లనుంచి వచ్చేగాలివల్ల శరీరపునొప్పులు తగ్గుతాయి.
"మీకు ప్రకృతివైద్యం కూడా వచ్చా" నవ్వుతూ అంది ముగ్ధ.
"నాకు చాలా వైద్యాలొచ్చులెండి అవసరమున్నప్పుడు మన ప్రతాపం చూపెడతాను" అన్నాడు రాజేంద్ర.
"మరి ఇన్నివిద్యలు వచ్చిన వారు చేతకాని వైద్లా ఇక్కడకొచ్చేసారేం."
"ఎన్ని విద్యలొచ్చినా తిండి పెడతాయేంటండి. తిండి పెట్టే విద్య నాకు రాదండి మోసం చెయ్యాలి కపటం నేర్చాలి దొంగమాటలు మాట్లాడాలి ఇవేవీ నాకు చేతగాదండి."
"చాలామంది నిరాశాపరులు ఆలోచించినట్టే మీరూ ఆలోచిస్తున్నారు. అదే మీ ఈ స్థితికి కారణం. ప్రపంచంలో చాలామంది బాగుపడడానికి కారణం మోసంచేయడం, కపటం నేర్వడం, దొంగమాటలు మాట్లాడటం అని మీరు అనుకోవడమే మొదటితప్పు ఏం ఆ దృష్టితోనే మీరెందుకు ఆలోచిస్తున్నారు. ప్రపంచంలో అందరూ ఇదేరకంగా బతుకుతున్నారని మీరనుకుంటే మీ చదువు మీకిచ్చిన ఆలోచనేమిటో నాకేం అర్ధంకావటంలేదు. ఇలా ఆలోచించేవాళ్ళు సాధారణంగా సోమరిపోతులవుతారని నేనెప్పుడో చదివాను.
సోమరిపోతులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇతరులమీద, ఇతరుల బతుకులమీద విమర్శలు చెయ్యడానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు."
ఆ మాటకు రాజేంద్ర ముగ్ధవేపు కోపంగా చూశాడు.
"నేను ఇతరుల తప్పుల్ని ఎత్తిచూపడంలేదు. లోకం గురించి చెప్తున్నా నంతే."
"మనకు సంబంధంలేని లోకంగురించి ఎన్నయినా చెప్పుకోవచ్చు కానీ ఉత్సాహవంతుడెప్పుడూ తన గురించి మాత్రమే ముందు ఆలోచిస్తాడు. ఉదాహరణకు నా జీవితంలోని ఒక ఇన్సిడెంట్ ను చెప్తాను వినండి.
నేను మొట్టమొదటిసారి కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన రోజులవి. నన్నుచూసి చాలామంది దూరంగా వెళ్ళిపోయేవారు. నాతో మాట్లాడడానికే జంకేవారు కనీసం నెలరోజులపాటు నాతో స్నేహం చెయ్యడానిక్కూడా ఎవరూ దగ్గరకు రాలేదంటే మీరునమ్మరు. కారణం ఏమిటో తెల్సా నా శరీరం రంగు నల్లగా ఉండడమే కారణం.
నేనేం నల్లగా ఉమ్దాలనుకున్నానా, నా తల్లి దండ్రులనుకున్నారా నల్లగా ఉండడానికి కారణం నేనా? నెతో విశాలమైన దృష్టితో ఉండాల్సిన లెక్చరర్లు కూడా నాపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించారు ఆ రోజుల్లో నేనెంత కుమిలిపోయానో తెల్సా ఎంత మానసికక్షోభ అనుభవించానో తెల్సా నన్నెవరూ అవమానించకుండా ఉండాలంటే, నేనేం చెయ్యాలో రాత్రింబవళ్ళూ ఆలోచించాను. యూనివర్శిటీ హైడిస్టంక్షన్ రావాలి. గోల్డుమెడల్ రావాలి. మన ప్రతిభ, మన తెలివితేటలు చాలా గొప్పవని మనం నిరూపించుకున్నప్పుడు మన అవలక్షణాల్ని ఎవరూ పట్టించుకోరు. ఇదే జీవితలక్ష్యం.
చదువు చదువు చదువు ఇరవైనాలుగ్గంటలూ అదే ధ్యాస. ఫస్ట్ సెమిస్టర్ లో నేననుకున్నది సాధించాను. యూనివర్శిటీలో పదేళ్లుగా ఎవరూ గోల్డుమెడల్ సంపాదించలేదు. చాన్సలర్ ఆ పతాకాన్ని నా మేడలో అలంకరిస్తున్నప్పుడు, వేలచేతులు చప్పట్లుకొట్టి నన్నభినందిస్తున్నప్పుడు వైస్ చాన్సలర్ నా గురించి పొగుడుతున్నప్పుడు మర్నాటినుంచి నేను కాలేజీలోకి అడుగుపెడుతున్నపుదు తోటి విద్యార్ధులు, లెక్చరర్లూ అంత వరకూ నాపట్ల చూపిన భావంలో అకస్మాత్తుగా మార్పొచ్చేసింది.
అప్పుడు వాళ్లకి నా రంగు కనిపించడంలేదు.
నా ప్రతిభ మాత్రమే కన్పిస్తోంది.
ఇది నేను సాధించిన అద్భుతవిజయాలలో ఒకటి అవునా? కాదా? చెప్పండి."
"నిజమే బాహ్య సౌందర్యంకన్నా, అంతర్ సౌందర్యం మిన్న" అన్నాడు ఏమనాలో తెలీక రాజేంద్ర.
"నేను సౌందర్య గురించి మాట్లాడడంలేదు. ప్రతిభ గురించి మాట్లాడుతున్నాను." సీరియస్ గా అంది ముగ్ధ.
నిరాశపడడం ఒక అవలక్షణం. దాన్నుంచి బయటకు రావడమే ప్రతిభ.
"కొంతమంది ఎవరో ఒకరు వెనుకుంటేనే ధైర్యంగా ముందుకెళతారు. నేనలాంటి వాడ్ని అనుక్షణం నాకెన్నో అనుమానాలు. ఇది చాలమందిలో ఉన్నట్టుగా నాలోపమే అనుకోండి. హౌ టు ఓవర్ కమ్ దట్ అనేది నాకు తెలీదు" తలదించుకుని అన్నాడు రాజేంద్ర.