Previous Page Next Page 
వ్యూహం పేజి 34


    "భగవాన్ శిష్యా... అర్థమైంది... నీదేదో సిన్సియర్ సింగిల్ పర్సనల్ లవ్ అనుకున్నాను... కాదు... నీది భారీ విశాల హృదయం- లవ్...."

 

    ఏదో అనబోతూ పక్కకి తలతిప్పి చూసాడు శక్తి.

 

    వాళ్ళిద్దరి మాటల్ని వింటూ, మునిపంట నవ్వుతూ మహిత-

 

    "ఏంటి- విశాల హృదయం లవ్ అంటున్నారు."

 

    తల తిప్పి చూసి, కంగుతిన్నాడు భగవాన్.

 

    "విశాల హృదయం లవ్... అంటే... సిన్మా పేరు మేడమ్... మా బాస్ ని మధ్యాహ్నం... సినిమాకు తీసికెళదామని..." తనని మహితకు పరిచయం చెయ్యమని, ఒక చేత్తో శక్తి మోచేతిని పొడుస్తూ మహిత చూడకుండా కన్నుమీద కన్నుగొడుతూ అన్నాడు భగవాన్.

 

    భగవాన్ బాధ భరించలేక....

 

    "మహితగారూ, ఈయన భగవాన్ అని, మీ ఆఫీసే. ఎకౌంట్స్ డిపార్ట్ మెంట్- పాపం... చాలా మంచోడు... విశాల హృదయం..." ఏదో అనబోతున్న శక్తి నోటిని మూసేసాడు భగవాన్.

 

    "భగవాన్ గారు నాకెందుకు తెలీదు.... లంచ్ టైమ్ లో మా ఆడపిల్లలు జోకులన్నీ ఈయన మీదే... ఈయన పోస్టింగు ఎకౌంట్స్ లో కాదట- కేంటిన్లో అట-" నవ్వింది మహిత.

 

    ఆ రకంగా మహిత, తన మీద జోకులాంటి, నిజం లాంటిదేదో మాట్లాడినందుకే ఇదైపోయాడు భగవాన్. వర్షంలో కరెంట్ స్తంభానికి ఆనుకున్న వాడిలా అయిపోయాడు భగవాన్.

 

    "మా మార్కెటింగ్ మేనేజర్ తో ఇప్పుడే మాట్లాడి వస్తున్నా. ఇవ్వాళ ఆరు తరువాత మా స్టూడియోకి మీరు వస్తే కొన్ని సాంపిల్ స్నాప్స్ తీస్తాను..." చెప్పింది మహిత.

 

    "నేను రెడీ..." వెంటనే ఒప్పేసుకున్నాడు శక్తి.

 

    "ఏవిటీ... మీరు రెడీ... ఇంపార్టెంట్ ప్రోగ్రామ్? అలా మర్చిపోతే ఎలా.... శక్తి బాసూ... ఇవాళ మీ మేనమామను కలవాలా... వద్దా! ఛైర్మెన్ గారు, మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారన్నారుగా...." మధ్యలో అడ్డొచ్చాడు భగవాన్.  

 

    "ఛైర్మెన్ గారు... మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారా... చెప్పారు... కారేం-" సీట్లో కూలబడుతూ అంది మహిత ఆశ్చర్యంగా.

 

    "అవునండీ- అపాయింట్ మెంట్ ఆర్డరివ్వడానికి- సాయంత్రం ఇంటికి రమ్మన్నారండి- మేనమామయినా బాసే కదా వెళ్ళాలి" చెప్పేసి, గబగబా వెళ్ళి, మూడు కూల్ డ్రింకులు తెచ్చి, ఒక బాటిల్ ను వినయంగా మహిత ముందు పెట్టాడు.

 

    "దేనికోసం వచ్చానో అది మర్చిపోతే ఎలాగయ్యా- శక్తిబాసూ" అన్నాడు భగవాన్.

 

    మింగలేక, కక్కలేక, తెల్లమొహం వేసి, మహిత వేపు చూసాడు శక్తి.

 

    "ఛైర్మెన్ తో ఎపాయింట్ మెంట్- ఇట్స్- రేర్- అపార్చునిటీ వెళ్ళండి- మన ప్రోగ్రాం రేపు పెట్టుకుందాం...." కూల్ డ్రింక్ ని సిప్ చేస్తూ అంది మహిత.

 

    "మీరు ఖచ్చితంగా, ఫోటోలీ రోజే తీద్దాం- ఉండిపోండి- అన్నారనుకోండి- ఉండిపోతాను- మా మామయ్యను, రేపైనా కలవొచ్చు- అర్జంటు పనిబడింది. వుండిపోయానని చెప్తాను. ఏవంటారు- ఆయన ఎంత డిసిప్లయిన్డ్ పర్సనో- అంత సాఫ్ట్...నాకు తెలుసు కదా!" అడ్డంగా కోసేసాడు శక్తి.

 

    "ముందు మీరు ఛైర్మెన్ ని కలవండి బాసూ- అదర్జంటా? ఫోటోలర్జంటా... మన మహితగారే కదా- ఫోటోలు రేపు తీసుకుంటారు ఏవంటారు- మహితగారూ?"

 

    వీడు ఇదే టైమ్ లోనే తగలడాలా? వీడున్న టైమ్ లోనే. ఆవిడ రావాలా?

 

    "అయితే మన ప్రోగ్రామ్- రేపే పెట్టుకుందాం- ఏవంటారు!" అనేసి లేచింది మహిత.

 

    మరేం మాట్లాడలేకపోయాడు శక్తి.

 

    చక, చకా నడుచుకుంటూ వెళ్ళిపోతోంది మహిత. అలా నడుచుకుంటూ, వెళ్ళిపోతున్న మహిత వాలుజడ వేపు చూసాడు. అందమైన జడ, మరీ అందంగా కదులుతోంది.

 

    "ఈ అమ్మాయి అందం.... ఆ వాలుజడలో ఉంది-" అనుకున్నాడు శక్తి.

 

    "ఏంటలా చూసేస్తున్నారు... మహిత వెళ్ళిపోయింది... ఏంటి బాసూ, మహిత మాట్లాడగానే, మేనమామ అపాయింట్ మెంట్ ని కూడా కేన్సిల్ చేసే పరిస్థితి వచ్చేస్తోందా- తప్పు- బాసూ- తప్పు-" హృదయ విదారకంగా మొహం పెట్టి అన్నాడు భగవాన్.

 

    "ఇప్పుడేమైపోయిందని- ఆ గోల-" విసుక్కున్నాడు శక్తి.

 

    "ఏమైపోయిందనా- ఏమీ అవలేదా- మూడేళ్ళ నుంచి ఇక్కడే ఛస్తున్నా, ఒక్కసారైనా నాతో మాట్లాడిందా... కనీసం చూసి విష్ చేసిందా- నవ్విందా- ఏం లేదు- మిమ్మల్ని చూడగానే, మిమ్మల్ని మోడల్ గా చేసేస్తోంది చూసారా... మీతో మహిత మాట్లాడ్డం, ఎంతమంది జలసీగా చూసారో- మీకు తెలుసా-"

 

    "అయితే ఏమిటట!"

 

    "ఏం లేదు- ఉత్తినే ఉత్తినే-"

 

    "రేపు, మా మేనమామ కూతురితో, ఇదే కాంటిన్లో, ఇదే లాన్లో, ఇదే హాల్లో, ఇలాగే తిరుగుతాను... అప్పుడింకా జలసీగా- చూస్తారు కదూ-

 

    "కరెక్ట్- అసలు- పాయింట్ లోకి ఇప్పుడొచ్చావు బాసూ- మీ టార్గెట్- మీ మేనమామ కూతురు బేబీగారు కదు- నిజంగా, నా మీద ఒట్టేసి చెప్పండి..." అన్నాడు భగవాన్.

 

    "అవును-"

 

    "హమ్మ- సందేహాలు తీరిపోయాయి. మరేం డౌట్లు లేవు-" గుండెమీద చెయ్యి వేసుకుంటూ, శక్తి చేతిని, తన చేతుల్లోకి తీసుకుని, వి.వి.గిరిగారి టైపులో ఊపేస్తూ అన్నాడు భగవాన్.

 

    "ఒక సాదా, సీదా అమ్మాయి- మేబీ బ్యూటీఫుల్- పలకరించగానే- నీల వెంటపడి, నా కర్తవ్యాన్ని నేను మర్చిపోతాననుకున్నావా నెవర్- నెవర్... మళ్ళీ చెపుతున్నా విను, ఈ ఆఫీసులో మా మేనమామ కూతురు, ప్రస్తుతానికి బేబీ అనుకుందాం... ఎక్కడ పని చేస్తుందో తెలుసుకోవడం కోసం మనం, మనం అంటే నేనన్న మాట, ఈ వయ్యారిభామను సైడుగా ఉపయోగిస్తామన్న మాట... ఎలా ఉంది అయిడియా."

 

    కాలరెగరేస్తూ అన్నాడు శక్తి.

 

    "వండ్రఫుల్ బాస్... కానీ ఇవేళ మీరు ఛైర్మెన్ మేనమామ గారింటి కెళతారు కదా... అక్కడ మీ బేబీగారితో కలిసి, మాట్లాడుతారు కదా..." 

 Previous Page Next Page