ఆకర్ణాంతవికృష్ణ విశ్వవిజయోధ్యద్గాండివజ్యారవం
బాకర్ణించిన మాత్ర, దుస్సహ దురన్యాయ ప్రభుత్వమ్ములో
భూకంపమ్ములు పుట్టు; బ్రద్దలయిపోవున్ ధూర్తదుశ్శాసన
ప్రాకారమ్ము;లు; క్రుంగి కూలు కురుసమ్రాట్ భావనాహర్మ్యముల్!
గురు గాంగేయులతోడి పోరితము సంకోచింపఁగా దగ్గదే!
మరి వారేటికి మిన్నకుండక యధర్మమ్మున్ సమర్ధించి ముం
దర కేతెంచిరి? భీష్మపౌత్రుఁడవు గాదా ధర్మదీక్షన్! ధను
ర్ధర మూర్ధవ్య! పురోగమింపుము పవిత్ర క్షాత్రరక్షార్ధివై!
"ఇది నీ మాతృఋణంబు "తీర్చుకోనుమోయీ! వేడి రక్తమ్ముతో;
"ఇది నీ కగ్నిపరీక్ష" దీక్షగొనుమోయీ! క్షాత్రవిస్పూర్తితో;
"ఇది కర్తవ్యము" నీకు నిల్వఁబడుమోయి! కర్మవీరుండవై;
"ఇది నీ జీవితలక్ష్య" మందుకొనుమోయీ విల్లు! శత్రుంజయా!
ఆహవ మ్మిది స్వేచ్చా మహాహవమ్ము;
నీవు హోత; వుపద్రష్ట నేను; స్రువము
గాండివమ్ము; విరోధి మూకలు హవిస్సు;
యజ్ఞఫలము స్వరాజ్యసంప్రాప్తి పార్ధ!
త్రిభువనమ్ము లేలు దేవేంద్రు మకుటమ్ము
తగడు నంచు మౌళిఁ దాల్చినావు;
సురల గౌరవమ్ము సురరాజు మరియార
శిరసు వంచి క్రిందు సేయకయ్య!
నిలిచియున్నాఁడు వీరాంజనేయమూర్తి
జయము సాధింప నీ ధ్వజాంచలమునందు;
నరుఁడవే యిట్టులైన, వానరుఁ డతండు
తోకజాడించి చెంగున దుమికిపాఁడే!
కుంతి కూరుచుండే కొండంత యాసతో
కొడుకు లేమొ ముక్తి గూర్తురంచు;
దిక్కుమాలి యెన్ని దినములు పడియండు
జాతివారి కన్నుసన్నలందు?
"పార్ధ' శబ్దమున కపార్ధమ్ముఁ గల్గించి
వాడి సేడుట రాచపాడి గాదు;
"ఇట్టికొడుకు" వన్న నింద్రుని సభ నున్న
పాండురాజు కింక బ్రతుకు గలడే!
దేవదత్తమ్ము పరువు, గాండీవ గౌర
వమ్ము, శ్వేతాశ్వముల మహాత్త్వము; కపిధ్వ
జప్రతిష్టయు త్వత్పరాజయ కళంకి
తములు కారాదు కవుల గ్రంధముల ముందు.
"ఇంట నిప్పుపెట్టు " నీ నృశంసులఁ జంప
"కంట నీరు పెట్టు" కరుణ చాలు,
కంట నీరు వెట్ట కాలమ్ము గా దిది
వింట బాణ మెక్కు వెట్టుమోయి!
ఆత్మ విస్మృతి నంది, సంది
గ్దాత్ముఁడవు కాఁబోకు మోయీ!
ఆత్మ గౌరవ పధములో ముం
దడుగు నిడు మోయీ!
భరతవీరా! లెవవొయీ!
పౌరుషము మేల్కొలుపుమోయీ!
"నరుఁడ' వోయీ నీవు! "నారా
యణుడ" నేనోయీ!
కర్మవీరా! నిల్వబడి, నీ
ఘర్మకణములు తుడుచుకోరా!
ధర్మమును చేపట్టి విజయ
ధ్వజము నెత్తుమురా!
విజృంభణము
అర్జునుఁడు
మోహ మడంగె నో భువనమోహనరూప! తొలంగె ధర్మ సం
దేహము లన్నియున్, దిగులు దీఱె, మసమ్ము కలంకదేఱె, ను
త్సాహము మైకొనేన్, విగతధర్ముఁడనైన ననున్ స్వధర్మ ని
ర్వాహకుగా నొనర్చిన భవత్కృప కియ్యవె ధన్యవాదముల్.
ఉదయశ్రీ కరుణరుణారుణ నవాభ్యుత్దానముల్ పద్మినీ
హృదయమ్మున్ కదలించి జీవిత మధు ప్రేమామృతాస్వాద సం
పద పొంగించెడిరీతి, తాపక మహోపన్యాసముల్ నా మదిన్
కదనోత్సాహము నూలుకొల్పే, నిలిపెన్ గర్తవ్య రంగమ్మునన్!
ముందుకు సాగనిమ్ము రధమున్ మధుసూదన! చేత గాండివ
మ్మందితి; "సోమశేఖరుని యాన" త్యజింపను! వైరి గుండియల్
కొందలమంద తద్భలము గూల్చెద, మాత కఖండసుప్రజా
నందము గూర్చెదన్; ద్రుపదనందన దుఃఖభరమ్ము దీర్చెదన్!
ఒత్తుము పాంచజన్యము ! ముహుర్ముహురాకులితారిసైన్య; మే
నొత్తేద దేవదత్తము; మహోదయ! నీ దయకల్మి నీ మదో
స్మత్తులఁ ద్రుంచి, ఈ దురభిమాన నితాంత నిరంకుశత్వ సం
పత్తికి స్వస్తి చెప్పి "నవభారత వీర పతాక" నెత్తేదన్!
శ్రీకృష్ణుఁడు
శ్రీమంతం బగుఁగాక భారతము! సుస్నేహర్ధ్రరాజప్రజా
సామంతం బగుఁగాక క్షాత్రము! సముచ్చైశ్శాంతి సీమంతినినీ
సీమంతం బగుఁగాక సృష్టి! విజయశ్రీ క్రాంతి సంక్రాంతికిన్
హేమంతం బగుఁగాక నవ్యయుగ సందేశప్రభావంతమై!