మంగల్ అధికారి, కాలూను చూచి "పాపకార్యాలు నిన్ను పతితున్నిచేశాయి. మానవుడు నీ మాయాజాలాన్ని తెలుసుకొని శిక్షించలేకపోవచ్చు. కాని కర్మను ఎలా తప్పించుకుంటావు? ఈ జన్మలో నీవు చేసిందంతా మరుసటిజన్మలో నీ నొసట వ్రాయబడుతుంది. కాలూ, నీవు నీ కూతుర్నుకూడా కూలదోశావు" అట్టడుగున ఉన్న కమ్మరి కాలూ జవాబు ఇవ్వడానికి ప్రయత్నించాడు. కాని మనిషిలో మనిషి ఉండడం ఎలా సాధ్యం? ఒకే వ్యక్తిలో విశ్వాసానికీ, విద్రోహానికీ స్థానం ఎలా లభిస్తుంది?
తాను నవ్వినా మాట్లాడినా కాలూలో కలవరం రేపుతున్నానని విశ్వనాథ్ కు తెలియదు. కాలూలోని మిణుగుర్లు కార్చిచ్చుకావడానికి అతడేకారణం అని అతనికి ఎలా తెలుస్తుంది?
సమస్య శివాభిషేకానికి సంబంధించింది. రోజూ మూడు బకెట్లతో శివునికీ క్షీరాభిషేకం జరుగుతుంది. ఆ పాలన్నీ సోమసూత్రం ద్వారా ఒక తోట్లోకి ప్రవహిస్తాయి. బిల్వపత్రాలూ, పుష్పాలూ అభిషేకజలం కూడా అందులోనే కూడుతుంది. అవన్నీ అక్కడికి తూర్పుగా అరమైలు దూరంలో ఉన్న గంగానదికి తీసికెళ్ళి సమంత్రకంగా గంగలో కలిపేస్తారు.
పూజారి ఒకనాడు చూస్తే తోట్లో మొగ్గలూ పూలూ తప్ప పాలు కనిపించలేదు. తాను బకెట్లకొద్ది పాలు పోశాడే? అవన్నీ ఏమైనాయి? తెల్లవారి చూశాడు. మళ్ళీ పాలు కనిపించలేదు.
ఇదేమిటో పట్టేయాలనుకున్నాడు పూజారి. తెల్లవారకముందే లేచి కుందతీగపొదలో చాటుగా కూర్చున్నాడు. ఒక జబ్బలు జారిన మనిషి రెండు చేతుల్తో రెండు బకెట్లు పట్టుకొని అక్కడికి వచ్చాడు. అతడు తొట్లోకి వంగి ఒక రేకుడబ్బా ముంచాడు. అతడెవరు? తోటమాలి, విశ్వనాథ్!
పూజారి ఒక్క నిముషం చూశాడు. బక్కెట్టు నిండుతూ, నిండుతూ ఉండగా పరిగెత్తి విశ్వనాథ్ చేయిపట్టుకున్నాడు.
"అయితే ఈ పని నీదే నన్నమాట"
తిట్లు ప్రవాహంలా వచ్చాయి. "దేవున్నేమోసం చేస్తావుగా! ఎవడో బైటివాడు కాదు. గుడి నౌకరేపాలు దొంగిలిస్తాడా? మనిషి కంటపడకుంటే మాత్రం గంపెడు కన్నులుగల ఆ విశ్వేశ్వరునికన్నులు ఎలా మూస్తావ్? భయంగానీ భక్తిగాని లేదు. ఓరి ద్రోహీ!"
విశ్వనాథ్ బకెటు క్రిందపెట్టాడు. చేయి విదిలించుకొని ప్రశాంతంగా "శివాభిషేకం జరిగింది. పాలపని తీరింది. ఈ పాలను గంగలో కలిపి పాడుచేయాల్సిందే. అలాంటప్పుడు నేను భగవంతుణ్ణి ఎలా మోసగించావో చెప్పండి" అని అడిగాడు.
అర్చకుడు కోపంతో వణికిపోయాడు. కర్మకాండ అభిషేకక్షీరాలను పవిత్రగంగానదీ జలాల్లో కలిపివేయాలంటూంది. అలాంటప్పుడు ఒక కులంతక్కువ వెధవ తనపాడుచేత్తో తాకుతాడూ? పైగా పాలు గంగామాతకు అర్పించడం పాడుచేయడం అంటాడూ? అబ్బ ఎంత ధైర్యం? ఎంత ధైర్యం?
"నిన్ను పనిలోంచి తీసేశాను. నీచులూ, దుర్మార్గులూ ఉండాల్సిన స్థలంకాదిది. అసలు నీలాంటివారిమీద దయతల్చడమే తప్పు. మళ్ళీ ఈ ప్రాంతంలో నీముఖం చూపకు."
పూజారికేకలకు జనం అంతా కూడారు. కాలూ కూడా అక్కడికి వచ్చేశాడు. విజయగర్వంతో పూజారి కథంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.
"మొదలు ఈ దరిద్రున్ని చూసినప్పుడే నాకు అనుమానం అయింది. ఇలాంటివారు ఇంకో లక్షమంది ఉన్నారు. ఈ మురికి ఈగలు మనసుందరనగరాన్ని కలుషితం చేస్తున్నాయి. సరిగ్గా సమయానికి పట్టుకున్నాను. మళ్ళీ ఈ పంచలకు వచ్చేధైర్యం చేస్తాడూ?" తన చాతుర్యానికి పూజారిగుండెగర్వంతో పొంగింది. "అభిషేక క్షీరాలతో మొదలుపెట్టాడు. ఇంక దేనిమీదనైనా చేయివేయొచ్చు. ఇలాంటివాళ్ళముఖం చూస్తేనే వాళ్ళగుణం తెలుసుకుంటా."
కాలూ నేరస్తున్ని ఎగాదిగా చూచాడు. పెదవి కదలకుండానే అతనిమీద ప్రశ్నలవర్షం కురిపించాడు.
"గౌతం రోడ్డుప్రక్కన 20 మంది ఆకలికి చస్తున్న బాలురున్నారు. వారికివ్వడానికే ఈ పాలు తీసికెళ్తున్నాను. ఇంక శలవు తీసుకుంటా" అని తనగదివున్న పెంకుటిళ్ళ వైపుకు నడిచాడు.
ఈ అడావుడికి మేల్కున్న లేఖ గుడిగేటుదగ్గర నుంచుంది.
"వెళ్ళిపోవాల్సిందేనా" లేఖ ధ్వనిలో కలవరం కనిపించింది.
"అది వాడి దురదృష్టం. అతడు మూర్ఖుడేమీకాడు. ఏం జరుగుతుందో అతనికి తెలిసి ఉండాల్సింది. నేను సహితం ఆ అభిషేకపు పాలను ముట్టను"
"బాబూ"
"నీ బాధ నాకు తెలుసు. నేనూ నీలాగే బాధపడుతున్నా. కాని అతడు ఇలా పంతం ఎందుకు పట్టాలి?
"పంతం?" లేఖ ఆశ్చర్యంగా అడిగింది.
"కాకపోతే, ఏర్పడ్డ క్రతువులు ఎలా మారుతాయి? ఉన్నదంతా ఆ క్రతువుల్లోనే ఉంది."
"విశ్వనాథ్ మామ ఈ పాలు ఆకలితో చచ్చే పిల్లలకు ఇచ్చి వారిని బతికిస్తున్నాడు."
"అదినేను కాదన్నానా?"
"ఆకలితో చచ్చే ఆపిల్లల్లో కరువు పొట్టపెట్టుకున్న 'మీనూ' కనిపించిందేమో"
కాలూకు ఆ ఆలోచన రాలేదు. ఆ మాటలు విని చకితుడైపోయాడు.
"ఆ పిల్లలకు పాలిస్తూ ఉంటే తన మీనూకే పాలుపోస్తున్నట్లు సంతృప్తి చెంది ఉంటాడు."
కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. అకస్మాత్తుగా కోపంతో మండిపోయిన కాలూ "రా, వెళ్దాం" అన్నాడు కరకుగా.
లేఖ మౌనంగా అతన్ని అనుసరించింది. కాలూ తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. లేఖ గిన్నెలో టీ తెచ్చేప్పటికి కాలూ గదిలో పచార్లుచేస్తున్నాడు. ఆమె మాట్లాడ్డానికి పెదవి కదిలించింది. కాని అతని ముఖం చూచి నోరు కదపకుండా వెళ్ళిపోయింది.
అర్ధగంట తరువాత మళ్ళీ గదిలోకి వెళ్తే కాలూ చాపమీద పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు. అతనిముఖం నేలకువేసి ఉంది. టీని తాకనైనా తాకలేదు.
'బాబూ'
అతడు తల పైకెత్తి చూశాడు. అతని ముఖం శాంతంగా ఉంది. "చంద్రలేఖా, అదేనిజం అంటావా"
'ఏది?'
"విశ్వనాథ్ ఆకలితో చచ్చిన పసిపాప మీనూకు పాలుపోసినట్లు భావిస్తున్నాడంటావా?"
ఆమె అతని భావాన్ని అర్ధం చేసుకోలేకపోయింది "అది నా ఊహ"
అతడు తల ఊపి "అవును. అది రూఢి చేసుకోవాలి."
"మళ్ళీ టీ పెట్టితెస్తా" నంటూ గదిలోంచి వెళ్ళిపోయింది.
రెండు నిముషాల తరువాత ఆమె వంటింట్లో పనిచేస్తూ ఉండగానే కాలూ కిందికి దిగిపోతున్న అడుగులచప్పుడు వినిపించింది. ఆమె బాల్కనీకి పరిగెత్తింది. అతడు రోడ్డూ గుడిగేటూదాటి వెళ్ళిపోతున్నాడు.
ఆమెకేమీ అర్ధంకాక "అతనికేమైంది?" అనుకుంది.
కాలూ సరాసరి పెంకుటిళ్ళవైపు నడిచాడు. విశ్వనాథ్ తన బట్టలమూట పట్టుకొని దేవాలయపు పనివల్ల దగ్గర శలవు పుచ్చుకుంటున్నాడు. సానుభూతితో వారంతా అతని చుట్టూ మూగారు. యజమాని కంటపడేవరకు గుంపు కరిగిపోయింది.
కాలూ తోటమాలి దగ్గరికివెళ్ళి విచిత్రంగా మాట్లాడాడు.
"ఆకలితో చచ్చేపిల్లలకు పాలుపోస్తున్నావనే విషయం రూఢి చేసుకోవాలి"
విశ్వనాథ్ చిరునవ్వు నవ్వి "నిరూపించడం అవసరమా?" అని అడిగాడు.
"అవును అవసరం ఉంది. నడువు" కాలూ వెనక్కు తిరిగి నడిచాడు.
రెండు బకెట్లపాలూ తొట్టిదగ్గరే ఉన్నాయి. కాలూ తొట్టిదగ్గర ఆగి "వాటిని తీసుకో" అని విశ్వనాథ్ ణు ఆజ్ఞాపించాడు. ఆ సమయానికి గుడినుండి బైటికివచ్చిన పూజారి "ఇంకో నిముషంలో పాలు గంగకు పోతాయి" అని ఒక చలిచూపు విసిరి "ఇంకా నువ్విక్కడే మిడుకుతున్నావేం?" అన్నాడు.
"బకెట్లు తీసుకో" మళ్ళీ కాలూ ఆదేశించాడు. పూజారివైపు వాడిచూపులు విసిరి "ఆకలితో చచ్చేవారికి ఇవ్వడమే ఉత్తమం" అన్నాడు.
పూజారి చకితుడైనోరప్పచెప్పి చూశాడు. అతడు తన చెవులను నమ్మలేకపోయాడు.
"గంగామాతకు పాలు" అన్నాడు చివరకు.
"ఆకలితో చచ్చేబిడ్డలకు పాలుపోయవద్దనే తల్లి ఉంటుందా? చెప్పు. నీ గుండెనడుగు. నీకు బిడ్డల్లేకపోవడం ఒక విచారం"
పూజారి ముఖం మాడింది.