ఒకనాడు ఒక చిన్న తగాదా వచ్చింది. అతనికి ఎటూ తోచక లేఖతో చెప్పాడు.
"చంద్రలేఖా, ఏం చేయాలి?"
"ఏమిటిబాబూ"
"నా ఎరుపుడైరీ చూశావుకదూ. అందులో శ్రావణం మొత్తానికీ ఒక్కొక్క తేదీన ఒక్కొక్క దాతపేరు ఉంది. అంటే ఆయాతేదీల్లో ఆయా దాతలు పాలు దానం చేస్తారని అర్ధం."
"అది నాకు తెలుసు"
"ఇవాళ్ళ ఉదయం ఒక వ్యక్తివచ్చి ఈ వారంలోగా ఒకరోజు పాలు దానంచేసే అవకాశం ఇప్పించాలని కోరాడు. అది సాధ్యపడదని నేను అతనితో చెప్పాను. అతని తండ్రి జబ్బున పడ్డాడట. ముసలివాడు వారం రోజులక్మ్తే ఎక్కువ జీవించడని డాక్టర్లు చెప్పారట. శివునికి పాల అభిషేకం ఏర్పాటు చేయించడం అతని చివరికోర్కె. అది జరుగుతే అతడు ఏ దుగ్ధ లేకుండా ప్రశాంతంగా ప్రాణాలు విడుస్తాడు."
"ఒక అదనపు అభిషేకం ఏర్పాటు చేయాల్సింది" లేఖ సూచించింది.
"అదీ సాధ్యపడదు. క్రమబద్దంగా ఏర్పాటైన క్రతువును అమాంతంగా మార్చడం అసాధ్యం. అభిషేకానికి అవసరం అయిన పాలన్నీ ఒకేఒక దాత ఇవ్వాలన్నది దేవాలయపు నియమం. నియమం మారుతే విలువ పడిపోతుంది."
"మన లిస్టులో ఉన్నవారిలో ఒకణ్ణి మరోనాలుగు రోజులు ఆగమనాలి. వారంతా ఈ వారంలోనే చావడంలేదుగా."
తానుకూడా అదే ఆలోచించాడు. రిక్షాతీసుకొని పట్టికలో ఉన్న పేర్లవారందరి దగ్గరికీ తిరిగాడు. అలా ఏడుగురి ఇండ్లకూ వెళ్ళాడు. నిష్పలంగా తిరిగివచ్చి లేఖతో "అంతా దుర్మార్గులు. ఇలాంటివారితో స్వర్గంలో పాలుపంచుకున్నదానికంటే నరకంలో పడిపోవడం మంచిది" అన్నాడు. ఆ ఏడుగురూ ఎలా తప్పుకున్నారో వివరించాడు. ఆ చచ్చేవాడికి మొదలే తెలిసి ఉండొద్దూ? మాలో ఎవడు ఏ నిమిషాన చస్తాడో ఎవడికెరుక? అన్నాడొకడు. జీవితం బుద్భదప్రాయం అని వేదాంతం వల్లించారు మరికొందరు.
ఆ ముసలివాడు అతని కోర్కె తీరకుండానే చనిపోయాడు. కాలూకు పెద్ద విచారంగా పరిణమించింది. ఆ చచ్చేవాడిచెవులో ఎవరూ వినకుండా "గుళ్ళో ఉన్నది దేవుడుకాదు. అది నేను కల్పించిన బూటకపు బొమ్మ. ఆ రాతిమీద అంతా పాలుకుమ్మరిస్తున్నారు" అని చెపుతే? కనీసం చివరిగడియల్లోనైనా ఆ ముసలివానికి తన నాటకం అర్ధంఅయ్యేది. కాలూ మండేగుండెకు కాస్త శాంతిలభించేది. పుణ్యకాములకు బాగా రోగం తిరిగింది!
అసలు పేచీవచ్చింది కాలూ మాలీగా నియమించిన విశ్వనాథ్ వైపునుంచి.
ముడతల ముఖంతో విశ్వనాథ్ ఎముకలు విరుచుకొని పనిచేసేవాడు. మండే ఎండలోనూ, కుండపోత వానలోనూ అతడు విరామం లేకుండా పనిచేసేవాడు. ఒకసారి తెల్లని పద్మమండపంలో కాలూ నుంచొని చూస్తూ ఉంటే పెద్దవానలో విశ్వనాథ్ పనిచేస్తూ కనిపించాడు. వానలో తడవవద్దని కాలూ కేకలు వేశాడు.
"ఈ ముసలి ఎముకల్లో ఇంకా జవ చావలేదు" అని విశ్వనాథుడు వెనక్కు తిరిగి చెప్పాడు.
కాలూ చాలావరకు విశ్వనాథ్ నుంచి దూరంగానే ఉండేవాడు. అయినా ఒక్కొక్కసారి వారిద్దరిమధ్య ఉన్నట్లు కనిపించే దగ్గరి బంధుత్వం ఆ దూరాన్ని అధిగమించేది. విశ్వనాథ్ బంధువులను గురించి కాలూ బాధపడ్డాడు. గతాన్ని తలపుకుతెస్తే అతనికి బాధ అవుతుందేమోనని ఊరుకున్నాడు కాలూ విశ్వనాథ్ తన పనిని గురించి స్వేచ్చగా మాట్లాడేవాడు. మళ్ళీ ఒకనాటికి కొలిమిపెట్టగలననే ఆశ అతనిలో మిణుకు మిణుకు మంటుండేది. తిరిగి పని ప్రారంభించడం సాధ్యపడదని విశ్వనాథునికి తెలుసు. ఆ విషయం కాలూకుకూడా తెలుసు. అందుకే కాలూకు తనలో విశ్వనాథుడు కనిపించేవాడు. ఇద్దరూ వల్లోపడ్డవారే. ఒకడు దరిద్రపువల్లోపడ్తే వేరొకడు బ్రాహ్మణవేషజాలంలో చిక్కుకున్నాడు. అంతే భేదం.
దేవాలయం అన్నా, దాని అర్చనలన్నా విశ్వనాథ్ కు గౌరవం ఉండేదికాదు. తన అభిప్రాయాన్ని దాచుకోవడంకూడా అతనికి తెలియదు.
"వేయిన్నొక్కదేవుళ్ళున్న ఈ దేశంలో కరువులూ, కాటకాలూ ఎందుకు రావాలి?" విశ్వనాథ్ కాలూను ప్రశ్నించాడు.
కాలూలోవున్న బ్రాహ్మడు చటుక్కున జవాబు అందించాడు. "మనకు వాడిమీద విశ్వాసంలేదు. అందుకే ఈ అగ్నిశిక్ష మన ఆత్మలు పవిత్రంకావడానికి ఇది అగ్నిసంస్కారం."
"నేను మూడునెల్లు ఉపవాసాలున్నాను. ఫలితం? నన్ను ఇలా చేసిన ఈ సమాజంమీద ద్వేషం పుట్టింది."
"అదిగో అదే నువ్వు నేను చెప్పిందాన్నే రుజువు చేస్తున్నావు. నీకు అసలు భగవంతుని మీద విశ్వాసంలేదు. సర్వాంతర్యామిమీద నమ్మకంలేందే."
కాలూ మాటలు విశ్వనాథ్ కు నచ్చలేదు.
"నాకూ దేవుడంటే భక్తి ఉండేది. నేనూ అందరిలాగే దేవుణ్ణి పూజించేవాణ్ణి. దేవుళ్ళంటే నాకు భయమూ భక్తీవుండేవి. నాపిల్లలు కూడా అంతే. చూడండి మాగతి ఏమైందో?"
విశ్వనాథ్ తన కుటుంబాన్ని గురించి ఏమైనా బైట పెడ్తాడేమోనని కాలూ నిరీక్షించాడు.
కొంతసేపు ఇద్దరూ మాట్లాళ్ళేదు.
విశ్వనాథ్ ముఖం చిట్లించి "మాగతి ఏమైంది?" న్నాడు. తన ముందు ఏదో భయంకరమైన వస్తువు కనిపించినట్లు అదిరిపోయాడు. క్షణం అతని నోటివెంట మాటరాలేదు. "పోనీ అది అలా ఉండనీండి. నాచిట్టి మనుమరాలు ఆకలితో ఎందుకు చచ్చింది? ఆమెకూ విశ్వాసం లేదంటారా?"
కాలూ బిత్తరపోయాడు. కాని మంగల్ అధికారి జవాబు అందించాడు.
"పూర్వజన్మంలోచేసిన పాపం ఈ జన్మలో అనుభవించాలి."
విశ్వనాథ్ బోసినోరు తెరచి కర్కశంగా నవ్వాడు.
"మీనూ శారీరకంగాగానీ, మానసికంగాగానీ పెరిగి పెద్దది అవుతేగదా అనుభవించడం?"
కాలూకు లేఖ, ఆమెపడ్డయాతనా దృష్టికివచ్చాయి. ఆమె కష్టాలకు కారణం? ఆమె పసిపిల్లలా అమాయకురాలు. ఆమెకు ఆ ఖర్మ ఎందుకు పట్టింది? దుష్టులనూ దుర్మార్గులనూ కర్మ అంటనైనా అంటదు. వారు పొట్టలుపగులతిని రామా కృష్ణా అంటూ హాయిగా కాలంగడుపుతారు.
సకల చరాచర సృష్టికర్త అయిన భగవంతునినుండి ప్రత్యుత్తరం కోరుతున్నాడా అన్నట్లు కాలూ తలపైకెత్తి ఆకాశంవైపు చూచాడు. అతడు పిడికిలి బిగించి 'ఒక అమాయకుడిని రొంపిలోకి దింపుతావు. ఇదేనా ఆత్మ పారిశుద్ధ్యం?' అనుకున్నాడు.
అతనిదృష్టి దేవాలయంమీద విశ్రమించి, అక్కడినుంచిలేచి, చకితుడై చూస్తున్న విశ్వనాథుని ముఖంమీదపడి అక్కడినుంచి నేలమీదపడింది. మాటమాట్లాడకుండా కాలూ అక్కడినుంచి లేచి వచ్చేశాడు.
కాలూలో అణిగివున్న కలవరం అతనిలోంచి తొంగిచూచింది. అది దాగివుండదని కాలూకు స్పష్టం అయింది. దాన్ని ఎదిరించినా గత్యంతరంలేదు. మొదలు తనకుతాను అర్ధంచేసుకోవాలి. విశ్వనాథుడే ఈ కలవరానికి కారణం. ఇంక కాలూ ఆత్మకు సంతృప్తిలేదు.
పరిస్థితులు అతనుముందు చీరవిప్పి నిల్చాయి. ప్రతి విషయమూ నగ్నంగా కనిపిస్తూంది. ఈ నాటకానికి ముందు తనకూ విశ్వనాథ్ లాగే ఒక విశ్వాసం ఉండేది. అనాదిగా వస్తున్న ఆచారాల్నుగానీ, అసమానతల్నుగానీ, అస్తవ్యస్తమైన కులభేదాల్ను కానీ అతడు ఎన్నడూ కాదనలేదు. ఒక వ్యవస్థను ఆమోదించడం ఆమోదించకపోవడం అనే విషయమై అతడు ఎన్నడూ బాధపడలేదు. ఉన్నదాంతో తృప్తి చెందాడు. ఇతరుల్ను గురించి ఎన్నడూ ఆలోచించలేదు.
కరువుతోనే సమస్యలన్నీ పుట్టాయి. చివరి సారిగా ఊదిన కొలిమిలో తనకున్న విశ్వాసం మండిపోయింది. పనిముట్లు అమ్ముకొని నగరానికి బైల్దేరినప్పుడు వేలెడు తిరుగుబాటు అతనిలో పుట్టింది. కోర్టులోనూ, జేల్లోనూ ఆ తిరుగుబాటుకు కాళ్ళూ చెవులూ వచ్చాయి. బి.10 సహాయంతో దానికి నోరువచ్చి పోరాటం నేర్చుకుంది. ఆ పోరాటం అతన్ని విద్రోహిని చేసింది. మనిషినీ దేవున్నీ ఎదురించాడు. అందుకే బ్రాహ్మణముసుగులో ప్రతీకారపోరాటం సాగిస్తున్నాడు. ఆతని ఉచ్చ్వాస నిశ్వాసాల్లో దైవదూషణం నిబిడీకృతం అయి ఉంది. బ్రాహ్మణ విశ్వాసం ప్రకారం అలాంటి దైవదూషణకు తనకు దండన లభించాల్సి ఉంది.