Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -6 పేజి 35


    "నదీమతల్లికి అవమానమా? అదా ఉద్దేశం?"
    పూజారిణి ఓదార్చాలనే ఉద్దేశంతో "విను. ఆపాలు చచ్చేపిల్లలకు ప్రాణంపోస్తున్నాయి. ఇరవైప్రాణాలు దక్కుతాయి. తెలిసిందా?" అన్నాడు.
    "ఎన్ని ప్రాణాలైనా ఆ పాలకు సరిగావు. మీకు నేను చెప్పేంతవాన్నా?"
    కాలూ పట్టుపట్టి నుంచున్నాడు. అతనిలో ఒక కొత్త పట్టుదల కనిపించింది.
    "పాలు అంతకంటే సదుపయోగం చేయడం సాధ్యపడదు" అని ఖచ్చితంగా చెప్పేశాడు.
    దాతలు తమను మోసం చేశారనుకుంటారు.
    "అతడు పాలు....." ఇంకేమీ చెప్పకూడదని నిర్లక్ష్యంగా ఆగిపోయాడు.
    "చచ్చేవాడల్లా నెలరోజుల్నుంచి దేవుని సొమ్ముతిని పాములా బ్రతికాడు. ఇప్పుడు వాడు ఊసరవెల్లిగా తయారైనాడు" పూజారి నిశ్వాసాలు పొగలుకక్కేయి.
    "అతడంటే నాకు అభిమానం. అతనిలో హృదయం ఉంది. అది ఇంకా చావలేదు" అని పాలు తీసుకొమ్మని విశ్వనాథునికి సంజ్ఞచేసి చూపాడు. బరువుతో వంగిపోతున్న భుజాల్తో విశ్వనాథ్ పాల బకెట్లు మోస్తూ సాగాడు.
    "పాలు కాచాలి" అన్నాడు యజమాని అడుగులో అడుగువేసి.
    "కాచాడం?"
    "అవును. కాచడమే పాలుతొట్లోవి. పాప...."క్షమాపణ కోరుతున్నట్లు మెత్తని స్వరంతో అన్నాడు.
    విశ్వనాథ్ తన గదిలో బొగ్గులు అంటిస్తూ ఉండగా కాలూ కటిక నేలమీద తల చేతుల్తో పట్టుకొని ఆలోచిస్తూ కూర్చున్నాడు. తాను దేవుణ్ణి ధిక్కరించాడు. ధర్మకర్తలు దీన్నిఊరికే పోనిస్తారా? అతని మనోఫలకంమీద. డబ్బూ పలుకుబడీగల అయిదుగురు ధర్మకర్తలు వెలశారు. సర్ ఆ బాలబంధు సర్వాధికారాలుగల చైర్మన్. అతడు నిలువచేసిన బ్రహ్మాండమైన బియ్యపు కోటాల్నుగురించి తెలియని వాడంటూ లేడు. కరువుపెరిగి జనం ఆకలితో చస్తూ ఉంటే అతని లాభాలు పెరిగాయి. అతని లాభాలగ్గానూ గుంపులు గుంపులుగా జనం పిట్టల్లా చచ్చారు. దేవాలయం సర్ ఆబాలబంధు దయాధర్మాలమీద ఆధారపడి ఉంది. కాలూ బోర్డువారి దయాధర్మాలకు పాత్రుడు.
    ఉపాయంగా తనపనినెగ్గించుకోక ఇలా ధిక్కరించాల్సిన అవసరం? తాను విశ్వనాథునికి బలంలోనూ, అవివేకంలోనూ, త్యాగంలోనూ సముడు కావాలనే అతనిగుండె ఆరాటమే అలా చేయించింది.
    యజమాని మనో భావాల్ను గుర్తించినట్లు "నే వెళ్ళిపోతేనే మంచిది" అన్నాడు విశ్వనాథుడు శాంతంగా.
    "ఎందుకూ?"
    "మిమ్మల్ని చిక్కుల్లోపడేసి కృతఘ్నుణ్ణి కాలేను."
    "నువ్విక్కడే ఉంటావు"
    ఇద్దరూ మౌనం వహించారు. పాలు కాగ్గానే విశ్వనాథుడు బకెట్లు తీసుకొని ముందునడిచాడు. వారు గుడిదాటి వీధిన పడ్డారు.
    అట్టేదూరం లేదన్నాడు విశ్వనాథ్. కాలూ తల ఊపాడు. పది నిముషాలు నడిచి వేసిన రొయ్యలకు ప్రసిద్దిచెందిన 'గ్లటన్స్ఇన్' వెనుకభాగం చేరారు. చెత్తకుండీలో ఏరుకున్న తిన్నులు చేతుల్లో పట్టుకుని బిడ్డల్ను ఎత్తుకున్న స్త్రీలదృశ్యం వారికంటపడింది. కుండ పొట్టల పిల్లలూ, కళ్ళల్లో ఆకలి కాలనృత్యం చేస్తున్న స్త్రీలూ కలకత్తాకు మామూలు అయిపోయారు. వారిద్దరూ దగ్గరికి రాగానే కాంతిహీన కనీనికల్లో కాంతి వచ్చింది. ఎవరినోటా ఒక్కమాటసహితం రాలేదు. కాళీబకెట్లు తీసుకొని విశ్వనాథ్ యజమానివైపు నడిచాడు.
    "ఏమైనా చెపుతారా?"
    "ఏమీలేదు"
    కాలూ శంక దూరం అయింది. విశ్వనాథుడు ఈ సజీవ ప్రేతాల్లో తన మీనూను చూశాడనడంలో సందేహం లేదు.
    "రేపంటూ ఉంటుందా?"
    "అనేక రేపులు ఉంటాయి"
    "గంద్రగోళం అవుతుందేమో?"
    "అది నాకో లెక్కకాదు."
    వారు గ్లటన్స్ ఇన్ దాటారు. అందులోంచి వచ్చే ఘుమఘుమలు ఆకలి మంటల్లో ఆజ్యం పోస్తున్నాయి.
    "మీలాంటి ఉదారులు ఉన్నన్నాళ్ళూ వారికి ఎలాంటి ప్రమాదమూ లేదు"
    "అంటే?"
    "మీలాంటి ఉదారులైన బ్రాహ్మణులు ఉన్నంతకాలమూ జనానికి మన సామాజిక విశ్వాసాలమీద నమ్మకం చావదు"
    ఉదారుడెవడు? తానేనా? ఆ మహానగరపు చరిత్రపుటలన్నీ దివిటీపెట్టి వెతికినా తనలాంటివాడు ఉండబోడనే విషయం విశ్వనాథ్ కు తెలుస్తే? విశ్వనాథ్, మంగల్ అధికారీ అన్నదమ్ముల్లాంటి వారని తెలుస్తే? కాలూ చూపు మళ్ళించుకున్నాడు.
    తన జేలు మిత్రుడు తన్ను మంగల్ అధికారిగా, దేవాలయాధిపతిగా చూస్తే? బి-10 మంత్రం బాగా పారింది. ఒక్క జిత్తు. అంతే ఒకేఒక ఎత్తుగడ. మట్టిలోంచి దేవాలయం పుట్టింది. ముఖంమీద వేసుకున్న ముసుగు ఆత్మను తినివేస్తుందనే విషయం కాలూ కనీసం ఊహించి సహితం ఉండడు. ఇదంతాచూస్తే బి-10 ఏమనుకుంటాడు? కాలూ మట్టిబిడ్డగానే పుట్టాడు. కాని ఇప్పుడు? తన పరిమళాన్నిచూచి ముగ్ధం అయ్యే కస్తూరి మృగంలా సిద్దం అయినాడు.
    బి.10 జేలు పరిమితి త్వరలోనే ముగుస్తుంది. ఆ రోజును కాలూ బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడు. కాళిపూజ అయింతరువాత రెండవ రోజు బి.10 విడుదల అవుతాడు. ఇల్లు చేరుకోవడానికిక్కూడా అది శుభదినం. అదిసరేగాని అసలు బి.10 కు ఇల్లంటూ ఒకటి ఉందా? ఇంకొకనెల - ఒక్క నెలమాత్రమే. ఆకలితో అలమటిస్తూ అసువుల్ను అరచేతులో పట్టుకున్న అనాథలకు అన్నం చూపినందుకు సంవత్సరం - 12 నెలలు - జేలు శిక్ష.
    
                                      13
    
    విపత్తు వానగా కురవడానికి మూడు రోజులముందునుంచే వ్యాకులపు జీమూతం దట్టంగా కమ్ముకుంది.
    ఆ వార్తకు రెక్కలువచ్చి ఎగిరింది. విధిగా గంగాజలంలో సమ్మిశ్రితం చేయాల్సిన శివాభిషేకక్షీరాలు గంగాభవానికి అందడంలేదు. మూడు బకెట్లపాలు కొనడానికి దాతలు ఖర్చుచేసిన మొత్తానికి పుణ్యం లభించడంలేదు. పరలోకంలో పాలు తయారు కావడంలేదు.
    గంద్రగోళం జరుగుతుందనే విషయం కాలూకు తెలుసు. అలాంటి జాడలు కూడా చూచాయగా కనిపించాయి. అతడు డైరీతీసి ఆరోజు ఎదుర్కోవాల్సిన వాడెవరో చూచాడు. మొట్టమొదటివాడు బులియన్ వ్యాపారి. అతని మూర్ఖత్వం కాలూకు తెలియందేమీకాదు. పాల అభిషేకం మొదలుపెట్టిన మొదట్లో కారు ఆపి మంగల్ అధికారి ఉన్నాడేమో చూడమని డ్రైవరును పంపాడు.
    "నాకో కోరికఉంది. బంగారం ధరబాగా పెరగాలన్నదే ఆ కోర్కె అది ఫలించడానిగ్గానూ, ఈనెలా, వచ్చేనెలా అభిషేకానిగ్గాను పాలు సమర్పిస్తాను"
    కాలూ, దాత తండ్రిపేరూ, తాతపేరూ, డైరీలో నోట్ చేసుకున్నాడు. వర్తకుడు కూడా నోట్ చేసుకున్నాడు.
    రెండు గంటల తరువాత ఇంకో వర్తకుడు వచ్చాడు. అప్పటి వర్తకుడు బానపొట్ట వాడైతే ఇతడు పుల్లలా ఉన్నాడు. అణకువతో స్వయంగా మంగల్ అధికారి దగ్గరికివచ్చి "నాకో కోర్కె ఉంది. బంగారం ధర పడిపోవాలన్నదే నా కోర్కె.. ది ఫలించడానిగ్గాను ఈ నెలా, వచ్చేనెలా శివుని అభిషేకానికి పాలు సమర్పిస్తా" అన్నాడు. మళ్ళీకాస్త ఆగి "పాలల్లో సువాసన ద్రవ్యాలూ, పంచదారా, బాదమూ కలపడానికి అనుమతిస్తే కలిపిస్తా. నేను మట్టిపాలు త్రాగను"
    "భగవంతునికి వట్టిపాలంటేనే ఇష్టం" అన్నాడు కాలూ.
    ఆ తరువాత శివరాత్రి. ఆనాడు దేవాలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆనాడు 'సెవాయ్' హోటల్ యజమానివంతు. యజమాని స్వయంగా రాలేదుగాని పెద్ద తలపాగా చుట్టుకున్న మేనేజర్ను పంపాడు. ఉత్సవదినాల్లో అయిదుబకెట్లు పాలతో శివునికి అభిషేకం చేస్తారు. అది మేనేజరుకు నచ్చింది. అదనంగా రెండు బకెట్ల పాలు కొనడం ఆ హోటల్ యజమానికి అట్టే కష్టం ఏమీకాదు.

 Previous Page Next Page