"ఎందుకు మీటవలేదు... మీటవలేదని ఎవరయినా చెప్పారా మీకు. ఏవండోయ్... నేను ఛైర్మెన్ ని మీటవలేదనే విషయం ఎవరయినా చెప్తే నమ్మకండేం... ఎందుకంటే నేను ఛైర్మెన్ తాలూకా అని తెలిస్తే చాలామందికి జలసీ ఉంటుంది కదా... అందుకే సీక్రెట్ గా కలుస్తున్నా నన్నమాట...." అని నోటికొచ్చిందేదో చెప్పేసి...
కళ్ళతోనే నవ్వుతున్న ఆ అమ్మాయివైపు చూసి...
"మీరు చాలా జీనియస్ లా వున్నారండీ... అన్నీ నా చేతే చెప్పించేస్తున్నారు. అసలు... మీరు నాతో ఏదో మాట్లాడ్డానికి పిలిపించారు. మర్చిపోయినట్టున్నారు" అసలు టాపిక్ లో కొచ్చాడు శక్తి.
శక్తి కొంతలో, కొంత అర్థమౌతున్నాడు మహితకు.
"రెండు... మూడు రోజుల డైలీ పేపర్లు చూసారా మీరు..." అడిగింది మహిత.
"ఏముంది... అందులో మా మావయ్య ఫోటో వేసారా...."
"మా టూత్ పేస్ట్ ప్రొడక్ట్ కి మోడల్స్ కావాలని వేసాం... మిమ్మల్ని- మొట్టమొదట కాంపౌండ్ లో చూడగానే, మోడల్ ఇంటర్వ్యూ కోసం వచ్చారేమో అనుకున్నాను. మా టూత్ పేస్ట్ కి మోడల్ గా నటిస్తారా?"
అసలు విషయం చెప్పింది మహిత.
"టూత్ పేస్ట్ కి మోడల్ గానా... అంటే ఏం చేయాలి నేను...."
"నేను చెప్పినట్లు చెయ్యండి చాలు. మీకెప్పుడు లీజరు."
"రోజంతా లీజర్" శక్తి నోటి చివర వరకూ వచ్చిందా మాట.
"ఒరేయ్ శక్తీ... వెంటనే బయటపడిపోకురోయ్..." మనసు హెచ్చరించింది.
"ఇవాళ సాయంత్రమైనా, రేపు సాయంత్రమైనా మనం షెడ్యూల్ వేసుకుందాం. మా మార్కెటింగ్ మానేజర్ తో మాట్లాడి, మీకు ఇన్ ఫామ్ చేస్తాను. మీరెక్కడుంటారు... ప్రస్తుతం మీరెక్కడుంటున్నారు. మీ మావయ్యగారింట్లోనేనా.
చటుక్కున మళ్ళీ సీలింగ్ ఫాన్ వేపు చూపులు తిప్పేసుకున్నాడు శక్తి.
"ఏవండీ మిమ్మల్నే..." మళ్ళీ అడిగింది మహిత.
"మీరు ఇన్ ఫామ్ చేస్తానన్నారు గదా... ఇక్కడే వుంటాను. మీరొచ్చే వరకూ ఇక్కడే ఉంటాను..." లేని నవ్వును మొహమ్మీద పూర్తిగా పులుముకుంటూ అన్నాడు శక్తి.
మానవుడు ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్లున్నాడు- అనుకుంటూ లేచి నిలబడి-
"ఒగ్గంటలో మిమ్మల్ని కలుస్తాను... కేంటిన్లో వుంటారా..." అంది.
"ఇక్కడే వుంటాను. ఎక్కడికీ వెళ్ళను..." గబగబా అనేసాడు శక్తి.
"సీ-యూ" మేఘాల్లోంచి ముందుకెళుతున్న హరివిల్లులా ముందుకు కదిలింది మహిత.
అప్పటివరకూ తల మోస్తున్న బస్తా బరువు కిందకు దిగిపోయినట్లుగా రిలాక్సింగ్ గా ఫీలయి నడుచుకుంటూ వెళుతున్న మహితవేపు చూసాడు శక్తి.
"ఈ అమ్మాయి అందం, ఈమె నడకలో వుంది" మనసులోనే అనుకున్నాడు.
కేంటిన్ దాటి, లాన్ దాటి, మెయిన్ హాల్లోకి వెళ్ళిపోతున్న మహితవేపు అలా చూస్తూ ఆలోచనల్లో పడ్డాడు శక్తి.
మేనమామ ఆఫీసులో ఒక అందమైన ఆడపిల్లతో స్నేహం. ఇంతమంది మగ వెధవలు ఈ ఆఫీసులో వుండగా, తనతోనే ఏరి కోరి ఎందుకు మాట్లాడింది మహిత? అంటే ఏ రామబ్రహ్మంగాడి ద్వారో, తన ఛైర్మెన్ మేనల్లుడినని ముందుగా తెలుసుకుందన్న మాట. హమ్మ కిలాడీ... అంటే... ఏదో ఒక నెపంతో తన మీద వల వేస్తుందన్న మాట.
ఇక నుంచీ తనకి ఇలాంటి వలలు ఎదురౌతాయి నమ్మకూడదు. ఈ మాయ వలల్లో, అమ్మాయిల వలల్లో అమాయకంగా పడిపోకూడదు- తను....
టార్గెట్- మేనమామ ద్వారా జాబ్, అందునా మంచి జాబ్ సంపాదించటం, తర్వాత మేనమామ కూతురు బేబిని పెళ్లాడ్డం... కోట్ల ఆస్తికి తను వారసుడు కావాలి తప్ప ఇలాంటి మాయలో పడకూడదుగాక- పడకూడదు.
ఈ మహితనే ఉపయోగించి, మేనమామ కూతురెవరో తెలుసుకుంటా- అందుకు ఈ పిల్లని ఉపయోగించాలి.
ఇప్పుడు, అతని మనసు ప్రశాంతంగా వుంది.
అదే సమయంలో సర్వర్ సుందరంలో నాగేష్ లా అష్టవంకర్లు తిరిగిపోతూ వచ్చాడు భగవాన్.
"ఏం బాసూ- ఖాళీగా కూర్చున్నావేంటి. డ్రీమ్ గర్ల్ ఏదీ..." చుట్టూ చూస్తూ అడిగాడు భగవాన్.
"ఏం డ్రీమ్ గర్ల్...." చిరాగ్గా అడిగాడు శక్తి.
"ఇంతకీ- మహిత, మిమ్మల్నే ఎందుకు పిలిచింది సార్..." అంత మొహం చేసుకుని నవ్వుతూ అన్నాడు భగవాన్.
"ఫలానా పిల్ల పిలుస్తుందని చెప్పి, తీసుకెళ్ళి పరిచయం చేసినోడివి నువ్వు... చెప్పు. అసలా పిల్లకు నాగురించి చెప్పిందెవరు... నేనేదో సల్మాన్ ఖాన్ బాబాయినట్లు- టూత్ పేస్ట్ మోడల్ గా నన్ను యాక్ట్ చేయించాలని, ప్రపోజ్ చేసిందెవరు? ముందు చెప్పు నువ్వే కదా...."
"అయ్యాబాబోయ్- అన్ని కుట్రలు చేసే అమ్రిష్ పురిలా కనిపిస్తున్నానా సర్ నేను... అందులోనూ ఆ అమ్మాయితో? ఇన్నేళ్ళుగా ఆ అమ్మాయివేపు కళ్ళు- ఒళ్ళు అప్పగించేసి చూడ్డమే తప్ప, ఎప్పుడయినా ఆ మహిత నావేపు చూసిందా సర్. అందంగా వుంటానని ఎంత పొగరు సర్ ఆవిడకి. ఇవాళేదో మీ దయవల్ల మొట్టమొదటిసారి నాతో మాట్లాడింది సర్..." అని ఆగి, శక్తి చెవి దగ్గర నోరుపెట్టి, రహస్యం చెపుతున్నట్టుగా.
"నన్ను మీ క్లోజ్ ఫ్రెండనుకుంటోంది సర్. అందుకే నన్ను పిల్చింది- ఉబ్బితబ్బిబ్బయి పోతూ అనేసి-
"శక్తి బాసూ- మీరు ఎం.డి. పోస్టులో జాయినైనా, ఛైర్మెన్ పోస్టులో జాయినయినా, నాకు ప్రమోషన్ అక్కర్లేదు. కాని సర్- ఒక్కసారి- ఒక్కసారి ఆ మహితకు నన్ను గట్టిగా ఇంట్రడ్యూస్ చెయ్యండి సర్. ప్లీజ్- సర్" అలా రిక్వెస్ట్ చేస్తున్న భగవాన్ ముఖంవేపు చూస్తుంటే నవ్వొచ్చింది శక్తికి.
"అయితే మహితంటే నీకింట్రస్టా చెప్పు. నీ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తాను-" ప్రేమ గురువులా అడిగాడు శక్తి.
"ఇంట్రెస్టా- అని నెమ్మదిగా అడుగుతావేమయ్యా బాసూ- వంద ఇంట్రెస్టులు- ఆవిడ వేసుకునే కాటుకనై, బిందినై. వంటిపేట నెక్లెసునై, చేతి గాజునై పుట్టాలని, ఆవిడ ఆనందం కోసం జీవించాలని..." కవిత్వంలోకి వెళ్ళిపోయాడు భగవాన్.
"నువ్వింతగా మహితను ప్రేమిస్తున్నావని నాకు తెలీదు... పోనీ... పరిచయం చేస్తాలే..."
"బాసూ- ఇది వన్ వే ట్రాఫిక్ ఆరాధన బాసూ- నాలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళు దొరకడం... కల్ల... తెలుసు... అందుచేత ఈ ఆఫీసులో ఈ దేహం ఇలా... మహితను... మంగళను, పూజితను, అపరాజితను ఆరాధించుకుంటూ... ఆరాధించుకుంటూ..."