Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 34

"చావు బతుకులు నాకొదిలేయ్! నీ పెళ్లి శారదతో నేను జరిపిస్తాను.
ఆ మాటకి సత్యమూర్తి కరిగిపోతూ కన్నీళ్లు పెట్టుకుని అన్నాడు-
"మీరెవరో  దేవుళ్లు లాగా వున్నారు. కానీ సార్ నా పెళ్లీ చేయాలని ప్రయత్నిస్తే మీరు కూడా కష్టాలు పడవలసి వస్తుంది."
"అందుకాయన సిద్దపడే ఆ మాట అంటున్నాడు. నీ పెళ్లి పేరిట కష్టాలు నేర్చుకుని, ఆ తర్వాత మీ పెళ్లి ఎట్లాగు జరగదు కనక ఆ కష్టాలకు అలవాటుపడి, కష్టాలలోనే బతుకుతాడు" అన్నాడు పరమానందం.
"అంత ధీమా పనికిరాదు పరమానందం. భవిష్యత్తు ఏ విధంగా అఘోరిస్తుందో మనం చెప్పలేం. చూడు సత్యమూర్తీ! అన్నాడు" ఆనందం.
"చూస్తున్నాను సార్! నేనెవరో మీకు తెలీక పోయినా - నా  పట్ల మీకున్న ఔ దార్యం చూస్తూ ఆనందపడి పోతున్నాను. మీ ఆదరణకి కరిగి పోతున్నాను. ఇన్నాళ్లూ నా వెనక ఎవరూ లేకుండా బతికేను సార్! ఇప్పుడు మీరున్నారనే ధీమాతో దైర్యంగా బతుకుతాను. గోవిందాన్ని చెరిగి పారేస్తాను. శారదని పెళ్లాడి తీరతాను. పుట్ట బోయే మా అబ్బాయికి మీ పేరు పెట్టుకుంటాను" అన్నాడు సత్యమూర్తి ఉత్సాహంతో.
"అయ్యగారి పేరు ఆనందం" మాట అందించేడు సింహాచలం.
అప్పటికి చీకటి పడింది. అందరూ అక్కణ్నించి ఊళ్లోకి వస్తున్నారు.
ఊళ్లో ...
ఒక గోడ చాటున దాక్కున్నకైలాసం సత్యమూర్తిని చూసేడు. అతన్తో పాటు ఆ నలుగుర్నీ చూసేడు.
                                         34
దేవుడి చెరువు గట్టు!
సింహాచలం, భద్రాచలంలు గట్టు మీద నడుస్తున్నారు.  ఎవరూ ఎవర్తోనూ మాటాడటం లేదు. ఇద్దరూ సీరియస్ గా ఆలోచిస్తూ నడుస్తున్నారు. కొంత దూరం నడిచేక సింహాచలం సడన్ గా ఆగిపోయేడు.
"ఎందుకు ఆగేవు?" అడిగేడు భద్రాచలం.
"గుండెలు బరువెక్కితే అంతే! ఆ బరువుతో నడవటం నా వల్ల కాదు" అన్నాడు  సింహాచలం.
"గుండెల్లో బాధని నువ్వు చెప్పుకుంటున్నావ్! నేను దాచుకుంటున్నాను. అంతే తేడా!" అన్నాడు భద్రాచలం.
"మనం సత్రకాయలం. వాడుకున్నంత కాలం వాడుకుని అవసరం తీరిం తర్వాత కాల్తో తంతారు.
"పాయింటు కొచ్చేయ్!"
"ఏముంది? మామూలే! మన రోజులు దగ్గర పడ్డాయ్!"
"ఆ సంగతి నాక్కూడా తెలుసు!"
""సత్యమూర్తి మీద కట్టిన పందెంలో మన యజమానుల్లో ఒకడు మట్టి కొట్టుకుపోతాడు."
"అంతేగా మరి! పందెమన్న తరువాత ఒకడు గెలుస్తాడు, మరొకడు నెత్తిన ముసుగేసు కుంటాడు."
"సర్వదాస్తిని పందెంలో పట్టేరు."
"ఓడిపోయినా వాడు అడుక్కుతింటాడు."
"అప్పుడు వాడికి గుమాస్తాని పెట్టుకునే తాహతు ఏముంటుంది?"
"ఒక వేళ పెట్టుకున్నా.... జోలి కట్టుకుని తనతో పాటు అడుక్కోమంటాడు."
"ఏతావాతా ... మనలో ఒకడు బస్టాండుకు బలైపోవాల్సిందే?" అన్నాడు సింహాచలం.
"మన తప్పు లేకుండా ముష్టెత్తుకునే లెవెల్కి పడిపోవడం నా కిష్టం లేదు. నాకీ పాయింటు నచ్చడం లేదు."
"నా క్కూడా నచ్చడం లేదు. కానీ ఏం చేస్తాం?"
"ఏదో ఒకటి చేయాలి. తప్పదు. వాళ్ళ బతుకుల్తో మన బతుకులు ముడిపడకుండా జాగ్రత్త పడాలి."
"అంటే?"
"వాళ్లల్లో ఎవరు బోర్డు తిప్పేసినా....మన బతుకు బస్టాండు కాకూడదు" అన్నాడు సింహాచలం.
"ఉద్దేశం మంచిదే! నాకు బాగా నచ్చింది" అన్నాడు భద్రాచలం.
"యజమానులకు తెలీకుండా మనం కొన్ని ముందు జాగ్రత్తలు ఇప్పట్నించే తీసుకోవాలి. మనం తలుచుకుంటే ఏవైనా చేయగలం."
"అంటే ... యజమానికి పుడ్డు లేకపోయినా గుమాస్తా క్షేమంగా వుండాలి. అంతేగా?"
"అవును" అని ఆలోచనలో పడ్డాడు సింహాచలం.
భద్రాచలం కూడా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇద్దరూ గెడ్డాలు రుద్దుకుంటున్నారు. మొహాలు చిట్లిస్తున్నారు. చేతులు నలుపుకుంటున్నారు.
ఈ విధంగా అయిదు నిమిషాలు గడవకుండానే ఇద్దరూ ఒకేసారి 'అయిడియా' అని అరిచేరు. అరిచింతర్వాత నాలుకలు కరుచుకున్నారు.
సింహాచలం అన్నాడు-
"చెరువుకి చెవులుంటాయి. ఇక్కడోద్దు."
"ఆ మైదానంలోకి నడుద్దాం" అన్నాడు భద్రాచలం.
వాళ్లిద్దరూ చెరువుగట్టుకి దూరంగా మైదానంలోకి నడుస్తున్నారు. ఆ ప్రదేశాన్ని పర్ర అని కూడా అంటారు.
                                                    *        *        *
పార్కులో
ఒక మూలగా వున్న బెంచీ మీద సత్యమూర్తి కూచుని వున్నాడు అతని  పక్కన శారద కూచుంది.
బెంచీ పక్కన తుప్పల్లో కుక్కలు రెండు దాక్కుని వున్నాయి.
సత్యమూర్తి అంటున్నాడు....
"దేవుడి లాంటి మనిషి శారదా! నా పెళ్లి చేసే బాధ్యత తీసుకున్నాడు."
"మా నాన్న పెట్టిన షరతులు?"
"అన్ని వివరాలూ చెప్పేను. అన్నీ విన్న తర్వాతనే ... నా పెళ్లి తాను చేస్తానని హామీ ఇచ్చేడు."
శారద నిట్టూర్చింది. సూటిగా ప్రశ్నించింది.
"ఆ పెద్దమనిషి  హామీ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకునే వాడివేగా?"
సత్యమూర్తి సమాధానం చెప్పలేదు.
వాళ్లక్కొంచెం దూరంలో ఒంటికి గోనె గుడ్డలు చుట్టుకుని .... తనలో తానే నవ్వేసుకుంటూ .....పిచ్చిమొక్కల్తో ఆడుకుంటున్న పిచ్చివాణ్ని చూస్తున్నాడు సత్యమూర్తి.
"సమాధానం చెప్పవేం? ఆత్మహత్య చేసుకునే  వాడివేనా?" మళ్లీ అడిగింది శారద.
"నన్ను మర్చిపోయి నువ్వు మీ హొదాకి తగిన  వ్యక్తిని పెళ్లాడాలంటే... ఆత్మహత్య ఒక్కటేగా మార్గం!" అన్నాడు సత్యమూర్తి.
"మా నాన్న చెప్పిన మార్గం .... అవునా?"
"సత్యమూర్తి మాట్లాడలేదు.
"హుఁ ...  నువ్వు ప్రాణాలు  తీసుకుంటే .. నేను బతికుండి ఎవర్నో పెళ్లాడి - సుఖపడతానని ఎట్లా అనుకున్నావు?" నిలదీసింది శారద.
సత్యమూర్తి సమాధానం చెప్పలేదు.
"మాటాడవే?" రెట్టించింది శారద.
"నీకు దూరంగా బతకలేను శారదా! అట్లా బతకవలసి వస్తే ....అటు చూడు .... ఆ  పిచ్చివాడిలా గోనెగుడ్డులు కట్టుకు వీథులు తిరిగేవాణ్ని. ఆ అవస్థ కంటే ఆత్మహత్యే మంచిదనుకున్నాను. తప్పా?" దీనంగా అన్నాడు సత్యమూర్తి.
"చాల్లే! ఇదుగో ఇప్పుడే చెబుతున్నా విను. చావైనా .. బతుకైనా అన్నీ నీతోనే! మా నాన్నని మరిచిపో! ఎక్కడికైనా వెళ్లిపోయి  పెళ్లి చేసుకుందాం. సరేనా?" అన్నది శారద.
సత్యమూర్తి నిబ్బరంగా నవ్వి అన్నాడు ...
"ఈ మాట నాలుగు రోజుల కిందట అడిగితే ఏం సమాధానం చెప్పేవాడినో గానీ ... ఇప్పుడు ఆ అవసరం రాదని గట్టిగా  చెబుతున్నాను. దేవుడు మనల్ని కరుణించేడు శారదా! అందుకే ఆ పెద్దమనిషి రూపంలో వచ్చి మన పెళ్లి తాను  చేస్తానని ప్రతిజ్ఞ చేసేడు. మన పెళ్లి జరిగి తీరుతుంది."

                              *        *        *
గోవిందం మేడ!
కుక్కలు మొరుగుతున్నాయి.
గోవిందం సోఫాలో చేరగిలబడి వున్నాడు. కళ్లు మూసుకుని వున్నాడు. కుక్కల మొరుగుళ్లను శ్రద్ధగా వింటున్నాడు.
జాకీ రాగాలు తీసి మొరుగుతోంది. దాని మొరుగుడు అసాంతం విని అన్నాడు.
"సత్యమూర్తి గాడు నిజమైన ప్రేమికుడు. అతని గుణం నాకు తెలుసు. కానీ పరమ పిరికి సన్నాసి! దిక్కులేని చావు చావవలసిన వాడు. అదృష్టం బావుండి బతికి బయట పడ్డాడు."
"టైగర్ మొరిగింది. విని అన్నాడు.
"ఎవరా దేవుడి లాంటి మనిషి? పెళ్లిళ్లు చేయడమే వాడి పనా? సత్యమూర్తి గాడి పెళ్లవ్వాలంటే నా చేతిలో అయిదు లక్షలు పడాలి?  అంత డబ్బు ఆ దేవుడుగాడు ఇస్తాడా లేక ఈ లోఫర్ గాడిస్తాడా?"
జాకీ మొరిగింది విని అన్నాడు.

 Previous Page Next Page