Previous Page Next Page 
ఆనందం పరమానందం పేజి 33

"అయితే వెళ్లోస్తా!"
"వెళ్లోస్తా అనకూడదు."
"ఏమనాలి?"
"ఫినిషై పోతా!" అని కదిలేడు సత్యమూర్తి.
గోవిందం ఖంగారుగా అన్నాడు -
"అటు వెళ్లకు! అమ్మాయి చూస్తుంది. నిన్ను చూడగానే ఆశ నిరాశల అడకత్తెరలో పోకచెక్క అవుతుంది. ఇదిగో, ఇది దొడ్డిదారి!  ఇటు వెళ్లు"
గోవింద మిచ్చిన సలహా ప్రకారమే సత్యమూర్తి దొడ్డిదారి గుండా బయటకు నడుస్తున్నాడు -స్ధిర నిశ్చయంతో, నిబ్బరంగా!
వెళ్లి పోతున్న సత్యమూర్తిని చూస్తూ ముసి ముసిగా నవ్వుకున్నాడు గోవిందం.
సరిగ్గా అప్పుడే స్టోరు గదిలోంచి డబ్బా మోతలు వినిపిస్తున్నాయి. అయినా గోవిందం కదలలేదు.
"నేను ఆ దిక్కుమాలిన గదిలోకి వెళ్లాను గాక వెళ్లను!" అని  కూచున్నాడు గోవిందం.

                                         33
సత్యమూర్తి అప్పటికే ఊరు దాటేడు!
వేగంగా నడుస్తున్నాడు. ఇవ్వాళ్టితో సత్యమూర్తి జీవితం ముగుస్తుంది. ప్రేమకోసం జీవితాన్ని త్యాగం చేసిన అమరజీవి అని ప్రేమ చరిత్రలో రాయబడుతుందని అనుకుంటో నడుస్తున్నాడు.
కొంచెం దూరంలో రైలుపట్టాలు కనిపించేయి. వాటిని చూడగానే సత్యమూర్తికి ఆవేశం కలిగింది. గబగబా అటువేపు నడిచేడు. పట్టాల మీద పడుక్కున్నాడు.
అమర జీవి అయ్యేందుకు ఆఖరి క్షణాలు లెక్క పెడుతున్నాడు.
సరిగ్గా అదే సమయంలో పట్టాల పక్కనున్న తుప్పల్లోంచి కొన్ని గేదెలు వస్తున్నాయి. ఒక గేదె మీద యమధర్మరాజల్లే ఒక కుర్రాడు కూచున్నాడు. నోటి కొచ్చిన పద్యాల్ని పరమ చెత్తగా  పాడుతున్నాడు.
పట్టాల మీద పడుకున్న సత్యమూర్తికి పశువుల కాపరి పద్యాలు వినిపించేయి. వాటి దెబ్బకు తట్టుకోలేక- అవి పాడే గంధర్వుణ్ని ఒక తడవ చూచి తరించాలనుకున్నాడు.
ఈలోగా....
పశువుల కాపరి సత్యమూర్తి పవళింపు భంగిమను చూసేడు. అది ఆఖరి ప్రయత్నమని గుర్తించేడు.
అందుచేత తనకి తెలిసిన విషయమొకటి సత్యమూర్తి చెవిని వేద్దామనే సదుద్దేశంతో గేదెమీంచి దూకి - పరుగున వచ్చి  సత్యమూర్తిని చేరుకున్నాడు.
"ఏంటండీ? పేణాలు తీసుకోవాలను కుంటున్నారా?" అని సత్యమూర్తిని అడిగేడు.
"అవును! అర్జెంటుగా చావాలనుకుంటున్నాను"  అన్నాడు సత్యమూర్తి.
"అనుకోవడం మంచిదే గానండీ! ఇయ్యాల బందు గందా! అంచేత రైళ్లు రావండి" అన్నాడు పశువుల కాపరి.
ఆ మాట  వినగానే పట్టాల మీంచి లేచి నుంచున్నాడు సత్యమూర్తి పశువుల కాపరిని మరి కొన్ని వివరాలడిగి తెలుసుకుందామనుకున్నాడు గానీ, మనసు మార్చుకుని కదలబోయేడు.
పశువుల కాపరి అడిగేడు -
"అంటే  తమరు నిజంగానే చచ్చిపోదామనుకుంటున్నారాండీ?"
"నిజంగానే కాదు. అర్జెంటుగా కూడా చచ్చిపోవాలను కుంటున్నాను" అన్నాడు సత్యమూర్తి.
"అవుతే దానికి టాంక్ బండే బాగా సూటవుద్డండీ! నీళ్లు  నిండా వున్నాయ్" అన్నాడు  పశువుల కాపరి.
"కరెక్టే! నీళ్లు కదా! చల్లగా చచ్చిపోవచ్చు. థేంక్స్" అని సత్యమూర్తి టాంక్ బండ్ వేపు నడుస్తున్నాడు.
"ఈడు చచ్చినా చావడు" అని గోనుక్కుంటున్నాడు పశువుల కాపరి!
సత్యమూర్తి టాంక్ బండ్ దగ్గరికి వచ్చేడు.
నీళ్లవేపు చూసేడు. విరక్తిగా నవ్వేడు. కళ్లు మూసుకున్నాడు. ప్రార్ధన చేసేడు. చువ్వ లేక్కెడు. అక్కణ్నించి నీళ్లలోకి దూకేందుకు సిద్దపడుతుండగా -
సత్యమూర్తి భుజమ్మీద చెయ్యి పడింది.
సత్యమూర్తి కళ్లు తెరిచేడు. తన భుజమ్మీద చెయ్యి వేసిన అవతారం ఒక సాధువు. కాషాయ వస్త్రాలో చాలా సింపుల్ గా వున్నాడు.
"చాలా సంతోషం నాయనా! చావాలనుకుంటున్నావు కదూ!" అన్నాడు సాధువు.
"అవును స్వామీ!"
"మంచి నిర్ణయం. ఎప్పటికైనా తప్పని మరణాన్ని ముందుగానే ఆహ్వానించడం జ్ఞానుల లక్షణం. కానీ ఒక విషయం నీతో చెప్పాలి!"
చెప్పండి స్వామీ!"
"బతికినంతకాలం మురికితో నీ దేహం కలుషితమైంది. పోయేటప్పుడు కూడా ఈ కుళ్ళు కంపు  నీళ్లలో దూకి  కళ్ళు మూస్తావా? మురికి నీటిలో నీ అంతిమశ్వాసకి స్వాగతం పలుకుతావా? తప్పు నాయనా? హాయిగా సముద్రంలో దూకు. అనంతమైన తరంగాల్లో...."
"సముద్రం ఇక్కడ లేదు కదండీ! మద్రాసో, విశాఖపట్నమో, కాకినాడో వెళ్లాలి!"
"అంత దూరమెందుకు నాయనా! మచిలీపట్నమైనా సరిపోతుంది."
"అంతవ్యవధి లేదు స్వామీ! నేను అర్జెంటుగా చావాలనుకుంటున్నాను. ఇంకో మార్గం చెప్పండి."
"అయితే కొండ ఎక్కి కిందకు దూకు! మధ్యలోనే ప్రాణం పోతుంది!" అని సాధువు సలహా ఇచ్చేడు."
"ఓహొ! అద్భుతమైన సలహా ఇచ్చేరు స్వామీ! ఆశీర్వదించండి!" అన్నాడు  సత్యమూర్తి.
"శీఘ్రమేవ సుఖమరణ ప్రాప్తి రస్తు!" అని దీవించేడు సాధువు.
   
                             *        *        *
కొండమీద -
తన కథ చెబుతున్న సత్యమూర్తి ఇప్పుడు ముగింపు వాక్యాలు చెబుతున్నాడు.
"ఇదీ నా కథ. కొండమీది నుంచి దూకి చావాలనుకుని వచ్చిన వాణ్ని చావలేక చాలా ఇబ్బంది పడుతున్నాను."
కథ ఇప్పటికైనా పూర్తయినందుకు ఆనందం పరమానందంలతో పాటు వాళ్ల అసిస్టెంట్లు కూడా గట్టిగా నిట్టూర్చేరు.
ఆనందం అన్నాడు-
"చూడబ్బాయ్! నువ్విక్కడే వుండు. నీకు తోడుగా మావాళ్లుంటారు. మేమిద్దరం అట్లా వెళ్లి ప్రైవేటుగా మాట్లాడుకోవలసిన అవసరముంది మళ్లీ ఇప్పుడే వస్తాం"
"వెళ్లిరండి! దేవుళ్లా కలిసేరు.  నాకో చావు మార్గం చూపించి పుణ్యం కట్టుకోండి" అన్నాడు సత్యమూర్తి.
ఆనందం పరమానందంలు అక్కడికి దగ్గిర్లో ఉన్న మర్రిచెట్టుకిందికి చేరుకున్నారు.
"ఈ కుర్రాడు చావడు. అంచేత వాడి చావు బతుకుల మీద పందెం కట్టి ప్రయోజనం లేదు" అన్నాడు ఆనందం.
"నా క్కూడా అట్లాగే అనిపిస్తోంది. సత్యమూర్తి చావు నొదిలేసి,  అతని పెళ్లి మీద పందెం  కాస్తేనో?" అన్నాడు పరమానందం.
"మంచి అయిడియా! పెళ్లి అంటే  సరిపోదు. అతనికి పెళ్లంటూ జరిగితే శారదతోనే జరగాలి. అదీ కండిషను, ఇప్పుడు చెప్పు, సత్యమూర్తి శారదతో పెళ్లావుతుందా లేదా?" అన్నాడు ఆనందం.
"నాకు అనుమానమే! గోవిందం బతికినంత కాలం సత్యమూర్తికి శారదతో పెళ్లి కాదు" అన్నాడు పరమానందం ఎంతో నమ్మకంగా.
"గోవిందం బతికుండగానే -  సత్యమూర్తి శారదలపెళ్లి నేను జరిపిస్తా!" అన్నాడు ఆనందం గంభీరంగా.
"నీ వల్లకాదు" అన్నాడు పరమానందం ఖచ్చితంగా.
"సర్వదాస్తీ పణంగా పెట్టుకోవడం జరిగిపోయింది."
"అవును అందుకు నేనూ సిద్దమే! అయితే ఇక్కడో చిన్న తిరకాసుంది" అన్నాడు పరమానందం.
"ఏమిటది?"
"టైం....టైం లిమిట్ ఎంత?"
"దాందేముంది? అయారునెలల్లో అయిదు లక్షలిస్తే అమ్మాయి నిస్తానని గడుపు పెట్టేడుగా గోవిందం మన పందేనికి కూడా గడుపు ఆర్నెల్లె."
"ఆర్నెలల్లో నువ్వోనేనో గెలుస్తాం."
"నువ్వోనేనో అడుక్కుతింటాం."
"అద్సరే! గోవిందం అడిగిన అయిదు లక్షలూ చాటుగా నువ్వు సర్దు బాటు చేస్తేనో?"
"చెప్పుచ్చుక్కొట్టు! రాసుకున్న కాగితాలను కాల్చిపారేయ్! అంగీకారమేనా?"
"పూర్తి అంగీకారమే!"
"అయితే పద!" అన్నాడు ఆనందం.
"ఇద్దరూ సత్యమూర్తి దగ్గరికి వచ్చేరు.
"వాళ్లని చూడంగానే సత్యమూర్తి లేచి నిలబడ్డాడు. సత్యమూర్తి భుజం మీద లాలనగా చెయ్యి వేసి, ఎంతో ఆత్మీయంగా అంటున్నాడు ఆనందం-
"శారదతో నీ పెళ్లి జరగాలి అంతే కదా!"
"నాకిప్పుడు పెళ్లి మీద ఆశ లేదండీ! చచ్చిపోవాలనుంది."

 Previous Page Next Page