"అవన్నీ ఉత్తుత్తి మాటలురా! చచ్చేవాణ్ని బతికించేందుకు చెప్పే మాటలు. చూస్తూ చూస్తూ అయిదు లక్షలు పోసి పెళ్లి జరిపిస్తాడా? నమ్మకండి!"
అని గోవిందం ఏదో చెప్పబోతోండగా పిచ్చి మారాజు అవతారంలో వచ్చిన కైలాసాన్ని చూస్తూ అన్నాడు.
"ఏవైనా చెప్పాలనుకుంటున్నావా?"
"లేదండీ!! నేను చెప్పదలుచుకున్నదంతా కుక్కలే చెప్పేశాయి గదా! చెప్పవలసివస్తే అవి చెప్పిన విషయాలే చెప్పాలి. చెప్పమంటారా?"
"అక్కర్లేదు."
"అనుకున్నాన్లెండి. వేషాలు వేసుకుని తిరుగుతున్నా నాకు కాలం కలిసి రావడం లేదు. అయ్యా! డబ్బా మోతలు వినిపిస్తున్నాయి!" అన్నాడు కైలాసం.
తనకి వినిపించకుండా కైలాసానికి వినిపిస్తున్నందుకు విడ్డూరపుడుతూ అడిగేడు గోవిందం.
"ఏమిటేమిటి? నీకు డబ్బా మోతలు ...."
"చిత్తం చెవులు పగిలిపోతున్నాయండీ, చూచి రమ్మంటారా?"
"అక్కర్లేదు. నేను చూసుకుంటా"
అని గోవిందం పెద్ద పెద్ద అంగలు వేసుకుంటో స్టోరు గది వేపు వెళ్లేడు.
కుక్కలు కైలాసాన్ని చూసి గుర్రుమన్నాయి. కైలాసం చేతులు జోడించి అన్నాడు -
"నాకే గనక మీ భాష వచ్చి వుంటే - నాతో పోటీపడి, నా కడుపు మీద కొట్టకండని మొరిగి చెప్పి వుండే వాడిని! అర్భకుణ్ని! నన్ను అల్లరి పెట్టొద్దు. పెద్దాయన ఇంకా ఇక్కడే నిలబడి వుంటే నన్ను తింటాడన్న భయంతో డబ్బా మోతని కోసేను. తప్పయితే నన్ను క్షమించండి"
అని అక్కణ్నించి మెల్లగా జారుకుంటున్నాడు.
35
అదొక ఆఫీసు.
టైర్ల కంపెనీ తాలూకు ప్రధాన కార్యాలయం. గొప్ప డాబుసరిగా వుంది. ఆఫీసులోకి వెళ్తే సింహద్వారం కూడా ఒక పెద్ద టైరు ఆకారంలో చిత్రంగా వుంది. ఆ మాట కొస్తే ఆఫీసు తాలూకు భవనం మొత్తం పైనుంచి చూస్తే టైరులాగానే వుంటుంది.
ఆ టైరు పేరు తోటాస్ టైరు. ఆ బ్రాండు టైరుకి మంచి గిరాకీ వుంది. స్కూటర్లకి, కార్లకి, లారీలకు, ట్రాక్టర్లక్కూడా తోటాస్ టైరు తూటాలాగా పనిచేస్తుందని ప్రతి ఒక్కరూ అనుకుంటారు.
తోటాస్ టైరుకి యజమాని తోట పాండు.
స్వశక్తితో కష్టపడి పై కోచ్చేడు. కొన్ని కోట్లు సంపాయించేడు. కష్టపడి పని చేసే మనిషంటే అతనికి చాలా యిష్టం.
ఎంత ఐశ్వర్యవంతుడైనా తోట పాండు ఇప్పటికీ కష్టపడుతూనే వుంటాడు.
లిప్టు లేని మేడ ఎక్కడం అతనికిష్టం. డ్రైవరు లేని కారు నడపడం, పెరటి పనులు చేసి ఆకుకూరలు పెంచడం, ఆ కూరల్నే తిని కడుపు నింపుకొడం. ఎయిర్ పోర్ట్ లోనూ, రైల్వేస్టేషన్ లోనూ తన లగేజి తానే స్వయంగా మోయడం లాంటి పనుల పట్ల తోట పాండుకి శ్రద్ధ ఎక్కువ.
అంతే గాకుండా అతను పరమ ఆనేస్టు! ఆనేస్టీ తనకి ఆరో ప్రాణమంటాడు. తన ఆఫీసు గది ముందు ఆ సూక్తిగా బోర్డు మీద రాసి తగిలించేడు.
ఇప్పుడు తన గదిలో ఫోన్ లో కూడా ఆనేస్టీ తాలూకు పసిడి వాక్కులనే పలుకుతున్నాడు. అవతల అధికారి నెవర్నో ఆనేస్టీకి అలవాటుపడమని మందలిస్తున్నాడు.
"సుబ్రహ్మణ్యం - ఇది వరకు నిన్ను సార్ అని పిలిచేవాడ్ని! ఇప్పుడు - మా బ్రాంచి మేనేజరు దగ్గర నువ్వు కక్కుర్తి పడ్డావని తెలిసి ఏకవచనం ప్రయోగిస్తున్నాను. వద్దు - నువ్వు మాటాడే అవినీతి పలుకులు నేను వినను. నేనిచ్చే వార్నింగు నువ్వు తప్పనిసరిగా వినాలి! పిల్లలు గలవాడివి గనక ఇప్పుడు నిన్ను వార్నింగుతో వదిలిపెడుతున్నాను. మరోసారి ఇంకోసారి అల్లాంటి పిచ్చ పనులు చేసినట్టు తెలుస్తే సుబ్రహ్మణ్యం - నె ఉద్యోగం ఊడిపోతుంది. అవసరమైతే ఢిల్లీ వెళ్లి నీ అంతు చూసేస్తాను. అల్లా చూడకపోతే నా పేరు తోట పాండు కానే కాదు! మైండిట్. ఫోన్ పెట్టేయ్"
అని తాను ఫోన్ పెట్టేసేడు. తన ముందున్న కాగితాలను చించుతున్నాడు.
అతను కాగితాలను చించే కార్యక్రమంలో వుండగా - సరిగ్గా అప్పుడే ఆ గదిలోకి అడుగు పెట్టేడు ఆనందం. అతని వెంట సింహాచలం కూడా వున్నాడు.
ఆనందాన్ని చూడగానే చించుడు కార్యక్రమానికి చుక్క పెట్టి, అమాంతం లేచి నించుని ఎంతో ఆదరంగా ఆహ్వానించేడు తోట పాండు.
ఒరే .... ఒరే .... ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి? ఇదేనా రావడం?"
ఆనందం తోట పాండు భుజమ్మీద చెయ్యి వేసి, కుర్చీలో కూచోబెట్టి. తాను కూడా కూచుంటో -
"ఇప్పుడు కూడా వచ్చేవాడిని కాదు. అవసరం అట్లాంటిది కనక వచ్చేను."
"నాతో నీకవసరం పడిందా! ఏమిట్రా అది? టైర్లు కావాలా!"
"కాదు. ఉద్యోగం కావాలి."
"నీకా?" నవ్వుతూ అడిగేడు తోట పాండు.
"నిజం చెప్పాలంటే - ఆ కుర్రాడికిస్తే నా కిచ్చినట్లే."
"ఎవడా కుర్రాడు? ఇతనా?" అని సింహాచలాన్ని చూస్తూ అడిగేడు తోట పాండు.
"చిత్తం! నాక్కాదండీ!" అన్నాడు సింహాచలం వినయంగా.
"అభ్యర్థి గ్రాడ్యుయేటు."
"అలాగే, ఆ క్వాలిఫికేషన్ కి తగిన ఉద్యోగం తప్పకుండా ఇస్తాను."
"జీతం నీ ఇష్టం."
"గ్రాడ్యుయేట్లకు ఇచ్చే జీతమే ఇస్తాను."
"కాని ... " సందేహిస్తూ ఆగిపోయేడు ఆనందం.
"అడగరా! ఇంకా ఏం కావాలో అడుగు."
"అయిదు లక్షలు కావాలి."
"అవును, అక్షరాలా అయిదు లక్షలు"
"జోక్ చేస్తున్నావా?"
"కాదు. సీరియస్ గానే అడుగుతున్నాను."
"కోటీశ్వరుడివి. నీకు నేను అయిదు లక్షలు సర్దాలా?"
"నాక్కాదు, అతనికి."
"అతనికా?"
"అదే! నువ్వు దయతో ఉద్యోగమిచ్చే కుర్రాడికి అయిదు లక్షలు కావాలి. అది అడ్వాన్సన్నమాట! ఆ బాకీని అతని జీతం నుండి నెల నెలా కొంచెం కొంచెంగా కట్ చేసుకో!"
ఆనందం మాటలు వింటున్న తోటపాండుకి పిచ్చెక్కిపోయింది. పేపర్ వెయిట్ తీసుకుని తన చెంపల మీద వాయించుకుంటున్నాడు. ఆనందం ఆ పేపర్ వెయిట్ ని చొరవగా లాగేసుకుంటో అన్నాడు -
"వీలు కాకపోతే చెప్పు, వేరే ప్రయత్నం చేస్తాను."
"తోట పాండు గాద్గదికంగా అన్నాడు -
"నా చేత తప్పుడు పనులు చేయించాలని చూస్తున్నావా ఆనందం?"
"మీటింగోద్దు! అవును - కాదు. ఏదో ఒకటి చెప్పు"
తోటపాండు ఆనందం హెచ్చరికను పాటించకుండా తన ధోరణిని కొనసాగిస్తున్నాడు.
"జీవితంలో ఓకే ఒక్కసారి ఫ్రాడు చేసేనురా! యసల్సీ పరీక్షలో నీ లెక్కల పేపరు కాఫీకొట్టి పాసయ్యేను. ఆ తర్వాత కాలేజీ, ఆ పైన ఇంజనీరింగు చదివి ఇదిగో ఈ స్థితికోచ్చేను. నీ లెక్కల పేపర్ కాపీ కొట్టి పాసవ్వకపోతే నేను ఎక్కడ, ఏ స్థితిలో ఉండేవాడినో? సరే, ఆనందం! నేను చేసిన అవినీతికి శిక్ష పడాల్సిందే! పడాలి! అయిదు లక్షలు అడ్వాన్సుతో నీ లెక్కల పేపరు కాఫీ కొట్టిన పాపం కొట్టుకుపోతుందంటే, ఎస్ ....నేనందుకు సిద్దమే. కమాన్! ఎక్కడున్నాడు ఆ కుర్రాడు? పిలిపించు?" అని ముగించేడు తోటపాండు ఆవేశంగా.
ఆనందం లేచేడు. తోట పాండు కూడా లేవబోయేడు. కానీ, అతన్ని కూచోబెట్టి ఆనందం అన్నాడు -
"అతని పేరు సత్యమూర్తి."
"నీతి గల పేరు. గుర్తుంటుంది."
"నా విజిటింగ్ కార్డుతో అతను నిన్ను రేపు కలుస్తాడు."
"రేపా? రేపు సాయంత్రం ఆమెరికా ప్రయాణం పెట్టుకున్నాను. మళ్లా ఆర్నెల్లకి గాని తిరిగి రాను."
"అయితే అతను రేపు మధ్యాన్నమే నిన్ను కలుస్తాడు."
"తప్పకుండా పంపించు, ఉద్యోగంతో పాటు అయిదు లక్షలూ అడ్వాన్సుగా ఇచ్చి, నీ లెక్కల పేపరు కాపీ కొట్టిన పాపాన్ని తుడిచేసుకుంటాను. పంపించు!"
అని మళ్లా పేపరు వెయిట్ తీసుకోబోయేడు తోటపాండు.
అతని చేతిలోంచి పేపరు వెయిట్ లాక్కుని, దానితో పాటు గదిలోంచి బయటకు నడిచేడు ఆనందం.
తోట పాండు తాలూకు విచిత్రమైన మనస్తత్వనికి ఎలాంటి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలో ఆలోచిస్తూ ఆనందంతో పాటు బయటకు నడుస్తున్నాడు సింహాచలం.
* * *